జేమ్స్‌బాండ్ అంటే ఎవరండీ?
‘ఇది రిస్క్ సుమీ’ అని భయపడకుండా దూసుకుపోయేవాడు.
పదిరూట్లు కనిపించినా... తనదైన సెపరేట్ రూట్ సృష్టించుకునేవాడు.
విజయాలెప్పుడూ తన వెంటపడేలా కనిపించేవాడు.
ఈ లక్షణాలు ఉన్న కరణ్‌ను జేమ్స్‌బాండ్ అని పిలుచుకోవచ్చు.
అయితే తన పేరునే ‘బ్రాండ్’ చేసుకున్న అతడిని కాస్త సరదాగా జేమ్స్‘బ్రాండ్’ అని పిలుచుకుంటే మరీ బాగుంటుంది...
ప్రపంచంలోని టాప్ ఫ్యాషన్ స్కూళ్ళ ముఖం ఎప్పుడూ చూడలేదు కరణ్ తొరాని. అయితేనేం...‘మోస్ట్ ప్రామిసింగ్ ఇండియన్ డిజైనర్’గా ప్రపంచ స్థాయిలో గుర్తింపు పొందాడు. తానే ఒక బ్రాండ్‌గా మారాడు.
కరణ్ తొరాని దిల్లీలోని పెరల్ అకాడమీలో ఫ్యాషన్ కోర్స్ చేస్తున్న సమయంలో తండ్రి ఆర్థిక సంక్షోభంలో కూరుకుపోయాడు. ఫ్యాషన్ డిగ్రీ చేతికి అందగానే ‘ఇలా చేయాలి’ ‘అలా చేయాలి’ అనుకున్న తన కలలకు బ్రేక్ పడింది. చదువు పూర్తయిన తరువాత ఇద్దరు డిజైనర్‌ల దగ్గర పనిచేశాడు.
మనసులో ఉన్న తన కల మాత్రం రోజూ పొద్దుటే హలో చెబుతూనే ఉంది. తన లక్ష్యాన్ని గుర్తు చేస్తూనే ఉంది. దీంతో ఫ్రీలాన్స్ ప్రాజెక్ట్‌లు చేయాలని నిర్ణయించుకున్నాడు. ‘రిస్క్–టేకర్’ అనే బిరుదును మరోసారి సార్థకం చేసుకున్నాడు.
ఫ్యాషన్ కోర్స్ చేయాలనుకున్నప్పుడు చాలామంది వెనక్కి లాగారు.
‘అది అందరికీ వర్కవుట్ కాదు’ అని నిరుత్సాహ పరిచారు.
‘ఎలాగైనా చేయాల్సిందే’ అని అకాడమీ మెట్లు ఎక్కినప్పుడు ‘రిస్క్–టేకర్’ అనే బిరుదు తగిలించారు.
ఫ్రీలాన్స్ ప్రాజెక్ట్ చేయడానికి బయటికి వచ్చినప్పుడు ‘కడుపులో చల్ల కదలకుండా డబ్బు వస్తుంటే ఇప్పుడు ఈ రిస్క్ ఎందుకు!’ అన్నారు.
‘చేయక తప్పదు’ అని మరోసారి అనుకున్నాడు కరణ్.
మొదట తన ఇన్‌స్టాగ్రామ్ ఎకౌంట్‌లో తాను డిజైన్ చేసిన గార్మెంట్స్ ఇమేజ్‌లను పోస్ట్ చేశాడు. అనూహ్యమైన స్పందన లభించింది. వారాల వ్యవధిలోనే అవి మల్టీ–బ్రాండ్ స్టోర్స్‌లలోకి వెళ్లాయి. హాట్‌కేకుల్లా అమ్ముడు అయ్యాయి.
దీంతో తనలోని ఆత్మవిశ్వాసానికి వెయ్యి ఏనుగుల బలం వచ్చింది.
బాలీవుడ్ అంటే తనకు వల్లమాలిన ఆసక్తి, అభిమానం. బాలీవుడ్‌లో స్టార్ ఫ్యాషన్ డిజైనర్‌గా పేరు తెచ్చుకోవడానికి కరణ్‌కు ఎంతో కాలం పట్టలేదు.
ఫ్యాషన్ ప్రపంచం ‘ఇతడొకడున్నాడు’ అని మన వైపు దృష్టి సారించడానికి, మనలో ‘మనదైన ప్రత్యేకత’ ఉండాలి. మరి కరణ్‌లోని ప్రత్యేకత గురించి చెప్పడానికి ముందు కాస్త
ఫ్లాష్‌బ్యాక్‌లోకి వెళితే...
దేశవిభజన సమయంలో కరణ్ పూర్వీకులు పాకిస్థాన్‌లోని సిం«ద్ నుంచి మనదేశానికి వలస వచ్చారు. చిన్నప్పటి నుంచి పూర్వీకుల కథలు వింటూ పెరిగాడు కరణ్.
కరణ్ బాల్యం ఎక్కువగా భోపాల్‌లోని అమ్మమ్మ ఇంట్లో గడిచింది.
అది ఇల్లు అనడం కంటే మ్యూజియం అంటే బెటర్.
ఎందుకంటే ఇంటినలుమూలలలో చిన్న చిన్న దారుశిల్పాలు కనిపించేవి. అమ్మమ్మ వాటిని అంగట్లో కొని తెచ్చేది. రకరకాల చీరలు కనిపించేవి. చందేరి చీర తనను ఎంతో ఇన్‌స్పైర్ చేసింది.
దిల్లీలోని లజ్‌పత్‌నగర్‌లో తండ్రికి ‘సింధి టెంట్‌హౌజ్’ ఉండేది. చిన్నప్పుడు తండ్రితో పాటు ఎన్నో వివాహవేడుకలకు వెళ్లేవాడు. ప్రతి పెళ్లివేడుకకు తనదైన గ్లామర్ గ్రామర్ ఉండేది. ఆ పాఠాలన్నీ తన మదిలో అలా నిలిచిపోయాయి. ఈ జ్ఙాపకాలన్నీ తన సృజనాత్మకతకు పదనుపెట్టాయి. విజువల్ స్టోరీ టెల్లింగ్‌ను తన విజయసూత్రంగా చేశాయి. కరణ్ డిజైన్‌లలో జ్ఞాపకాలు పలకరిస్తాయి. కథలు చెబుతాయి.
మరీ ఎక్కువగా మోడ్రన్‌గా ఉండకుండా, అలా అని తక్కువ కాకుండా గార్మెంట్స్ డిజైన్ చేస్తూ పాతజ్ఞాపకాల కొత్తలోకంలోకి తీసుకెళ్లడంలో చేయి తిరిగిన డిజైనర్ అనిపించుకున్నాడు కరణ్.
‘సైకిల్ ఆఫ్ ఫ్యాషన్’ అనే సూత్రాన్ని గట్టిగా నమ్మాడు. అలనాటి ఫ్యాషన్ ట్రెండ్స్‌ను కొత్త లుక్‌తో తీసుకువచ్చాడు.
ఇద్దరు ఉద్యోగులతో ఫ్రీలాన్స్ ప్రాజెక్ట్స్ మొదలు పెట్టాడు కరణ్. ఇప్పుడు రెండు వందల మంది ఉద్యోగులు అతడి దగ్గర పనిచేస్తున్నారు!
సక్సెస్ స్టోరీ: జేమ్స్‌బ్రాండ్
Published Fri, Jul 8 2022 12:31 AM | Last Updated on Fri, Jul 8 2022 1:01 AM
Advertisement
Advertisement
Comments
Please login to add a commentAdd a comment