షాన్‌దార్ ఇఫ్తార్
ఎదుటివారి ఆకలి తెలిసేలా చేసేది ఉపవాసం. అభిమానం అనే ఆకలిని పెంచేది ఇఫ్తార్. రంజాన్ మాసం అంటే తోటివారిపై ప్రేమ చాటుకునే మాసం. వారిని ప్రేమగా గుండెలకు హత్తుకునే మాసం. ఈ మాసంలో ముస్లింలు ఇతర మతస్తులను ఇఫ్తార్‌కు ఆహ్వానిస్తారు. అలాగే ఇతర మతస్తులు వారికి ఇఫ్తార్ విందు ఇస్తారు. అన్నదమ్ముల్లా కలిసిమెలిసి ఉందామనే సంకల్పం ఇస్తుంది ఇఫ్తార్. ఈ వంటకాలతో ఇఫ్తార్ విందు ఇవ్వండి. మీ అభిమానమనే ఆకలిని పెంచుకోండి.
మటన్ హలీమ్
కావలసినవి: మటన్ – 1 కేజి, బాస్మతి బియ్యం – 1 కప్పు, గోధుమ పిండి – 1 కప్పు, దాల్చిన చెక్క – ఒక ముక్క, లవంగాలు – 4 , ఏలకులు – 4, జీలకర్ర – అర టీ స్పూను, గులాబీ రేకులు – 1 టీ స్పూను, ఎండుమిరపకాయలు – 2, అల్లం పేస్ట్ – 1 టీ స్పూను, ఉల్లి తరుగు – 1 కప్పు, జీడిపప్పులు – గుప్పెడు, బాదం పప్పులు – గుప్పెడు, నెయ్యి – అర కప్పు, రిఫైండ్ ఆయిల్ – 4 టీ స్పూన్లు, నీళ్ళు – 2 కప్పులు, కొత్తిమీరతరుగు – 2 టీ స్పూన్లు, ఉప్పు – తగినంత
తయారి : మటన్ శుభ్రపరచి నీళ్ళుపోసి ముక్క మెత్తబడే వరకు (దాదాపు 5 గంటల సమయం) ఉడికించాలి. బాస్మతి బియ్యం ఒక గంటపాటు నానబెట్టి మటన్‌లో కలపాలి. మటన్, బియ్యం కలిశాక గోధుమ పిండిని కలపాలి. ఈ మిశ్రమాన్ని పేస్ట్ తయారయ్యేవరకు కలుపుతూ వుండాలి. మిశ్రమమంతా పేస్ట్‌లా తయారయిన తరువాత నెయ్యి, మసాలాదినుసులన్నీ కలిపి ఉడికించాలి. బాణలిలో నూనె వేడిచేసి తరిగిన ఉల్లిగడ,్డ అల్లం పేస్ట్ కలిపి వేయించి పక్కనుంచుకోవాలి. ఒక బౌల్‌లో హలీమ్ తీసుకుని వేయించిన ఉల్లిగడ్డ, కొత్తిమీర తరుగు పైన చల్లి నెయ్యి రెండు టీ స్పూన్లు వేసుకుని వేడివేడిగా తింటే బాగుంటుంది.
మటన్ బిర్యానీ
కావలసినవి : మటన్ – అర కిలో, బాస్మతి బియ్యం – 1 కిలో, అల్లం వెల్లుల్లి పేస్ట్ – 1 టీ స్పూను, గరం మసాలా – అర టీ స్పూను, పసుపు – అర టీస్పూను, దాల్చిన చెక్క – చిన్న ముక్క, ఏలకులు – 4, లవంగాలు – 5, కుంకుమ పువ్వు – చిటికెడు, కారం – 2 టీ స్పూన్లు, ఉప్పు – తగినంత, ఉల్లిగడ్డ – 1, పాలు – 1 కప్పు
తయారి : మటన్‌ను శుభ్రపరచి కారం, ఉప్పు, అల్లం వెల్లుల్లి పేస్ట్, పసుపు, గరం మసాలా పట్టించి అరగంట పాటు పక్కనుంచాలి. బాస్మతి బియ్యాన్ని ఒక్క ఉడుకు రానిచ్చి నీళ్ళు వడకట్టి పక్కనుంచాలి. మటన్‌ను ఉడికించాలి. అడుగు మందంగా వున్న పాత్రలో అడుగున మటన్‌ను పేర్చి దానిమీద సగం ఉడికించిన బియ్యాన్ని అమర్చాలి. దీనిని తక్కువ మంటమీద ఉడికించాలి. పాలలో కుంకుమపువ్వు కలిపి ఉడికిన బిర్యానీ పైన చల్లి మూత పెట్టాలి. ఉల్లిగడ్డని పొడవుగా తరిగి అర టీ స్పూను అల్లంవెల్లుల్లి మిశ్రమం, చిటికెడు ఉప్పు కలిపి వేయించాలి. ఈ మిశ్రమాన్ని బిర్యానీకి కలిపి మరో పదినిమిషాలపాటు మగ్గనిచ్చి స్టౌపై నుంచి దించేయాలి.
కద్దూ కా దాల్‌చా
కావలసినవి: శనగపప్పు – 3 కప్పులు, ఉప్పు – తగినంత, నూనె – 2 టేబుల్ స్పూన్లు,జీలకర్ర – 2 టీ స్పూన్లు, దాల్చిన చెక్క – అంగుళం ముక్క, ఎండు మిర్చి –2 ,కరివేపాకు – ఒక రెమ్మ, టొమాటో– 2(తరగాలి), తరిగిన కొత్తిమీర – ఒక టేబుల్ స్పూన్, మిరప్పొడి– 2 టీ స్పూన్లు,ఉప్పు – 2 టీ స్పూన్లు, పసుపు – పావు టీ స్పూన్, సొరకాయ – ఒక కేజీ, చింతపండు రసం– నాలుగు టేబుల్ స్పూన్లు
తయారి: శనగపప్పును కడిగి రెండు నిమిషాల సేపు ఉడికించి దించాలి. సగం శనగపప్పును మెత్తగా గ్రైండ్ చేయాలి. బాణలిలో నూనె వేసి జీలకర్ర, దాల్చిన చెక్క, ఎండుమిర్చి, కరివేపాకు వేసి వేయించాలి. అవి వేగిన తర్వాత టొమాటో ముక్కలు, తరిగిన కొత్తిమీర, కారం, ఉప్పు, పసుపు వేసి కలిపి మూత పెట్టి ఒక నిమిషం సేపు మగ్గనివ్వాలి. ఇప్పుడు సొరకాయ ముక్కలను వేసి కలిపి ఒక కప్పు నీటిని పోసి మూత పెట్టాలి. ఇది పది నిమిషాలకు ఉడుకుతుంది. ఇందులో గ్రైండ్ చేసిన శనగపప్పు పేస్టు, సగం ఉడికిన శనగపప్పును, శనగపప్పు ఉడికిన నీటిని కలపాలి. చివరగా చింతపండురసం వేసి కలిపి మరిగిన తర్వాత దించేయాలి.
దహీ వడ
కావలసినవి: శనగపిండి – 1 కప్పు, పెరుగు – 2 కప్పులు, అల్లం తరుగు – అర టీ స్పూను, వెల్లుల్లితరుగు – అర టీ స్పూను,
పసుపు – పావు టీ స్పూను, వంట సోడా – చిటికెడు, ఎండు మిర్చి – 4, పసుపు – చిటికెడు, కొత్తిమీర తరుగు – 2 టీ స్పూన్లు, నూనె – వేయించేందుకు తగినంత, ఉప్పు – తగినంత, పోపుగింజలు – 1 టీ స్పూను
తయారి : బాణలిలో రెండు టీ స్పూన్ల నూనె వేడిచేసి పోపు గింజలు వేయించి పసుపు, తగినంత ఉప్పు, ఎండు మిరపకాయలు వేయించి పక్కనుంచుకోవాలి. తగినంత నీటిలో శనగపిండి, పసుపు, వంటసోడా, అల్లం, ఉప్పు, కలిపి ముద్దచేసి ఒక గంటపాటు పక్కన పెట్టాలి. బాణలిలో నూనె వేడిచేసి శనగపిండి మిశ్రమంతో తగినంత సైజులో వడలు వేయాలి. దోరగా వేయించిన వడలను నూనె వడకట్టి పెరుగు మిశ్రమంలో వేసుకోవాలి. వడలను పెరుగులో ఒక గంపాటు నానివ్వాలి. వడ్డించేముందు కొత్తిమీర చల్లుకుంటే బాగుంటుంది.
సేమ్యా హల్వా
కావలసినవి: నెయ్యి – పావు కేజీ, ఏలకులు – 12, సన్న సేమ్యా – అరకేజీ, చక్కెర – పావుకేజీ, పాలు – ఒక కప్పు, నీరు – 4 కప్పులు, డ్రై ఫ్రూట్స్ – గార్నిష్ కోసం తగినన్ని (సన్నగా తరగాలి).
తయారి: బాణలిలో నెయ్యి వేడి చేసి ఏలకులు వేసి వేగాక సేమ్యా వేసి సన్న మంట మీద గోధుమరంగు వచ్చేదాకా వేయించాలి. పాలు, నీళ్లు వేసి కలుపుతూ సేమ్యా పూర్తిగా పీల్చుకునే వరకు ఉడికించాలి. అప్పుడు చక్కెర వేసి అది కరిగి తిరిగి దగ్గరయ్యే వరకు వేయించి దించాలి. చివరగా సన్నగా తరిగి ఉంచిన డ్రైఫ్రూట్స్‌తో గార్నిష్ చేయాలి.
మిక్స్‌డ్ ఫ్రూట్ సలాడ్
కావలసినవి: ఆపిల్ – ఒకటి, సపోటా– రెండు, బత్తాయి – ఒకటి, ఖర్జూరాలు – ఇరవై
తయారి: మధ్యలో ఖర్జూరాలను పెట్టి చుట్టూ సన్నగా పొడవుగా కట్ చేసిన ఆపిల్ ముక్కలను, బత్తాయి తొనలు, సపోటా ముక్కలను అమర్చాలి.