ఆకాశం నీలంగా ఉంటుందనీ, ఆకుపచ్చని ప్రకృతి అందంగా ఉంటుందనీ చూడగలిగినవారికి ఎవరూ చెప్పనక్కర్లేదు. కనుచూపు కరవైన వారికి అలా చెప్పడం మాత్రమే, కాదు వారి చేత ఆ అందాల్ని కాన్వాస్‌పై ఆవిష్కరింపజేయాలని తపిస్తున్నారు లలిత. మరోవైపు కేన్సర్ బాధిత చిన్నారుల కోసం ఒక చిన్నపాటి లైబ్రరీ ఏర్పాటుకు ప్రయత్నిస్తున్నారు. హైదరాబాద్‌లోని బంజారాహిల్స్‌లో ఉంటున్న లలితాదాస్... వృత్తిరీత్యా సైకాలజిస్ట్, యోగా థెరపిస్ట్, ఆర్టిస్ట్ కూడా. అయితే ప్రవృత్తి రీత్యా మాత్రం హ్యూమనిస్ట్. చేదు అనుభవాలు అందించిన చేవతో అవసరార్థులకు చేతనైనంత చేయూతను అందిస్తున్న ఈ ఇద్దరు బిడ్డల తల్లితో మాట్లాడిన ప్పుడు ఆమె పంచుకున్న ఆలోచనలు ఆమె మాటల్లోనే...
మనసునే చూసేదాన్ని...
‘‘మెదడుతో ఆలోచించి చేయాల్సిన పనులున్నట్టే మనసుతో ఆలోచించి చేయాల్సినవి కూడా ఉన్నాయని అనుభవపూర్వకంగా తెలుసుకున్నా. మాది తిరుపతి. అమ్మానాన్న ఇద్దరూ వైద్యవృత్తిలోనే. వైద్యుల దగ్గర రోగులు పొందే సాంత్వన చూస్తూ పెరిగాను కాబట్టి డాక్టర్నే కావాలనుకున్నా. శరీరం ఎంత ఆరోగ్యంగా ఉన్నా మనసు బాగోలేకపోతే అది వ్యక్తి మీద అత్యధిక ప్రభావం చూపుతుదని తర్వాత అర్థం చేసుకున్నాను. హైదరాబాద్ వచ్చేశాక ఫ్యామిలీ కౌన్సిలింగ్ కోర్సు చేశా. ప్రొఫెషన్‌గానే కాకుండా స్వచ్ఛందంగానూ పలువురికి కౌన్సిలింగ్ చేస్తున్నాను. అనాధాశ్రమాలు, ఎన్‌జిఒ హోమ్స్‌కు వెళ్తూ అక్కడివారికి అవసరమైన వస్తువులతో పాటు స్ఫూర్తినిచ్చే మాట సాయం చేస్తున్నాను.
కేన్సర్‌బాధిత చిన్నారులకు లైబ్రరీ...
పాజిటివ్ పాఠాలు నేర్చుకుంటూ, నేర్పుతూంటే జీవితానికి సరైన గమ్యం ఏర్పడుతుందనేది నా ఆలోచన. ప్రభుత్వ కేన్సర్ ఆసుపత్రిలో అత్యంత క్లిష్టమైన దశలో ఉండి చికిత్స పొందుతున్న చిన్నారుల పరిస్థితి ఏమిటంటే... ఇప్పుడెన్ని ట్యాబ్లెట్లు, తర్వాత ఇంజెక్షన్ ఎప్పుడు... ఇలా అదే ఆలోచనలో టైమ్ చూసుకుంటూ గడపడమే. వాళ్ల ధ్యాస మళ్లించి, వాళ్లకి కూడా కాస్తంత ఆహ్లాదకరమైన ఆలోచనలు ఇవ్వాలని వారికి పెయింటింగ్ నేర్పేదాన్ని. అదే క్రమంలో ఒకసారి రెండు పుస్తకాలు తీసుకెళ్లి ఇచ్చాను. ఆ తర్వాత వెళ్లినప్పుడు ఆ పుస్తకాలు చదవడం వల్ల వారిలో ఎన్నో సానుకూల ఆలోచనలు రావడం గమనించాను. అప్పుడనుకున్నా, వారి కోసం ఒక చిన్నపాటి లైబ్రరీ తయారు చేసి ఇవ్వాలని. ఇప్పటికి 50 కిపైగా పుస్తకాలు ఇచ్చాను. వంద దాటాక ఒక రాక్‌లో పెట్టి చిన్న లైబ్రరీగా మార్చి అక్కడే అమర్చాలనుకుంటున్నాను.
అంధులకోసం ఆర్ట్...
చిత్రకళ మనసుకు అద్భుతమైన సాంత్వన కలిగిస్తుందని స్వీయానుభవం. అందుకే నా కౌన్సిలింగ్‌లో ఆర్ట్ కూడా భాగమైంది. ప్రపంచంలోని అందాల్ని చూడలేమని బాధపడే అంధుల బాధ కొంతైనా పోగొట్టాలనిపించింది. దీని కోసం అంధుల హోమ్ నుంచి కొందరు చిన్నారులను వీలున్నప్పుడల్లా మా ఇంటికే తీసుకువచ్చి... వారి చేతికి కుంచెనిచ్చాను. విభిన్న మార్గాల ద్వారా వారి భావనలో ప్రకృతి రూపాలను ఆవిష్కరింపజేస్తూ, అవి లిఖించేందుకు మార్గదర్శనం చేశాను. ఇప్పుడు వారు స్వయంగా బొమ్మలు వేయగలుగుతున్నారు. వాటిని చూసిన వారి ప్రశంసలు ఆ పిల్లలకు బోలెడంత ఆత్మవిశ్వాసాన్ని అందిస్తున్నాయి’’.
అలా చెప్పుకుంటూ పోతున్న లలితాదాస్... వ్యక్తిగత జీవితంలో తాను ఎదుర్కున్న కొన్ని ఒడిదుడుకుల్ని వివరిస్తుంటే... ఓటమిని మించిన గురువూ, ఓర్పును మించిన గెలుపూ లేదనిపించింది. ఆమె తన కష్టాల నుంచి ఇతరుల కష్టాలను గుర్తించడం నేర్చుకున్నారు. తన నిస్సహాయత నుంచి ఇతరులకు సాయపడడం తెలుసుకున్నారు. ఆశలతో కాదు ఆశయంతో బతకాలని అంటున్నారు.
- ఎస్.సత్యబాబు
తరలిరాద తనే వసంతం... తనను చూడలేని జనాల కోసం..
Published Mon, Oct 21 2013 11:31 PM | Last Updated on Fri, Sep 1 2017 11:50 PM
Advertisement
Advertisement