bajji
-
గోంగూరతో మిర్చి.. బజ్జీ ఇలా ఎప్పుడైనా ట్రై చేశారా?
గోంగూర బజ్జీ కావలసినవి: తాజా గోంగూర – కప్పు; సెనగపిండి – కప్పు; బియ్యప్పిండి – మూడు టేబుల్ స్పూన్లు; కారం – టీస్పూను; పసుపు –పావు టీస్పూను; ఇంగువ – చిటికెడు; ఉప్పు – రుచికి సరిపడా; నూనె – పావు కేజీ. తయారీ విధానమిలా: ∙గోంగూరను శుభ్రంగా కడిగి పక్కన పెట్టుకోవాలి ∙సెనగపిండిలో బియ్యప్పిండి, ఇంగువ, కారం, పసుపు, రుచికి సరిపడా ఉప్పు వేసి కలపాలి ∙కొద్దిగా నీళ్లు పోసి చిక్కగా కలుపుకోవాలి. చివరిగా టేబుల్ స్పూన్ నూనె వేసి కలపాలి ∙ఇప్పుడు గోంగూర ఆకులను ఈ పిండిలో ముంచి మరుగుతోన్న నూనెలో వేసి గోల్డెన్ బ్రౌన్‌లోకి మారేంత వరకు వేయించి తీసేయాలి ∙నూనె ఎక్కువగా ఉన్నట్లు అనిపిస్తే బజ్జీలను టిష్యూ పేపర్ మీద వేసి, నూనెను పేపర్ పీల్చుకున్న తరువాత సర్వ్ చేసుకోవాలి. -
Recipe: రుచికరమైన క్యాప్సికమ్ బజ్జీ తయారీ ఇలా..
రుచికరమైన క్యాప్సికమ్ బజ్జీ తయారు చేసుకోండిలా.. కావలసినవి: ►క్యాప్సికమ్ – 6 లేదా 8 (శుభ్రంగా కడిగిపెట్టుకుని.. నాలుగు వైపులా చాకుతో గాటు పెట్టుకోవాలి), ►శనగపిండి – 1 కప్పు ►ఉప్పు – తగినంత ►కారం – 1 టీ స్పూన్ ►పసుపు – చిటికెడు ►ధనియాల పొడి – అర టీ స్పూన్ ►వంట సోడా – కొద్దిగా ►క్యారెట్ ముక్కలు, బీట్ రూట్ ముక్కలు, కొత్తిమీర తురుము, ఉల్లిపాయ ముక్కలు – రుచికి అదనంగా (అన్నీ ఒక బౌల్లో వేసుకుని.. నిమ్మరసం, ఉప్పు, కారం కలిపి పక్కన పెట్టుకోవాలి) ►నూనె – డీప్ ఫ్రైకి సరిపడా తయారీ: ►ముందుగా ఒక బౌల్లో శనగపిండి, కారం, వంట సోడా, ఉప్పు, ధనియాల పొడి ఒకదాని తర్వాత ఒకటి వేసుకోవాలి ►ఇందులో కొద్దికొద్దిగా నీళ్లు పోసుకుంటూ.. బాగా కలుపుకుని పక్కన పెట్టుకోవాలి. ►అనంతరం ఒక్కో క్యాప్సికమ్ తీసుకుని.. శనగపిండి మిశ్రమంలో ముంచి.. నూనెలో డీప్ ఫ్రై చేసుకోవాలి. ►చల్లారాక చాకుతో ఒక వైపు కట్ చేసుకుని.. అందులో క్యారెట్ ముక్కల మిశ్రమాన్ని నింపుకుని సర్వ్ చేసుకుంటే భలే రుచిగా ఉంటాయి ఈ బజ్జీలు. -
Recipe: బీట్రూట్ బజ్జీ ఇలా తయారు చేసుకోండి!
వర్షాకాలంలో బీట్రూట్ బజ్జీ ఇలా ఇంట్లోనే తయారు చేసుకుని ఎంచక్కా తినేయండి! బీట్రూట్ బజ్జీ తయారీకి కావలసినవి: ►బీట్రూట్ – 3 (పెద్దవి, పైతొక్క తొలగించి.. గుండ్రటి చక్రాల్లా కట్ చేసుకోవాలి) ►శనగపిండి – 1 కప్పు, ఉప్పు, కారం – సరిపడా, కార్న్ పౌడర్ – పావు కప్పు ►బేకింగ్ సోడా – కొద్దిగా, నీళ్లు – కావాల్సినన్ని ►నూనె – డీప్ ఫ్రైకి సరిపడా బీట్రూట్ బజ్జీ తయారీ: ►ముందుగా ఒక బౌల్లో శనగపిండి, కార్న్ పౌడర్, ఉప్పు, కారం, గరం మసాలా, బేకింగ్ సోడా వేసుకోవాలి. ►కొద్దికొద్దిగా నీళ్లు పోసుకుంటూ తోపులా చేసుకోవాలి. ►అందులో బీట్రూట్ ముక్కల్ని ఒకదాని తర్వాత ఒకటి ముంచి.. నూనెలో డీప్ ఫ్రై చేసుకుంటే సరిపోతుంది. ►ఈ బజ్జీలను వేడి వేడిగా ఉన్నప్పుడే సాస్ లేదా చట్నీల్లో నంజుకుని తింటే భలే రుచిగా ఉంటాయి. ఇవి కూడా ట్రై చేయండి: Corn Palak Pakoda Recipe: స్వీట్ కార్న్, పాలకూర.. కార్న్ పాలక్ పకోడి Idiyappam Pulihora Recipe: బియ్యప్పిండి, మొక్కజొన్న పిండి.. ఇడియప్పం పులిహోర -
ఆహా ఏమి రుచి.. తినరా మైమరచి.. అక్కడ రూ.1కే మిర్చిబజ్జి !
సాక్షి, కామారెడ్డి: నిత్యావసరాల ధరలన్నీ ఆకాశాన్నంటాయి. ఏది కొనాలన్నా అగ్గిపిరమే. ఇలాంటి పరిస్థితుల్లోనూ ఆ ఊళ్లో రూ. 1 కి ఒక మిర్చిబజ్జి అమ్ముతున్నారు. మీరు చదివేది నిజమే. యాబై ఏళ్ల క్రితం మొదలైన వాళ్ల దందా ఏడు పదుల వయసులోనూ నిరాటంకంగా కొనసాగుతోంది. కామారెడ్డి జిల్లా రాజంపేట మండల కేంద్రంలో ఆముద సత్యనారాయణ–ఊర్మిల దంపతులు యాబై ఏళ్ల కిందట మిర్చిబజ్జీల అమ్మకాలు మొదలుపెట్టారు. అప్పట్లో అంగళ్లలో, పండుగ ఉత్సవాల్లో వేడివేడి బజ్జీలు తయారు చేస్తూ అమ్ముతుండేవారు. మిగతా రోజుల్లో రాజంపేట గ్రామంలోని ప్రధాన కూడలి వద్ద బండీపై పెట్టుకుని అమ్మేవారు. అయితే వయస్సు పైబడడంతో బయటకు వెళ్లడం మానేశారు. ఇంటి దగ్గరే పొయ్యిమీద మిర్చీలు గోలించి బండిపై పెట్టుకుని అమ్ముతున్నారు. ప్రతీ రోజూ ఐదు వేలకు పైగా మిర్చిలు అమ్ముడవుతాయిని సత్యనారాయణ పేర్కొన్నారు. ఒక్కోసారి ఎనిమిది వేల నుంచి పది వేల దాకా అమ్ముడుపోతాయి. ఉదయం 9 గంటల నుంచి రాత్రి తొమ్మిది వరకు అంటే దాదాపు 12 గంటల పాటు శ్రమిస్తారు. సత్యనారాయణ కొడుకు రాము బీఈడీ పూర్తి చేశాడు. ఉద్యోగాల నోటిఫికేషన్ రాకపోవడంతో తండ్రికి తోడుగా మిర్చిబజ్జీ దందాలో భాగమవుతున్నాడు. రాజంపేట మండల కేంద్రంలో సత్యనారాయణ దగ్గర మిర్చిబజ్జీల కోసం జనం ఎగబడతారు. ప్రతీ రోజూ తయారీ అమ్మకం సాగిస్తుంటారు. నలుగురు కలిస్తే చాలు మిర్చిలు తెప్పించుకుని తినడం ఆ ఊరిలో చాలా మందికి అలవాటు. దీంతో సత్యనారాయణ మిర్చిల దందా నిరాటంకంగా సాగుతోంది. అప్పుడు ఏకాన...ఇప్పుడు ఏక్ రూపియే నాలుగైదు దశాబ్దాల నాడు సత్యనారాయణ దంపతులు మిర్చిదందా మొదలుపెట్టినపుడు ఏకాణాకు ఒక మిర్చి అమ్మేవారని సత్యనారాయణ తెలిపారు. రూపాయికి 16 అణాలు కాగా, ఒక్క రూపాయికి 16 మిర్చిలు ఇచ్చేవారమని పేర్కొన్నారు. తరువాత రూపాయకి నాలుగు, ఆ తరువాత రూపాయికి రెండు మిర్చిలు అమ్మామని, ఇప్పుడు ఒక్క రూపాయికి ఒక మిర్చి అమ్ముతున్నట్టు పేర్కొన్నారు. శనగ పప్పు, బియ్యంతో కలిపి పిండితయారీ.... సత్యనారాయణ మిర్చిల కోసం శనగ పప్పుతో పాటు బియ్యం కలిపి గిర్నీ పట్టిస్తాడు. క్వింటాళ్ల కొద్ది పిండి పట్టించి మిర్చిల తయారీకి వాడుతున్నారు. అప్పట్లో రూ.2.50 కి కిలో నూనె, రూ.1.25 కు కిలో పప్పు దొరికే దని, ఇప్పుడు రూ.140 కిలో పామాయిల్, రూ.65 కిలో శనగపప్పు దొరుకుతున్నాయని తెలిపాడు. అప్పట్లో రూపాయికి కిలో పచ్చిమిర్చి దొరికేది, ఇప్పుడేమో రూ.40 నుంచి రూ.80 వరకు కొంటున్నామని పేర్కొన్నాడు. కొంత కాలం గ్యాస్ పొయ్యి మీద మిర్చిలు గోలించామని, అయితే గ్యాస్ ధర భాగా పెరగడంతో మళ్లీ కట్టెల పొయ్యిమీదనే చేయాల్సి వస్తోందని తెలిపాడు. చదవండి: Kalyana Lakshmi Scheme: 50 ఏళ్ల కింద పెళ్లయిన వారికి.. ‘కల్యాణలక్ష్మి’! -
గొంతులో బజ్జీ ఇరుక్కుని మహిళ మృతి
చెన్నై,తిరువొత్తియూరు: బజ్జీ గొంతులో చిక్కుకుని మహిళ మృతి చెందిన ఘటన గురువారం రాత్రి చెన్నైలో చోటుచేసుకుంది. చూలైమేడు కామరాజర్ నగర్‌కు చెందిన పద్మావతి (45) గురువారం రాత్రి బజ్జీలు చేసింది. కుటుంబ సభ్యులతో కలిసి తింటుండగా గొంతులో ఇరుక్కుపోయి విలవిలలాడింది. కుటుంబ సభ్యులు ఆమెను కీల్పాక్కం ప్రభుత్వ ఆస్పత్రికి తీసుకెళ్లారు. ఆమెను పరిశీలించిన వైద్యులు అప్పటికే మృతి చెందినట్లు తెలిపారు. చూలైమేడు పోలీసులు కేసు నమోదు చేసి విచారణ చేస్తున్నారు. -
బజ్జీలు వేస్తే... మేఘాలు ఏర్పడతాయా?
బజ్జీలకూ.. మేఘాలకు లింకేమిటబ్బా? ఇదెలా సాధ్యం?... ఇవేగా మీ డౌట్స్! ఒక్క నిమిషమాగితే అన్నీ క్లియర్ అయిపోతాయి. ఒక్క బజ్జీలేమిటి.. నూనెలో వేయించే ప్రతి వంటకంతోనూ నగరాల్లో మేఘాలు ఏర్పడే అవకాశాలు పెరుగుతాయని అంటున్నారు యూరోపియన్ శాస్త్రవేత్తలు. నూనెలో ఉండే ట్రైగిజరైడ్ కొవ్వు పదార్థాలు వాతావరణంలోని కణాల చూట్టూ చేరిపోవడం వల్ల ఇలా జరుగుతోందని వీరు అంటున్నారు. ట్రైగిజరైడ్లు అంటుకోవడం వల్ల వాతావరణంలోని దుమ్ము, ధూళి కణాలు ఎక్కువ తేమను ఆకర్శించగలవని.. ఎక్కువ దూరం ప్రయాణించగలవని.. తద్వారా అవి మేఘాలుగా ఏర్పడే అవకాశాలూ పెరుగుతాయని అంచనా. ఇళ్లల్లో పాత్రలు శుభ్రం చేసేటప్పుడు ఎలాగైతే సోప్ పౌడర్‌కు మట్టి అంటుకుంటందో.. అలాగన్నమాట. లండన్ నగరంలో ప్రతిరోజూ వాతావరణంలోకి చేరే అతిసూక్ష్మ కణాల్లో కనీసం పదిశాతం ఇలా బాగా వేయించిన వంటనూనెల నుంచి వెలువడ్డవేనని అందుకే ఈ నగరంపై మేఘాలు ఎక్కువ ఉంటున్నాయని బాత్ యూనివర్శిటీ శాస్త్రవేత్త అడమ్ స్కైర్స్ అంటున్నారు. అయితే తాము ల్యాబ్‌లో చేసిన పరిశోధనకు, వాస్తవ పరిస్థితికి మధ్య తేడా ఉండవచ్చునని. ఎంత మోతాదులో ట్రైగిజరైడ్ కొవ్వులు విడుదలైతే మేఘాలు ఎక్కువ అవుతాయన్న కచ్చితమైన అంచనాలకు మరిన్ని పరిశోధనలు అవసరమని ఆడమ్ చెప్పారు. -
బజ్జీ తింటావా బుజ్జీ!!
ఫ్రూట్ బజ్జీ! బజ్జీలు కారంగా ఉంటాయి బుజ్జి, బుజ్జిగాడు బజ్జీ తినరు. అందుకే ఈ స్పెషల్ బజ్జీ! తియ్యగా, పుల్లగా వేయించిన బజ్జీ!! సూపర్ ట్రెండీ ఫ్రూట్ బజ్జీ! ఫర్ బుజ్జీ అండ్ ఫ్యామిలీ!! జామకాయ బజ్జీ కావల్సినవి: జామకాయలు (గులాబీ రంగు గుజ్జు ఉన్నవి) – 3–4; టెంపురా పిండి (ఇది మైదా, గుడ్డు కలిపి తయారుచేస్తారు. మార్కెట్లో లభిస్తుంది. ఈ పిండిలో వెజ్ టెంపురా, నాన్‌వెజ్ టెంపురా కూడా లభిస్తుంది. ఈ పిండితో బజ్జీలు మరింత రుచిగా ఉంటాయి); దీనికి బదులుగా మైదా వాడుకోవచ్చు) – 2 కప్పులు; పసుపు – చిటికెడు; పంచదార – అర కప్పు (తగినంత); పంచదార పొడి – పావు కప్పు; నూనె – వేయించడానికి తగినంత తయారీ: జామకాయ చివరలు కట్ చేయాలి. తర్వాత సన్నని స్లైసులుగా కట్ చేసుకోవాలి. ఒక గిన్నెలో టెంపురా పిండి లేదా మైదా పోసి, పసుపు వేసి తగినన్ని నీళ్లతో జారుగా కలుపుకోవాలి. దీంట్లో పంచదార పొడి వేసి కలపాలి. పంచదార పూర్తిగా పిండిలో కరగనివ్వాలి. పొయ్యిమీద మూకుడు పెట్టి, నూనె పోసి కాగనివ్వాలి. పిండిలో జామకాయ స్లైసులను ముంచి, కాగుతున్న నూనెలో వేసి రెండు వైపులా బంగారు రంగు వచ్చేలా వేయించుకొని తీయాలి. వేడిగా ఉన్నప్పుడే పంచదార పొడి చల్లి, చాక్లెట్ సాస్‌తో సర్వ్ చేయాలి. స్ట్రాబెర్రీ బజ్జీ కావల్సినవి: మైదా – 2 కప్పులు; బేకింగ్ పౌడర్ – టేబుల్ స్పూన్; ఉప్పు – అర టీ స్పూన్ ; పంచదార – ముప్పావు కప్పు; దాల్చిన చెక్క పొడి – టీ స్పూన్; జాజికాయ పొడి – పావు టీ స్పూన్; పాలు – ఒకటిన్నర కప్పు; వెనిల్లా ఎక్స్ట్రాక్ట్ – టీ స్పూన్; 4 గుడ్లలోని తెల్లసొన; 3 గుడ్లలోని పసుపు సొన; నూనె – టేబుల్ స్పూన్; నిమ్మరసం – టేబుల్ స్పూన్; స్ట్రాబెర్రీలు – రెండున్నర కప్పులు (కడిగి, తడిలేకుండా తుడవాలి); బ్లాక్ బెర్రీ – పావు కప్పు (గింజలేనివి); నూనె – వేయించడానికి తగినంత; పంచదార పొడి – తగినంత తయారీ: ఒక గిన్నెలో పొడి పదార్థాలన్నీ వేసి కలపాలి. మరొక గిన్నెలో పాలు, గుడ్డులోని పసుపుసొన, నూనె, నిమ్మరసం, వెనిల్లా ఎక్స్ట్రాక్ట్ వేసి కలపాలి. ఈ మిశ్రమాన్ని పొడిపదార్థాలలో వేసి పిండి మృదువుగా అయ్యేంతవరకు గిలకొట్టాలి. మరొక గిన్నెలో గుడ్డులోని తెల్లసొన గిలక్కొట్టి ఈ మిశ్రమాన్ని పిండి మిశ్రమం మీదుగా వేయాలి. స్ట్రాబెర్రీలను పలచని ముక్కలుగా కట్ చేసి, పిండిలో వేయాలి. బ్లాక్‌బెర్రీలను కూడా అలాగే వేసి ఉంచాలి. స్టౌ మీద కడాయి పెట్టి, నూనె పోసి కాగనివ్వాలి. దీంట్లో పిండి పట్టిన స్ట్రాబెర్రీలు, బ్లాక్ బెర్రీలు వేసి ముదురు గోధుమ రంగు వచ్చే వరకు అన్ని వైపులా వేయించి, తీయాలి. పైన పంచదార పొడి చల్లి వెంటనే సర్వ్ చేయాలి. దీనికి చాకెలెట్ సాస్‌ను కాంబినేషన్‌గా ఇవ్వచ్చు. పియర్ బజ్జీ కావల్సినవి: పియర్ పండు – 1 (పై తొక్క తీసి సన్నని స్లైసులుగా కట్ చేయాలి); ఆలివ్ ఆయిల్ – టేబుల్ స్పూన్; మైదా – ముప్పావు కప్పు; బేకింగ్ పౌడర్ – టీ స్పూన్; ఉప్పు – పావు టీ స్పూన్; మిరియాల పొడి – చిటికెడు; గుడ్డు – 1 ; పాలు – 3 టేబుల్ స్పూన్లు; నూనె – వేయించడానికి తగినంత తయారీ: పాన్‌లో ఆలివ్ ఆయిల్ వేడయ్యాక పియర్ స్లైస్‌లు వేసి రెండు వైపులా వేయించుకొని, చల్లారనివ్వాలి. ఒక గిన్నెలో మైదా, బేకింగ్ పౌడర్, ఉప్పు, మిరియాల పొడి వేసి కలపాలి. మరొక చిన్న గిన్నెలో గుడ్డు సొన, పాలు కలిపి గిలకొట్టాలి. ఈ మిశ్రమాన్ని పిండిలో కలపాలి. మూకుడు పొయ్యి మీద పెట్టి నూనె పోసి కాగనివ్వాలి. సిద్ధంగా ఉంచుకున్న పిండి మిశ్రమంలో పియర్ పండు ముక్కను ముంచి, తీసి కాగుతున్న నూనెలో వేసి వేయించి, తీయాలి. పనసపండు బజ్జీ కావల్సినవి: పనసపండు ముక్కలు – 250 గ్రాములు; బియ్యప్పిండి – 2 టేబుల్‌స్పూన్లు; సోడా – చిటికెడు; కారం – టేబుల్ స్పూన్; పసుపు – పావు టీ స్పూన్; ఉప్పు – తగినంత; శనగపండి – కప్పు; జీలకర్ర – టీ స్పూన్; నూనె – వేయించడానికి తగినంత తయారీ: పనసపండు తొనలను, నిలువుగా పలచని ముక్కలు కట్ చేసుకోవాలి. ఒక గిన్నెలో కారం, పసుపు, ఉప్పు, సోడా, బియ్యప్పిండి, జీలక్రర, శనగపిండి, టేబుల్ స్పూన్ నూనె, కప్పుడు నీళ్లు పోసి కలపాలి. దీంట్లో పనసతొనలు వేసి కలపాలి. ఈ తొనలను ఒక్కోదాన్ని తీసుకుంటూ కాగుతున్న నూనెలో వేసి, వేయించి తీయాలి. వేడి వేడిగా సర్వ్ చేయాలి. ఆపిల్ బజ్జీ కావల్సినవి: ఆపిల్స్ – 2; శనగపిండి – కప్పు; కారం – అర టీ స్పూన్; దోసె పిండి – టేబుల్ స్పూన్; ఇంగువ – చిటికెడు; ఉప్పు – తగినంత తయారీ: ఒక గిన్నెలో శనగపిండి, నీళ్లు, ఉప్పు, కారం, ఇంగువ, దోసెపిండి వేసి జారుగా కలపాలి. ఆపిల్‌ను స్లైసులుగా కట్ చేసి, మధ్య భాగం కత్తితో గుండ్రంగా (చిల్లుగారెలా) కట్ చేయాలి. పొయ్యి మీద మూకుడు పెట్టి, నూనె పోసి కాగనివ్వాలి. సిద్ధం చేసుకున్న ఆపిల్ స్లైస్‌ను పిండిలో ముంచి కాగుతున్న నూనెలో వేసి, రెండువైపులా దోరగా వేయించాలి. పుదీనా లేదా టొమాటో సాస్‌తో వడ్డించాలి. పైనాపిల్ బజ్జీ కావల్సినవి: పైనాపిల్ స్లైసులు – 6 పీసులు; మైదా – కప్పు; ఉప్పు – తగినంత; బేకింగ్ పౌడర్ – చిటికెడు; ఒక గుడ్డు సొన; నీళ్లు – తగినన్ని ; నూనె – వేయించడానికి తగినంత; పంచదార – టేబుల్ స్పూన్ తయారీ: ఒక గిన్నెలో పిండి, ఉప్పు, బేకింగ్ సోడా, గుడ్డు సొన, పంచదార వేసి కలపాలి. దీంట్లో నీళ్లు పోసి దోసె పిండిలా చిక్కగా ఉండేలా కలుపుకోవాలి. మూకుడు పొయ్యి మీద పెట్టి, నూనె పోసి కాగనివ్వాలి. పైనాపిల్స్లైస్ను పిండిలో ముంచి, కాగుతున్న నూనెలో వేసి రెండు వైపులా ముదురు గోధుమ రంగు వచ్చేలా వేయించుకొని తీయాలి. వేడి వేడిగా వడ్డించాలి. అరటిపండు బజ్జీ కావల్సినవి: అరటిపండ్లు – 2; మైదా – 1/2 కప్పు; పంచదార – టేబుల్ స్పూన్; ఉప్పు – చిటికెడు; బేకింగ్‌సోడా – చిటికెడు; నూనె – వేయించడానికి తగినంత తయారీ: ఒక గిన్నెలో మైదా, ఉప్పు, పంచదార, బేకింగ్ సొడ వేసి కలపాలి. దీంట్లో నీళ్లు పోసి పిండి జారుగా కలుపుకోవాలి. పొయ్యి మీద మూకుడు పెట్టి, నూనె పోసి కాగనివ్వాలి. అరటిపండు తొక్క తీసి, నిలువుగా మూడు పీసులుగా కట్ చేయాలి. ఒక్కో అరటిపండు ముక్కను సిద్ధంగా ఉంచిన పిండి మిశ్రమంలో ముంచి, నూనెలో వేసి ముదురు గోధుమరంగు వచ్చే వరకు వేయించుకొని తీయాలి. -
బజ్జీల వివాదం.. కత్తిపోట్లకు దారితీసింది
తణుకు: అంచుకు మిరపకాయ బజ్జీలు తెచ్చుకుని పూటుగా మద్యం సేవించారు నలుగురు స్నేహితులు. బజ్జీలు బాగుండటంతో ఇంకొన్ని కొనుక్కున్నారు. ఎవరెన్ని పంచుకోవాలనే విషయంలో గొడవపడ్డారు. అదికాస్తా ముదిరిపాకాన పడటంతో బొడ్లో దాచుకున్న కత్తితీసి స్నేహితులపై దాడిచేశాడో వ్యక్తి. పశ్చిమగోదావరి జిల్లా పెరసవల్లి మండలం కందవల్లిలో మంగళవారం చోటుచేసుకున్న ఈ సంఘటన వివరాల్లోకి వెళితే.. మల్లేశ్వరం గ్రామానికి చెందిన మాండు వెంకటేశ్వర్లు(45), భేతాళ రవి(56), నిడదవోలు మండలం పెండ్యాల గ్రామానికి చెందిన పీమా వెంకటేశ్వర్లు(62), ఇందుకూరి రామచంద్రరాజు(46) స్నేహితులు. చిన్నచిన్న పనులు చేసుకుంటూ జీవనం సాగించేవీరు మంగళవారం జాతీయ రహదారి వద్దనున్న కేఎస్‌రావు వైన్స్‌లో మద్యం సేవించారు. వెళ్తూ వెళ్తూ పక్కనున్న దుకాణంలో బజ్జీలు కొనుక్కున్నారు. బజ్జీల పంపకాల్లో తేడా రావడంతో గొడవ మొదలైంది. గొడవ పెద్దది కావడంతో మాండు వెంకటేశ్వర్లు తన దగ్గరున్న కత్తితో మిగతా ముగ్గురిపై దాడి చేశాడు. ఈ దాడిలో ముగ్గురికీ తీవ్రగాయాలయ్యాయి. వెంకటేశ్వర్లును గ్రామస్తులు పట్టుకుని స్తంభానికి కట్టేసి చితకబాదారు. గాయపడిన ముగ్గుర్నీ తణుకు ప్రభుత్వాస్పత్రికి తరలించారు. పోలీసులు వెంకటేశ్వర్లును అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు.