ప్రథమ భక్తులు
నేను నా దైవం
తిరుమలలో గవర్నర్ దంపతులు. యాదగిరి గుట్టలో గవర్నర్ దంపతులు... ఏ గుడికెళ్లినా, ఏ సంప్రదాయ వేడుకలో చూసినా ఆదిదంపతుల్లా లక్ష్మీనరసింహన్ ఆయన సతీమణి విమలా నరసింహన్ కనిపిస్తుంటారు. ఎంతో భక్తి భావాన్ని నింపుకున్న ఈ దంపతులను వారి ఇష్ట దైవం గురించి అడగాలనిపించింది. ‘సాక్షి ఫ్యామిలీ’ సెక్షన్‌లో అందరి ఆలోచన ఇదే! కట్ చేస్తే– రాజ్‌భవన్‌లో గవర్నర్ లక్ష్మీ నరసింహన్, ఆయన సతీమణి. ఆహ్లాదకరమైన పరిసరాల మధ్య చిరునవ్వుతో ఇద్దరూ దైవం గురించి తమ అభిప్రాయాలను ఈ విధంగా వెలిబుచ్చారు.
మీరు తరచూ ఆలయాలను సందర్శిస్తుంటారు. ఇంతటి భక్తి ఎలా కలిగింది?
నరసింహన్: చిన్నప్పడు మా అమ్మనాన్నల వద్ద పురాణేతిహాస కథలు విని పెరిగాను. స్కూల్‌లోనూ వీటి గురించి ఆసక్తిగా తెలుసుకునేవాడిని. స్కూల్‌కి వెళ్లి వచ్చేదారిలో గణేష్ ఆలయం ఉండేది. తరచూ ఆ ఆలయానికి వెళుతుండేవాడిని. హనుమాన్ అంటే చాలా ఇష్టం. ఆయనలో ఉండే ధైర్యం, అసమానమైన తెలివితేటలు, స్వామి భక్తి... ఎంత చెప్పినా తక్కువే! హనుమాన్ గురించి ఎన్నో కథలు విని ఆయనకు భక్తుడిని అయిపోయాను. ఇప్పటికీ హనుమాన్ టెంపుల్‌కి వెళ్లి ఆయన ను మనస్ఫూర్తిగా నమస్కరించుకుంటుంటాను.
విమల: దైవాన్ని తలుచుకుంటూ నిద్రలేస్తాం. అంటే మనలో ఉన్న దైవత్వాన్ని తట్టి లేపుతున్నాం అన్నమాట. ఇలా జీవితంపైన నమ్మకాన్ని పెంచుకోవడం ఉన్నతి వైపు అడుగులు వేయడమే! దైవారాధన ఉదయం లేస్తూనే మొదలవుతుంది. ఇది మా పెద్ద వారి నుంచి వస్తున్న దినచర్య. నేను చిన్ననాటి నుంచి విన్న కథలలో శ్రీరాముడి జీవితం అందరికీ ఆదర్శప్రాయమైనది. ఒకే మాట, ఒకే బాణం, ఒకే భార్య... ఇది శ్రీరాముడు సమాజానికి ఇచ్చిన విలువైన మార్గం. ఈ దారిలో వెళితే విజయం తథ్యం అని తన జీవితాన్ని ఉదాహరణగా చూపించాడు. అలా శ్రీరాముడు ఇష్టదైవం అయ్యాడు.
సర్! మీకూ మీ ఇష్టదైవం హనుమాన్‌కి ఉన్న సాన్నిహిత్యం ఎలాంటిది?
నరసింహన్: బిడ్డకు – తండ్రికి ఉన్నటువంటి సాన్నిహిత్యమే! దీని గురించి ఎవరికి వారు తెలుసుకోవాల్సిందే తప్ప వివరించలేం. మనకేవేవో కోర్కెలు ఉంటాయి. తండ్రి కదా అని వాటన్నింటినీ దైవం దగ్గర మొరపెట్టుకోవడం సబబు కాదు. మనకేం కావాలో ఆ తండ్రికి తెలుసు. అయితే, ఎప్పుడు ఏ సమయంలో బిడ్డకు ఏది ఎంతవరకు అవసరమో దానినే ఇస్తాడు. మన వంతు వచ్చేవరకు ఎదురుచూడాలి. మన ప్రతి పండగల్లోనూ దైవాన్ని దర్శించుకోవడం అంతర్లీనంగా ఉంటుంది.
నర్సింహస్వామి పేరు మీకు పెట్టడానికి ఏదైనా కారణం ఉందా?
నరసింహన్: మా నాన్నగారు ఆ పేరు పెట్టారు. (నవ్వుతూ) మరీ ఉగ్రనరసింహుడిని అవుతానేమోనని అమ్మవాళ్లు లక్ష్మీ అనే పేరు చేర్చారు (పూర్తిపేరు: ఎక్కాడు శ్రీనివాసన్ లక్ష్మీ నరసింహన్). పురాణాలను, ఇతిహాసాలను చూడండి... ప్రతి ఒక్క దేవుడికి ఒక రాజ్యం ఉంటుంది. కానీ నరసింహ స్వామికి రాజ్యం లేదు. నాపేరుకు తగ్గట్టుగానే, నేనూ ఒక చోట లేను. అలా అన్ని రాజ్యాలు నావే! (నవ్వులు).
నరసింహ స్వామికి కోపం కలిగినట్టు మీకెప్పుడైనా దేవుడి మీద కోపం కలిగిందా?
విమల: కొన్నేళ్ల క్రితం ఈయన బ్రదర్ ఓ ఉగ్రవాదుల దాడిలో చనిపోయారు. ఆయన దహన సంస్కారాలు జరుగుతున్నాయి. అప్పుడు ఈయనలో బాధలో నుంచి వచ్చిన కోపాన్ని చూశాను.
నరసింహన్: మా సోదరుడు అంటే నాకు విపరీతమైన, అపరిమితమైన అభిమానం. ఆయన మరణించడంతో దుఃఖాన్ని ఆపుకోలేకపోయాను. నా చేతి వేలికున్న వెంకటేశ్వరస్వామి ఉంగరం మీద పడింది చూపు. అప్పుడు వచ్చింది కోపం. ఆ ఉంగరాన్ని తీసి, నేలకేసి కొట్టాను. అన్ని కార్యక్రమాలు పూర్తయ్యి, దుఃఖం నుంచి తేరుకుంటున్నప్పుడు విమల నా వద్దకు వచ్చి, నా అర చేతిలో ఒక వస్తువు ఉంచింది. ఏంటని చూశాను. నేను విసిరికొట్టిన వెంకటేశ్వర స్వామి ఉంగరం. నేను తన కేసి చూశాను. ఆ ఉంగరాన్ని చూశాను. ఏదో అర్థమైన భావన. మౌనంగా ఆ ఉంగరాన్ని మళ్లీ నా వేలికి ధరించాను.
మీరు భయంతో దైవాన్ని ప్రార్థించిన సంఘటన...
నరసింహన్: అలాంటివెప్పుడూ లేవు.
విమల: జీవితమన్నాక ఎన్నో ఒడిదొడుకులు ఉంటాయి. కొన్ని ఉద్వేగాలు ఉంటాయి. అయితే, భయపడిన ఘటన ఎప్పుడూ లేదు. నేను ఈ రాజ్‌భవన్‌లో అడుగుపెట్టిన రోజున ఇక్కడి వాతావరణం ఎలా ఉంటుందో అనుకున్నాను. అడుగుపెట్టిన క్షణమే ఆశ్చర్యంతో పాటు సంబరమూ కలిగింది. నాకు ముగ్గులంటే చాలా ఇష్టం. పండగలప్పుడు ముగ్గులేసి వాటì లో రంగులు, పువ్వులను నింపుతుంటాను. రాజ్‌భవన్ ముంగిట్లో అందమైన రంగవల్లులు చూసి చాలా ఆనందమేసింది. నా పెళ్లయిన కొత్తలో మా అమ్మగారు చందనంతో చేసిన విష్ణు, లక్ష్మీదేవి మూర్తులను కానుకగా ఇచ్చారు. మేం ఎక్కడకు షిఫ్ట్ అయినా వాటినీ నా వెంట తీసుకెళుతుంటాను.
భక్తి అనగానే గుడే కళ్ల ముందు కనిపిస్తుంది. గుడి లేకుండా భక్తిని మరో చోట ఎక్కడైనా చూశారా?
నరసింహన్: ఆ దైవం సన్నిధిలో ఉన్నప్పుడు అన్ని సంశయాలూ తుడిచిపెట్టుకుపోతాయి. గుడి అనే ప్లేస్‌కున్న శక్తి అలాంటిది. దైవం మన చెంతనే ఉందనుకుంటే గుడిలో అయినా, ఇక్కడ అయినా అంతటా ఉన్నట్టే!
ఎక్కువ మంది వెళ్లే చోటునే దేవుడుంటాడా? మన వీధిలో ఉన్న చిన్న గుడిలో ఉండే శక్తి... శక్తి కాదా?
విమల: అన్ని చోట్లా శక్తి ఉంది. ఇప్పుడు మనం కూర్చున్న ఈ ప్లేస్‌లో కూడా శక్తి ఉంది. దేవుyì గుడి చిన్నదా, పెద్దదా అనే తేడా లేదు. అయితే, ఎక్కువ మంది వెళుతున్నారంటే అక్కడ పాజిటివ్ వైబ్రేషన్స్ అంత అధికంగా ఉన్నాయన్నమాట.
ఉపవాసం ఉండటం, కొండమెట్లు ఎక్కడం, హారతి చేతిలో వెలిగించుకోవడం... అంటే, తమను తాను హింసించుకుంటే దైవానుగ్రహం కలుగుతుందా?
నరసింహన్: హింసించుకుంటేనే దేవుడు కరుణిస్తాడనుకోవడం అవివేకం. మనం నూటికి నూరు శాతం దైవాన్ని నమ్మితే చాలు. దైవం ఎప్పుడూ పరహితాన్ని కోరుకోవడాన్ని మెచ్చుతాడు. దాన్ని మర్చిపోకూడదు.
గుడిలో అక్కడి ప్రాంగణంలో సేవ చేస్తే దేవుడు ఇంకా మెచ్చుకుంటాడా? అసలు ఆ సేవ ఎలాంటిదై ఉండాలి?
నరసింహన్: ఎన్నో ఇచ్చిన దైవానికి కృతజ్ఞత తెలియజేసుకోవడమే సేవ. ఆయన సేవలో ఏదో తెలియని సంతృప్తి కలుగుతుంది నాకు. ఇలాంటిదే చేయాలి అనే ప్రత్యేక నియమం అయితే ఏమీ లేదు.
డ్యూటీయే దైవం అంటారు చాలామంది. మీ మాటల్లో దాని గురించి చెప్పండి?
నరసింహన్: దైవం దైవమే! డ్యూటీ డ్యూటీయే! ఒకదానితో ఒకటి ముడిపెట్టకూడదు. అలాగే వృత్తి వేరు– వ్యక్తిగతం వేరు. దేనికది విడిగానే చూడాలి. నీకు ఒక బాధ్యతను అప్పజెప్పినప్పుడు దాని పైన వంద శాతం ఎఫర్ట్ పెట్టు. అది నీ కర్తవ్యం. అంతేకానీ, భారం దైవం మీద వేయవద్దు.
దేవుడా కాపాడు అనుకున్న సందర్భం?
నరసింహన్: దైవాన్ని రోజూ ప్రార్థిస్తాం. కానీ, కాపాడు అనుకున్న సందర్భం లేదు. జీవితంలో ఏదైనా పరీక్ష ఎదురైనప్పుడు ఆవేశపడిపోకూడదు. కొంత సహనం వహించాలి.
అసలు దేవుడు అంటే ఏంటి?
విమల: పూర్ణ విశ్వాసం.
దేవుడు కానిదేంటి?
నరసింహన్: అపనమ్మకం.
మీ దంపతులను కలిపింది ఎవరు అని భావిస్తారు?
విమల: దైవమే! పెళ్ళిళ్లు స్వర్గంలో జరుగుతాయంటారు కదా! (ఇద్దరూ నవ్వులు). అలా ఈ భూమ్మీద మా పెద్దలు నిర్ణయించారు. జాతకాలు చూశారు. పెళ్లి జరిపించారు.
పిల్లలపై భక్తిభావనను రుద్దడం సరైనదేనా?
విమల: పిల్లల్లో భక్తిని పెంచడం చాలా అవసరం. సమాజం పట్ల సదవగాహన కలగాలంటే భక్తి అవసరం. వారు సరైన దారిలో ప్రయాణించాలంటే దైవం మనిషిగా అవతరించి చేసిన గొప్ప గొప్ప కథనాలను పిల్లలకు తెలియజేయాలి. అది తల్లిదండ్రుల విధి. మా ఇద్దరబ్బాయిలకు చిన్నప్పటి నుంచి భక్తిగా ఎలా జీవితాన్ని దర్శించాలో నేర్పాం. శ్రీరామ రామ రామేతి, రమే రామే మనోరమే... సహస్రనామ తత్తుల్యం... రామ నామ వరాననే!... ఇలాంటి ఎన్నో శ్లోకాలను వారి చేత కంఠస్తం చేయించాను.
పతియే ప్రత్యక్ష దైవం అంటారు కదా!
విమల: నా వరకు వస్తే... ఈయనకు సతియే ప్రత్యక్షదైవం (నవ్వు).
నరసింహన్: మేమిద్దరం ఒకరికొకరం ప్రత్యక్ష దైవం (నవ్వులు).
దేవుడికి మనిషికి మధ్య ఉండే పూజారి ఎవరు? అతను ఎలా ఉండాలి?
విమల: అసలు దేవుడికి– మనిషికి మధ్య ఎవరూ లేరు. ఇది ప్రతి ఒక్కరూ తెలుసుకోవాలి.
దేవుడికి నచ్చే నైవేద్యం ఏంటి?
నరసింహన్: మనలోని భక్తి, విశ్వాసం.
దేవుడు మనకు ఇచ్చే ప్రసాదం ఏమిటి?
నరసింహన్: అన్నీ తెలుసుకోగలిగే జ్ఞానం.
మనిషి ధరించే గొప్ప ఆభరణం నుదుటి మీద కుంకుమా? గుండెలో ధైర్యమా?
నరసింహన్: గుండెలో ధైర్యం.
ప్రార్థనలో... ఏదైనా కోరుకోవాలా? ఇచ్చిన వాటికి కృతజ్ఞతలు తెలపాలా?
విమల: ఈ జన్మను ఇచ్చినందుకు, మన గురించి మనం తెలుసుకోగలిగే ఆలోచనను ఇచ్చినందుకు కృతజ్ఞతలు తెలిపాలి.
– నిర్మలారెడ్డి చిల్కమర్రి