నైటింగేల్‌ గోవిందమ్మ | special story to nurse Govindamma | Sakshi
Sakshi News home page

నైటింగేల్‌ గోవిందమ్మ

Published Mon, May 8 2017 11:19 PM | Last Updated on Tue, Sep 5 2017 10:42 AM

నైటింగేల్‌ గోవిందమ్మ

నైటింగేల్‌ గోవిందమ్మ

అమ్మలకు అమ్మ

తల్లి కడుపులో నవమాసాలు కదలాడి బాహ్య ప్రపంచంలోకి రాగానే బిడ్డకు తొలి స్పర్శ నందించి తొలి ఊపిరికి ఆసరాగా నిలిచిన ఆ చేతులు... బిడ్డకు జన్మనిచ్చే క్షణాల్లో మానవశక్తికి అతీతంగా వంద డెసిబుల్స్‌ బాధను అనుభవిస్తూ బిడ్డకు జన్మనిచ్చి పునర్జన్మను పొందే ఆ తల్లికి ఆసరానిచ్చే∙ఆ చేతులు... రోగులకు ఆప్యాయతతో సేవ చేసిన ఆ చేతులు... ఇప్పుడు అత్యున్నత పురస్కారాన్ని అందుకోబోతున్నాయి. ఎంచుకున్న వృత్తి పట్ల అంకిత భావంతో పనిచేయటంతో పాటు ఆ వృత్తిలో కొనసాగటం అదృష్టంగా భావించి ముందుకు సాగితే పురస్కారాలు, ప్రశంసలు వారి చెంతకు చేరుతూనే ఉంటాయనడానికి ఇదే నిదర్శనం.

నర్సింగ్‌ వృత్తిని అత్యంత పవిత్రమైనదిగా, సేవకు ప్రతిరూపంగా మలిచిన  ‘ఫ్లారెన్స్‌ నైటింగేల్‌’ పేరిట జాతీయ స్థాయిలో అందించే ఆవార్డుకు ఆంధ్రప్రదేశ్‌ తరపున నర్స్‌ గోవింద ‘అ’మ్మ ఎంపికయ్యారు. ఫ్లారెన్స్‌ నైటింగేల్‌ జయంతిని పురస్కరించుకుని ప్రతి ఏడాది జాతీయ స్థాయిలో అందించే ప్రతిష్టాత్మక నైటింగేల్‌ అవార్డును ఈనెల 12న రాష్ట్రపతి భవన్‌లో రాష్ట్రపతి ప్రణబ్‌ ముఖర్జీ చేతుల మీదుగా ఆమె అందుకోనున్నారు. ఈ అవార్డు కింద మెడల్, ధ్రువపత్రంతో పాటు రూ.50 వేలు నగదు బహుమతి అందిస్తారు.

గుంటూరు జిల్లా భట్టిప్రోలు మండలం ఆళ్లమూడి గ్రామానికి చెందిన వ్యవసాయ కార్మికుడు వేజెండ్ల చెంచురామయ్య, నాగేంద్రమ్మ దంపతులకు 1976 మార్చి 15న పుట్టిన గోవిందమ్మ రేపల్లెలోని ఎస్‌ఎన్‌బీటీ డిగ్రీ కశాలలో డిగ్రీ, విజయవాడలోని యూనివర్శిటీ జనరల్‌ ఆసుపత్రిలో జీఎన్‌ఎం కోర్సు పూర్తి చేశారు. అనంతరం వృత్తిలో కొనసాగుతూ ఇగ్నో నుంచి దూరవిద్య ద్వారా బీఎస్సీ(నర్సింగ్‌), ఆచార్య నాగార్జున యూనివర్శిటీ ద్వారా ఎంబీఎ (హాస్పిటల్‌ అడ్మినిస్ట్రేషన్‌) పూర్తి చేశారు. 1999 జులై 9న స్టాఫ్‌ నర్సుగా వృత్తి జీవితాన్ని ప్రారంభించారు. 1999 నుంచి 2003 వరకు కనగాల, 2004 నుంచి 2007 వరకు చండ్రాజుపాలెం, 2007 నుంచి 2013 వరకు కావూరు ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో, 2013 నుంచి ప్రస్తుతం కనగాల ప్రాథమిక ఆరోగ్యకేంద్రంలో విధులు నిర్వహిస్తున్నారు. ఫ్లారెన్స్‌ నైటింగేల్‌ అవార్డు అందుకోనున్న సందర్భంగా గోవిందమ్మ గురించి ఆమె మాటల్లోనే...

అత్తమ్మ అండ... ఆయన ప్రోత్సాహం...
ఉద్యోగం వచ్చిన వెంటనే నామేనమామ పెదపూడి కోటేశ్వరరావు కొడుకు శ్రీనివాసరావుతో వివాహం అయింది. అప్పటినుంచి అత్తమామలతో కలిసే ఉంటున్నాను. నా భర్త శ్రీనివాసరావు ప్రభుత్వ ఉపాధ్యాయునిగా ఎంపీయూపీ పాఠశాల, ఆరేపల్లెలో పనిచేస్తున్నారు. మాపాప నాగశ్రీ ప్రవల్లిక, బాబు రోహిత్‌ చంద్‌. అందరి పిల్లలనూ నేను కాపాడితే, నా బిడ్డలను కంటికి రెప్పలా కాపాడింది మాత్రం మా అత్తమ్మ యశోదే. నా భర్త, అత్తమ్మల అండదండలు ఉండబట్టే నేను ఈ రోజు అత్యున్నత పురస్కారాన్ని అందుకుంటున్నానని చెప్పొచ్చు. ఎందుకంటే అర్ధరాత్రీ అపరాత్రీ అని లేకుండా నిరుపేదలైన గర్భిణులు కాన్పులకు వచ్చేవారు. అప్పుడు ఏమాత్రం విసుగు లేకుండా నవ్వుతూ నన్ను నా భర్త ఆసుపత్రిలో వదిలిపెట్టడంతో పాటు ఆయన కూడా ఆసుపత్రి ఆవరణలోనే నిద్ర లేకుండా గడిపిన రాత్రులు ఎన్నో. ప్రసవం అనంతరం తల్లీబిడ్డా సురక్షితం అన్న తరువాత నాతో పాటు నాకుటుంబ సభ్యులూ ఆనంద పడటం అలవాటైపోయింది.

కాన్పు జరిగేవరకూ తిట్లూ చీవాట్లూ...
కాన్పు తర్వాత దణ్ణాలూ... దీవెన లూ!

కాన్పుల సమయంలో గర్భిణీలు పడే బాధ వర్ణనాతీతం. ఆ సమయంలో ఆమె బంధువులు మాపై కోపాన్నీ, అసహనాన్నీ ప్రదర్శిస్తుంటారు. అయినప్పటికీ తల్లి, బిడ్డల క్షేమాన్ని దృష్టిలో ఉంచుకుని ఎంతో ఓర్పుతో నేర్పుగా కాన్పులను పూర్తి చేయాల్సి ఉంటుంది. తల్లి, బిడ్డ క్షేమంగా ఉన్నారని తెలిసిన వెంటనే అప్పటివరకు ఎంతో కోపంతో మా మీద చిరాకు పడిన బంధువులు ఒక్కసారిగా ఎంతో ఆప్యాయతను చూపుతూ ఆత్మీయులుగా మారిపోయే ఆ క్షణం పడిన కష్టాన్ని సైతం మరిపించి ఎంతో సంతృప్తినిస్తుంది.

ఎంతో రిస్క్‌ చేయాల్సిన పరిస్థితి
బెల్లంకొండ మండలం చండ్రాజుపాలెం గ్రామంలో గర్భిణుల ప్రసవ సమయంలో తీవ్రంగా శ్రమించాల్సి వచ్చేది. గ్రామాల్లో గర్భిణీలు నొప్పులు మొదలయ్యాక ఆసుపత్రికి రావటం అలవాటు. అటువంటి పరిస్థితుల్లో ఆర్ధరాత్రి ఒక్కసారిగా ఇంటి వద్దే నొప్పులు ఎక్కువయిన సమయంలో ఆసుపత్రికి వచ్చేవారు. పరిస్థితులు సంక్లిష్టంగా మారిన ఆ క్షణాలలో అప్పటికప్పుడు పెద్దాసుపత్రులను తరలించే అవకాశం ఉండేది కాదు. దాంతో పలు సందర్భాల్లో డాక్టర్ల సలహాలతో రిస్కీ డెలివరీలు చేశాను. అదే పరిస్థితి కనగాల పీహెచ్‌సీలో ఎదురైంది. ఉబ్బసంతో బాధపడుతున్న ఓ గర్భిణికి నెబ్యూలైజర్‌ పరికరాలను ఉపయోగించి అత్యంత క్లిష్ట పరిస్థితుల్లో డాక్టర్ల సలహాలతో ప్రసవం చేశాను. తల్లీ బిడ్డ క్షేమంగా ఇంటికి వెళ్లారు. కనగాల పీహెచ్‌సీ పరిధిలోనే కాకుండా చుట్టుపక్కల పీహెచ్‌సీల పరిధిలోని గర్భిణీలు కాన్పులకు కనగాలకు వస్తున్నారు. ప్రసవం జరిగేటప్పుడే కాదు... ప్రసవం అనంతరం తల్లీ బిడ్డలు తీసుకోవాల్సిన జాగ్రత్తలపై నిరంతరం సలహాలు, సూచనలు అందించటం అలవాటుగా మారింది.   

కుటుంబం, ఉద్యోగం రెండు కళ్లు
ఉద్యోగం, కుటుంబం రెండు రెండు కళ్లుగా భావించి ముందుకు సాగుతున్నాను. రెండిటికి సమాన ప్రాధాన్యతనిస్తూ కదిలితేనే సాఫీగా ముందుకు సాగగలుగుతాం. దానికి తగినట్లుగా ప్రణాళికతో ముందుకు సాగే విధంగా నా భర్త శ్రీనివాసరావు పూర్తి సహకారం అందిస్తున్నారు.

కు. ని. ఆపరేషన్లపై అవగాహన
ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా తలపెట్టిన కుటుంబ నియంత్రణ ఆపరేషన్ల నిర్వాహణలో ఆమె పాత్ర సాటిలేనిది. కాన్పులకు వచ్చే మహిళలు, బంధువులకు కుటుంబ నియంత్రణ ఆపరేషన్లపై అవగాహన కలిగిస్తూ, ఎఎన్‌ఎంల సహకారంతో గోవిందమ్మ పనిచేసిన పీహెచ్‌సీలలో అధిక శాతం కుటుంబ నియంత్రణ ఆపరేషన్లు నిర్వహించటంలో సఫలీకృతులయ్యారు.

వృద్ధుల పట్ల ఆప్యాయతతో...
ఆసుపత్రికి వచ్చే వృద్ధులు, వికలాంగులు, మహిళల పట్ల ప్రత్యేక శ్రద్ధ చూపుతూ వారి ఆరోగ్య సమస్యలను పరిష్కరించి వారికి ధైర్యాన్ని అందిస్తూన్న తీరును గ్రామస్తులు కొనియాడుతున్నారు. ఆమె పనిచేసిన పీహెచ్‌సీల పరిధిలోని గ్రామాల ప్రజలు నేటికీ గోవిందమ్మను గుర్తు చేసుకుంటున్నారంటే ఆమె సేవానిరతి, రోగుల పట్ల ఆమె చూపే శ్రద్ధాసక్తులను అర్థం చేసుకోవచ్చు.   

అవార్డులు ఆమె సొంతం
ప్రపంచ జనాభా దినోత్సవాన్ని పురస్కరించుకుని వైద్య ఆరోగ్యశాఖ అందించే ఉత్తమ అవార్డును జిల్లా స్థాయిలో 2010 నుంచి 2016 వరకు వరుసగా ఆరుసార్లు అందుకున్నారు. ప్రభుత్వం అందించే జిల్లా ఉత్తమ స్టాఫ్‌ నర్సుగా 2014 ఆగస్టులో అవార్డు వరించింది.

ఆళ్లమూడిలో ఆనందం
తమ ఊరి ఆడబిడ్డకు ప్రతిష్ఠాత్మక పురస్కారం అభించటంతో ఆళ్లమూడి గ్రామంలో ఆనందకరమైన వాతావరణం నెలకొంది. గోవిందమ్మ తల్లితండ్రులకు బంధువులు, గ్రామస్తులు, స్నేహితులు అభినందనలు తెలుపుతున్నారు.


నాకు ఇష్టమైన నర్సింగ్‌ కోర్స్‌ను చదివించిన అమ్మానాన్నలకు రుణపడి ఉంటాను.పలు సందర్భాల్లో డాక్టర్ల సలహాలతో రిస్కీ డెలివరీలు చేశాను.ఉబ్బసంతో బాధపడుతున్న ఓ గర్భిణికి నెబ్యూలైజర్‌ పరికరాలను ఉపయోగించి అత్యంత క్లిష్ట పరిస్థితుల్లో డాక్టర్ల సలహాలతో ప్రసవం చేశాను. నా కుటుంబ సభ్యుల సహకారం ఉండబట్టే నేను ఈ పురస్కారాన్ని అందుకుంటున్నానని చెప్పొచ్చు.
– గడ్డం వాసు, సాక్షి, రేపల్లె

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement