ఒక మమ్మీ.. ఏడు శాపాలు | special story to 'mummies' | Sakshi
Sakshi News home page

ఒక మమ్మీ.. ఏడు శాపాలు

Published Fri, Jun 16 2017 10:55 PM | Last Updated on Tue, Sep 5 2017 1:47 PM

ఒక మమ్మీ..  ఏడు శాపాలు

ఒక మమ్మీ.. ఏడు శాపాలు

చావుకు చావు ఉండదన్నది మమ్మీని చూస్తేనే అర్థం కావాలేమో! మట్టిలో కొట్టుకుపోవాల్సింది ఇసుకై లేస్తుందని మనకెలా తెలుసు?
వంద శవపేటికలు కూడా బందీ చెయ్యలేని దానిని కట్లు కట్టి.. పీట ముడులు వేసి, పాతి పెడితే... ఏడు శాపాలను ఈనింది.. ఈ మమ్మీ!
ఏడు సమాధుల్ని కట్టింది.


అనగనగా ఏడుగురు రాకుమారులు. ఏడుగురూ వేటకెళ్లి... కథ తెలిసిందే.  కానీ ఇది ఏడు చేపల కథ కాదు. ఏడు శాపాల కథ.

లొకేషన్‌ : ఈస్ట్‌ వ్యాలీ ఆఫ్‌ కింగ్స్‌
కంట్రీ : ఈజిప్టు ::: సంవత్సరం : 1922

హోవర్డ్‌ కార్టర్, ఆయన పరిశోధక బృందం ఇసుక మేటల్లో నడుస్తోంది. వాళ్లంతా ఆర్కియాలజిస్టులు, ఈజిప్టాలజిస్టులు. ప్రాచీన ఈజిప్టులోని మార్మికతల్ని శోధించడం కోసం కొన్నాళ్లుగా అక్కడక్కడే తిరుగుతున్నారు. ‘‘మిస్టర్‌ హోవర్ట్‌.. ఇక్కడేదో కనిపిస్తోంది’’... పెద్దగా అరిచాడు ఆ బృందంలోని ఒక సైంటిస్ట్‌. అవును కనిపిస్తోంది. మెట్లమార్గం! ఆ రోజు నవంబర్‌ 4. మర్నాటికి బృందమంతా ఆ మెట్ల మార్గంలోంచి లోపలికి వెళ్లగలిగింది. అక్కడొక సమాధి ఉంది! ‘తెరిచి చూద్దాం’ అనుకున్నారంతా. కానీ ఇరవై ఐదు రోజులకు గానీ తెరవలేకపోయారు. అంత మిస్టిక్‌గా ఉంది సమాధి చుట్టూ ఉన్న నిర్మాణం. మొత్తానికి నవంబర్‌ 29న సమాధి మూత తెరిచారు.
మర్నాడు ప్రెస్‌ కాన్ఫరెన్స్‌ పెట్టారు.

పర్మిషన్‌ల కోసం మధ్యలో కొన్ని రోజులు పని ఆగింది. డిసెంబర్‌ 27న సమాధిలోపలి పేటిక పక్కన ఉన్న ఒక పురావస్తువును బయటికి తీశారు. తర్వాత మళ్లీ కొన్ని రోజులు పని ఆగింది. 1923 ఫిబ్రవరి 16న.. సమాధి లోపలి శవపేటికను తెరిచారు. ఏప్రిల్‌ 5న లార్డ్‌ కార్నర్వాన్‌ చనిపోయాడు! కార్నర్వాన్‌... ఈ పురావస్తు పరిశోధనకు డబ్బులు పెట్టిన పెద్దమనిషి. శవపేటికలో మమ్మీ ఉంది! ఆ మమ్మీలో ఉన్నది ఈజిప్టు చక్రవర్తి టుటంఖమున్‌. ఎవరో అన్నారు.. టుటంఖమున్‌ మమ్మీ శపించి ఉంటుందని! టెర్రర్‌ మొదలైంది.

మమ్మీని చూసి ఎవరైనా టెర్రర్‌ అవ్వాల్సిందేమీ లేదు! మమ్మీ శపిస్తేనే.. వర్రీ అవ్వాలి! మమ్మీ శపిస్తుందా! అవునట. సమాధిలో తన నిద్రను డిస్టర్బ్‌ చేస్తే అంతు చూస్తుందట. టుటంఖమున్‌ కూడా శపించే ఉంటాడా? టుటంఖమున్‌  క్రీ.పూ. 1332 నుంచి 1322 వరకు కింగ్‌. అతడెలా చనిపోయాడో ఎవరికీ తెలీదు. అదొక మిస్టరీ. దాన్ని ఛేదించడానికి రాల్ఫ్‌ మిషెల్‌ అనే హార్వర్డ్‌ యూనివర్సిటీ మైక్రోబయాలజిస్ట్‌ బయల్దేరాడు. సమాధి చుట్టూ ఉండే గోడలపై కొన్ని చోట్ల పచ్చిగా ఉన్నప్పుడే పెయింట్‌ చెదిరిపోయినట్లుగా ఉన్నట్లుంది. సో.. టుటంఖమున్‌ని హర్రీగా పూడ్చిపెట్టారు. ఖతం చేసి, ఖననం చేశారు. ఇదీ ఆయన అబ్జర్వేషన్‌. అక్కడితో ఊరుకున్నాడు రాల్ఫ్‌. బతికిపోయాడు.

కానీ.. లార్డ్‌ కర్నార్వన్‌ అలా ఊరుకోలేదు. తవ్వి తియ్యండి చూద్దాం అన్నాడు. ఎవరైనా దుస్సాహసాలు చేస్తుంటే డబ్బులిచ్చి ప్రోత్సహించడం కర్నార్వన్‌కి.. అదో కిక్కు. ఆ డబ్బులు తీసుకుని హోవార్డ్‌ కార్టర్‌ అండ్‌ టీమ్‌.. టుటంఖమున్‌ సమాధిని ఓపెన్‌ చేసింది. మమ్మీకి నిద్రాభంగం అయింది. ఇది జరిగిన ఏడాదికి కర్నార్వన్‌.. దోమ కుట్టి చచ్చిపోయాడు! అంతా అది సమాధిలోంచి వచ్చిన దోమ అన్నారు. అది కాదు విషయం. ఇక్కడ సమాధిని తవ్వుతుండగానే అక్కడ హోవార్డ్‌ కార్టర్‌ గారి పాటలు పాడే పెంపుడు పక్షి పంజరంలోనే కోబ్రా కాటేసి చనిపోయింది! మమ్మీ కోపం అక్కడితో చల్లారిపోలేదు. టుటంఖమున్‌ సమాధితో ఏదో ఒక విధంగా సంబంధం ఉన్నవారు ఏడుగురు ప్రాణాలు పోగొట్టుకున్నారు. హోవార్డ్‌ కార్టర్‌ లక్‌ ఏంటంటే.. మమ్మీ అతడిని వదిలేసింది! 1939లో అతడు తనకై తను కాలం తీరి చనిపోయాడు.

శాపగ్రస్థులు 1 – 2 : లార్డ్‌ కార్నర్వాన్, జార్జి జే గోల్డ్‌
లార్డ్‌ కార్నర్వాన్‌ చనిపోయినప్పుడు ఎవ్వరూ అతడు మమ్మీ శాపం వల్ల చనిపోయాడని అనుకోలేదు. తర్వాత కొద్ది రోజులకు మే 16 ఫ్రాన్స్‌లో జార్జి జే గోల్డ్‌ అనే అతను హటాత్తుగా మరణించాడు. అతడొక ఫైనాన్షియర్‌. టుటంఖమున్‌ మమ్మీ మూత తెరిచారన్న వార్త తెలిసి ఈజిప్టు Ðð ళ్లి చూసి వచ్చాక అతడి మరణం సంభవించడంతో మమ్మీ శపిస్తోందన్న అనుమానం బయల్దేరింది!

శాపగ్రస్థుడు 3 : ప్రిన్స్‌ అలి కామెల్‌ ఫామీ బే
ఫామీ బే ఈజిప్టు రాకుమారుడు. అతడి భార్య మేరీ మార్గరెట్‌. మొదటి భర్తకు విడాకులు ఇచ్చాక ఇతడిని చేసుకుంది. దంపతులిద్దరూ లండ¯Œ లో ఉన్నప్పుడు మాటామాట వచ్చి పిస్టల్‌తో అతడిని కాల్చి చంపేసింది మేరీ మార్గరెట్‌. ఈ హత్య జూలై 9న జరిగింది. అంతకుముందే ప్రిన్స్‌ ఫామీ బే.. టుటంఖమున్‌ సమాధిని చూసి వచ్చాడు.

శాపగ్రస్థుడు 4: ఆబ్రే హెర్బెట్‌
ఈయన బ్రిటిష్‌ దౌత్య అధికారి. ట్రావెలర్‌. అంతకన్నా కూడా కర్నార్వన్‌ (మొదటి శాపగ్రస్థుడు) కజిన్‌ బ్రదర్‌. ఎప్పుడూ దేశాలు తిరుగుతుంటాడు. టుటంఖమున్‌ సమాధిని చూసి వచ్చిన వెంటనే జబ్బున పడ్డాడు. చూపు మందగించింది. చికిత్స చేస్తుంటే వికటించి రక్తానికి ఇన్ఫెక్షన్‌ సోకింది. మొదటి ముగ్గురూ చనిపోయిన ఏడాదే ఈయనా చనిపోయాడు సెప్టెంబర్‌ 23న. కర్నార్వన్‌ శాపం కొద్దిగా ఈయనకూ తగిలినట్లుంది.

శాపగ్రస్థుడు 5 : సర్‌ ఆర్చిబాల్డ్‌ డగ్లాస్‌ రీడ్‌
ఇతడు రేడియాలజిస్టు. టుంటంఖమున్‌ మమ్మీకి ఎక్స్‌రే తీసింది ఇతడే. తర్వాత ఇతడికి తెలియని అనారోగ్యమేదో పట్టుకుంది. 1924 జనవరి 15న చనిపోయాడు.

శాపగ్రస్థుడు 6 : సర్‌ లీ స్టాక్‌
ఈ సైడాన్‌ గవర్నర్‌ జనరల్‌ 1924 నవంబర్‌ 19న కారులో కైరోకు ప్రయాణిస్తుండగా ఆగంతకులు రివాల్వర్‌తో కాల్చి చంపారు. సర్‌ టీ స్టాక్‌.. టుటంఖుమున్‌ సమాధి ఉన్న ప్రదేశాన్ని కలియదిరిగి వచ్చిన కొన్నాళ్లకే ఇలా జరిగింది.

శాపగ్రస్థుడు 7 : ఎ.సి.మేస్‌
బ్రిటిష్‌ ఈజిప్టాలజిస్టు. టుటంఖుమున్‌ సమాధిన తవ్విన హోవార్డ్‌ కార్టర్‌ బృందంలో సభ్యుడు. టుటంఖుమున్‌ సమాధిని తవ్వేటప్పుడు తనూ ఒక చెయ్యి వేశాడు. మేస్‌కి వెంటనే ఏమీ కాలేదు కానీ పరిశోధనలు చేస్తున్నప్పుడు చేతికి అంటుకున్న అర్సెనిక్‌ మూలకాలు క్రమంగా అతడిలో చొరబడి 1928లో అతడి ప్రాణం తీశాయి.

నిజానికి మమ్మీలలో చెడ్డ మమ్మీలు, శపించే మమ్మీలు ఉండవు. వాటి చుట్టూ మాత్రమే శాపాలు, కోపాల కథలు ఉంటాయి. ఆ కథల్లోంచి వచ్చిన కొత్త హాలీవుడ్‌ మూవీ ‘ది మమ్మీ’ గతవారమే విడుదలైంది. ఇప్పుడొక ఓల్డెస్టు మమ్మీ గురించి, లేటెస్టు మమ్మీ గురించి తెలుసుకుని కథ ముగిద్దాం.

ఓల్డెస్టు మమ్మీ
మమ్మీలు వేల ఏళ్లనాటివే అయినా ప్రపంచం చూసిన ఫస్ట్‌ మమ్మీ.. జింజర్‌ మమ్మీ. ఈజిప్టు ఏడారి సమాధులలో 1900 సం. తవ్వకాల్లో జింజర్‌ మమ్మీ బయటపడింది. 18–20 మధ్య వయసుగల ఈ మమ్మీ క్రీ.పూ.3400 నాటిది. మనిషి చనిపోయాక ఏమౌతాడు అనే ప్రశ్న అన్ని దేశాల్లోనూ ఉంది. కానీ ఈజిప్టులో ఎక్కువగా ఉంది. అందుకే అక్కడ అన్ని మమ్మీలు. భద్రపరిచిన మమ్మీ ఏదో ఒక రోజు తిరిగి ప్రాణంతో లేస్తుందని వారి నమ్మకం. అందుకే ఈజిప్టియన్లు గొప్పగొప్ప మమ్మీలకు పిరమిడ్‌లు కట్టేశారు!

మమ్మిఫికేషన్‌ చాలా పకడ్బందీగా జరుగుతుంది. డెడ్‌బాడీ మొత్తాన్ని గుడ్డలో చుట్టేయరు. కాలేయం, పేగులు, ఊపిరితిత్తులు వేరుగా తీసి ‘కేనోపిన్‌’ అనే జార్‌లలో ఉంచుతారు. వీటిని పెద్ద మమ్మీతో పాటు ఉంచుతారు. పెద్ద మమ్మీని శుద్ధి చేసి, అవి పాడవకుండా పొరలు పొరలుగా రసాయనాలు పూస్తారు. పైన గుడ్డలు చుడతారు. మమ్మీ.. దేహం కాదు. బతికున్నవాళ్ల ఆత్మ. మమ్మీల గురించి మనిషి ఏం తెలుసుకోవాలని ప్రయత్నిస్తున్నాడో అవి తెలుస్తూనే ఉన్నా, వాటి వెంటే తెలియని మిస్టరీలు.. సమాధుల నుంచి పైకి లేస్తున్నాయి. ఇదొక అంతులేని అన్వేషణ.

ఫేమస్‌ మమ్మీలు
రామసేన్‌ చక్రవర్తి: మూడవ రామసేస్‌ చక్రవర్తి సమాధి కెవి11 అనే చోట ఉంది. ఈ కేవీ లెవ¯Œ , కేవీ సిక్స్‌టీటు.. ఇవన్నీ ఈజిప్టులోని ‘వాలీ ఆఫ్‌ ది కింగ్‌’ అనే ప్రాంతంలో ఉంటాయి. రామసేస్‌–త్రీ క్రీస్తుపూర్వపు ఈజిప్టు చక్రవర్తి. హటాత్తుగా చనిపోయాడు. ఎలా చనిపోయాడన్నది వెయ్యేళ్ల మిస్టరీ. చివరికి భయం భయంగా మమ్మీని ఓపెన్‌ చేశారు. సీటీ స్కాన్‌లో చక్రవర్తి గొంతులో ఏడు సెంటీమీటర్ల పొడవున కత్తి గాటు కనిపించింది. చరిత్రను గాలించి చూస్తే రామసేస్‌ను చంపే దమ్ము ఎవరికీ లేదని తేలింది. చంపితే అతడి కొడుకులే చంపి ఉండాలి. అదింకా తేల్లేదు.

ది గ్రాబెల్‌ మ్యాన్‌: ఈ మమ్మీ 1952లో డెన్మార్క్‌లోని గ్రాబెల్‌ అనే చోట బయట పడింది. ఇది క్రీ.పూ.3వ శతాబ్దం నాటి మగ మనిషిది. అతడి కాలేయం చెక్కుచెదర్లేదు. ఆ కాలేయానికి రేడియోకార్బన్‌ డేటింగ్‌ పరీక్షలు చేసి చూస్తే.. బాడీ కనీసం రెండువేళ ఏళ్ల క్రితం నాటిదని తేలింది. చనిపోయినప్పుడు అతడి వయసు 30. మెడకింద కోసినట్లు ఉంది. ఏవో అంచనాలను బట్టి ఇతడు ప్రాణత్యాగం చేసి ఉండాలని అనుకోవడం తప్ప రూఢీ కాలేదు.

యుకోక్‌ రాకుమారి: ఈ మమ్మీని 1993లో రష్యాలో కనుక్కున్నారు. 2,500 ఏళ్ల క్రితం నాటి మనిషి ఈ మమ్మీ.  చనిపోయేనాటికి ఆమె వయసు 25. ఒంటి నిండా పచ్చబొట్టు బొమ్మలు ఉన్నాయి. ఈ అమ్మాయి సెర్బియా కొండల్లో ఉండే పజిరిక్‌ గిరిజన తెగల పిల్ల అట! ఇలా పచ్చబొట్టు పొడిపించుకున్న వారంతా చనిపోయాక పైన ఒకర్నొకరు కలుసుకుంటారని ఆ తెగల్లో ఒక నమ్మకం. రాకుమారి అన్నది.. ఈ మమ్మీకి ముద్దుపేరు మాత్రమే. పాతికేళ్లకే ఎలా చనిపోయింది? ఒక సాధారణ గిరిజన మహిళను ఇంత కాస్టీ›్లగా ఎవరు మమ్మిఫై చేశారు అన్నది మిస్టరీ.

దషీ–దోర్జో ఇటిగిలోవ్‌: దోర్జో మమ్మీ ఒక బౌద్ధ సన్యాసి. రష్యాలో పుట్టాడు. 1927లో ఓ రోజు రాత్రి తోటి భిక్షువులతో, శిష్యులతో కలిసి ధ్యానంలో ఉండగానే పరలోకాలకు వెళ్లిపోయారు. అప్పుడతడు పద్మాసనంలో ఉన్నాడు. ఆయన్ని ఆ స్థితిలోనే ‘మమ్మిఫై’ చేసి అలా ఉంచేశారు. అప్పట్నుంచీ... శిథిలమవుతున్న ప్రతిసారీ మళ్లీ ఒక కోటింగ్‌ ఇచ్చి దోర్జో మమ్మీని ‘బతికిస్తున్నారు’. దోర్జో చనిపోయి వందేళ్లు కావస్తున్నా.. 36 గంటల క్రితం చనిపోయిన మనిషిలానే కనిపిస్తుంటాడు. ఆధునికులు ఏం పూసి ఈ మమ్మీని ఫ్రెష్‌గా ఉంచుతున్నారన్నది మిస్టరీ.

ఈవా పెరాన్‌: జువాన్‌ పెరాన్‌ 1946–1955 మధ్య కాలంలో అర్జెంటీనాకు అధ్యక్షుడు. ఆయన భార్య ఈవా పెరాన్‌. 1952 జూలై 26న చనిపోయింది. ఆమె క్యాన్సర్‌ పేషెంట్‌. ముప్పై మూడేళ్లకే కన్నుమూసింది. ఈవా మృతదేహాన్ని మమ్మీగా మార్చి భద్రపరిచారు. జువాన్‌ రెండో పెళ్లి చేసుకున్నాడు. ఆ రెండో భార్య ఇసాబెల్‌. ఆమె ఈవా మమ్మీని ఎంతగానో ప్రేమించేవారు. ప్రతిరోజూ పేటిక తెరిచి ఈవా తల దువ్వేవారు. కొన్నిసార్లు శవపేటికలో ఈవా పక్కనే పడుకునేవారు. ఇప్పుడా మమ్మీ జువాన్‌ వారసుల కుటుంబ ప్రార్థనా స్థలం చర్చి అడుగుభాగంలో ఖననం అయి ఉంది.

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement