
భక్తుల రొట్టెలకే సంతసించి వారు కోరిన కోర్కెలు బారాషహీద్ తీరుస్తారని నమ్మకం. విశ్వాసమే ప్రధానంగా భక్తులు కోరిన కోర్కెలు తీర్చే దర్గాగా బారాషహీద్ ఖ్యాతి గాంచింది. ఇచ్చి పుచ్చుకోవడంలో మానవత్వం, పరస్పర సహకారం ఉందనే తత్వాన్ని బోధిస్తూ రొట్టెల పండగ చేసుకుంటారు. ఇందుకు నెల్లూరులోని బారాషహీద్ దర్గా ఖ్యాతిగాంచింది. వందల ఏళ్ల నుంచి కొనసాగుతున్న ఈ ఆచారం నేటికీ కొనసాగుతూ లక్షలమంది భక్తులు దర్గాకు చేరుస్తోంది. పవిత్ర యుద్ధంలో అమరులైన బారాషహీద్ పవిత్రమైన స్వర్ణాల చెరువు ప్రాంతంలో సమాధి చెందారు. ఆ సమాధి నేడు బారాషహీద్ దర్గాగా మారి మత సామరస్యానికి ప్రతీకగా నిలిచింది. ఒకటవ తేదీన మొదలయిన రొట్టెల పండగ ఉత్సవాలు 5వ తేదీ వరకు కొనసాగనున్నాయి.
అప్పట్లో నెల్లూరు ప్రాంతం తమిళనాడు రాష్ట్రాన్ని పాలించిన ఆర్కాట్ నవాబుల పాలనలో ఉండేది. వందల ఏళ్ల క్రితం నెల్లూరుకు ఎటువంటి రాకపోకలు కూడా లేనివిధంగా పూర్తి అటవీప్రాంతంగా ఉండేది. సహజసిద్ధంగా ఏర్పడిన స్వర్ణాల చెరువు మాత్రమే ఉండేది. ఆర్కాట్ నవాబు సతీమణి అనారోగ్యంతో బాధపడుతోంది. ఈ క్రమంలో ఒకరోజు బారాషహీద్ ఆమెకు కలలో కనిపించి తాను స్వర్ణాల చెరువు వద్ద సమాధి అయ్యానని, తనకు అక్కడ దర్గా నిర్మించమని ఆదేశించారు. తనకొచ్చిన స్వప్నం గురించి ఆమె ఆర్కాట్ నవాబుకు చెప్పగా వెంటనే భారీ సైన్యంతో అటవీప్రాంతంలో ఉన్న స్వర్ణాలచెరువు వద్దకు ఆర్కాట్ నవాబు వచ్చి బారాషహీద్ కోరిన విధంగా సమాధి నిర్మాణ పనులు మొదలుపెట్టారు. అప్పట్లో దూరప్రాంతాలకు వచ్చే క్రమంలో రొట్టెలే ఆహారంగా ఎక్కువ వినియోగంలో ఉండేది. ఈ క్రమంలో నవాబు, అతని సతీమణి రొట్టెలు తిని స్వర్ణాల చెరువులో నిలబడి మిగిలిన రొట్టెలు తమతో వచ్చిన పరివారానికి పంచిపెట్టారు. ఆమె వెంటనే కోలుకోవడంతో షహీద్‌పై భక్తివిశ్వాసాలు పెరిగాయి. ఆ తర్వాత ఆర్కాట్ నవాబు షహీద్‌కు సమాధి నిర్మించి కొంత భూమిని దర్గాకు కేటాయించారు. ఇది సుమారు 266 ఏళ్ల క్రితం జరిగిన సంఘటన.
1751 నుంచి రొట్టెల పండగ...
ఏటా మొహరం కలసి వచ్చేలా బారాషహీద్ దర్గా ఉత్సవాలు జరుగుతుంటాయి. దాదాపు 266 ఏళ్ల నుంచి ఉత్సవాలు జరుగుతున్నాయి. 1751వ సంవత్సరం జూలై 14వ తేది (శుక్రవారం) న బారాషహీద్ మహిమ ప్రకటితమైంది. నానాటికీ భక్తులు పెరుగుతున్న క్రమంలో ఉత్సవాలను వైభవంగా నిర్వహిస్తున్నారు.
పులే బారాషహీద్‌కు కాపలా..
బారాషహీద్ దర్గా నిర్మితమయ్యాక బారాషహీద్ మహిమలు ఒక్కొక్కటిగా వెలుగులోకి వచ్చాయి. ప్రతిరోజూ ఉదయం పూట భక్తులు దర్గాను దర్శించుకొని వెళ్లేవారు. సాయంత్రం పూట దర్గాకు రక్షణగా పులి దర్గాలో సంచరించి రాత్రి అక్కడే నిద్రించి పొద్దునే వెళ్లేముందు దర్గా ప్రాంగణం మొత్తాన్ని తోకతో శుభ్రం చేసేది. దాదాపు 50 ఏళ్ల క్రితం వరకు కూడా ఇది కొనసాగింది. పులికోసం దర్గాలో బోను ఉంది.
ఐదు వరకు ఉత్సవాలు..
ఒకటవ తేదీన ప్రారంభమైన ఉత్సవాలు 5వ తేది వరకు కొనసాగనున్నాయి. కోరిన కోర్కెలతో దర్గాపక్కనే ఉన్న స్వర్ణాల చెరువులో దిగి రొట్టెలను భక్తులు ఇచ్చి పుచ్చుకుంటారు. వారి కోర్కెలు తీరాక మరుసటి సంవత్సరం మొక్కుబడులు తీర్చుకుంటారు. ఇలా రాష్ట్రం నుంచే కాకుండా సౌదీ అరేబియా, దుబాయ్ దేశాల్లో సిర్థపడిన ముస్లింలు, మహారాష్ట్ర, తమిళనాడు, కేరళ, కర్ణాటక, తెలంగాణా రాష్ట్రాల నుంచి భారీగా భక్తులు హాజరవుతారు. నిజానికి నేడు తహలీల్ ఫాతియా కార్యక్రమం నిర్వహించి ఉత్సవాలను ముగించాలి. అయితే భక్తుల రద్దీ అధికంగా ఉన్నందువల్ల 5వ తేదీన దర్గాలో ప్రత్యేక ప్రార్థనలు జరగనున్నాయి. ఉత్సవాల్లో గంధమహోత్సవం, మొక్కుబడి రొట్టెల కార్యక్రమం ముఖ్యమైనవి.
ఇలా చేరుకోవాలి
నెల్లూరు ఆర్టీసీ బస్టాండు నుంచి కిలోమీటరు, రైల్వేస్టేషన్ నుంచి 2 కి.మీ దూరంలో దర్గా ఉంది. నగరంలో బస్టాండు, రైల్వేస్టేషన్‌ల నుంచి ప్రత్యేక బస్సులతోపాటు నిరంతరం ఆటోలు ఉంటాయి. నెల్లూరు నుంచి 24 కి.మీ దూరంలో వెంకటాచలం మండలం కసుమూరు గ్రామంలో ప్రసిద్ధమైన మస్తాన్‌వలీ దర్గా ఉంది. నెల్లూరు నుంచి 59 కి.మీల దూరంలో ఎస్‌పేటలో ఖాజానాయబ్ రసూల్ దర్గా ఉంది. నెల్లూరు నుంచి సంగం మీదుగా ఏఏస్‌పేటకు చేరుకోవచ్చు.
– కాట్రపాటి కిషోర్, సాక్షి ప్రతినిధి, నెల్లూరు.
Comments
Please login to add a commentAdd a comment