క్లింటన్‌లగారింటి అమ్మాయి
బిల్ క్లింటన్ అమెరికా అధ్యక్షుడిగా పని చేశారు. అదే ఇంట్లోని హిల్లరీ క్లింటన్.. అమెరికా అధ్యక్షురాలిగా పోటీ చేశారు. ఇక ఆ ఇంట్లో ఉన్నది ఒక్కరే... చెల్సీ క్లింటన్! ఒక్కగానొక్క కూతురు. ఈ క్లింటన్‌లగారింటి అమ్మాయి కూడా రాజకీయాల్లోకి వచ్చేస్తుందా? తల్లి హిల్లరీ కలను తను నెరవేరుస్తుందా? చూడాలి. 2020లో... క్లింటన్ 3 వెర్షన్ వస్తుందేమో చూడాలి.
రెండు ముక్కల్లో
పూర్తి పేరు ⇒ చెల్సీ విక్టోరియా క్లింటన్
జననం ⇒ 1980 ఫిబ్రవరి 27
తల్లిదండ్రులు ⇒ బిల్ క్లింటన్, హిల్లరీ క్లింటన్
చదువు ⇒ బి.ఎ., ఎం.ఫిల్. డి.ఫిల్., ఎంపిహెచ్
వివాహం ⇒ 2010 జూలై 31
భర్త ⇒ మార్క్ మెజ్‌విన్‌స్కీ, ఇన్వెస్ట్‌మెంట్ బ్యాంకర్
పిల్లలు ⇒ కూతురు షార్లెట్ (3), కొడుకు ఐడన్ (1)
కొలువు ⇒ ఎన్.బి.సి. స్పెషల్ కరస్పాండెంట్(2011 నుంచి 2014 వరకు)
వ్యాపకం ⇒ క్లింటన్ ఫౌండేషన్
రోడ్రిగొ డ్యుటార్టె నోట్లో నోరు పెట్టడానికి పెద్దపెద్దవాళ్లే ‘ఎందుకులేబ్బా’ అనుకుంటారు. డ్యుటార్టె ఫిలిఫ్పీన్స్ అధ్యక్షుడు. చూడ్డానికి ఎన్‌కౌంటర్ స్పెషలిస్టులా ఉంటాడు. అమెరికాను, ఐక్యరాజ్యసమితినీ ఎవర్నీ లెక్క చెయ్యడు. అలాంటి వాడితో పడింది చెల్సీకి! చెల్సీ.. బిల్ క్లింటన్ కూతురు. రోడ్రిగో ఇటీవలే తన దేశంలోని దక్షిణ ప్రాంతంలో మార్షల్ లా విధించాడు. చిన్న స్పీచ్ కూడా ఇచ్చాడు. ‘‘మీరేమైనా చెయ్యండి. మీ బదులుగా నేను జైలుకు వెళతా. ఒకవేళ ఎవర్నైనా రేప్ చేయవలసి వస్తే ఆ పనీ చెయ్యండి. ఆ నేరాన్ని నా మీద వేసుకుంటా’’ అని సైనికులకు భరోసా ఇచ్చాడు. దీనిపై ప్రపంచంలో ఎవరూ మాట్లాడలేదు! చెల్సీ ఒక్కరే స్పందించారు. ‘డ్యుటార్టె మానవ హక్కులను విస్మరించిన భయంకరమైన వ్యక్తి’ అని ట్విట్టర్‌లో పోస్ట్ చేశారు.
డ్యుటార్టె ఊరుకుంటాడా? వైట్‌హౌస్ ఇంటెర్నీ మోనికా లెవెన్‌స్కీతో, మిగతా అమ్మాయిలతో మీ నాన్నగారు వివాహేతర సంబంధాలు నడిపిన విషయంపై నువ్వెప్పుడైనా నోరెత్తావా?’’ అని చెల్సీని విమర్శించాడు. అయితే చెల్సీ ఇప్పుడు వార్తల్లో ఉన్నది ఇందుకు కాదు. తిరిగి ఆమె డ్యుటార్టెకు ఎలాంటి రిటార్ట్ ఇవ్వబోతోందన్నదీ విషయం కాదు.
కొన్నాళ్లుగా చెల్సీ తన ట్విట్టర్ ఫ్రొఫైల్‌కు పదును పెడుతున్నారు. ట్విట్టర్‌లో చెల్సీకి 10 లక్షల 70 వేల మంది ఫాలోయర్లు ఉన్నారు. ఆన్ లైన్‌లోనే కాదు, ఆఫ్ లైన్‌లోనూ తరచూ ఆమె తన అభిప్రాయాలను వెల్లడిస్తున్నారు. మరీ ముఖ్యంగా తన తల్లి హిల్లరీ క్లింటన్ గత అధ్యక్ష ఎన్నికల్లో ఓడిపోయినప్పటి నుంచీ చెల్సీ వాయిస్ నిరంతరం ఎక్కడో ఒక చోట రెయిజ్ అవుతూనే ఉంది. ‘వరల్డ్ మెన్‌స్ట్రువల్ హైజీన్ డే’, చైల్డ్ మ్యారేజెస్ వంటి సామాజిక, లైంగిక ఆరోగ్య అంశాలపై ఆమె పరిశీలనలు, ట్రంప్ యంత్రాంగపు తీర్మానాలపై ఆమె ఆగ్రహ ప్రకటనలు ఆమెరికన్‌లను ఆకర్షిస్తున్నాయి. చెల్సీలోని ఈ క్రియాశీలత్వం ఇప్పుడు ఆ దేశపు మీడియాకు ఒక కొత్త సందేహాన్ని రేకెత్తిస్తోంది. చెల్సీ రాజకీయాలలోకి వస్తారా అన్నదే ఆ సందేహం. దీనికి కారణం ‘షి పెర్సిస్టెడ్’!
‘షి పెర్సిస్టెడ్’ అనేది.. గత మంగళవారం విడుదలైన చెల్సీ కొత్త పుస్తకం. ఆ పుస్తకం లోపల ఉన్న విశేష రచనల కన్నా, పుస్తకం పైన ఉన్న టైటిల్ ఇప్పుడు చెల్సీ రాజకీయ ప్రవేశానికి ఒక సంకేతంలా అమెరికన్ ప్రజలకు కనిపిస్తోంది! ‘షి పెర్సిస్టెడ్’ అంటే.. ‘ఆమె తగ్గలేదు’ అని అర్థం.ఈ పుస్తకం రాయడానికి చెల్సీకి ఇన్‌స్పిరేషన్ ఎలిజబెత్ వారెన్. 67 ఏళ్ల వారెన్ విద్యావేత్త, డెమొక్రాటిక్ పార్టీ సభ్యురాలు, మసాచుసెట్స్ సెనెటర్. గత ఫిబ్రవరిలో సెనెట్ ఫ్లోర్‌లో ఈమెకు, సెనెట్ మెజారిటీ లీడర్ మిచ్ మికానెల్ (75) కు పడింది. మికానెల్‌ది రిపబ్లికన్ పార్టీ. కెంటకీ సెనెటర్. ట్రంప్ తరఫున అటార్నీ జనరల్ పదవికి జెఫ్ సెషన్స్ (70) నామినేషన్‌పై ఫ్లోర్‌లో డిబేట్ జరుగుతున్నప్పుడు.. 1986లో ఇదే జెఫ్ సెషన్స్‌ను ఫెడరల్ జడ్జి పదవికి అడ్డుకుంటూ అమెరికన్ పౌరహక్కుల నాయకుడు స్వర్గీయ మార్టిన్ లూథర్ కింగ్ జూనియర్ భార్య కొరెట్టా స్కాట్ కింగ్ రాసిన ఉత్తరం కాపీని ఎలిజబెత్ వారెన్ నిండు సెనెట్‌లో చదవడం మొదలు పెట్టగానే ఆమెపై మిచ్ మికానెల్ విరుచుకుపడ్డారు.
చదవడం ఆపేయమని ఒక గద్దింపులా ఆదేశించారు. అయితే ఆయన గద్దింపును ఎలిజబెత్ ఖాతరు చేయలేదు. మికానెల్ వెంటనే పోడియంలోకి వెళ్లి... జ్ఛి ఠ్చీటఠ్చీటn్ఛఛీ. జ్ఛి ఠ్చీటజజీఠ్ఛిn ్చn ్ఛ్ఠp ్చn్చ్టజీౌn. N్ఛఠ్ఛిట్టజ్ఛి ్ఛటట, టజ్ఛి p్ఛటటజీట్ట్ఛఛీ అన్నాడు. ‘ఆమెను హెచ్చరించాను. ఆమెకు వివరణ ఇచ్చాను. కానీ వినలేదు. ఆమె తగ్గలేదు’ అని అర్థం. మికానెల్ మాటల్లోని ‘షి పెర్సిస్టెడ్’ అన్న మాటనే చెల్సీ టైటిల్‌గా పెట్టుకున్నారు. ‘ఆమె తగ్గలేదు’ అనే మాటను యావత్ మహిళా ప్రపంచానికే సగర్వమైన మాటగా చెల్సీ భావించారు.
‘‘మీరు రాజకీయాల్లోకి రాబోతున్నారా?’’ అని పుస్తకం విడుదల తర్వాత చెల్సీని ఇప్పుడు అంతా అడుగుతున్నట్లే.. ఆమె మూడేళ్ల వయసులో తండ్రి ఎన్నికల ప్రచారంలో ఆయనతో పాటు ఉన్నప్పుడు ఎవరో అడిగారు. దానికి చెల్సి చెప్పిన సమాధానం.. ‘నాకింకా మూడేళ్లే కదా’ అని. ఈ 37 ఏళ్ల వయసులో ‘ఆ రోజు అలా అన్నాను’ అని మాత్రమే నవ్వుతూ ప్రశ్నను దాటవేస్తున్నారు. అయితే చెల్సీ ఎంత దాటవేసినా.. 2020లో ఆమె ఏదో సాధించబోతున్నారని అమెరికన్ మీడియా విశ్వసిస్తోంది. ట్రంప్ తర్వాత ఆమె కుమార్తె ఇవాంక అధ్యక్ష పదవికి పోటీ పడితే కనుక, ఇవాంకను తట్టుకోగల శక్తి చెల్సీకి మాత్రమే ఉందన్నది ఇప్పటికే ఆ దేశంలో ఒక చర్చలా సాగడం మొదలైంది! ఈ సందర్భంగా చెల్సీ బ్రీఫ్ బయోగ్రఫీ.
మూడు పుస్తకాలు
‘షి పెర్సిస్టెడ్’కు ముందు చెల్సీ రెండు పుస్తకాల రాశారు. ‘ఇటీజ్ యువర్ వరల్డ్: గెట్ ఇన్‌ఫార్మ్‌డ్, గెట్ ఇన్‌స్పైర్డ్ అండ్ గెట్ గోయింగ్’ అనే పుస్తకంలో మిడిల్–స్కూల్ పిల్లలకు సోషల్ ఎంపవర్‌మెంట్ గురించి చెప్పారు. ఇంకోటి గత జనవరిలో విడుదలైంది. ప్రపంచ ఆరోగ్యంపై చెల్సీ రాసిన ఆ పుస్తకం పేరు ‘గవర్నింగ్ గ్లోబల్ హెల్త్: హు రన్స్ ద వరల్డ్ అండ్ వై’.
పుట్టకముందే పేరు!
చెల్సీ అన్నది ఉత్తర లండన్‌లోని ఒక సంపన్న ప్రాంతం. చెల్సీ పుట్టడానికి ముందు 1978లో క్లింటన్ దంపతులు యుఎస్ నుంచి క్రిస్మస్ సెలవులకు చెల్సీకి వెళ్లినప్పుడు అక్కడ జోనీ మిచెల్ కచేరీలో ‘చెల్సీ మార్నింగ్’ అనే పాటను విన్నారు. ఆ పాట బిల్ క్లింటన్ మనసుకు హత్తుకుపోయింది. వెంటనే ఆయన ‘మనకు కూతురు పుడితే కనుక చెల్సీ అని పేరుపెట్టుకుందాం’ అని హిల్లరీతో అన్నారు. అన్నట్లే కూతురు పుట్టింది. చెల్సీ అని పేరూ పెట్టుకున్నారు.
డాడీని నొప్పించింది
చెల్సీకి డాన్స్ అంటే ఇష్టం. నాలుగేళ్ల వయసులోనే డాన్స్ మాయలో పడిపోయింది! వాషింగ్టస్ స్కూల్ ఆఫ్ బ్యాలేలో చాలా ఏళ్లు పాటు ప్రాక్టీస్ చేసింది. డాన్స్ కోసం సాఫ్ట్‌బాల్‌ని, సాకర్‌నీ వదిలేసింది. క్లింటన్‌కి కూతురి చాయిస్ నచ్చలేదు. చెప్పి చూశాడు. చెల్సీ వినలేదు. ఇక ఆమె దారిలోకే ఈయన వెళ్లాడు. కూతురు ఎక్కడ ప్రోగ్రాములు ఇస్తున్నా అక్కడికి వెళ్లడం మొదలుపెట్టాడు. ‘నట్‌క్రాకర్’ ప్లేలో స్టేజీ మీద ‘ఫేవరేట్ ఆంట్’ పాత్రను అభినయిస్తున్న కూతుర్ని చూసి తెగ మురిసిపోయాడని హిల్లరీ ‘ఇట్ టేక్స్ ఎ విలేజ్’ అనే తన పుస్తకంలో రాసుకున్నారు.
తల్లి మతమే తన మతం
బిల్ క్లింటన్ సదరన్ బాప్టిస్టు. హిల్లరీ మెథడిస్టు విశ్వాసి. రెండూ ప్రొటెస్టెంట్‌ల విభాగాలే అయినా ఫిలాసఫీలో స్వల్పంగా మాత్రమే వ్యత్యాసం ఉండేది. అయితే చెల్సీ తన తల్లి మార్గానే అనుసరించేది. తన ఏజ్ గ్రూప్ (టీన్స్) వాళ్లతో కలిసి మెథడిస్ట్ చర్చికి వెళ్లి వచ్చేది. అయితే అందర్లోనూ ‘టెరిఫిక్ కిడ్’ లా ఉండేది. చర్చి లేనప్పుడు తన చర్చి మేట్స్‌ని బ్రేక్‌ఫాస్ట్‌లకు, లంచ్‌కి పిలుచుకొచ్చేది. కొన్నిసార్లు క్లింటన్ దంపతులు కూడా వాళ్లతో కూర్చునేవారు. కొందరైతే రాత్రి ఉండడానికి (స్లీప్–ఓవర్) చెల్సీతో పాటు వైట్ హౌస్‌కి వచ్చేసేవారు!
అమ్మ కోసం ప్రచారం
హిల్లరీ క్లింటన్ 2008లో అధ్యక్ష పదవి ఎన్నికల ప్రచారంలో తల్లి అభ్యర్థిత్వానికి మద్దతుగా వందకు పైగా కాలేజీల్లో ప్రసంగించారు చెల్సీ. అప్పుడు ఎవరో ‘లెవిన్‌స్కీతో మీ నాన్న స్కాండల్, మీ అమ్మకు వ్యతిరేకంగా పనిచేస్తుందనుకుంటున్నారా?’ అని అడిగార్ట. ‘మీరు ఓటు వేయడానికి ఇదే ముఖ్యం అని భావిస్తే మీ భావనననుసరించి ఓటెయ్యండి. నేను అనుకోవడం ఏంటంటే.. హెల్త్ కేర్, ఎకనమిక్స్ అంశాల ఆధారంగా ఓటు వేసే వారూ ఉంటారని’ అన్నారు చెల్సీ. మొన్నటి అధ్యక్ష ఎన్నికల్లోనూ తల్లికి సపోర్టుగా ఉన్నారు. తల్లి ఓటమి చెల్సీని కదలించింది కానీ, తల్లి కదలిపోకుండా చూసేందుకే తన దృష్టినంతా కేంద్రీకరించారు.
చెల్సీ కోడ్ నేమ్ ‘ఎన ర్జీ’
బిల్ క్లింటన్ తొలిసారి అమెరికా అధ్యక్షుడు అయినప్పుడు 1993 జనవరి 20న తల్లిదండ్రులతో పాటు చెల్సీ వైట్ హౌస్‌లోకి అడుగుపెట్టింది. అక్కడ ఆమెకు అమెరికా సీక్రెట్ సర్వీస్ ‘ఎనర్జీ’ అనే కోడ్‌నేమ్ ఇచ్చింది. అప్పుడు ఆమె వయసు 13 ఏళ్లు. క్లింటన్ దంపతులు తమ ఏకైక సంతానం అయిన చెల్సీని మీడియా కంటపడకుండా పెంచారు. ఈ విషయంలో హిల్లరీ.. కెనడీ భార్య జాక్వెలీన్ సలహాలను పాటించారు. ప్రభుత్వం తరఫున జరిగే సభలకు, సమావేశాలకు కూడా కూతుర్ని దూరంగా ఉంచారు. మీడియా అభివర్ణనలలోంచి తన వ్యక్తిత్వాన్ని చూసుకుని చెల్సీ వాటికి ప్రభావితం కాకుండా ఉండేందుకు క్లింటన్ దంపతులు ఈ నిర్ణయం తీసుకున్నారు. అయినప్పటికీ క్లింటన్ అధ్యక్షుడిగా చేసిన ఎనిమిదేళ్లలోనూ చెల్సీపై ‘ది న్యూయర్క్ టైమ్స్’లో 32 కథనాలు, టీవీలలో 87 నెట్‌వర్క్ న్యూస్ స్టోరీలు వచ్చాయి. అమెరికా చరిత్రలోనే అధ్యక్షుల పిల్లలందరిలోకీ ఎక్కువ మీడియా కవరేజీ వచ్చింది చెల్సీకే!
ఐదవ ఏట రీగన్‌కి లెటర్
తండ్రి ఆర్కాన్‌సాస్ గవర్నర్‌గా పోటీ చేస్తున్నప్పుడు రెండేళ్ల వయసులోనే తల్లిదండ్రులతో పాటు ఎన్నికల ప్రచారంలో ఉత్సాహంగా పాల్గొంది చెల్సీ! మూడేళ్లకే న్యూస్ పేపర్ చదవడం, ఉత్తరాలు రాయడం నేర్చుకుంది. ఐదో ఏట ఏకంగా అప్పటి అమెరికా అధ్యక్షుడు రొనాల్డ్ రీగన్‌కే ఉత్తరం రాసింది. ఆ ఉత్తరం కాపీని క్లింటన్ ఇప్పటికీ భద్రంగా దాచి ఉంచారు. పశ్చిమ జర్మనీలోని నాజీ సైనికుల సమాధులను సందర్శించడానికి వెళ్లొద్దని చెల్సీ ఆ ఉత్తరంలో రాసింది!
అమ్మానాన్నలతో చెల్సీ
కొడుకుతో చెల్సీ దంపతులు