మదినిండుగ.. వరాల పండుగ
-
గంధం ముగిసిన రోజు భారీగా తరలివచ్చిన భక్తులు
-
విద్యుత్ స్తంభం విరిగిపడి ఇద్దరికి స్వల్పగాయాలు
సాక్షి ప్రతినిధి – నెల్లూరు: రొట్టెల పండుగకు శుక్రవారం భక్త జనం పెద్ద ఎత్తున తరలివచ్చారు. గంధం ముగిసిన మరుసటి రోజు విశిష్టమైనదిగా భావించి ఇతర ప్రాంతాల నుంచి వచ్చే భక్తులతోపాటు స్థానికులు పెద్ద ఎత్తున దర్గాను దర్శించుకుని రొట్టెల పండుగలో పాల్గొన్నారు.
11 గంటల వరకు..
బారాషహీద్ దర్గాలో శుక్రవారం తెల్లవారు జామున జరిగిన గంధం కార్యక్రమానికి భారీ సంఖ్యలో భక్తులు తరలివచ్చారు. ఉదయం 11 గంటల వరకు ఈ రద్దీ కొనసాగింది. ఎండ కారణంగా సాయంత్రం 5 గంటల వరకు భక్తుల సంఖ్య తగ్గింది. 5 గంటల తర్వాత ఇతర ప్రాంతాల నుంచి వచ్చిన భక్తులతో పాటు స్థానికులు తరలి వచ్చారు. పండుగ ప్రారంభమైన తర్వాత శుక్రవారం సాయంత్రానికి పొదలకూరు రోడ్డు వైపు నుంచి, పోలీస్ పరేడ్ గ్రౌండ్స్ వైపు నుంచి నిండుగా జనం కనిపించారు. స్వచ్చంద సేవా సంస్థలు భక్తులకు మజ్జిగ, తాగునీరు, భోజనం ఉచితంగా అందించాయి. మంత్రి నారాయణ, మేయర్ అజీజ్, కలెక్టర్ ముత్యాలరాజు ఏర్పాట్లను పర్యవేక్షించారు. మంత్రి నారాయణ తిరుపతి ఎమ్మెల్యే సుగుణమ్మ, మేయర్ అజీజ్‌తో కలసి చెరువులో బోటు విహారం చేసి పర్యాటక శాఖ అందిస్తున్న సేవలను పరిశీలించారు. జనం పెద్దగా లేక పోవడంతో ఉదయం 11 గంటల నుంచి దర్గా ముఖద్వారంలో ఏర్పాటు చేసిన ఆర్చిల వరకు పాసులు లేక పోయినా పోలీసులు వాహనాలను అనుమతించారు. సాయంత్రం నుంచి రద్దీ పెరగడంతో పోలీసులు వాహనాల రాక పోకలను నియంత్రించారు. దర్గా దర్శనానికి వచ్చిన వీఐపీల సంఖ్య కూడా భారీగా పెరిగింది. ఇదిలా ఉంటే చెరువు ఘాట్ల వద్ద ఏర్పాటు చేసిన విద్యుత్ స్తంభం మధ్యాహ్నం సమయంలో కింద పడి ఇద్దరు భక్తులు స్వల్పంగా గాయపడ్డారు. సిబ్బంది వేగంగా స్పందించడంతో పెద్ద ప్రమాదం తప్పింది. కృష్ణపట్నం పోర్టు, సీవీఆర్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో ప్రత్యేక కౌంటర్ ఏర్పాటు చేసి 25 వేల మజ్జిగ ప్యాకెట్లు పంపిణీ చేశారు.
అప్పుడే ఊడిన ఘాట్ల టైల్స్
చెరువు ఒడ్డున శాశ్వతంగా ఉండే ఉద్దేశంతో నిర్మించి ఫ్లోరింగ్ టైల్స్ శుక్రవారం నాటికే అక్కడక్కడా ఊడిపోయి కనిపించాయి. పనులు వేగంగా చేయాల్సి వచ్చినందువల్ల ఈ పరిస్థితి ఏర్పడిందా? లేక పనుల్లో నాణ్యత లేకపోవడం కారణమా? అనేది అధికారులు పరిశీలించాల్సి వుంది.