వరల్డ్ వ్యూ
‘ఆకలి’ మాసం
రంజాన్ మాసంలో ఉపవాసం ఉండటం ముస్లింల విధి. సూర్యోదయానికి ముందే భోజనం చేసి సూర్యాస్తమయం తర్వాత తిరిగి భోజనం చేస్తూ ఈ మధ్య సమయంలో పచ్చి మంచినీళ్లు కూడా ముట్టకుండా కఠినమైన ఉపవాసం ఉంటారు. కాని ఇరాక్‌లోని ముస్లింల పరిస్థితి ప్రతిరోజూ ఉపవాసంతో నిండి ఉంది. ఆకలితో అలమటిస్తూ ఉంది. అక్కడ నెలకొన్న పరిస్థితుల వల్ల ‘ఐసిస్’ చొరబాటు వల్ల కొన్ని నగరాలకు నగరాలే ఖాళీ అయ్యాయి. మరికొన్ని ధ్వంసమయ్యాయి. ప్రజలు శరణార్థ శిబిరాలలో ఉన్నారు. వారికి వాలంటీర్లు కాని దాతలు కాని ఆహారం అందివ్వాల్సి వస్తోంది. ఎంతో ఉత్సాహంగా పవిత్రంగా సంతోషంగా గడపాల్సిన రంజాన్ మాసంలో ఇరాక్ ప్రజల దీనవదనాలివి.
నీటి ఏనుగు...
నీటి ఏనుగు వేరు నీళ్లలో ఉన్న ఏనుగు వేరు. కాని ఇక్కడ నిజం ఏనుగు నీళ్లల్లో ప్రదర్శన ఇస్తున్నది కనుక దీనిని నీటి ఏనుగనే అనాలేమో. బ్యాంకాక్‌లోని ‘ఖ్వవ్ ఖెయొవ్’ జంతు ప్రదర్శనశాలలో ‘సీన్ దావ్’ అనే ఎనిమిదేళ్ల ఆడ ఏనుగు ఉంది. ఇది నీటితొట్టెలో జలకాలాడుతూ తన మావటితో విన్యాసాలు చేస్తుంది. ఈ విన్యాసాలు చూడటానికి చిన్న పిల్లలు చాలా ఉత్సాహ పడుతుంటారు. కొన్ని గజాలలోతు నీళ్లలో గజం మునకలేయడం ఎవరికైనా కుతూహలమే కదా.
హాౖయెన హంస నావలోన
‘మెచ్చిందిలే దేవసేన’... అని ‘బాహుబలి’ సినిమాలోలా అక్కడ పర్యాటకులు పాడుకుంటూ ఉంటారు. ఈ ఫొటోలు ‘గువానాబరా’ తీరంలో ఉన్న ‘పాక్వెటా ద్వీపం’లోనివి. ఈ ద్వీపం ఆగ్నేయ బ్రెజిల్‌లో ఉంది. ‘పాక్వెటా ద్వీపం’ ఒకప్పుడు శ్రీమంతుల ద్వీపం. ప్రపంచంలోని శ్రీమంతులు మాత్రమే ఈ ద్వీపానికి విహారానికి వెళ్లి సేద తీరుతుండేవారు. ఈ ద్వీపంలో మోటారు వాహనాలను నిషేధించింది బ్రెజిల్ ప్రభుత్వం. సైకిళ్లు, గుర్రంబగ్గీలే ఉపయోగించాలి. అయితే గత కొన్నేళ్లుగా ఈ ద్వీపం ప్రభ తగ్గింది. పెరిగిన జనాభా, కాలుష్యం దీని పట్ల ఆసక్తిని తగ్గించాయి. అయినప్పటికీ పర్యాటకులతో ఇది కళకళలాడుతూనే ఉంటుంది. ఇదిగో ఇలా ఉల్లాసపరుస్తూ ఉంటుంది.