పాడైపోయెను గూడు | special story to some countries news | Sakshi
Sakshi News home page

పాడైపోయెను గూడు

Published Sun, Mar 12 2017 11:00 PM | Last Updated on Tue, Sep 5 2017 5:54 AM

పాడైపోయెను గూడు

పాడైపోయెను గూడు

గ్రౌండ్‌  అప్‌

పాడైపోయెను గూడు
ఇరాక్‌ ఇంకా చల్లపడలేదు. సద్దాం హయాం నుంచీ ఆ దేశంలో ఏదో ఒక కల్లోలం! ప్రస్తుతం ఐసిస్‌ జిహాదీలకు, ఇరాక్‌ ప్రభుత్వానికీ మధ్య భీకర పోరాటం జరుగుతోంది. ఐసిస్‌ ఇరాక్‌లో ఒక్కో ప్రాంతాన్ని ఆక్రమించుకుంటుంటే... ఇరాక్‌ దీటుగా పోరాడి ఒక్కో ప్రాంతాన్నీ విడిపించుకుంటూ వస్తోంది. జిహాదీలు ఆత్మాహుతి దళాలతో దొంగ దెబ్బ తీస్తుంటే, ఇరాక్‌... రాకెట్‌ దాడులతో ఐసిస్‌ జిహాదీలను తరిమికొడుతోంది. ఈ రెండు వర్గాల నడుమ ఇరాక్‌లోని వేలాది కుటుంబాలు చెల్లాచెదురవుతున్నాయి. అయినవాళ్లను పోగొట్టుకుని ఎందరో అనాథలవుతున్నారు. వీళ్ల కోసం అమెరికా నాయకత్వంలోని సంకీర్ణదళాలు ప్రత్యేక శిబిరాలను ఏర్పాటు చేస్తున్నాయి. మోసీల్‌ పట్టణంలోని అలాంటి ఒక రక్షణ శిబిరంలోకి... కూతుర్ని ఎత్తుకుని, పరుగులు తీస్తున్న ఇరాక్‌ తండ్రినే మీరిప్పుడు ఫొటోలో చూస్తున్నది. తల్లి ఎక్కడుందో వీళ్లకు తెలియదు. వీళ్లు ఎక్కడున్నారో ఆమెకు తెలియదు. ఒకళ్ల ప్రాణాలు ఒకళ్ల దగ్గరున్నాయని మాత్రం ఈ విషాద దృశ్యం తెలియజేస్తోంది.

బుల్‌ అండ్‌ లిటిల్‌ గర్ల్‌
మాన్‌హట్టన్‌లోని వాల్‌ స్ట్రీట్‌ కంచు ఆంబోతుకు సవాల్‌ విసురుతూ... ‘నువ్వా? నేనా?’ అన్నట్లు దానికి ఎదురుగా నిలుచున్న చిన్న పిల్ల విగ్రహం ఒకటి ఇప్పుడు ప్రపంచానికి ముచ్చటగొల్పుతోంది. మహిళా సాధికారతకు, అంతకు మించి మహిళా శక్తికి తార్కాణంగా ఉన్న ఈ చిన్నారి విగ్రహాన్ని మొన్నటి మహిళా దినోత్సవం సందర్భంగా ఏర్పాటు చేశారు. పెద్ద పెద్ద కంపెనీల బోర్డు నిర్ణయాలలో మహిళల భాగస్వామ్యం ఇప్పటికీ తక్కువగానే ఉందని, మహిళా శక్తిని అంగీకరించి, వారికి సమాన అవకాశాలను కల్పిస్తే ప్రపంచ ఆర్థిక వ్యవస్థ సురక్షితంగా ఉంటుందనీ సూచిస్తూ బుల్‌కి ఎదురుగా ఈ లిటిల్‌ గర్ల్‌ని ఉంచారు.

సాధించింది సేనాని భార్య
మేజర్‌ అమిత్‌ దేశ్వాల్‌! ఏడాది క్రితం మణిపూర్‌లో తీవ్రవాదులతో పోరాడి మరణించిన సైనిక వీరుడు. ఆర్మీ స్పెషల్‌ ఫోర్స్‌లో పని చేస్తూ దేశం కోసం ప్రాణాలర్పించిన ఆ అమిత్‌ దేశ్వాల్‌ ఆశయాన్ని ఇప్పుడు ఆయన భార్య నీతా భుజం మీదకు తుపాకీలా ఎత్తుకున్నారు. 33 ఏళ్ల నీతా భారత సైన్యంలో ‘షార్ట్‌ సర్వీస్‌ కమిషన్‌’ ఆఫీసర్‌గా ఎన్నికయ్యారు. చెన్నైలోని ఆఫీసర్స్‌ ట్రైనింగ్‌ అకాడమీలో ఏప్రిల్‌ 1న ప్రారంభమై 49 వారాల పాటు సాగే శిక్షణ అనంతరం నీతా ఆర్మీ విధుల్లో చేరుతారు. సరిగ్గా గత ఏడాది ఏప్రిల్‌లోనే ఆమె తన భర్తను కోల్పోయారు. ఆ షాక్‌ నుంచి తేరుకోడానికి ఆమెకు రెండు నెలలు పట్టింది. ఆ తర్వాత గుండె దిటవు చేసుకుని తన మూడేళ్ల కొడుకుతో పాటు హర్యానా నుంచి ఢిల్లీ వెళ్లి ‘సర్వీస్‌ సెలక్షన్‌ బోర్డు’ పరీక్షలకు ప్రిపేర్‌ అయ్యారు. తన భర్త అర్ధంతరంగా వదిలిపెట్టి వెళ్లిన దేశ రక్షణ బాధ్యతలో పాల్పంచుకోవడమే ఆమె లక్ష్యం. అదిప్పుడు నెరవేరింది. చెన్నైలో శిక్షణ పూర్తయ్యాక లెఫ్ట్‌నెంట్‌ క్యాడర్‌ అధికారిగా దేశానికి సేవలు అందిస్తారు నీతా.

కసిగా ఉన్నాడు
మిన్‌ బహదూర్‌ షేర్‌చాన్‌ ప్రస్తుత వయసు 86. దేశం నేపాల్‌. 2008లో ఈయన ఎవరెస్టు శిఖరాన్ని ఎక్కాడు. ఎక్కిన రెండేళ్ల తర్వాత 2010లో ‘ఎవరెస్టు శిఖరాన్ని అధిరోహించిన అతివృద్ధుడు’గా గిన్నిస్‌ బుక్‌ని ఎక్కాడు. అయితే షేర్‌చాన్‌కి ఆ సంతోషం ఎక్కువకాలం మిగల్లేదు. యుచీరో మియూరా అనే 80 ఏళ్ల వృద్ధ మహాశయుడు 2015లో ఎవరెస్టును ఎక్కి, మన షేర్‌చాన్‌ని గిన్నెస్‌లోంచి తోసేశాడు! అప్పట్నుంచీ షేర్‌చాన్‌ కసిగా ఉన్నాడు. మళ్లీ ఎలాగైనా ఎవరెస్టును ఎక్కేసి, తన జపాన్‌ ప్రత్యర్థి మియూరాను గిన్నిస్‌నుంచి ఒక్క తన్ను తన్నేయాలన్న దృఢనిశ్చయంతో ఉన్నాడు. ఏడాది లోపు ఎక్కితీరుతాను అని కూడా చెబుతున్నాడు. ‘నేను వృద్ధుడిని కావచ్చు. మనసు ఇంకా యంగ్‌గానే ఉంది’అని అంటున్నాడు. అయితే రికార్డు కోసం పంతాన్ని నెగ్గించుకోవాలనుకోవడం లేదట షేర్‌చాన్‌. ప్రపంచశాంతి, భూమాతను కాపాడుకోవడం... అనే అంశాలపై ప్రజలను చైతన్యం చేయడం కోసం ఈ శిఖరయాత్రను చేపడుతున్నాడట.


నూరేళ్ల విలాపం
ఇరవై ఏళ్ల క్రితం ఇండియాలో వినాయకుడు పాలు తాగాడు. ఇప్పుడు క్రిమియా ద్వీపకల్పం సిమ్‌ఫెరోపోల్‌లోని రష్యా చివరి చక్రవర్తి రెండవ నికోలాయ్‌ విగ్రహం కన్నీళ్లు కారుస్తోంది. తర్కానికి అతీతంగా భక్తివిశ్వాసాలు మనుషులను నడిపిస్తాయని అనుకోడానికి ఈ రెండు వార్తలు నిదర్శనం. ఉక్రెయిన్‌ నుంచి రష్యా సిమ్‌ఫెరోపోల్‌ను కలుపుకున్న రెండేళ్ల తర్వాత 2016లో నికోలాయ్‌ విగ్రహ ప్రతిష్ఠాపన జరిగింది. పూర్వపు చక్రవర్తుల మాదిరిగానే రెండవ నికోలాయ్‌ భక్తిపరుడు. నికోలాయ్‌ పదవీచ్యుతుడై వందేళ్లు అయిన సందర్భంగా అతడి విగ్రహం విలపిస్తూ ఉండివుండొచ్చని క్రిమియా న్యాయవాది నాటాలియా పొర్లోన్‌స్కయా అంటున్నారు.

పాపం.. బ్యాంక్‌! 
ఈ తాబేలు పేరు ‘బ్యాంక్‌’. అసలు పేరు ఆమ్సిన్‌. వయసు 25. ఇంకో నూటా పాతికేళ్ల జీవితం ఉండగానే ఇదిగో... ఇలా హాస్పిటల్‌ పాలయింది! తాబేళ్ల జీవితకాలం సాధారణంగా 150 ఏళ్లు. జాతిని బట్టి 200 ఏళ్లు బతికే తాబేళ్లూ ఉన్నాయి. అయ్యో! మరి మన ‘బ్యాంక్‌’కు ఇంతలోనే ఏమయింది?!తాబేలు ఉన్న కొలనులోకి నాణేలను విసిరితే ఎక్కువకాలం జీవిస్తామని థాయ్‌లాండ్‌లో ఓ నమ్మకం ఉంది. ఆ నమ్మకమే ఇప్పుడు ‘బ్యాంక్‌’ ప్రాణాల మీదికి తెచ్చింది. థాయ్‌ రాజధాని బ్యాంకాక్‌కు దగ్గర్లో శ్రీరచ అనే తీరప్రాంత సమీప పట్టణం ఉంది. ఆ పట్టణంలో ఓ కొలను ఉంది. ఆ కొలనులో ఓ తాబేలు ఉండేది. ఆ తాబేలే... ఇప్పుడు థాయ్‌ ఆసుపత్రిలో ఉన్న ‘బ్యాంక్‌’. బ్యాంక్‌... కొలనులో ఉన్నప్పుడు అది నీటి పైకి తేలినప్పుడు... కొలను దగ్గరున్న వాళ్లు తాబేలు ఉన్న వైపు నాణేలు విసిరేవారు. వాటిని ‘గుడ్‌ లక్‌  పెన్నీస్‌’ అంటారు. అయితే ఆ గుడ్‌ లక్‌ పెన్నీలు... కొలనులోని తాబేలుకు బ్యాడ్‌ లక్‌ పెన్నీలు అయ్యాయి. ఎన్నాళ్ల నుంచి ఆ తాబేలు... నీటిలోకి వచ్చి పడుతున్న నాణేలను మింగుతుందో గానీ, దాని కడుపు ఉబ్బిపోయి, కదలలేని స్థితికి వచ్చింది. ఈ సంగతిని ఓ నేవీ అధికారి గమనించాడు. వెంటనే దాన్ని యూనివర్శిటీ ఆసుపత్రికి చేర్చాడు. డాక్టర్లు స్కాన్‌ చేసి చూస్తే తాబేలు కడుపులో నాణేలు కనిపించాయి! వెంటనే ఆపరేషన్‌కు ఏర్పాట్లు జరిగాయి.

తాబేలుకు మత్తు ఇచ్చారు. కడుపుపైన చిన్న కోత పెట్టారు. ఏడు గంటల పాటు శ్రమించి దాని కడుపులోంచి 915 థాయ్‌ నాణేలను తీశారు. ఒంట్లోంచి ఒక్కసారిగా ఐదు కిలోల బరువు తగ్గిపోవడంతో తాబేలు తేలికపడింది. డాక్టర్లూ ఊపిరి పీల్చుకున్నారు. అసలే ఈ తాబేలు... అంతరించిపోతున్న జీవజాతిలో ఉంది మరి! ఈ సంఘటన యూనివర్శిటీలోని వెటర్నరీ డిపార్ట్‌మెంట్‌ హెడ్డు నంతరికా ఛాస్యూకి చాలా బాధ కలిగించింది. మీడియాను పిలిపించి, నీళ్లలో నాణేలు వేయడం మానుకోవాలని స్థానికులకు, టూరిస్టులకు ఆమె విజ్ఞప్తి చేశారు. ప్రస్తుతం బ్యాంక్‌ ఆసుపత్రిలో కోలుకుంటోంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement