ప్రారంభమైన పండగ | Rottela Pandaga starts | Sakshi
Sakshi News home page

ప్రారంభమైన పండగ

Published Thu, Oct 13 2016 2:25 AM | Last Updated on Sat, Oct 20 2018 6:19 PM

ప్రారంభమైన పండగ - Sakshi

ప్రారంభమైన పండగ

 
  • తరలివస్తున్న భక్తులు
  • గంధమహోత్సవం నేడు
  • బాంబు పేలుడు నేపథ్యంలో అడుగడుగునా పోలీసు భద్రత
  • నేడు సీఎం, రేపు జగన్‌ రాక
 
సాక్షి ప్రతిని«ధి–నెల్లూరు :   బారాషహీద్‌ దర్గా ఆవరణలో బుధవారం రొట్టెల పండగ ప్రారంభమైంది. దేశంలోని వివిధ ప్రాంతాల నుంచి భక్తులు పెద్ద ఎత్తున తరలివస్తున్నారు.  బుధవారం నుంచి 16వ తేదీ వరకు జరిగే ఈ వేడుకకు 15 లక్షల మంది  హాజరవుతారని అంచనా వేసిన మున్సిపల్‌ కార్పొరేషన్‌ అధికారులు పారిశుధ్యం విషయంలో తొలిరోజే ఘోరంగా విఫలమయ్యారు. నెల్లూరు జిల్లా కోర్టు ఆవరణలో బాంబు పేలుడు నేపథ్యంలో వీఐపీలకు సైతం తనిఖీలు తప్పడం లేదు. వాహనాల పాసుల జారీ విషయంలో పోలీసులు, కార్పొరేషన్‌ అధికారుల మధ్య వివాదం రేగింది. రొట్టెల పండగలో పాల్గొనడానికి గురువారం సీఎం చంద్రబాబు నాయుడు, శుక్రవారం ప్రతిపక్ష నేత వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి నెల్లూరుకు వస్తున్నారు.
రొట్టెల పండుగను ప్రభుత్వం రాష్ట్ర పండ గగా ప్రకటించిన నేపథ్యంలో ఈ సారి భారీ ఎత్తున ఏర్పాట్లు చేయడానికి కార్పొరేషన్‌ రంగంలోకి దిగింది. రూ.కోటికి పైగా ఖర్చు పెట్టి భక్తుల కోసం మరుగుదొడ్లు, సేద తీరే భవనాలు, రొట్టెలు మార్చుకోవడానికి ఇబ్బంది లేకుండా అనేక ఏర్పాట్లు చేస్తామని ప్రకటించారు. నెల రోజుల ముందు నుంచి మంత్రి నారాయణ, మేయర్‌ అజీజ్‌ రొట్టెల పండుగ ఏర్పాట్లపై సమీక్షలు జరిపారు. ఐదు రోజుల్లో 15 లక్షల మంది వస్తారనే అంచనాతో పారిశుధ్యంపై ఎక్కువ దృష్టి పెట్టారు. ఇందుకోసం ఏడు జోన్లు ఏర్పాటు చేసి జోన్‌ ఇన్‌చార్జ్‌లతో పాటు ఇద్దరు  పర్యవేక్షణాధికారులు, 14 మంది మేస్త్రీలను నియమించారు. ఎక్కడా  చెత్త కనిపించకుండా చేయాలనే ఉద్దేశంతో 1000 మంది తాత్కాలిక పారిశుధ్య కార్మికులను రంగంలోకి దించారు. అయితే తొలిరోజు ఊహించినంత మంది జనం రాక పోయినా పారిశుద్ధ్యం విషయంలో మాత్రం కార్పొరేషన్‌ అధికారులు విఫలమయ్యారు. మరుగుదొడ్లు, ఇతర ఏర్పాట్లు బాగానే ఉన్నాయని అనిపించాయి. కృష్ణపట్నం పోర్టు, సీవీ ఆర్‌ ఫౌండేషన్‌ ఆధ్వర్యంలో భక్తులకు మజ్జిగ ప్యాకెట్లు  సరఫరా చేశారు. ఐదు రోజుల్లో లక్ష మందికి మజ్జిగ పంపిణీ చేస్తున్నట్లు పోర్టు వర్గాలు చెప్పాయి. కార్పొరేషన్‌ అధికారులు తాగునీరు, వైద్య సహాయ శిబిరాలు ఏర్పాటు చేశారు. మిగిలిపోయిన పనులు శుక్రవారం ఉదయానికి పూర్తి చేయడం కోసం పనులు జరిపిస్తూనే ఉన్నారు. మంత్రి నారాయణ, మేయర్‌ అజీజ్, కలెక్టర్‌ ముత్యాల రాజు ఏర్పాట్లను పర్యవేక్షించారు. భక్తులకు ఆహ్లాదం కలిగించడం కోసం పర్యాటక శాఖ బోటు షికారు ఏర్పాటు చేశారు.
1800 మందితో భద్రత
జిల్లా కోర్టు ఆవరణలో ఇటీవల బాంబు పేలుడు సంభవించిన నేపథ్యంలో  ఎస్‌పీ విశాల్‌ గున్ని నేతృత్వంలో పోలీసు శాఖ భారీ భద్రత ఏర్పాటు చేసింది. నగరంలోని ఆర్టీసీ బస్టాండ్, రైల్వే స్టేషన్‌తో పాటు లాడ్జిల మీద నిఘా ఉంచారు. డ్రోన్, సీసీ కెమెరాలతో నిఘా పర్యవేక్షిస్తున్నారు. వీఐపీల వాహనాలను సైతం తనిఖీ చేశాకే దర్గా ప్రాంతంలోకి అనుమతించాలని పోలీసు అధికారులకు ఆదేశాలు జారీ చేశారు.
నేడు సీఎం రాక
సీఎం చంద్రబాబు నాయుడు బుధవారం మధ్యాహ్నం 3–20 గంటలకు  హెలికాప్టర్‌లో నెల్లూరు పోలీసు పరేడ్‌ గ్రౌండ్స్‌కు చేరుకుని అక్కడి నుంచి దర్గాకు వెళతారు. సాయంత్రం 4–15 గంటల వరకు రొట్టెల పండగలో పాల్గొని,  4.20 నుంచి 5 గంటల వరకు ఉమేష్‌ చంద్ర సమావేశ మందిరంలో ప్రజాప్రతినిధులు, అధికారులతో సమావేశం నిర్వహిస్తారు. అనంతరం తిరుపతికి వెళతారు.
రేపు జగన్‌ రాక
శాసనసభలో ప్రతిపక్ష నాయకుడు, వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షుడు వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి శుక్రవారం రొట్టెల పండగలో పాల్గొంటారని రూరల్‌ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్‌రెడ్డి తెలిపారు. మధ్యాహ్నం 12 గంటలకు దర్గాకు చేరుకుని దర్శనం చేసుకున్నాక రొట్టెల పండుగలో పాల్గొని తిరుపతికి తిరుగు ప్రయాణం అవుతారని ఆయన చెప్పారు.
 
 
 

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement