
స్టేజ్ టు సినిమా!
దర్శకుడిగా ‘దర్శకరత్న’ ప్రయాణం
అప్పటి మద్రాసులోని వాణీమహల్‌లో ఓ రోజు ‘పద్మశ్రీ’ అనే నాటక ప్రదర్శన జరుగుతోంది. నిండా ముప్ఫై ఏళ్లు నిండని ఓ కుర్రాడు ఆ నాటక రచయిత–దర్శకుడు. హీరో కూడా అతనే. హాలు మొత్తం నిండింది. నాటకం పూర్తవ్వగానే కరతాళ ధ్వనులతో మార్మోగిపోయింది. ప్రేక్షకుల్లోంచి ఓ వ్యక్తి నాటకం రాసి, దర్శకత్వం వహించిన ఆ కుర్రాడి దగ్గరకు వచ్చి... ‘‘వెల్‌డన్! నాటకం బాగా రాశావ్. అంతకంటే బాగా నటించావ్. నటనలో మంచి ఈజ్ ఉంది. రచయితగా, నటుడిగా నీకు మంచి భవిష్యత్ ఉంది’’ అన్నారు. ఈ మాటలన్నది ఎవరో తెలుసా? మహానటుడు ఎస్వీ రంగారావు. ఆయన ప్రశంసలు అందుకున్న కుర్రాడు దాసరి నారాయణరావు.
వాళ్లిద్దరి తొలి పరిచయం సన్నివేశమది. అలా మొదలైన పరిచయం ఎస్వీఆర్ నటించిన చిత్రాలకు దాసరి మాటలు, స్క్రీన్‌ప్లే రాసే వరకు వచ్చింది. ఎస్వీఆర్ ‘జగత్ కిలాడీలు, జగత్ జెట్టీలు’ చిత్రాలకు దాసరి డైలాగులు రాశారు. తర్వాత ఎస్వీఆర్ దర్శకత్వం వహించిన ‘బాంధవ్యాలు’, ‘చదరంగం’ చిత్రాలకు స్క్రిప్ట్ వర్క్‌లో పాలు పంచుకున్నారు. ఈ క్రమంలో దర్శకుడిగా పరిచయం కావాలనుకుంటున్న దాసరి, అందుకోసం రాసుకున్న కథను ఓసారి ఎస్వీఆర్‌కు వినిపించారు. ఆయనకు కథ బాగా నచ్చేసింది. ఎస్వీఆర్, నిర్మాత కె. రాఘవలు మంచి మిత్రులు కదా! వాళ్లిద్దరి మాటల మధ్యలో ఓసారి దాసరి ప్రస్తావన వచ్చింది.
అప్పుడు ఎస్వీఆర్ ‘ఆ కుర్రాడి దగ్గర మంచి సెంటిమెంట్ కథ ఉంది’ అని రాఘవకు చెప్పారు. వెంటనే దాసరిని పిలిపించుకుని కథ విన్నారు రాఘవ. ఆయనకు విపరీతంగా నచ్చేసింది. ఆ కథే 1972 మార్చి 23న ‘తాతా–మనవడు’గా ప్రేక్షకుల ముందుకొచ్చింది. అదే దాసరి దర్శకత్వం వహించిన తొలి సినిమా. దాసరి రెండో సినిమా ‘సంసారం–సాగరం’లో కూడా ఎస్వీఆర్ నటించారు. కాబూలీ వాలా పాత్రలో కనిపించారు.
పాలకొల్లు టు హైదరాబాద్ వయా మద్రాస్... దాసరి ప్రయాణంలో ఎన్నో ఎత్తు–పల్లాలు... అవమానాలు. అన్నింటినీ అధిగమించారు. 75 ఏళ్ల జీవితంలో వ్యక్తిగా–దర్శక–నిర్మాతగా–రచయితగా–నటుడిగా తాను ఎదుర్కొన్న పలు అనుభవాలను దాసరి పలు సందర్భాల్లో స్వయంగా చెప్పారు. ఆ విశేషాలు...
గౌరీ ప్రొడక్షన్స్ భావనారాయణగారు కన్నడ హిట్ ‘ప్రేమకు పర్మిట్’ తెలుగు డబ్బింగ్ ‘పర్వతాలు పానకాలు’కు మాటలు రాసే బాధ్యత నాకు అప్పగించారు. అడ్వాన్స్‌గా రూ. 300 ఇచ్చారు. ఫస్ట్ ఛాన్స్, ఫస్ట్ రెమ్యునరేషన్ అదే. తర్వాత భావనారాయణగారు డబ్బింగ్ కాకుండా, రీమేక్ చేయాలనుకున్నారు. స్క్రిప్ట్ డిస్కషన్స్‌లో నేనూ పాల్గొన్నాను. డైలాగులు రాశాను. మ్యాగజైన్‌లో నా పేరు ఎప్పుడు చూసుకుందామా? అనే ఆత్రుతతో ఉండేవాణ్ణి. తీరా, మ్యాగజైన్‌లో సంభాషణల రచయిత ‘దాసం’ అని రాశారు. ఏం జరిగిందో తెలుసుకోవాలని ఆ ఆఫీసుకు వెళితే... సబ్–ఎడిటర్ తప్పు చేశాడన్నారు. గౌరీ ప్రొడక్షన్స్‌లో ‘బంగారు సంకెళ్లు’ సినిమాకు దాసం గోపాలకృష్ణగారు స్క్రిప్ట్ రాస్తున్నారు. ‘దాసం’ బదులు ‘దాసరి’ అని రాశారేమో అనుకుని సబ్–ఎడిటర్ ‘రి’ బదులు ’ పెట్టారట. ఆ పొరబాటుతో చిత్రపరిశ్రమలో నా ప్రయాణం మొదలైంది.
ఫెయిల్యూర్ వస్తే పరిస్థితి ఎలా ఉంటుందో ‘ముద్దబంతి పువ్వు’తో నాకు అర్థమైంది. అంతకు ముందు వరుసగా 12 హిట్స్ ఇచ్చాను. ఒక్క ఫ్లాప్ వచ్చేసరికి నా చుట్టూ ఉన్న 26 మంది నిర్మాతల్లో 14మంది అడ్వాన్సులు వెనక్కి తీసుకున్నారు. అప్పుడు ‘ఓహో... ఫెయిల్యూర్ అంటే ఇదా!’ అనుకుని నవ్వుకున్నా. ఆ సినిమా విడుదలకు ముందు నేను విజయవాడ వెళితే... నా వెనుక పది, పన్నెండు కార్లు బయలుదేరాయి. రిటన్ వచ్చినప్పుడు ఒక్క కారు కూడా లేదు. ఒక్క నిర్మాత కూడా కనిపించలేదు. గమ్మత్తు ఏంటంటే... సినిమా ఫ్లాపైందని నా కారుకు కూడా తెలిసిందేమో! అది కూడా రిపేరయ్యి మొరాయించింది. అదే నా ఫస్ట్ అండ్ లాస్ట్ బిటర్ ఎక్స్‌పీరియన్స్.
తొలినాళ్లలో సక్సెస్ ఎంజాయ్ చేసేంత టైమ్ నాకు లేదు. ఓ సినిమా రిలీజ్ అయితే నాలుగు సినిమాలు సెట్స్‌పై ఉండేవి. అప్పట్లో టీవీలు, సెల్ ఫోనులు లేకపోవడంతో ఎవరైనా మద్రాస్ వచ్చి చెబితే తెలిసేది. రిజల్ట్ మాకు తెలిసేటప్పటికి రెండు మూడు వారాలు పట్టేది. ‘ప్రేమాభిషేకం’ హిట్ అని తెలుసు కానీ... అంత పెద్ద హిట్ అన్న విషయం వంద రోజులు ఆడే వరకు తెలీలేదు. విజయాల గురించి వినడమే తప్ప ఎగిరి గంతులేసి ఎంజాయ్ చేసేంత టైమ్ ఉండేది కాదు.
ఎన్టీఆర్‌గారితో ‘చిక్కడు–దొరకడు’ చిత్రాన్ని నిర్మించిన కుదరవల్లి లక్ష్మీనారాయణగారు ఆయనకు కథ చెప్పాలని నన్ను తీసుకువెళ్లారు. ఎన్టీఆర్‌కి రెండు కథలు చెప్పాను. వాటిలో ఒకటి ఆయనకు బాగా నచ్చింది. కానీ, వ్యక్తిగత కారణాల వల్ల నిర్మాత సినిమాను ప్రారంభించలేదు. అయితే... ఎన్టీఆర్‌కి కథ బాగా నచ్చడంతో రూ. 1,116 అడ్వాన్స్‌గా ఇచ్చారు. ‘నారాయణరావుగారూ! వీలుపడినప్పుడు ఈ కథతో తప్పకుండా సినిమా చేద్దాం’ అన్నారు. ఆ కథ ఇంతవరకు తెరకెక్కలేదు. నేను దర్శకుడు కాకముందు, కో–డైరెక్టర్‌గా పనిచేసేటప్పటి సంగతిది.
సావిత్రిగారు దర్శకత్వం వహించిన ‘వింత సంసారం’కు నేను కో–డైరెక్టర్‌గా పనిచేశా. అంతకు ముందు నుంచీ ఉన్న పరిచయంతో ఆమెను ‘అక్కా’ అని పిలిచేవాణ్ణి. ‘వింత సంసారం’కు పని చేస్తున్నప్పుడు నిజంగానే నాకు ఆవిడ ‘అక్క’ అవుతారని తెలిసింది. మా దగ్గర బంధువు బసవయ్యగారికి సావిత్రిగారు మేనకోడలు. నటిగా ఎంత ఉన్నతురాలో... అంతకు పదింతల సంస్కారం, సహృదయత ఉన్న మనిషి సావిత్రిగారు.