
యూనీస్ గేసన్ / 1928–2018 – ఫస్ట్ జేమ్స్‌బాండ్ గర్ల్
ఆమె సాహసం అతడిని ముగ్ధుణ్ణి చేసింది. ఆమె వైపు ఆరాధనగా చూశాడు. ‘ఐ అడ్మైర్ యువర్ కరేజ్, మిస్..’ అంటూ ఆగాడు. ఆమె పేరేమిటో అతడికి తెలీదు. అందమైన అమ్మాయిని నేరుగా నీ పేరేమిటని ఎలా అడగ్గలడు? అందుకే .. మిస్.. అంటూ ఆగిపోయాడు. ‘‘ట్రెంచ్.. సిల్వియా ట్రెంచ్’’.. చెప్పిందా అమ్మాయి. చెప్పి ఊరుకోలేదు. ‘ఐ అడ్మైర్ యువర్ లక్, మిస్టర్.. ’ అంటూ ఆగిపోయింది. తనూ అతడి పేరు తెలుసుకోవాలి కదా. ‘బాండ్.. జేమ్స్‌బాండ్..’’ చెప్పాడతడు.‘ట్రెంచ్.. సిల్వియా ట్రెంచ్’ అని ఆమె తన పేరును ఎలాగైతే చెప్పిందో, సరిగ్గా అలాగే తన పేరును ‘బాండ్.. జేమ్స్‌బాంyŠ ’ అని చెప్పాడతను.\జేమ్స్‌బాండ్ ఫస్ట్ మూవీ ‘డాక్టర్ నో’ (1962) లోని సీన్ ఇది. అందులో జేమ్స్‌బాండ్.. సీ(షా)న్ కానరీ. సిల్వియా ట్రెంచ్.. యూనీస్ గేసన్. యూనీస్ గేసన్ (90) శుక్రవారం చనిపోయారు. ‘మా తొలి బాండ్ గర్ల్ యూనీస్ గేసన్ కన్నుమూశారని తెలిసి చాలా బాధపడ్డాం. ఆమె కుటుంబానికి మా ప్రగాఢ సంతాపాన్ని తెలియజేస్తున్నాం’ అని బాండ్ చిత్రాల నిర్మాతలు మైఖేల్ జి విల్సన్, ఆయన సోదరి బార్బారా బ్రొకోలి ట్విట్టర్‌లో యూనీస్ గేసన్‌కు నివాళులు అర్పించారు.
‘బాండ్.. జేమ్స్‌బాండ్’ అని ఆ ఒక్క చిత్రంలోనే చెప్పి ఆగిపోలేదు జేమ్‌బాండ్. తర్వాత వచ్చిన ఇరవై నాలుగు చిత్రాల్లోనూ బాండ్‌గా నటించినవాళ్లంతా ఆ మాటను అదే టోన్‌లో చెప్పారు. ఇప్పుడు మేకింగ్‌లో ఉన్న ఇరవై ఐదవ బాడ్ మూవీలో డేనియల్ క్రెయిగ్ కూడా అలాగే చెప్తాడు.‘బాండ్.. జేమ్స్‌బాండ్’ అని తన పేరును చెప్పడం.. జేమ్స్‌బాండ్ పాత్రకు ఒక సిగ్నేచర్ స్టెయిల్ అయింది. అలా అతడు చెప్పడానికి ఓ స్టెయిలిష్ ప్రేరణగా (సిల్వియా ట్రెంచ్ పాత్రలో) యూనీస్ గేసన్ నిలిచిపోయారు. ‘డాక్టర్ నో’ తర్వాత వచ్చిన ‘ఫ్రమ్ రష్యా విత్ లవ్’ చిత్రంలోనూ బాండ్ గర్ల్‌గా నటించారు యూనీస్. తొలి అధికారిక బాండ్ గర్ల్ యూనీస్! ఈ రెండు బాండ్ చిత్రాల్లో మాత్రమే ఆమె నటించారు. యూనీస్ బ్రిటిష్ నటి. 1948 నుంచి 1963 వరకు ఇరవై ఒక్క చిత్రాల్లో నటించారు. వీటిల్లో రెండే జేమ్స్‌బాండ్ చిత్రాలు. 1995లో వచ్చిన బాండ్ మూవీ ‘గోల్డెన్‌ఐ’లో యూనీస్ కూతురు కేట్ గేసన్ ఒక పాత్రలో కనిపిస్తారు.
Comments
Please login to add a commentAdd a comment