ఆకాంక్షలే ఆలంబనగా రొట్టెల పండగ | Special Story About Nellore Bara Shaheed Dargah Bread Festival | Sakshi
Sakshi News home page

ఆకాంక్షలే ఆలంబనగా రొట్టెల పండగ

Published Thu, Jul 18 2024 1:34 AM | Last Updated on Thu, Jul 18 2024 1:34 AM

Special Story About Nellore Bara Shaheed Dargah Bread Festival

సంప్రదాయం

అక్కడకు తరలి వచ్చేవారివి చిన్న చిన్న కోరికలే. చదువు రావాలి, ఉద్యోగం రావాలి, వివాహం జరగాలి,  సంతానం కలగాలి అనే... జీవితంలో ఆకాంక్షలు ఉండాలి. ఆ ఆకాంక్షలు నెరవేరతాయనే ఆశ ఉండాలి. అలాంటి వారికి అభయమిచ్చే ఆధ్యాత్మిక వేడుకలు ఎన్నో. అలాంటి వాటిలో ఒకటి ‘రొట్టెల పండగ’ నెల్లూరులో జరిగే ఈ పండగలో స్త్రీలు విశేషంగా ΄ాల్గొంటారు. 
 

ప్రతి సంవత్సరం మొహరం పండగ వేళలో నెల్లూరు వీధులు ΄ోటెత్తుతాయి. దేశ విదేశాల నుంచి జనం నెల్లూరులోని బారా షహీద్‌ దర్గా దగ్గరకు చేరుకుంటారు. కులం, మతం, భాష, ్ర΄ాంతం... తేడా లేకుండా అక్కడి స్వర్ణాల చెరువులో మొక్కు మొక్కుకుంటారు. లేదా తీర్చుకుంటారు. మొక్కు తీరిన వారు రొట్టె పంచుతారు. మొక్కుకునే వారు ఆ రొట్టెను స్వీకరిస్తారు. తరాలుగా వస్తున్న ఈ సంప్రదాయం చెక్కు చెదరడం లేదు. ప్రతి సంవత్సరం ఐదు రోజుల ΄ాటు జరిగే ఈ వేడుక నిన్నటి నుంచి çఘనంగా జరుగుతోంది. ఇది ప్రధానంగా స్త్రీల పండగ.

ఎవరు ఈ బారా షహీద్‌?
మహమ్మద్‌ ప్రవక్త సందేశాన్ని ప్రపంచ వ్యాప్తం చేయడంలో భాగంగా టర్కీ నుంచి  సుమారు 300 ఏళ్ల క్రితం 12 మంది మతబోధకులు భారతదేశానికి వచ్చారు. ఆ సమయంలో కొడవలూరు మండలంలోని గండవరంలో తమిళనాడు వాల్జారాజులకు, బీజాపూర్‌ సుల్తాన్‌లకు మధ్య యుద్ధం జరిగింది. ఆ యుద్ధంలో ఈ 12 మంది వీరమరణం ΄÷ందారు. వీరి  తలలు గండవరంలో తెగిపడగా మొండాలను గుర్రాలు నెల్లూరులోని స్వర్ణాల చెరువు వద్దకు తీసుకు వచ్చాయి. ఈ 12 మంది నెల్లూరు ఖ్వాజీకి కలలో కనపడి తమను అక్కడే సమాధి చేయాలని కోరడంతో అక్కడే సమాధులు నిర్మించారు. 12ను ఉర్దూలో బారా, వీర మరణం ΄÷ందిన అమరులను షహీద్‌లుగా పిలుస్తారు. అందుకే ఈ దర్గాకు బారా షహీద్‌ అనే పేరొచ్చింది.
    
రొట్టెల  ఆనవాయితీ
తమిళనాడు నుంచి నెల్లూరు వరకు ఆర్కాట్‌ నవాబుల ఏలుబడిలో ఉన్నప్పుడు నవాబు భార్య జబ్బు పడితే ఆమెకు నయం అయ్యే మార్గం కోసం నవాబు ఎదురు చూస్తున్నాడు. అదే సమయంలో బారా షహీద్‌ దర్గా దగ్గర బట్టలు ఉతుకుతున్న రజకునికి ఆ రాత్రి బారా షహీద్‌లు కనబడి మా సమాధుల దగ్గరి మట్టి తీసుకుని నవాబు భార్య నుదుటికి రాస్తే నయం అవుతుందని చె΄్పారు. ఆ సంగతి రజకుడు ఊరి వారికి తెలుపగా వారు నవాబుకు తెలియచేశారు. మట్టి తెప్పించిన నవాబు దానిని తన భార్య నుదుటికి రాయగా 24 గంటల్లో ఆమెకు నయం అయ్యింది. దాంతో అతడు అంత దూరం నుంచి బారా షహీద్‌ దర్గాను చూడటానికి వచ్చాడు. దర్శనం అయ్యాక అక్కడ ఉన్న పేదలకు రొట్టెలు పంచాడు. మొక్కు తీరాక ఇలా రొట్టెలు పంచడం ఆనవాయితీ అయ్యింది. ఈ నెల 21 వరకు రొట్టెల పండగ జరుగుతుంది.

వివాహం రొట్టె.. సంతాన రొట్టె
నెల్లూరు బారా షహీద్‌ దర్గాలో మొక్కు రొట్టెతో ముడిపడి ఉంటుంది. ఇక్కడకు వచ్చే భక్తులు ఉద్యోగం, ప్రమోషన్, సౌభాగ్యం, సంతానం, విద్య, స్వగృహం,  వ్యా΄ారం... ఈ కోరికలు నెరవేరాలని మొక్కుకునేందుకు వస్తారు. గతంలో మొక్కిన మొక్కులు తీరిన వారు రొట్టెలతో వస్తారు. వారి నుంచి రొట్టె తీసుకోవాలి. అంటే గతంలో వివాహ మొక్కు మొక్కుకుని వివాహం జరిగిన వారు రొట్టెలతో వస్తారు. వివాహం కావలసిన వారు వారి దగ్గర నుంచి రొట్టె స్వీకరించి తినాలి. మొక్కు తీరాక వాళ్లు ఇలాగే రొట్టెను తెచ్చి ఇవ్వాలి. బారా షహీద్‌ దర్గా పక్కనే ఉన్న స్వర్ణాల చెరువులో మోకాళ్ల లోతుకు దిగి స్త్రీలు ఈ రొట్టెల బదలాయింపు చేసుకుంటారు. బాకీ తీరాలనే రొట్టె, స్థలం కొనాలనే రొట్టె, ర్యాంకుల రొట్టె... ఇవన్నీ అదృష్టాన్ని బట్టి దొరుకుతాయి. అన్నింటి కంటే ఎక్కువగా ఆరోగ్య రొట్టె కోసం వస్తారు. 
 

– కొండా సుబ్రహ్మణ్యం, 
సాక్షి, నెల్లూరు

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement