ఆ చెప్పుల్లో నిలబడాలంటే కుట్టుకోవాల్సిందే... | special story to old movie | Sakshi
Sakshi News home page

ఆ చెప్పుల్లో నిలబడాలంటే కుట్టుకోవాల్సిందే...

Published Thu, Jul 13 2017 11:33 PM | Last Updated on Tue, Sep 5 2017 3:57 PM

ఆ చెప్పుల్లో నిలబడాలంటే కుట్టుకోవాల్సిందే...

ఆ చెప్పుల్లో నిలబడాలంటే కుట్టుకోవాల్సిందే...

ప్రారంభాన్ని మర్చిపోతే గమ్యం శిథిలమవుతుంది. చెట్టు అరవై బారల ఎత్తు ఎదుగుతుంది. కాని దాని వేళ్లు భూమిలోనే ఉన్నాయన్న ఇంగితాన్ని కలిగి ఉంటుంది. మబ్బు అంబరాన్ని చుంబిస్తూ ఉంటుంది.\ కాని దాని గర్భంలో ఉన్న నీటి గమ్యం నేలకే అన్న ఎరుకతో ఉంటుంది. వందల ఎకరాల పంట అయినా మొలకతోనే మొదలవుతుందని రైతుకు తెలుసు. ఎంత అగాధానికి చేరుకున్నాతిరిగి తిరిగి ఒడ్డుకే చేరాలని జాలరికి తెలుసు. అడుగు లేని కుండ నిలువదు. మొదలు గట్టిగా లేని దారం చివరన గాలిపటం ఎగుర వేయలేదు. పొంగు నురగే తప్ప పాలు కాదు. ఇది మర్చిపోతే జీవితం పటాటోపం ఉంటుంది. పైపై పొరల జీవితం ఓటితనంతో దుఃఖాన్ని మిగులుస్తుంది.

ఎనిమిదేళ్ల చిన్నా... ఇంట్లో పని చేసే పిల్లవాణ్ణి అబ్యూజ్‌ చేశాడు. ఆ పిల్లవాడి ఒళ్లంతా పాలిష్‌ పూశాడు. ఏడిపించాడు. కారణం? ఆ పిల్లవాడు తన షూస్‌ సరిగ్గా పాలిష్‌ చేయలేదు. అందుకు అది శిక్ష. ఇది చిన్నాను పెంచుతున్న తండ్రి, సాంబయ్య పాత్రధారి అయిన చిరంజీవికి తెలిసింది. ఒక్కసారిగా కోపం నషాళానికి అంటింది. వెంటనే చిన్నాను పిలిచి పని పిల్లవాడి ముందే షూస్‌ పాలిష్‌ చేయించాడు. అంతేకాదు సాయంత్రం స్కూల్‌ అయిపోయాక తీసుకెళ్లి చెట్టు కింద గుడ్డ పరిచి దారిన పోయేవాళ్ల షూస్‌ పాలిష్‌ చేసే శిక్ష విధించాడు.

చిరంజీవి అలా ఎందుకు చేశాడు?
ఎందుకంటే ఏ పాలిష్‌ చేయడానికైతే చిన్నా అసహ్యించుకున్నాడో ఆ పాలిష్‌ చేసే చిరంజీవి పైకి వచ్చాడు. చెప్పులు కుట్టి పైకి వచ్చాడు. చెట్టు కింద నుంచి పైకి వచ్చాడు. ఇవాళ నాలుగు మేడలు, ఎనిమిది షోరూములు ఉండనీ గాక అతని మొదలు అతనికి తెలుసు. ఆ మొదలంటే అతడికి గౌరవం. ఆ మొదలంటే అతనికి గర్వం. అన్నం పెట్టే వృత్తిని గౌరవించని వాడు అమ్మను గౌరవించనివాడితో సమానం. మరి అలాంటి ఇంట్లో పుట్టిన చిన్నా ‘నాకు షూస్‌ పాలిష్‌ అంటే అసహ్యం, నాకు పేదవాళ్లంటే అసహ్యం, నేను అందరితో పాటు స్కూలుకు బస్సులో వెళ్లను కారులో వెళతాను’ అంటే ఎలా ఉపేక్షించడం. అందుకే చిన్నా పట్ల చిరంజీవి అంత కఠినంగా వ్యవహరించాడు.
కాని అందుకు తాను పెంచిన చిన్నానే ఒదులుకోవాల్సినంత పెద్ద శిక్షను పొందాడు.

స్వయంకృషి సినిమాలో చిరంజీవి  చెప్పులు కుట్టుకునేవాడు. చెల్లెలిని చరణ్‌రాజ్‌కు ఇచ్చి పెళ్లి చేస్తే ఆమె బిడ్డను కని భర్త నిర్లక్ష్యం వల్ల మరణిస్తుంది. సంవత్సరం వయసున్న ఆ పిల్లవాడికి ‘చిన్నా’ అని పేరు పెట్టుకుని అల్లారు ముద్దుగా పెంచుకుంటూ ఉంటాడు చిరంజీవి. చిన్నప్పటి నుంచి తాను ప్రేమించిన సుమలతను కూడా చిరంజీవే చదివిస్తూ ఉంటాడు. సుమలతను పెళ్లి చేసుకోవాలని అతడి కోరిక. కాని సుమలత... చిరంజీవిని కాదని సర్వదమన్‌ బెనర్జీని చేసుకుంటుంది. ఇదీ మంచికే అయ్యిందనీ, సుమలతతో పెళ్లయి పిల్లలు పుడితే గనక వారి మీద ప్రేమతో చిన్నాను నిర్లక్ష్యం చేసి ఉండేవాణ్ణని చిరంజీవి తనను తాను సమాధానపరుచుకుంటాడు. ఇది అతడి మీదే మనసు పెట్టుకుని బతుకుతున్న గంగ పాత్రధారి విజయశాంతికి తెలుస్తుంది.

చిరంజీవితో పెళ్లికి పిల్లలే గనుక అడ్డమైతే ఆ పిల్లలు తనకూ వద్దని పెళ్లికి ముందే పిల్లలు పుట్టని ఆపరేషన్‌ చేయించుకుంటుంది. ఇది చిరంజీవికి తెలిసి కదిలిపోతాడు. కృతజ్ఞతగా ఆమెను పెళ్లి చేసుకుంటాడు. అప్పటి నుంచి వాళ్లిద్దరికీ చిన్నాయే జీవితం. కాని ఆ చిన్నాను కన్నతండ్రి చరణ్‌రాజ్‌ తన వైపు తిప్పుకుంటాడు. పసి మనసు విరిచేసి ‘కోర్టులో కన్నతండ్రి కావాలా పెంచిన తండ్రి కావాలా’ అని అడిగితే కన్నతండ్రే కావాలని చెప్పేలా చేస్తాడు. చిన్నాను తనతో పాటు తీసుకెళ్లి వ్యసనాలకు ఎక్స్‌పోజ్‌ చేస్తాడు చరణ్‌రాజ్‌. ఇదంతా ఎందుకు? చిరంజీవి ఆస్తి కోసం. ఆస్తి ఇచ్చేస్తే చిన్నాను ఇచ్చేస్తానని బేరం పెడతాడు. చిరంజీవి చిన్నా కోసం ఆస్తినంతా వదిలేస్తాడు. క్రమంగా చిన్నాకు చిరంజీవి మనసు అర్థమవుతుంది. చరణ్‌రాజ్‌ తన సొంత తండ్రే అయినా అతడు దుర్మార్గుడని అర్థం చేసుకుంటాడు. చరణ్‌రాజ్‌ ముఖాన ఉమ్మి ఆ పాత్రకు ముగింపు పలుకుతాడు.

క్లయిమాక్స్‌లో చిరంజీవి ఒక చెట్టు కింద చెప్పులు కుట్టుకోవడానికి కూర్చుంటే ఎదుటి చెట్టు కింద చిన్నా కూడా చెప్పులు కుట్టడానికి కూర్చుంటాడు. అంటే చిన్నా తన మూలాలను స్వీకరించాడు. చిరంజీవిలానే ‘కృషితో నాస్తి దుర్బిక్షం‘ అని గ్రహించాడు. ఒక సంస్కారం ఒక జనరేషన్‌ నుంచి మరో జనరేషన్‌కు అందింది. ఈ సినిమాతో దర్శకుడు కె.విశ్వనాథ్‌ బట్వాడా చేయాలనుకున్న సంస్కారం ఇదే.

నాటి  సినిమా
చిరంజీవికి ఈ సినిమా సగర్వమైన సినిమాగా మారడానికి కారణం చిరంజీవి కూడా ఇండస్ట్రీలో ఎవరి అండా లేకుండా స్వయంకృషితో పైకి రావడమే. తమ తల్లిదండ్రులు చేస్తున్న వృత్తి, తాము చేస్తున్న వృత్తి చెప్పుకోవడానికి నామోషీ పడే ఒక తరం యువతీ యువకులకు ‘స్వయంకృషి’ ఒక గట్టి మెసేజ్‌ ఇచ్చిందని చెప్పాలి. ఈ సినిమాకు చిరంజీవి ఎంత బలమో విజయశాంతి కూడా అంతే బలం. ఆమె తాను పోషించిన గంగ పాత్రను అద్భుతంగా రక్తి కట్టించింది. ‘అట్ట సూడమాకయ్యా’ అనే ఆమె ఊతపదం పాపులర్‌. ఈ సినిమాకు మొదటిసారి కె.విశ్వనాథ్, రమేష్‌నాయుడు కలిసి పని చేసినా పాటలన్నీ హిట్‌ అయ్యాయి. ‘పారా హుషార్‌’..., ‘సిగ్గు పూబంతి’, ‘సిన్నీ సిన్నీ కోరికలడగ’, ‘హలో హలో డార్లింగ్‌’... ఈ పాటలన్నీ ఆకట్టుకుని తెలుగు వారి మనసులకు అతికిపోయినవే. స్వయంకృషి ఇన్‌స్పిరేషన్‌తో చాలామంది తమ షాపులకు ‘స్వయంకృషి’ అని పేరుపెట్టుకున్నారు. స్వయంకృషి సినిమాని స్కూల్‌ సిలబస్‌లో చేర్చవచ్చు. నేటి ఆరంభాలు గుర్తుపెట్టుకున్న బాలలే రేపటి గొప్ప గొప్ప గమ్యాలను నిర్మించగలరు. స్వచ్ఛభారత్‌ కన్నా విలువైన స్లోగన్‌ స్వయం భారత్‌.

చిరంజీవికి 1986లో ‘కొండవీటి రాజా’, ‘రాక్షసుడు’ వంటి కమర్షియల్‌ హిట్స్‌ పడ్డాయి. అయితే ఆ సంవత్సరమే కె.విశ్వనాథ్‌ తీసిన ‘స్వాతిముత్యం’ సినిమా వచ్చింది. చిరంజీవికి ఆ సినిమా చూశాక తనలోని నటుడిని సంతృప్తి పరిచేది ఇటువంటి సినిమాలే అని అనిపించింది. ‘స్వాతిముత్యం’ చేయలేదని కె.విశ్వనాథ్‌ దగ్గర బాధ పడ్డారు. ఫలితంగా వారి కాంబినేషన్‌లో పూర్ణోదయ నిర్మాణంలో ‘స్వయంకృషి’ మొదలైంది. ఇది దర్శకునికి, నిర్మాతకు ఎంతో సాహసపూరితమైన నిర్ణయం. 1987 సెప్టెంబర్‌లో ‘స్వయంకృషి’ విడుదలయ్యేలోపు అదే సంవత్సరం జూలైలో ‘పసివాడి ప్రాణం’ రిలీజయ్యి చిరంజీవిని సుప్రీం హీరోను చేసింది. అంత ఇమేజ్‌ ఉన్న హీరో మామూలు బట్టల్లో చెట్టు కింద కూచుని చెప్పులు కుట్టేవాడిలా కనిపిస్తే ప్రేక్షకులు తెరలు చించేయరా? రిజెక్ట్‌ చేయరా? నిజానికి అలాంటి రిజెక్షన్‌ జరిగింది కూడా. 1987లోనే మార్చి నెలలో చిరంజీవి–భారతీరాజా కాంబినేషన్‌లో ‘ఆరాధన’ వచ్చింది. ఇందులో చిరంజీవి బెస్తపాలెంలో ఆకతాయిలా ఆర్ట్‌ఫిల్మ్‌ హీరోలా కనిపిస్తే జనం దారుణంగా రిజెక్ట్‌ చేశారు. మరలాంటిది చెప్పులు కుట్టేవాడిగా చూస్తారా? చూశారు. కారణం? ఆ కథలోని ఆత్మ. ప్రతి మనిషికి తాను నడిచి వచ్చిన దారి గుర్తు ఉంటుంది. దాని పట్ల గౌరవం ఉంటుంది. కొందరు అల్పులు దానిని మర్చిపోయి ఆకాశం నుంచి ఊడి పడినట్టుగా బిహేవ్‌ చేస్తుంటే వారికి బుద్ధి చెప్పాలని ఉంటుంది. అలాంటి బుద్ధిని చెప్పే సినిమా కాబట్టి ‘స్వయంకృషి’ జనానికి నచ్చింది.

‘నీకు ఇష్టమైన పనిలో నైపుణ్యం సంపాదించు. సక్సెస్‌ దానంతట అదే వస్తుంది’ అని నిన్న మొన్నటి త్రీ ఇడియట్స్‌ ద్వారా చెప్పాడు రాజ్‌కుమార్‌ హిరాణీ. ‘ఏదో ఒక పని ఎంచుకుని దానిలో కష్టపడు. పైకొస్తావ్‌’ అని దీనికి ఎన్నో ఏళ్ల క్రితం చెప్పారు కె.విశ్వనాథ్‌. ఆదర్శాలను మనం పాటించడం కాదు తర్వాతి తరాలకు అందించాలి. ఆ సూత్రం కూడా ఈ కథ పాటించడంతో జనం స్వయంకృషి బ్రహ్మరథం పట్టారు.
– కె

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement