ఫస్ట్ డాటర్
ఇవాంక ట్రంప్
అమెరికా శక్తిమంతమైన దేశం. ఆ దేశాన్ని నడిపించేది శక్తిమంతమైన అధ్యక్షుడు. ఆ అధ్యక్షుడిని నడిపించేది శక్తిమంతమైన సలహాదారు. ఆ సలహాదారు స్థానంలో... స్వయానా ఆ దేశాధ్యక్షుడి కూతురే ఉంటే? ఇక ఆమె ఎంత పవర్‌ఫుల్ అయి ఉండాలి!! కానీ ఇవాంక... పవర్‌ని కిరీటంలా తలపై ధరించడం లేదు. బాధ్యతగా భుజాలకు ఎత్తుకుంటున్నారు. అమెరికా అధ్యక్షుడి భార్యను ‘ఫస్ట్ లేడీ’ అంటారు. మహిళలకు అమెరికా ఇచ్చే గౌరవం అది. ఇవాంక కూడా అమెరికాలో ఉన్న ప్రతి మహిళా..అభివృద్ధి చెందాలని కోరుకుంటున్నారు. అందుకే ఆమె... ఆ దేశానికి ‘ఫస్ట్ డాటర్’.
వాషింగ్టన్‌లో ఆదివారం ఉదయం కూడా తుంపర్లు పడడం కొనసాగి ఉంటే, ఇవాంక ట్రంప్ ఆ వానజల్లుల్లో తడుస్తూనే జాగింగ్‌ను ముగించుకుని ఇల్లు చేరి ఉంటారు. గత రెండు రోజులుగా అక్కడి వాతావరణం సాధారణ స్థాయిని మించి చల్లగా ఉండి, పూల చెట్ల పైనుంచి మంచు బిందువులను మెత్తగా చిలకరిస్తోంది. గంట వ్యాయామం తర్వాత కూడా ఒంటికి చెమటలు పట్టనివ్వని చల్లదనం అది! కలోరమా ప్రాంతానికి పొరుగునే ఉండే అతి ఖరీదైన నివాస పరిసరాలలో అమెరికా పూర్వపు అధ్యక్షుడు ఒబామా ఉంటున్న కొత్త ఇంటికి కాస్త సమీపంలోనే ఇవాంక కుటుంబం కూడా ఉంటోంది. ఏడాదికి 55 లక్షల డాలర్ల (సుమారు 35 కోట్ల 56 లక్షల రూపాయలు) అద్దె చెల్లించి ఇవాంక ఉంటున్న ఆ ఇంట్లోని కుటుంబ సభ్యుల సంఖ్య.. భర్తతో కలుపుకుని మొత్తం ఐదుగురు మాత్రమే.
జాగింగ్ చేస్తున్నప్పుడు ఇవాంక వెంట ఆమె భర్త జారెడ్ కష్నర్ తప్పనిసరిగా ఉంటారు. వారిద్దరినీ ఒక మహిళా సీక్రెట్ సర్వీస్ ఏజెంట్ అనుసరిస్తూ ఉంటుంది. (ఫొటో చూడండి). ఇద్దరూ వైట్‌హౌస్ ఉద్యోగులే అయినప్పటికీ... రోజు మొత్తంలో ఇవాంక, ఆమె భర్త.. ఒకరి సమక్షంలో ఒకరు గడిపే అమూల్యమైన అవకాశం ఇంటి దగ్గర ఈ ఉషోదయపు నిమిషాలలో మాత్రమే లభిస్తుంటుంది. మ్యాచింగ్ అథ్లెటిక్ దుస్తులు వేసుకుని, లో బేస్‌బాల్ క్యాప్‌లు ధరించి, పక్కపక్కనే వడివడిగా, వగరుస్తూ నడుస్తూ ఈ భార్యాభర్తలు ఎక్కువగా మాట్లాడుకునే విషయాలు ఫిట్‌నెస్ గురించే! ఇవాంకకు ఒకప్పుడు న్యూయార్క్ సిటీ హాఫ్–మారథాన్‌ను గెలవడం అన్నది లక్ష్యంగా ఉండేది. ఆ లక్ష్యాన్ని కొన్ని నెలల కఠోరమైన శిక్షణతో ఆమె నెరవేర్చుకున్నారు కూడా. 2015 ఏప్రిల్‌లో పదమూడు మైళ్ల మారథాన్ పరుగులో ఇవాంక విజయం సాధించారు!
అయితే జాగింగ్‌కి వెళ్లి, ఇంటికి క్షేమంగా తిరిగి రావడాన్ని కూడా ఏరోజుకారోజు ఒక పెద్ద విజయంగా పరిణమించే పరిస్థితులు ఇవాంక చుట్టూ క్రమక్రమంగా ఒక అభద్రతా వలయంలా ఏర్పడబోతున్నాయి! ఏప్రిల్ 6న సిరియాపై అమెరికా క్షిపణిదాడులు జరిపాక ఆ ప్రమాదం మరింత ఎక్కువయింది. ‘డాటర్ ఆఫ్ ట్రంప్’ ప్రోద్బలం వల్లనే ఈ దాడి జరిగిందన్న వార్తలు రావడమే ఇందుకు కారణం. అయితే ఈ పరిణామాలేవీ ఇవాంకను అమెరికా దాటకుండా చేయడం లేదు. మంగళవారం (రేపు) బెర్లిన్‌లో జరగబోయే మహిళా సదస్సు ‘డబ్ల్యూ 20 సమ్మిట్’లో ‘ఇన్‌స్పైరింగ్ ఉమెన్: స్కేలింగ్ అప్ ఉమెన్స్ ఆంట్రప్రెన్యూర్íషిప్’ అనే అంశంపై ఇవాంక ప్రసంగించబోతున్నారు. ఆ వెంటనే బెర్లిన్‌లోని ‘హాలోకాస్ట్ మెమోరియల్’ను సందర్శిస్తారు. రెండో ప్రపంచ యుద్ధంలో మరణించిన యూదుల స్మారక చిహ్నం అది.
ఇవాంక.. ఉన్నది ఉన్నట్లు మాట్లాడే అమ్మాయి. ముగ్గురు పిల్లల తల్లి అయితే కావచ్చు. కానీ ఆమె తన ఉద్వేగాల పరంగా ఇప్పటికీ చిన్న పిల్లే. అమెరికా ‘ఫస్ట్ డాటర్’ అన్న హోదా కూడా ఆమె వ్యక్తిత్వానికి ఏమాత్రం గుంభనత్వాన్ని చేకూర్చలేకపోయింది! కెనడా యువ ప్రధాని జస్టిన్ ట్రూడో ఇటీవల వైట్ హౌస్‌కు వచ్చినప్పుడు ఇవాంక అతడిని కళ్లార్పకుండా చూస్తూ ఉండిపోయిన దృశ్యాన్ని యావత్ ప్రపంచ ప్రజలు ఆసక్తిగా తిలకించారు. అయితే ప్రపంచ దేశాలు మాత్రం ఆమెను అమెరికా అధ్యక్షుడికి నిరంతరం అందుబాటులో ఉండే ‘మిస్టీరియస్ బ్లాక్ బ్రీఫ్‌కేస్’ను చూసినట్టుగా భయం భయంగా వీక్షిస్తున్నాయి. ఎక్కడి నుంచైనా, ఏ క్షణంలోనైనా, ఏ దేశంపై మీదికైనా బాంబు వేయమని ఆదేశించే సాంకేతిక వ్యవస్థ ఆ బ్రీఫ్‌కేస్‌లో ఉంది! ట్రంప్ తన పుత్రికపై ఉన్న వాత్సల్యంతో బాంబు లాంటి అమెరికాను ఆడుకోడానికి ఆమె చేతికి ఇచ్చేశారని తక్కిన అగ్రరాజ్యాలు ఇప్పుడు కలవర పడుతున్నాయి.
మొదటి ప్రపంచ యుద్ధం గవ్రిలో ప్రిన్సిన్ అనే బోస్నియా యువకుడి వల్ల ప్రారంభం అయింది. రెండో ప్రపంచ యుద్ధం హిట్లర్ వల్ల మొదలైంది. మూడో ప్రపంచ యుద్ధానికి ఇవాంక కారణం అవుతుందా? పిచ్చి ఆలోచన. కానీ ఇవాంక ఇప్పుడు వైట్‌హౌస్‌లో తన తండ్రికి ఆంతరంగిక సలహాదారుగా ఉన్నారు కదా!! అదీ మంచికే అనుకోవాలి. ట్రంప్ తన కుమార్తె ఆదేశాలను పాటిస్తారేమో కానీ, ఇవాంక తన తండ్రిని గుడ్డిగా సమర్థించరు. ఆ విషయం మొన్నటి అమెరికా అధ్యక్ష ఎన్నికల ప్రచారంలోనే స్పష్టం అయింది.
అమెరికా అధ్యక్ష ఎన్నికలకు ఇవాంక.. తండ్రి తరఫున ప్రచారం చేసినప్పటికీ ఎన్నికల్లో ఆయన పోటీ చేయడంపై ఆమె తన అభిప్రాయాలను ఏమాత్రం దాపరికం లేకుండా వెల్లడించడం ట్రంప్ ప్రత్యర్థుల్ని సైతం నివ్వెరపరచింది. ‘‘ఒక పౌరురాలిగా ఆయన చేస్తున్న పనిని నేను ఇష్టపడతాను. కానీ ఒక కూతురిగా ఇది ఆయనకు కష్టమైన విషయంగా భావిస్తాను’’ అని ఇవాంక అన్నారు! మొదట్నుంచీ ట్రంప్‌ను వ్యతిరేకిస్తూ వస్తున్న ‘వాషింగ్టన్ పోస్ట్’ పత్రిక.. మధ్యలో తన పట్టును కాస్త సడలించిందీ అంటే అది ఇవాంక వల్లనే! ‘‘నా తండ్రిలో ఉన్న అత్యంత గొప్పవైన నైపుణ్యాలలో ఒకటి ఏమిటంటే.. మనుషుల్లోని సామర్థ్యాలను ఇట్టే పట్టేస్తారు. అమెరికాను ఆయన మళ్లీ ఒక గొప్ప దేశంగా మార్చేయగలరు’’ అని రిపబ్లికన్ పార్టీ అభ్యర్థుల సమావేశంలో ఇవాంక అన్న మాటల్ని వాషింగ్టన్ పోస్ట్ ప్రముఖంగా ప్రచురించింది.
ఆ సమావేశంలో ఆమె ప్రసంగం స్వర్గీయ ఇంగ్లండ్ గిటారిస్ట్ జార్జి హ్యారిసన్ పాట ‘హియర్ కమ్స్ ది సన్’తో మొదలవడం వెనుక ఉన్న ఆలోచన కూడా ఆమెదే అయివుండొచ్చని సరిగ్గానే ఊహించింది. ఆ పత్రిక ఊహించిన మరొక విషయం.. ఇవాంక వైట్‌హౌస్‌లో ఉన్నంత వరకే అమెరికా గానీ, మిగతా దేశాలు గానీ ట్రంప్ చేతుల్లో సురక్షితంగా ఉంటాయని. అయితే ఇది కాలం వల్ల రుజువయ్యే ఊహ కాదు. కాలానికే ఇవాంక పెట్టే పరీక్ష. ఇప్పటికైతే యూఎస్‌కు షీ ఈజ్ ద బాస్.
జీతం లేని ఉద్యోగం
డొనాల్డ్ ట్రంప్ అమెరికా అధ్యక్షుడు కాకపోయుంటే ఇవాళ ఇవాంక మేరీ ట్రంప్ (35) పరిచయం వేరేలా ఉండేది. ప్రధానంగా వజ్రాలు, బంగారు ఆరణాలు, స్త్రీల దుస్తులు, స్త్రీలు ధరించే యాక్సెసరీల వ్యాపారి ఆమె. అంతకన్నా ముందు ఫ్యాషన్ మోడల్. ప్రస్తుతం అమెరికా ప్రథమ పుత్రికగా ఇవాంక తన తండ్రికి వైట్ హౌస్ ఆంతరంగికురాలిగా జీతం లేని ఉద్యోగం చేస్తున్నారు. ఆమె కన్నా ఏడాది మాత్రమే వయసులో పెద్దవాడైన భర్త జారెడ్ కుష్నర్ కూడా ఒక సీనియర్ సలహాదారుగా ట్రంప్ పంచనే ఉండిపోయారు. ఇవాంక కుటుంబం ఈ ఏడాది మార్చిలో న్యూయార్క్ నుంచి వాషింగ్టన్‌కు తరలి వచ్చింది. శుక్రవారం ఇవాంక తన ఇన్‌స్టాగ్రామ్‌లో ఐదేళ్ల తన కూతురు ఆరబెల్లా ఫొటోను పోస్ట్ చేశారు. ఆ ఫోటోలో వైట్‌హౌస్ మెట్లు దిగుతున్న ఆరబెల్లాను చూస్తే, శ్వేతసౌధానికే అందం వచ్చినట్లుగా ఉంది! ఆరబెల్లానే ఆ ఇంట్లో పెద్దమ్మాయి. తర్వాత ఇద్దరు తమ్ముళ్లు. మూడేళ్ల ఫ్రెడెరిక్, ఏడాది వయసున్న థియోడర్.
బోర్డింగ్ స్కూల్లో బందీ!
మొదట తల్లి పేరే కూతురికీ ఉండేది. తర్వాత ఇవాంకగా మార్చారు. ఇవాంకకు 11 ఏళ్ల వయసులో ట్రంప్ దంపతులు విడాకులు తీసుకున్నారు. ఇవాంక తండ్రితో ఉండిపోయింది. పదిహేనో యేట వరకు మన్‌హట్టన్‌లోని చాపిన్ స్కూల్లో చదివింది. తర్వాత కనెక్టికట్‌లో బోర్డింగ్ స్కూల్. అదొక జైలులా ఉండేది ఇవాంకకు. తన ఫ్రెండ్స్ అంతా న్యూయార్క్‌లో స్వేచ్ఛగా చదువుకుంటుంటే తనొక్కతే ఇలా బందీగా ఉండడం ఇవాంకకు నచ్చలేదు. బాల్యాన్ని, టీనేజ్‌ని బలవంతంగా లాక్కొచ్చింది. పెన్సిల్వేనియా యూనివర్సిటిలో ఎకనమిక్స్ డిగ్రీ పూర్తి చేసింది. ఇవాంకకు ఇంగ్లిష్, ఫ్రెంచ్‌తో పాటు చెక్ భాష కూడా వచ్చు. అది తల్లి నుంచి వచ్చిన భాష. ఆమె చెకోస్లోవేకియా దేశస్థురాలు.
అమెరికా ప్రథమ పుత్రిక
డొనాల్డ్ ట్రంప్ మొదటి భార్య ఇవాన. ఆమెతో విడిపోయాక మార్లా మేపుల్స్‌ను చేసుకున్నారు. మేపుల్స్‌తో కూడా విడాకులు తీసుకున్నాక మెలానియాను చేసుకున్నారు. ఇవాంక.. మొదటి భార్య కూతురు. మిగతా పిల్లల్లో డొనాల్డ్ జూనియర్ (39) ఇవాంక అన్నయ్య. ఎరిక్ (33) ఇవాంక తమ్ముడు. టిఫాని (23), బ్యారన్ (11) ఇవాంక చెల్లి, తమ్ముడు. అయితే ఈ ఇద్దరు తోబుట్టువులు కాదు. మారు తల్లి పిల్లలు. టిఫానీ.. ట్రంప్ రెండో భార్య మేపుల్స్ కూతురు. బ్యారన్.. ట్రంప్ మూడో భార్య మెలానియా కొడుకు. మెలానియా ఇప్పుడు వైట్ హౌస్‌లోనే ఉన్నారు.. అమెరికా ప్రథమ మహిళ హోదాలో. అయితే ఆమెకన్నా కూడా ఇవాంకకే ‘ప్రథమ పుత్రిక’గా ఎక్కువ ప్రాముఖ్యం లభిస్తోంది!
హిల్లరీకి వెయ్యి డాలర్లు
హిల్లరీ క్లింటన్ 2007లో ఒబామాపై పోటీగా అధ్యక్ష పదవికి నిలబడినప్పుడు హిల్లరీ ఎన్నికల ప్రచారానికి ఇవాంక వెయ్యి డాలర్ల విరాళం ఇచ్చారు! సుమారు 65 వేల రూపాయలు. ఇవాంక అప్పుడు అమెరికన్ మోడలింగ్ ప్రపంచాన్ని దాదాపుగా ఏలుతున్నారు. ఫోర్బ్స్, గోల్ఫ్ మ్యాగజీన్, అవెన్యూ, ఎల్, మెక్సికో, టాప్ చాయిస్ మ్యాగజీన్.. ఏ కవర్‌పై చూసినా ఇవాంకానే! ‘లవ్ ఎఫ్.ఎం.డి.’ పత్రికపై అయితే ఇవాంక లెక్కలేనన్నిసార్లు కనిపించారు. హిల్లరీకే కాదు, ఆ తర్వాత 2012లో అమెరికా అధ్యక్ష పదవికి నామినేషన్ వేసిన రిపబ్లికన్ పార్టీ అభ్యర్థి మిట్ రామ్నీకి కూడా డబ్బు సహాయం చేశారు. ఇంతకుమించి రాజకీయాలపై ఆమె ఉత్సాహం చూపలేదు. ఆసక్తీ కనబరచలేదు.
పెద్ద మనసు... పెద్ద చెయ్యి
ఇవాంక మనసులాగే చెయ్యి కూడా పెద్దది. న్యూయార్క్‌లో ‘చాయ్ లైఫ్‌లైన్’ అనే స్వచ్ఛంద సంస్థ ఉంది. ఆ సంస్థ క్యానర్ బారిన పడిన బాలలను సంరక్షిస్తుంటుంది. ఆ సంస్థకు, ఇంకా అనేక యూదు సంస్థలకు ఇవాంక డబ్బు సహాయం చేస్తుంటారు. అలాగే ‘యునైటెడ్ హట్జలా’ అనే సంస్థ ఉంది. జెరుసలేంలోని అత్యవసర వైద్య చికిత్సా సంస్థ ఇది. దానికి కూడా వేల డాలర్ల చెక్కులు పంపుతుంటారు. డొనాల్ట్ ట్రంప్ అయితే ఆ సంస్థకు లక్షల డాలర్లు ఇచ్చిన సందర్భాలు కూడా ఉన్నాయి!
- మాధవ్ శింగరాజు