K Viswanath Interesting Comments On Chiranjeevi After Swayam Krushi Movie, Deets Inside - Sakshi
Sakshi News home page

K Viswanath-Chiranjeevi: ఆ సీన్‌లో చిరంజీవి ఇచ్చిన ఎక్స్‌ప్రెషన్‌ అత్యద్భుతం: కె విశ్వనాథ్‌

Published Sat, Feb 4 2023 1:11 PM | Last Updated on Sat, Feb 4 2023 2:57 PM

K Viswanath Interesting Comments on Chiranjeevi After Swayam Krushi - Sakshi

‘చిన్నప్పుడు... వేసవి రాత్రుల్లో మిద్దె మీద పడుకునేవాళ్ళం. ఆకాశంలో ఉన్న చుక్కలను చూసే వాళ్ళం. చుక్కలను మన ఊహకు తోచినట్టు గీతలతో కలుపుకుని చిత్రాలను వేసుకునేవాళ్ళం. నా సృజనకు కనబడ్డ చిత్రం మరొకరికి కనబడేది కాదు. వాళ్ళ చిత్రాలు నాకు కనబడేవి కావు. చిత్రం విచిత్రమైనది.చూసిన ప్రతి ఒక్కరికి ఓ కొత్త కోణం కనబడుతుంది’ ప్రేక్షకులు చూసే కోణం, చిత్రం తీసిన వారి కోణం ఒక్కటే కానక్కర్లేదు. సినిమా చూశాక ఎవరి ఇంటికి వారు, వారికి బోధపడ్డ విచిత్రాన్ని మూట కట్టుకుని తీసుకెళ్తారు.

సృష్టికర్త పెట్టిన చుక్కలకు ఎన్ని అనంత అర్థాలు ఉంటాయో... కె.విశ్వనాథ్‌ సినిమాకు కూడా అన్నే పరమార్థాలు ఉండవచ్చు. మనం ఎంతెత్తు ఎదిగినా మనమూలాల్ని మర్చిపోకూడదని చూపించారు స్వయం కృషితో. అప్పటి వరకు ఆర్ట్స్‌ ఓరియెంటెడ్‌ సినిమాలు తెరకెక్కించిన ఆయన తొలిసారి మెసేజ్‌ ఓరియెంట్‌ మూవీ తీశారు. మరి ఈ కథ ఆయనకు ఎలా తొలచింది, ఈ సినిమా తియడానికి కారణాలను గతంలో ఆయన సాక్షితో పంచుకున్నారు. మరి స్వయం కృషి గురించి, ఆయన పంచుకున్న విశేషాలను మరోసారి గుర్తు చేసుకుందాం! 

స్వయం కృషిలో తనకు నచ్చిన సన్నివేశం కోర్టు సీన్‌ అని చెప్పారు. అప్పటిదాకా విజయశాంతిని కసురుకునేవాడు కాస్తా,పిల్లలు పుట్టకుండా ఆపరేషన్‌ చేయించుకుందని తెలిశాక లోపలికి వచ్చి ఆమెవంక అభిమానంగా చూడడం, అప్పుడామె ‘అట్టసూడమాకయ్యా!’ అనే సీన్‌ పెంచుకున్న కొడుకుని అసలు తండ్రి (చరణ్‌రాజ్‌) కరప్ట్‌ చేస్తున్న క్యాసెట్‌ చూస్తున్నప్పుడు... తట్టుకోలేక తల్లిఏడవడం.. తండ్రి నిబ్బరంగా కూర్చునే కోర్టు సీన్‌... కొడుకు ఎవరి దగ్గర ఉండాలని కోరుకుంటాడో (పెంచిన తండ్రి దగ్గరా? అసలుతండ్రి దగ్గరా?) అని వేచి చూస్తున్న పేరెంట్స్‌... షాట్‌ అది.

ఈ సీన్‌కి ముందు చిరంజీవితో ఒకటే చెప్పాను. ‘జీవితంలో చర్మాన్ని ఒలిచి చెప్పులు కుట్టుకుంటూ బ్రతికిన వాడివి... ఇప్పటిదాకా జరిగినవన్నీ చాలా నిబ్బరంగా తీసుకున్నవాడివి... ఈ సమయంలో నువ్వు బ్యాలెన్స్‌ కోల్పోవద్దు! జరగబోయే పరిణామాల గురించి చింతపడకుండా కేవలం ఒక ప్రేక్షకుడిలా ఏం జరగబోతోందో! చూడు’ అని చెప్పాను. తర్వాత ఆ సీన్‌ చేసేటప్పుడు చిరంజీవి ఇచ్చిన ఎక్స్‌ప్రెషన్‌ అత్యద్భుతం, అలా చేయడానికి యోగసిద్ధి ఉండాలనిపించేతలా చేశాడంటూ విశ్వానథ్‌ చిరునుప్రశంసించారు. 

ఇక చిరంజీవి మూడు సినిమాలు చేసిన అనుభవం గురించి ఆయన మాట్లాడుతూ.. చిరంజీవికి తన వృత్తిపట్ల ఉన్న డెడికేషన్‌ అయోఘమైనదన్నారు. ‘శుభలేఖ’, ‘స్వయంకృషి’ తర్వాత ‘ఆపద్బాంధవుడు’... ఈ మధ్య గ్యాప్‌లో అతడు స్టార్‌గా అంచెలంచెలుగా ఎదిగాడు. కానీ తను అది ఏమాత్రం చూపించలేదు. ప్రతి పిక్చర్‌ ఇదే తన మొదటి సినిమా అన్నట్లుగా తపనపడేవాడు. దానికో ఉదాహరణ చెప్తాను.. ‘ఆపద్బాంధవుడు’లో... మెంటల్‌ హాస్పిటల్‌లో షాక్‌ థెరపీ ఇచ్చాక హీరోకి మాట పెగలదు. అలాంటి సీన్‌ యాక్ట్‌ చేయడం ఏ యాక్టర్‌కైనా పండగ. ఓన్లీ స్కై ఈజ్‌ ద లిమిట్‌ ఫర్‌ దట్‌! అది తనకు తెలుసు కాబట్టి ఏమాత్రం ఖాళీ లేకపోయినా, తనంత పీక్‌ స్టార్‌డమ్‌లో ఉన్నా... ముందు రోజు తనంతట తాను నా రూమ్‌ కొచ్చి, ఎక్కడేం చేయాలో తెలుసుకుని, రిహార్సల్స్‌ చేసుకుని వెళ్ళాడు.

అదే సినిమాలో దక్షుడిగా క్లాసికల్‌ డ్యాన్స్‌ చేయాల్సి వచ్చినప్పుడు... తనకసలు అవసరం లేకపోయినా (మంచి డ్యాన్సర్‌ కదా!), రెండు రోజులపాటు డ్యాన్స్‌ డైరెక్టర్‌తో రిహార్సల్స్‌ చేసుకుని వెళ్ళాడు’ అంటూ చెప్పుకొచ్చారు. తన ప్రతి సినిమాలో శివుడి ప్రస్తావన తీసుకొచ్చే విశ్వనాథ్‌ స్వయం కృషిలో పెద్దగా పెట్టలేదనేది ప్రేక్షకులు అభిప్రాయం. దీనికి ఆయన స్పందిస్తూ.. ఈ సినిమాలో శివుని ప్రస్తావన పెట్టానని, బ్రహ్మానందం తన కొడుకుతో ఒకమాటంటాడు కదా.. ‘గుళ్ళో శివుడు, నంది ఇద్దరూ ఉంటారు; అలా అని నంది వెళ్ళి శివుని పక్కనకూర్చోవాలనుకోవడం తప్పుకదా? అని ఉంది కదా అన్నారు. ఆ తర్వాత మీకు శివుడి సెంటిమెంట్‌ ఉందాని హోస్ట్‌ అడగ్గా.. తన పేరులోనే శివుడు ఉన్నాడంటూ నవ్వుతూ ఆయన సమాధానం ఇచ్చారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement