దూకుడు చూడ్డానికి బాగానే ఉంటుంది!
దూకేప్పుడు చేతిలో రిమోట్ ఉండదుగా!
పేరెంట్స్ చేతుల్లో పిల్లల రిమోట్ ఉండదు!
పేరెంట్స్ నేర్పే సంస్కారమే వాళ్లను అదుపులో ఉంచుతుంది!
మంచి–చెడుల మధ్య విచక్షణ నేర్పుతుంది!!
టీవీలు చంపేస్తున్నాయి!!
‘‘ఎలా కాలింది పాపకు’’ పక్క బెడ్‌లో ఉన్న ఎనిమిదేళ్ల బాబు తల్లి ప్రశ్న. ఆ ప్రశ్న వినగానే రెండు చేతుల్లో మొహం దాచుకొని ఘొల్లుమంది పాప తల్లి. ‘‘అయ్యో.. సారీ అండీ ఇబ్బంది పెడితే’’ నొచ్చుకుంది పక్క బెడ్‌లోని బాబు తల్లి. ‘‘పర్లేదమ్మా...’’ అని ఆవిడకు సమాధానమిచ్చి.. ‘‘అనుపమా.. ఏంటిది.. ఊరుకో... పొద్దస్తమానం నువ్వలా ఏడుస్తుంటే పిల్ల బెంబేలెత్తి పోతుంది..’’ అంటూ కూతురిని మందలించింది పెద్దావిడ. పక్క బెడ్ బాబు తల్లి కూడా.. ‘‘అవునండీ.. మీ అమ్మగారు చెప్పింది కరెక్టే.. మనమే భయపడితే.. మనల్ని చూసి పిల్లలు మరింత భయపడ్తారు. ఊరుకోండి.. అనవసరంగా నేనే కదిలించి... మిమ్మల్ని ఏడిపించినట్టయింది’’ అంటూ నొచ్చుకుంది. ‘‘అయ్యో మీరలా ఫీలవకండి... నేను మరిచిపోతే కదా.. నేనే సారీ అండీ’’ అంటూ చీర చెంగుతో కళ్లు తుడుచుకుంటూ తమాయించుకుంది అనుపమ. ‘‘మీ బాబుకు...’’ అంటూ ఆగిపోయింది అనుపమ. ఆ మాటకు నిద్రపోతున్న బాబు పక్కన కూర్చొని వాడి తల మీద చేయి వేసి నిమురుతూ చెప్పింది వాళ్లమ్మ మృదుల.. ‘‘మా అపార్ట్‌మెంట్‌లో ఫస్ట్ ఫ్లోర్ నుంచి దూకాడు’’ అని. ‘‘అయ్యయ్యో... అంటే వాడే దూకాడా? లేక ఎవరన్నా..’’ అని అనుపమ వాక్యం పూర్తిచేసేలోపే ‘‘వాడే దూకాడు’’ చెప్పింది మృదుల. ‘‘అదేంటమ్మా.. మీరెవరూ లేరా? అలాఎలా దూకాడు?’’ విస్మయంగా అనుపమ తల్లి.
‘‘నేనూ, మావారు ఇద్దరం జాబ్ హోల్డర్స్‌మే. పొద్దున వెళితే రాత్రికి రావడమే ఇంటికి. ఇంట్లో అత్తగారుంటారు వాడి ఆలనాపాలనా చూసుకుంటూ. పోగో చానల్, బ్యాట్‌మ్యాన్, స్పైడర్ మ్యాన్ అంటే పిచ్చి వాడికి. ఏం తినిపించాలన్నా ఆ చానల్స్ పెట్టాల్సిందే. ఆ చానల్, ఆ సీరియల్స్ ఇన్‌ఫ్లుయెన్స్ చాలా వాడి మీద. మెయిన్‌గా స్పైడర్ మ్యాన్ అంటే. అలాంటి డ్రెస్ కూడా కొనిపించుకున్నాడు. ఆ డ్రెస్ వేసుకొని ఇంట్లో మంచం మీద నుంచి, దీవాన్ మీద నుంచి దూకి స్పైడర్‌మ్యాన్‌ను ఇమిటేట్ చేస్తుంటే సంబరపడిపోయేవాళ్లం. అది వాడిని ఇంకోరకంగా డ్రైవ్ చేస్తుందని ఏ రోజూ అనుకోలేదు. మాకసలు ఆ థాటే రాలేదు. పసిగట్టలేదు కూడా. ఎప్పటిలాగే ఆ రోజు కూడా సాయంకాలం స్కూల్ నుంచి రాగానే స్పైడర్‌మ్యాన్ పెట్టుకొని స్నాక్స్ తిని ఫ్రెండ్ వాళ్లింటికి వెళ్లాడట ఆడుకోవడానికి. మా అపార్ట్‌మెంట్లో ఉన్న పిల్లలంతా కలిసి వీడిని రెచ్చగొట్టారో... వీడే తన అడ్వంచర్ చూపించాలనుకున్నాడో.. వాడి ఫ్రెండ్ వాళ్లింట్లో బాల్కనీలోంచి కిందికి దూకాడు’’ అని చెప్తుంటే మృదుల కళ్లు నిండాయి నీళ్లతో. అనుపమ లేచి ఆమె పక్కకు వెళ్లి మృదుల భుజమ్మీద చేయివేసింది అనునయంగా. ‘‘హూ... ’’ అని బాధగా నిట్టూరుస్తూ ఈ కాలం పిల్లలే అంత తల్లీ’’ అంటూ తన మనవరాలి గాయం గురించి చెప్పడం మొదలుపెట్టింది అనుపమ తల్లి సుజాత.
‘‘దీని ప్రమాదానికీ నేనే సాక్షినయ్యే పాపం చుట్టుకుంది తల్లీ’’ అంది మనవరాలిని చూపిస్తూ. అనుపమ మళ్లీ తన కూతురు దగ్గరకొచ్చి కూర్చుంది బెడ్ మీద. ‘‘మీకులాగే ఇదిగో నా కూతురూ, అల్లుడూ కూడా ఉద్యోగస్తులే. ఇదీ అంతే.. టీవీలేందే ముద్ద తినదు. చేసిన పాపం చెప్పుకుంటే పోతుందని.. ఇంట్లో ఎవరూ ఉండకపోయే సరికి పొద్దుపోక టీవీ సీరియల్స్ చూస్తుంటానమ్మా.. అలా టీవీ చూడ్డం నా మనవరాలికి నా వల్లే అలవాటైంది.నేనెన్ని సీరియల్స్ చూస్తానో అదీ అన్ని చూస్తుంది. ఆ యాక్టర్స్‌లా యాక్షన్ చేస్తుంటే మురిసి ముక్కలయ్యేదాన్ని. ఇదిగో వీళ్లు ఇంటికి రాగానే ఆనందంగా చెప్పేదాన్ని దాని చేష్టలన్నిటినీ. ఇలాగే మొన్న వారం కిందట... టీవీలో వస్తున్న సీరియల్ కొంత చూసి సంధ్యవేళ అయిందని హాల్లోనే ఉన్న దేవుడి మండపంలో దీపం వెలిగించి వంటింట్లోకి వెళ్లాను రాత్రికి వంటకు కూరలు తరుక్కుందామని. ఇంకేముంది టీవీలో చూపించినట్టు.. సోఫా మీది కవర్ తీసి దీపం దగ్గర అంటించి కిందపడేసి దాంట్లో డాన్స్ చేయసాగింది నా మనవరాలు. ఆ మంటల బాధకు తాళలేక కేకలేస్తుంటే అప్పుడు వచ్చి చూస్తే ఏముంది? మంటల్లో పిల్ల.. గుండె గుభేలుమంది. వెంటనే దుప్పట్లో చుట్టేసి మంటలార్పేసా.. ఇంకా నయం.. పాదాలు మాత్రమే కాలాయి.. లేకపోతే పిల్ల ఏమైపోయేదో...’’ అంటూ ఏడ్వసాగింది సుజాత. ‘‘అమ్మా.. ఊరుకో... చంటిది లేస్తుంది’’ తల్లిని హెచ్చరించింది అనుపమ. ‘‘ఏమన్నారు డాక్టర్లు?’’ అడిగింది మృదుల. ‘‘గాయం తగ్గాక ప్లాస్టిక్ సర్జరీ చేయాలన్నారు’’ చెప్పింది అనుపమ తలవంచుకొని.‘‘మావాడిదీ తృటిలో తప్పిన పెద్ద యాక్సిడెంటేనండీ... కాళ్లు ఫ్రాక్చరై గండం గట్టెక్కింది. లేక ఏ నడుమో.. స్పైనో దెబ్బతింటే జీవితాంతం వీల్ చైర్‌కే పరిమితమవ్వాల్సి వచ్చేది అన్నారు డాక్టర్లు ’’ తన వేదనా పంచుకుంది మృదుల. ఇద్దరూ ఒకరి చేతులు ఒకరు పట్టుకున్నారు.. తమ గుండెను దిటవు చేసుకోవడం కోసం!
కర్ణాటక, ముంబైలలో...
మొన్న నవంబర్ నెలలో కర్ణాటకలో ఓ ఏడేళ్ల పాప ‘‘నందిని’’ అనే సీరియల్ చూస్తూ అందులోని పాత్ర మంటల్లో దూకడం చూసి ఈ పాప కూడా కాగితాలను పేర్చి మంట పెట్టి అందులో దూకి చనిపోయింది. అలాగే రెండేళ్ల కిందట ముంబైలోనూ ఇలాంటి ఘటనే ఒకటి జరిగింది. స్పైడర్ మ్యాన్‌ను చూస్తూ ఓ తొమ్మిదేళ్ల కుర్రాడు తనను తాను స్పైడర్‌మ్యాన్‌లా ఊహించుకుంటూ రెండంతస్థుల మేడ మీద నుంచి దూకి ప్రాణాలు కోల్పోయాడు. అప్పట్లో ఈ వార్త సంచలనమైంది కూడా!
అదంతా డ్రామా అని చెప్పండి
ప్రస్తుత రోజుల్లో టీవీ మన కుటంబాల్లో భాగమైపోయింది. దాన్ని చూడకుండా పిల్లలను కట్టడిచేయడం దుస్సాధ్యం. దాని బదులు టీవీ ప్రోగ్రామ్స్, సీరియల్స్ అన్నీ కల్పనలే అని వివరించడం మేలు. ఏ టీవీ ప్రోగ్రామ్ అయినా, సీరియల్ అయినా టీవీల టీఆర్‌పీలు పెంచడానికే అన్న సత్యాన్ని పిల్లలకు తెలియజేయాలి. ప్రేక్షకాదరణ పెంచుకోవడం కోసం నిజ జీవితంలో సాధ్యంకాని స్టంట్స్, డ్రామా, చిటికెలో పరిష్కారాలు, అడ్డదారుల్లో విజయాలు పొందడం.. వంటివన్నీ చూపిస్తారని.. అవి రియల్ లైఫ్‌లో చేయలేమని గట్టిగా చెప్పాలి. వీలైనంతవరకు టీవీ పెట్టే సమయం, కట్టేసే సమయం అందరికీ ఒకేలా ఉండేలా చూడండి. అంటే పేరెంట్స్ ఆబ్‌సెన్స్‌లో పిల్లలు టీవీ చూసే ప్రాక్టీస్‌ను తగ్గించడమన్నమాట. అలాగే అర్థరాత్రి వరకు టీవీ చూసే అలవాటును ఇంట్లో అందరూ మానుకోవాలి. వారంరోజులు, వారాంతాల్లో కూడా. ఒకవేళ పెద్దవాళ్లు ఇంట్లో లేనప్పుడు పిల్లలు కాలక్షేపం కోసం టీవీ చూడాల్సివస్తే పిల్లలు చూడకూడని చానల్స్‌ను లాక్‌చేసి పెట్టడం మంచిది. అంతేకాదు ఇంట్లో ఒక పిల్లాడు లేదా పాప చదువుకుంటున్నప్పుడు ఇంకో పిల్లాడు లేదా పాప టీవీ చూడ్డాన్ని ప్రోత్సహించవద్దు. టీవీకి బదులు శారీరక శ్రమ ఉండే ఆటలు, ఇతర యాక్టివిటీస్‌ను ఎంకరేజ్ చేయడమే ఎల్లవేళలా శ్రేయస్కరం.
– మేకల కళ్యాణ్‌చక్రవర్తి, కన్సల్టెంట్ సైకియాట్రిస్ట్
ల్యూసిడ్ డయాగ్నస్టిక్స్, హైదరాబాద్
– శరాది
Comments
Please login to add a commentAdd a comment