భర్త కన్నప్ప | special story to Natural delivery | Sakshi
Sakshi News home page

భర్త కన్నప్ప

Published Thu, Apr 27 2017 12:11 AM | Last Updated on Tue, Sep 5 2017 9:46 AM

భర్త కన్నప్ప

భర్త కన్నప్ప

తండ్రిది పేగుబంధం.  కాబట్టి... కన్న కూతురికి చిన్న కష్టం వచ్చినా ఆ కన్నపేగు కలుక్కుమంటుంది. మరి భర్తది?...  కట్టిపడేసిన తాడు బంధం. కానీ... భార్య గర్భందాల్చాక   ఆ తాడుబంధం తోడుబంధం కావాల్సిందే. భర్తగా మీరు మీ భార్యను ఎంతగా ప్రేమించినా బిడ్డను కడుపున మోయలేరుగా! భార్యను ఎంత ఇష్టంగా చూసుకున్నా పురిటి నొప్పులు మీరు పడలేరుగా! భార్యను ఎంత గారాం చేయాలనుకున్నా వేవిళ్లు మీరు తెచ్చుకోలేరుగా! నిజమే... మీరు కనలేరు. బాధనూ కనలేరు. బిడ్డనూ కనలేరు. అందుకే మీరు భర్త ‘కన్న’ప్ప అయిపోండి. భర్తగా బాధ్యత పంచుకోండి. మీ భార్య ‘కన్న’ కలలను నెరవేర్చండి. ఆమె పురిటినొప్పులను మరిచేంతగా గారాం చేయండి. అన్ని జాగ్రత్తలను దగ్గరుండి  మీరే తీసుకోండి.

తన ఇంట పండంటి పాప నడయాడాలని కోరుకున్న ప్రతి భర్తా... తన భార్యను కంటిపాపలా చూసుకోవాలి. కంటి పాప బాగుంటేనే కదా చంటిపాపైనా, ఇంటి పాపైనా ఆరోగ్యంగా ఉండేది! అందుకోసం తొలుత దృష్టిసారించాల్సింది క్రమం తప్పకుండా కావాల్సిన ఆమె ఫాలో అప్‌లు. గర్భవతికి ఇచ్చే సంరక్షణలో ఒక్కరిని చూసుకుంటే ఇద్దరిని చూసుకున్నట్టు! అలా చూసేవాడే నిజమైన హీరో. గర్భవతిని ఒక్కసారి హాస్పిటల్‌కు తీసుకెళ్తే... ఇద్దరిని తీసుకెళ్లినట్లు... ఈ ఒక్క చర్యతో ఈ లోకంలోకి రాబోయే చిన్నారికి మరో వందేళ్ల జీవితాన్ని భరోసాగా ఇచ్చినట్టే! ఇక్కడి తొమ్మిదంశాలపై దృష్టిసారిస్తే తొమ్మిది నెలల భారాన్ని భర్తా మోసినట్టే...   గర్భవతి తన కడుపున బిడ్డను మోసే వ్యవధి తొమ్మిది నెలలు. దీనికి సరిగా భర్త కనీసం తొమ్మిది అంశాలపై దృష్టి నిలిపితే నవమాసాల తర్వాత కువకువలడే చిన్నారి నట్టింట్లోని ఉయ్యాలలోకి వచ్చేస్తుంది. ఆ తొమ్మిది అంశాలివి...

తొలి ప్రాధాన్యం సహజ ప్రసవం కోసం...
గర్భం దాల్చిన ప్రతి మహిళా తనకు సహజ ప్రసవం (వెజైనల్‌ డెలివరీ) కావాలని కోరుకుంటుంది.  ప్రసవం తర్వాత కోలుకునే సమయం తక్కువ కావడం, అంతా స్వాభావికంగా జరిగిపోవడం వంటి కారణాల వల్ల ఆమెలో ఈ కోరిక ఉంటుంది.  అయితే... ఏదైనా ముప్పు వాటిల్లితే, పెద్ద ప్రాణాన్ని, చిన్న ప్రాణాన్ని కాపాడుకునేందుకు ఆధునిక వైద్యశాస్త్రం శస్త్రచికిత్స ప్రక్రియను ఆవిష్కరించింది. అదే సిజేరియన్‌. దీనికి తోడు కాన్పు కష్టమవుతుందని అనిపిస్తే ఆ సమయంలో అనుసరించాల్సిన ప్రణాళికను బట్టి డెలివరీ విధానాలను ఎంచుకుంటారు. మొదట అసిస్టెడ్‌ వెజైనల్‌ డెలివరీ, ఫోర్సెప్స్‌ డెలివరీ... కోసం ప్రయత్నిస్తారు. ఇవేవీ కుదరకపోతే సిజేరియన్‌ చేయాల్సి వస్తుంది. ఇవన్నీ తల్లి, బిడ్డ ఇద్దరి క్షేమం కోరుతూ చేసే ప్రసవాలు.

సహజ ప్రసవం అంటే...
చాలామందిలో యోని మార్గం ద్వారా బిడ్డ సునాయాసంగా బయటకు వచ్చేస్తుంది. నిర్దిష్టంగా ఏ సమయానికి ప్రసవం జరుగుతుందనేది ఎవరూ చెప్పలేరు. కానీ 36 వారాల గర్భధారణ సమయం పూర్తయ్యాక దాదాపుగా 37 – 40 వారాల మధ్యలో ఈ ప్రవసం జరుగుతుంది.

రకరకాల ప్రసవాలివి...  
ప్రసవాలు అనేక రకాలుగా చేస్తారు. వీటన్నింటిలో యోని ద్వారా ప్రసవం కావడం సహజమైన ప్రక్రియ. తల్లి, బిడ్డ పరిస్థితిని బట్టి... ప్రతి గర్భవతి విషయంలో వారివారికి ఎదురయ్యే సంక్లిష్టతలు వేరుగా ఉంటాయి. వాటిని బట్టి వారికి అనుసరించాల్సిన ప్రక్రియ ఆధారపడి ఉంటుంది. దానిని డాక్టర్లు నిర్ణయిస్తారు.

అసిస్టెడ్‌ / ఆపరేటివ్‌ వెజైనల్‌ డెలివరీ: సాధారణ ప్రసవం జరిగే సమయంలో అసిస్టెడ్‌ డెలివరీ ప్రక్రియ సహాయపడుతుంది. ఈ ప్రక్రియలో శిశువు తల వద్ద శూన్య ప్రదేశం (వ్యాక్యూమ్‌) ఏర్పరచడం ద్వారా ప్రసవం తేలిగ్గా అయ్యేలా చూస్తారు. ఇది ప్రసవ సమయంలో అక్కడి పరిస్థితిని బట్టి డాక్టర్లు ఎంచుకునే ప్రక్రియ. ఇందులో డాక్టర్లు చిన్నారి తల వద్ద ఒక వాక్యూమ్‌ పంప్‌ను పంపుతారు. ఈ ప్రక్రియను అవలంబించడం వల్ల ద్వారా యోని మార్గం (బర్త్‌ కెనాల్‌) నుంచి బిడ్డ ప్రసవం తేలిగ్గా అయ్యేలా చూడవచ్చు.

ఫోర్సెప్స్‌ డెలివరీ : ఈ ప్రక్రియలో యోని మార్గం ద్వారా బిడ్డను బయటకు తీసుకు వచ్చేందుకు డాక్టర్లు ఫోర్సెప్స్‌ అనే పరికరాన్ని ఉపయోగిస్తారు. దీని ద్వారా బయటకు వచ్చేందుకు వీలుగా చిన్నారి తలకు ఒక మార్గదర్శనం దొరుకుతుంది. ఫలితంగా బిడ్డ తేలిగ్గా బయటకు వస్తుంది.

సిజేరియన్‌ (సి–సెక్షన్‌) డెలివరీ : ఈ తరహా ప్రసవంలో పొట్ట మీది నుంచి గర్భసంచికి చిన్న గాటు (కోత) పెడతారు. బిడ్డను ఇలా బయటకు తీయడం అనేది ఒక్కోసారి ముందుగా నిర్ణయించిన ప్రణాళిక ప్రకారం జరుగుతుంది. కొన్నిసార్లు సాధారణ ప్రసవం కష్టమైనప్పుడు... అంటే గర్భసంచి బిడ్డ కదలికలు మొదలయ్యి... బయటకు రావడానికి కష్టమవుతుంటుంది. అప్పుడు బిడ్డకు శ్వాస అందదు. అప్పుడు తక్షణం సిజేరియన్‌ చేయడానికి నిర్ణయం తీసుకుంటారు. అలాగే కడుపులో బిడ్డ అపసవ్య దిశలో ఉండడం, పేగు మెడకు చుట్టుకోవడం వంటి కాంప్లికేషన్స్‌ ఉన్నా కూడా సి సెక్షన్‌ చేయాల్సి రావచ్చు.

వ్యాయామ రీతులు అనుసరించేలా చూడటం...
క్రమం తప్పకుండా వ్యాయామం : గర్భంతో ఉన్నప్పుడు రోజూ వ్యాయామం చేయడం వల్ల పెల్విస్‌ కండరాలు, కాళ్లలో ఉండే కండరాలకు బలం చేకూరుతుంది. వీటిలో కీగల్స్‌ అనే తరహా వ్యాయామాలు కీలకం. పెల్విస్‌ స్ట్రెచెస్, టిల్ట్స్, డీప్‌ స్క్వాట్స్‌ లాంటివి చేయడం ద్వారా పెల్విస్‌ కండరాలు గట్టిపడి నార్మల్‌ డెలివరీకి దోహదం చేస్తాయి. అయితే పొట్ట మీద ఒత్తిడి పడే వ్యాయామాల వల్ల మొదటికే మోసం రావచ్చు. కాబట్టి డాక్టర్‌ సూచించిన వ్యాయామాలను మాత్రమే చేయించాలి.

బ్రీతింగ్‌ వ్యాయామాలు : ఇవి తల్లిలోని ప్రతి అవయవానికి ఆక్సిజన్‌ను తీసుకెళ్లే సామర్థ్యాన్ని పెంచి, బిడ్డనూ ఆరోగ్యంగా ఉంచుతాయి.
∙ప్రీనేటల్‌ యోగా: గర్భం దాల్చిన మహిళ మనసు ఎప్పుడూ శాంతంగా ఉండాలి. ప్రీ–నేటల్‌ యోగాసనాలు శరీరానికి సాగేగుణాన్నీ (ఫ్లెక్సిబిలిటీ) పెంచుతాయి. గర్భిణి వ్యాయామం చేసేటప్పుడు భర్త దగ్గర ఉండడం చాలా అవసరం.

ప్రతికూలమైన అంశాలకు దూరంగా ఉండటం...
ప్రసవ సమయంలో వారికి ఎదురైన చేదు అనుభవాలను గూర్చి ఎవరైనా చెబుతుంటే, గర్భిణి వాటిని వినకపోవడమే మంచిది. ఎందుకంటే పురిటి నొప్పులు, వాటి వల్ల కలిగే ఇబ్బందులు... ప్రతి ఒక్కరికీ ఒకేలా ఉండవు. అంతేకాదు... ఒకే మహిళలో సైతం నొప్పులు ఒక కాన్పులో ఉన్నట్లు మరొక కాన్పులో ఉండవు, తేడాలు ఉంటాయి. కాబట్టి ప్రసవం నొప్పుల గురించి ఆందోళన పడడం కంటే మానసికంగా సిద్ధమై ధైర్యంగా ఉండాలి.  నొప్పులు లేకుండా ప్రసవం అయ్యేందుకు ‘పెయిన్‌లెస్‌ డెలివరీ’లు కూడా చేస్తున్నారు. దీన్నే ‘ఎపిడ్యూరల్‌ ఎనాల్జీషియా’ అంటారు. ఇతరుల చేదు అనుభవాలు భార్య దరిజేరకుండా భర్త కూడా జాగ్రత్త తీసుకోవాలి.

సమతుల ఆహారం అందించడం
సరైన పోషకాలు ఉండే సమతులాహారం తీసుకోవాలి. దీనివల్ల తల్లి ఆరోగ్యమే కాకుండా, బిడ్డ ఆరోగ్యం కూడా బాగుంటుంది. ఆకుకూరలు, తాజాపండ్లు, పాలు, గుడ్లు, మాంసకృత్తులు ఎక్కువగా తీసుకోవాలి. రక్తహీనత రాకుండా కాపాడుకోవాలి. గర్భిణికి మంచి ఆహారాన్ని సమకూర్చడం, ఆమెకి తినాలనిపించిన రుచుల కోరిక తీర్చాల్సిన బాధ్యత భర్తదే.

గర్భం... ప్రసవంపై అవగాహన!
ప్రీ–నేటల్‌ బర్త్‌ విషయంలో నిర్వహించే తరగతులకు భార్యతోపాటు భర్త కూడా వెళ్లాలి. డాక్టర్‌ను అడిగి మీలో కలిగే చిన్న చిన్న సందేహాలను సైతం తీర్చుకోవాలి. ప్రెగ్నెన్సీకి సంబంధించిన పుస్తకాలు ఇద్దరూ చదవాలి. వాటి వల్ల ప్రసవం గురించి కలిగే అపోహలు తొలగిపోతాయి. అప్పుడు ధైర్యంగా ఉండగలుగుతారు.

కంటి నిండా నిద్ర!
గర్భవతులు నిద్రకు తగినంత ప్రాధాన్యం ఇవ్వాలి. సాధారణ సమయంలో నిద్ర కంటే గర్భిణికి ఎక్కువ నిద్ర అవసరం. ఏడో నెల దాటాక మధ్యాహ్నం నిద్ర తప్పనిసరి. దానివల్ల బీపీ కూడా నియంత్రణలో ఉంటుంది.

ప్రసవం కోసం ఆసుపత్రికి ఎప్పుడెళ్లాలి?
గర్భం దాల్చారని తెలిసినప్పటి నుంచి ఓ చిన్నారి పాపాయి ఎప్పుడెప్పుడు తమ చేతుల్లోకి వస్తుందా, ఎప్పుడు తమ ఒళ్లోకి వస్తుందా అని చాలా ఆత్రుతగా ఎదురుచూస్తారు. ప్రసవించే తేదీని ఉజ్జాయింపుగా డాక్టర్లు చెప్పిన నాటి నుంచి ఆ అద్భుతమైన ప్రసవ ఘడియ కోసం కాబోయే తల్లిదండ్రుల పాటు బంధుమిత్రులంతా ఉద్విగ్నంగా వేచిచూస్తారు. అయినా ప్రసవం అయ్యే తేదీ నిర్దిష్టంగా ఫలానా రోజనీ, ఫలానా సమయానికి తప్పక నొప్పులు వస్తాయని ఎవరూ చెప్పలేరు. అయినప్పటికీ కొన్ని సూచనల ద్వారా ప్రసవ చిహ్నాలను గుర్తుపట్టవచ్చు. అవి...

ఇది మొదటి గర్భ ధారణ అయితే... ప్రవవానికి కొద్ది రోజుల ముందు పొట్ట బరువంతా కిందికి జారినట్లుగా అనిపిస్తుంది. దాంతో తుంటి మీద బరువు తగ్గిన అనుభూతి ఉంటుంది.

రుతుస్రావం సమయంలో కండరాలు బిగుసున్న రీతిలోనే పొట్టపై కండరాలు బిగుసుకుపోతూ, వదులవుతుంటాయి.
     కొద్ది కొద్దిగా మ్యూకస్‌ జిగురు పదార్థం గర్భాశయ ముఖద్వారం నుంచి స్రవించడం వల్ల అక్కడి ప్రాంతం వదులవుతున్న అనుభూతి కలుగుతుంది.

ఉమ్మనీటి సంచి (బిడ్డ చుట్టూ ఆవరించుకుని ఉండే ద్రవం ఉన్న సంచి) అకస్మాత్తుగా పగిలిపోయి ఒక్కసారిగా ఉమ్మనీరంతా యోని నుంచి బయటకు చిమ్ముతుంది.

అప్పటి వరకూ అనుభవంలోకి వచ్చిన బిడ్డ కదలికలు కాస్త మందగిస్తాయి.

యోని నుంచి రక్తస్రావం లేదా అదేపనిగా నొప్పి కనిపిస్తాయి. పైన పేర్కొన్న లక్షణాల్లో ఏవైనా మీకు కనిపిస్తుంటే వెంటనే మీరు డాక్టర్‌ను సంప్రదించాలని గుర్తుంచుకోండి.

రకరకాల ఇన్ఫెక్షన్స్‌
గర్భధారణ సమయంలో యోనిలో ఇన్ఫెక్షన్స్‌ రావడం చాలా సాధారణం. అందుకే ఆ సమయంలో డాక్టర్‌ సూచించిన మేరకు తరచూ వైద్యపరీక్షలు చేయించుకోవాలి. గర్భధారణ సమయంలో యోని సంబంధితమైన ఏవైనా ఇన్ఫెక్షన్స్‌ ఉంటే డాక్టర్లు వాటికి తగిన మందులు ఉపయోగించి సురక్షితమైన ప్రసవం జరిగేలా చూస్తారు.

యోనిలో ఇన్ఫెక్షన్‌: గర్భం దాల్చి ఉన్న సమయంలో మహిళల్లో యోనిలో ఇన్ఫెక్షన్‌ రావడం చాలా సాధారణ సమస్య. మరీముఖ్యంగా రెండో త్రైమాసికంలో. ఈ ఇన్ఫెక్షన్‌ క్యాండిడా అనే ఒక రకమైన ఫంగస్‌ వల్ల వస్తుంది. ఇక బ్యాక్టీరియల్‌ ప్రజాతికి చెందిన సూక్ష్మజీవుల పెరుగుదల వల్ల కూడా యోనిలో ఇన్ఫెక్షన్స్‌ రావచ్చు. యోని సంబంధమైన ఇన్ఫెక్షన్‌ కనిపించినప్పుడు డాక్టర్‌ సహాయం తీసుకోండి. మీ సమస్య తీవ్రత, లక్షణాల తీవ్రత ఆధారంగా డాక్టర్లు తగిన చికిత్స అందిస్తారు.

మూత్రనాళ ఇన్ఫెక్షన్‌ : గర్భధారణ సమయంలో హార్మోన్ల మార్పుల వల్ల మూత్రనాళంలోనూ కొన్ని మార్పులు వస్తాయి. ఇవి మహిళల్లో మూత్రనాళంలో ఇన్ఫెక్షన్‌ వచ్చేందుకు ఆస్కారమిస్తాయి. దీనికి తోడు గర్భవతుల్లో గర్భసంచి క్రమంగా పెరుగుతూ ఉంటుంది. ఇవి మూత్రకోశం (బ్లాడర్‌)పై క్రమంగా ఒత్తిడిని పెంచుతూ పోతుంది. ఫలితంగా మూత్రవిసర్జనకు వెళ్లినప్పుడు మూత్రం అంతా బయటకు వెళ్లక కొంత మూత్రం లోపలే మిగిలిపోయేలా చేస్తుంది. ఇలా అక్కడే నిలిచిపోయిన మూత్రం ఇన్ఫెక్షన్‌కు దారితీస్తుంది. సమయానికి దీనికి చికిత్స అందించకపోతే అది మూత్రపిండాలను సైతం దెబ్బతీయవచ్చు. మూత్రనాళ ఇన్ఫెక్షన్‌ సమస్య చాలా అరుదుగా మాత్రమే తీవ్రమైన ఆరోగ్య సమస్యను ఎచ్చిపెడుతుంది. అది తీవ్రమైన ప్రభావం గనక చూపిందంటే... ఆ ఇన్ఫెక్షన్‌ మూత్రపిండాల వరకు పాకుతుంది. గర్భందాల్చినప్పుడు ఇలాంటి దుష్ప్రభావాల వల్ల నెలలు నిండకముందే ప్రవసం కావడం, తక్కువ బరువుతో నెల తక్కువ బాలలు పుట్టడం వంటి సమస్యలు వస్తాయి.

సహాయం కోసం డాక్టర్‌ను ఎప్పుడు కలవాలి?
చాలా ఎక్కువ మొత్తంలో తెల్లబట్ట అవుతున్నప్పుడు
యోనిలో ఇన్ఫెక్షన్‌ ఉన్నట్లుగా లక్షణాలు కనబడుతున్నప్పుడు
మూత్రనాళంలో ఇన్ఫెక్షన్‌ ఉన్న లక్షణాలు కనబడుతున్నప్పుడు

రెగ్యులర్‌గా మందులు...
భార్య క్రమం తప్పకుండా డాక్టర్‌ను సంప్రదించేలా చూడాల్సిన బాధ్యత భర్తదే. డాక్టర్‌ రాసిన మందులు... అంటే ఫోలిక్‌ యాసిడ్, ఐరన్, క్యాల్షియమ్‌ టాబ్లెట్స్‌ లాంటివి తప్పనిసరిగా వాడేలా చూడాలి. ఆమెకి తినాలనిపించినవ రుచులు కూడ. భార్య ప్రసవ వేదనను భర్త అనుభవించడు. కనీసం పైన పేర్కొన్న తొమ్మిదంశాలను పాటిస్తే భార్యపడే అదనపు వేదనను పంచుకున్నవాడవుతాడు.
డాక్టర్‌ పి. సరోజ సీనియర్‌ కన్సల్టెంట్,
ఆబ్‌స్టెట్రిక్స్‌ అండ్‌ గైనకాలజీ
బర్త్‌రైట్‌ బై రెయిన్‌ బో, ఎల్‌.బి.నగర్‌
హైదరాబాద్‌

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement