మచ్చలను తుడిచేద్దాం...
బ్యూటిప్స్
ప్రతిరోజూ ఉదయం ముందుగా చన్నీటితో ముఖం కడిగి టొమాటో రసం, నిమ్మరసం మిశ్రమాన్ని ముఖానికి రాయాలి (ఒక బాటిల్‌లో తాజా టొమాటోరసం అంతే మోతాదులో నిమ్మరసం కలిపి ఆ మిశ్రమాన్ని ఫ్రిజ్‌లో భద్రపరిచి రోజూ వాడవచ్చు). ఈ మిశ్రమాన్ని కాటన్‌తో కాని వేళ్లతో కాని అప్లయ్ చేయాలి. పది నిమిషాలకు లేదా ఆరిన తర్వాత చన్నీటితోనే తుడిచేయాలి. ఇది నేచురల్ స్కిన్‌కి మంచి టోనర్. ఇది ముఖం మీది నల్లమచ్చలతో పాటు అవాంఛిత రోమాలను కూడా తొలగిస్తుంది.
మచ్చలను తొలగించడంలో చందనం చక్కగా పని చేస్తుంది. ఒక టేబుల్ స్పూన్ చందనం పొడిలో తగినంత పన్నీటిని కలిపి ముఖానికి రాయాలి. ఆరిన తర్వాత చన్నీటితో తడిపి వలయాకారంగా రుద్దుతూ కడగాలి. ముఖం మీద ఉన్న మచ్చలు పోవాలంటే నిమ్మకాయ బాగా పని చేస్తుంది. ప్యాక్‌ల కోసం టైం కేటాయించలేని వాళ్లు వంటలోకి పిండేసిన నిమ్మచెక్కను తిరగేసి ముఖానికి రుద్ది పది నిమిషాల తర్వాత చన్నీటితో కడిగితే చాలు. క్రమంగా మచ్చలు చర్మంలో కలిసిపోతాయి.
నిమ్మచెక్కను రసం పిండేసిన తర్వాత వెనక్కి తిప్పి చక్కెరలో అద్ది ముఖానికి సున్నితంగా మర్దన చేయాలి. ఇలా ప్రతిరోజూ చేస్తుంటే నల్లమచ్చలు, మొటిమలు అన్నీ పోయి ముఖం క్లియర్‌గా మారుతుంది. రెండు టీ స్పూన్ల పెసరపిండిలో చిటికెడు పసుపు కలిపి, రెండు చుక్కల నిమ్మరసం, ఒక స్పూను పెరుగు వేసి కలపాలి. ఈ మిశ్రమాన్ని ముఖానికి పట్టించి ఆరిన తర్వాత చన్నీటితో కడగాలి.