పోను పోనూ మీకే తెలుస్తుందిలే: ఇవాంకా ట్రంప్
వాషింగ్టన్: అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ పాలనా వ్యవహారాలలో కూతురు ఇవాంకా ట్రంప్ జోక్యం ఎక్కువైందని తీవ్ర విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. దీనిపై స్థానిక మీడియాలో భిన్న కథనాలు రావడంపై ఇవాంకా స్పందించారు. తాను తన తండ్రి, అధ్యక్షుడు ట్రంప్ నిర్ణయాలలో జోక్యం చేసుకోవడం లేదని, కేవలం ఈ విషయంలో అందరూ అపోహ పడుతున్నారని పేర్కొన్నారు. పాలనా వ్యవహారాలలో తగిన సలహాలు ఇవ్వడాన్ని తప్పుబట్టడాన్ని ఆమె తీవ్రంగా వ్యతిరేకించారు. వేరే వ్యక్తులు ఎవరైనా తనకంటే భిన్నంగా ఏమైనా.. ఏం చేయాలనుకుంటున్నారో చెప్పాలని విమర్శకులను సూటిగా ప్రశ్నించారు. తాను చేసే ప్రతిపని అమెరికన్ ప్రజల మంచి కోసమేనని పోను పోనూ మీకే తెలుస్తుందని ఇవాంకా పేర్కొన్నారు.
ట్రంప్ తీసుకునే చెడు నిర్ణయాలలో ఆమె తన వంతు పాత్ర పోషిస్తున్నారని డెమొక్రాట్లతో పాటు కొందరు రిపబ్లికన్ నేతలు వ్యాఖ్యానించారు. అయితే తన తండ్రి పాలనాపరంగా విజయం సాధిస్తారని ఇందులో సందేహం అక్కర్లేదని ఇవాంకా చెప్పారు. తనపై వాడుతున్న కాంప్లిసిట్ అనే పదానికి మీకు అర్థం తెలుసా అని ఆగ్రహం వ్యక్తంచేశారు. నేరాన్ని చేసే వాళ్లకు సాయం చేయడాన్ని, తప్పుడు పనులకు శ్రీకారం చుట్టడాన్ని కాంప్లిసిట్ అని వ్యవహరిస్తారని.. అలాంటప్పుడు ఈ పదాన్ని ఎందుకు పదే పదే వాడుతున్నారో తనకు అర్థం కావడం లేదన్నారు. ఆ పదానికి అర్థం తెలుసుకోలనుకుంటే డిక్షనరీ చూసుకోవాలని సూచించారు.
అధ్యక్షుడు ట్రంప్ పెద్ద కూతురు ఇవాంకా జీతం తీసుకోకుండా తండ్రికి ఇవాంకా సలహాదారుగా పని చేస్తున్నట్లు ఇటీవల వైట్‌హౌస్ ఓ ప్రకటనలో వెల్లడించిన విషయం తెలిసిందే. ఆమె భర్త జేర్డ్ కుష్నర్ కూడా జీతం తీసుకోకుండా ట్రంప్‌కు సీనియర్ సలహాదారుడిగా పనిచేస్తున్నారు. జనవరిలో జపాన్ ప్రధాని షింజో అబేతో ట్రంప్ సమావేశమైన సందర్భంలో, ఫిబ్రవరిలో ట్రంప్‌తో జరిగిన రౌండ్ టేబుల్ సమావేశంలో, జర్మన్ నాయకులతో జరిగిన భేటీలోనూ ఇవాంకా పాల్గొనడం కూడా ఆమెపై వ్యతిరేఖతకు కారణమై ఉండొచ్చునని అభిప్రాయపడ్డారు. కొన్ని రోజుల్లో వారి వైఖరిలో మార్పు వస్తుందని ఇవాంకా ఆశాభావం వ్యక్తం చేశారు.