![special story to Train is a love story - Sakshi - Sakshi](/styles/webp/s3/article_images/2017/11/17/train_0.jpg.webp?itok=IRKaDH_l)
చిన్నప్పుడు అగ్గిపెట్టెలతో ట్రైన్ చేసుకునే వాళ్లం ఇంకొంచెం పెద్దయ్యాక తాటికాయలతో రైలు పెట్టెలు చేసేవాళ్లం కొంచెం డబ్బున్న ఇళ్లలో పిల్లల కోసం బ్యాటరీ ట్రైన్‌లుండేవి ఆ తర్వాత మనందరికీ గుర్తున్న రైలు ప్రయాణాన్ని ఎన్నటికీ మరిచిపోలేం ఒక బంధువుని స్టేషన్ దగ్గర దిగబెడుతున్నప్పటి జ్ఞాపకాలు వాళ్లను ట్రైన్ తీసుకెళ్లిపోతే కలిగిన బాధ ఇంకోసారి వస్తున్న ట్రైన్‌ని ప్లాట్‌ఫామ్ మీద నిలబడి చూస్తుండగా కిటికీలోంచి ఆనందంగా చేతులూపిన బంధువుల ముఖాలు మన గుండెల మీద అలాగే నిలిచిపోయాయి జీవితాన్ని అంతగా కదిలించిన ట్రైన్ సినిమాలను కూడా కదిలించింది నెమరేసుకోవడానికి అలాంటి కొన్ని సినిమాలు మొదటి పెట్టె జననం... చివరి పెట్టె మరణం. నట్ట నడుమ బోగీలన్నీ నాటకం... సినిమా నాటకం!
విలన్ దాడి చేసి తల్లిదండ్రుల్ని చంపేశాడు. అన్నదమ్ములు పాపం చిన్న పిల్లలు కళ్లారా ఈ ఘోరాన్ని చూశారు. విలన్ వీళ్లను కూడా వదిలిపెట్టదలుచుకోలేదు. వెంటపడ్డాడు. అన్నదమ్ములిద్దరూ పరిగెత్తుతూ రైలు పట్టాల మీదకు చేరుకున్నారు. ఏదో గూడ్స్ వెళుతోంది. అన్న ఎక్కేశాడు. తమ్ముడు పరిగెడుతున్నాడు. అన్న చేయి అందించి తమ్ముణ్ణి అందుకోబోయాడు. కానీ ట్రైన్ వేగం అందుకుంది. తమ్ముడు పరిగెడుతూనే ఉన్నాడు. కానీ అన్నయ్యను చేరుకోలేకపోయాడు. రైలు పట్టాలు కలవవు. విడిపోయిన ఈ అన్నదమ్ములు ఎప్పటికి కలుస్తారు. హిందీలో ‘యాదోంకి బారాత్’గా తెలుగులో ‘అన్నదమ్ముల అనుబంధం’గా విడుదలైన సినిమాలో సన్నివేశం ఇది.
ఎడ్ల బండి ఆగుతుంది. బస్సు ఆగుతుంది. కారు కూడా ఆగమంటే ఆగుతుంది. కానీ రైలు ఆగదు. అది మనం చెప్పినట్టు వినదు. రైలు దగ్గరకు మనం వెళ్లాలి తప్ప మన దగ్గరకు రైలు రాదు. అందుకే రైలుతో చాలా కథలు ముడిపడ్డాయి. చాలా జీవితాలు మారిపోయాయి. చాలా జీవితాలు మునిగి తేలాయి. అందుకే సినిమాలకు రైలు పెద్ద కథావస్తువు. కూ...ఛుక్‌ఛుక్... ధక్ ధక్... ధక్ ధక్... ఇది రైలు చప్పుడే కాదు. ప్రేమికుడి గుండె చప్పుడు కూడా. భారతదేశంలో వచ్చిన రైలు సన్నివేశాలలో హిందీలో వచ్చిన ‘పాకీజా’లోని రైలు సన్నివేశం మనోహరమైనది. ఆ సినిమాలో హీరో రాజ్‌కుమార్ కదిలిపోతున్న రైలులో పెట్టె చూసుకోకుండా ఎక్కేస్తాడు. తీరా ఎక్కాక తెలుస్తుంది అది ఫస్ట్‌క్లాస్ కంపార్ట్‌మెంట్ అని. అందులో హీరోయిన్ మీనా కుమారి నిద్రపోతూ ఉంటుంది. ఆమె ముఖం కంటే కూడా ఆమె పాదాలు ఆకర్షిస్తాయి. ఆ క్షణమే అతడు ఆమెతో ప్రేమలో పడతాడు. ‘ఈ పాదాలను నేల మీదకు దించకు సుమా. మాసిపోగలవు’ అని ప్రేమలేఖ రాస్తాడు. ఆ తర్వాత అతడి జీవితం మొత్తం వెలయాలు అయిన ఆ హీరోయిన్‌ని పొందడం గురించే.
రైలులో పుట్టే ప్రేమలు ఎన్నో ఉన్నాయి. పెనవేసుకునే ప్రేమలూ ఉన్నాయి. డాక్టర్ చక్రవర్తిలో అక్కినేని, మిసమిసలాడే కృష్ణకుమారిని చూసి కంపార్ట్‌మెంట్ కిటికీలన్నీ మూసి ‘ఈ మౌనం ఈ బిడియం ఇదేనా ఇదేనా చెలియ కానుక’ అని పాడి చేయి పట్టుకుంటాడు. జబ్బ నిమిరి చూస్తాడు. ఎన్టీఆర్ కూడా ‘భలే తమ్ముడు’ సినిమాలో కె.ఆర్.విజయ కోసం మారువేషంలో పరుపుల పెట్టె ఎక్కి ‘గోపాల బాల నిన్నే చేరి’ అని మహమ్మద్ రఫీ గొంతులో పాట అందుకుంటాడు. ఆ తర్వాత ఈ ట్రెండ్ ఎన్నో సినిమాల్లో కొనసాగింది. కానీ తమిళంలో భారతీరాజా తీసిన ‘కిజాకె పోగుమ్ రైల్’ తెలుగులో బాపు దర్శకత్వంలో ‘తూర్పు వెళ్లే రైలు’గా వస్తే అందులో రైలునే ప్రేమికులు తమ ప్రేమ లేఖగా మలుచుకుంటారు. ప్రేయసిని వదిలి పట్నం వెళ్లిన ప్రియుడు తన ఊరికి వెళ్లే రైలు చివరి పెట్టె మీద తన మెసేజ్ రాస్తుంటే ప్రియురాలు కూడా ఆ మెసేజ్‌కు సమాధానం ఇస్తుంది. క్లయిమాక్స్‌లో ఊరుని వదలి ఆ రైలులోనే పారిపోయి తమ ప్రేమను సఫలం చేసుకుంటారు. ఇదే థీమ్‌ను తేజ ‘జయం’లో నితిన్, సదా ఉపయోగిస్తారు. ‘వర్షం’లో త్రిష రైల్వే ప్లాట్‌ఫామ్ మీద ‘ఇన్నాళ్లకు గుర్తొచ్చానా వాన’ పాడి, గోపీచంద్ కళ్లల్లో పడటమే త్రిష– ప్రభాస్‌ల ప్రేమకథకు మలుపు. లోకల్ ట్రైన్‌లలో ప్రేమను మణిరత్నం ‘సఖి’ అద్భుతంగా చూపిస్తుంది. అయితే డైలాగులేమీ లేకుండా కేవలం రైల్వే ప్లాట్‌ఫామ్ మీద సైట్ వేయడం ద్వారానే అంజలా జవేరీని పడేస్తాడు చిరంజీవి ‘చూడాలని ఉంది’ సినిమాలో. చిరంజీవి నటించిన సన్నివేశాలలో ఇది భిన్నమైనది. ఆ రోజులకు కొత్తది కూడా. ప్రయాణికులలో మగ పాసింజర్లు, ఆడ పాసింజర్లు ఉన్నంత కాలం ఈ లవ్ జర్నీ కూడా తప్పదు. ప్రేమ పచ్చజెండాలు ఊగడం కూడా తప్పదు.
అయితే రైళ్లు బోలెడంత విషాదాన్ని కూడా నింపుకుని ఉంటాయి. ‘ఆమె కథ’ సినిమా జయసుధ ట్రైన్ దిగడంతో మొదలయ్యి మళ్లీ ట్రైన్ ఎక్కడంతో ముగుస్తుంది. నడి మధ్యలో ఆమె తన మనసుకు నచ్చినవాడి కోసం చేసిన వెతుకులాట తీరనే తీరదు. దొరికినవాళ్లు అందరు. అందినవాళ్లు దొరకరు. అదో పెద్ద విషాదం. మణిరత్నం ‘దళపతి’లో శ్రీ విద్య తన అవివాహ శిశువును కడు దుఃఖంలో నిస్సహాయంగా ఒక గూడ్స్ బండిలో వదిలిపెడుతుంది. కుంతికి నది దొరికింది. శ్రీవిద్యకు రైలు. జైలు నుంచి విడుదలైన వాళ్లు ట్రైన్‌లోనే తమ కథలు మొదలెడుతుంటారు. ‘సర్దార్ పాపారాయుడు’లో ఎన్టీఆర్, ‘త్రిశూలం’లో కృష్ణంరాజు, ‘నువ్వొస్తావని’లో నాగార్జున తమ జీవిత కథలను ప్రయాణికులతోటో స్వీయ ఫ్లాష్ బ్యాక్‌లోనో తలుచు కుంటారు. ‘అంకురం’ సినిమాలో రైల్వే ప్లాట్‌ఫామ్ మీద దిగిన నక్సలైట్ ఓంపురిని పోలీసులు క్షణాల్లో లిఫ్ట్ చేస్తారు. రైలులో ఉన్న అతడి శిశువు రేవతి ఒడిలో ఉండిపోతుంది. ఆ శిశువు తండ్రి కోసం రేవతి పోరాటమే అద్భుతమైన ఆ సినిమా– అంకురం. కానీ ఈ రైలుతోనే విషాదాంతమైన క్లయిమాక్స్ కూడా ఉంది. శ్రీకాంత్ నటించిన ‘ప్రేయసి రావే’ సినిమాలో శ్రీకాంత్ రాశిని ప్రేమిస్తాడు. కానీ ఆమె అతడ్ని అపార్థం చేసుకుని మరొకరిని వివాహం చేసుకుంటుంది. అయినా సరే ఆమెనే ప్రేమిస్తూ ఆమె బాగు కోరుకునే శ్రీకాంత్ ఆమె భర్తకు గుండె జబ్బు ఉందని తెలిసి చనిపోయాకైనా సరే ఆమె గుండెలో చోటు సంపాదించుకోవచ్చని తన గుండె ఇవ్వడానికి రైలు కింద పడి ఆత్మహత్య చేసుకుంటాడు. ఇలాంటి క్లయి మాక్స్ ఇదొక్కటే ఉంది. శ్రీకాంత్‌కు పేరు తెచ్చిన క్లయిమాక్స్ ఇది.
రైలులో బోలెడంత హాస్యం కూడా ఉంటుంది. ‘ఫ్యామిలీ ఫ్యామిలీ అంతా ఉప్మా తిని బతికేస్తున్నారా నాన్నా?’ అని మహేశ్‌బాబు తన బామ్మర్ది భరత్‌ను లోకల్ ట్రైన్‌లోనే హాస్యం ఆడతాడు– ‘పోకిరి’ సినిమాలో. కిటికీ అవతల కొబ్బరి బోండాం తీసుకుని దానిని కిటికీ లోంచి కంపార్ట్‌మెంట్‌లోకి ఎలా తీసుకోవాలో తెలియక నవ్వులు పండిస్తాడు సునీల్ ‘మర్యాద రామన్న’లో. ‘వెంకీ’లో రవితేజ అండ్ బ్యాచ్ టి.సి వేణుమాధవ్‌తో కలిసి ‘గజాలా’ పేరు కలిగిన బ్రహ్మానందంను, ‘బొక్కా’ పేరు కలిగిన ఏవీఎస్‌ను ఏడిపించుకుతినే సీన్లు బాగా నవ్వు తెప్పిస్తాయి. ‘వెంకటాద్రి ఎక్స్‌ప్రెస్’లో సప్తగిరి పులిహోర, పెరుగన్నం అమ్ముకుంటూ ట్రైన్ మిస్సయిన హీరో సందీప్ కిషన్‌కు ఫోన్లు కొడుతూ రాత్రంతా జాగారం చేసి నవ్వులతో మనల్ని మెలకువలో ఉంచుతాడు. ‘శివాజీ’లో తన ప్రేమను శ్రియ చేత ఒప్పించడానికి రైలు కింద పడి ఆత్మహత్య చేసుకునే నాటకం కోసం పట్టాల మీద నిలబడతాడు రజనీకాంత్. ట్రైన్‌లో కమెడియన్ వివేక్ అతడికి సహాయంగా ఎక్కుతాడు. కానీ రజనీకాంత్ కాలు పట్టాల్లో ఇరుక్కుపోతుంది. రైలు అతడి మీదకు వచ్చేస్తుంటుంది. ఇది తెలిసిన వివేక్ హడావుడిగా చైన్ లాగుతాడు. అది ఊడి చేతికి వస్తుంది. చైన్ లాగితే ట్రైన్ ఆగుతుందనే మన నమ్మకానికి ఈ హాస్య సన్నివేశం పెద్ద ఎదురుదెబ్బ. ఒకటి మాత్రం వాస్తవం.
ట్రైనెక్కిన ఏ మనిషైనా రెండు సార్లు తప్పక నోరు తెరుస్తాడు. ఒకటి ఏదైనా తినడానికి. రెండు ఏదో ఒక విషయం మీద నవ్వడానికి.
రైళ్లు క్లయిమాక్స్‌లకు మజా ఇస్తాయి. ‘దిల్ వాలే దుల్హనియా లేజాయేంగే’ క్లయిమాక్స్ మనకు తెలియనిది కాదు. రైల్లో వెళ్లిపోతున్న షారుక్‌ఖాన్‌ను చేరుకోవడానికి తండ్రి అనుమతితో చేయి విడిపించుకుని ప్లాట్‌ఫామ్ మీద పరిగెడుతుంది కాజోల్. అద్భుతమైన సన్నివేశం. పవన్ కల్యాణ్ ‘ఖుషీ’ సినిమాలో కూడా క్లయిమాక్స్‌లో తాము ఒకరి నొకరు ప్రేమించుకుంటున్నామని అర్థం చేసుకున్న హీరో హీరోయిన్లు ఆ మాట చెప్పుకో వాలంటే ఒకరు ఒక ట్రైన్‌లో మరొకరు మరో ట్రైన్‌లో వెతుక్కుని నానా హైరానా పడతారు. మణిరత్నం ‘గీతాంజలి’ క్లయిమాక్స్ కూడా రైల్వేస్టేషన్‌లోనే. నాగార్జున, గిరిజ రైల్వేస్టేషన్‌లోనే ఒకరినొకరు హత్తుకుపోతారు– ప్రాణాలు కొనఊపిరితో నిలిపి. ‘వసంత కోకిల’ సినిమాలో అంత వరకూ తనను కాపాడిన కమల్‌హాసన్‌ను ప్లాట్‌ఫామ్ మీద చూసి గుర్తు పట్టలేకపోతుంది శ్రీదేవి. మతి భ్రమణంలో అతడు తన ఆత్మబంధువు. మతి తిరిగి వచ్చాక అపరిచితుడు. ఆమె తనను గుర్తు పట్టడానికి కురుస్తున్న వానలో అతడు పిల్లి మొగ్గలు వేస్తూ ఏడుస్తూ ఉంటే ట్రైన్ కదిలిపోతూ ఉంటే శ్రీదేవి అతణ్ణి విడిచి వెళ్లిపోయే సన్నివేశం ఎవరూ మరిచిపోలేరు. గమ్యం వస్తే స్టేషన్ వస్తుంది. వచ్చిన ప్రతి స్టేషన్ ఎవరికో ఒకరికి గమ్యం తెస్తుంది. ఆగడం, ముందుకు కదలడంలో మనిషి జీవితం ఉంది.
చివరి గమ్యం వరకు ఆ ప్రయాణం తప్పదు. ఆ నట్ట నడుమ నాటకమూ తప్పదు. కూ... ఛుక్‌ఛుక్ ఛుక్.
‘శివాజీ’లో తన ప్రేమను శ్రియ చేత ఒప్పించడానికి రైలు కింద పడి ఆత్మహత్య చేసుకునే నాటకం కోసం పట్టాల మీద నిలబడతాడు రజనీకాంత్. ట్రైన్‌లో కమెడియన్ వివేక్ అతడికి సహాయంగా ఎక్కుతాడు. కానీ రజనీకాంత్ కాలు పట్టాల్లో ఇరుక్కుపోతుంది. రైలు అతడి మీదకు వచ్చేస్తుంటుంది. ఇది తెలిసిన వివేక్ హడావుడిగా చైన్ లాగుతాడు. అది ఊడి చేతికి వస్తుంది. చైన్ లాగితే ట్రైన్ ఆగుతుందనే మన నమ్మకానికి ఈ హాస్య సన్నివేశం పెద్ద ఎదురుదెబ్బ.
– కె
Comments
Please login to add a commentAdd a comment