పెసరే రామరసం | Sriramanavami special | Sakshi
Sakshi News home page

పెసరే రామరసం

Published Sat, Mar 24 2018 12:26 AM | Last Updated on Sat, Mar 24 2018 12:26 AM

Sriramanavami special - Sakshi

శ్రీరామనవమి వస్తే చలువ పందిళ్లు చల్లటి నీడనిస్తాయి.
మల్లెలు రాముని పాదాల చెంతకు చేరటానికి వికసిస్తాయి.
జగతి ఆ దివ్య జంట కల్యాణం కోసం సిద్ధమవుతుంది.
శుభ ఘడియలలో శుచితో నిండిన రుచికరమైన పదార్థాలు 
పండగ శోభను తెస్తాయి...
పెసర ప్రసాదం... పెసర చలువ చేసే పదార్థం...
రాముడి కోసం రామభక్తుల కోసం ఇవిగో నైవేద్యాలు...

పెసర పాయసం
కావలసినవి:  పెసర పప్పు – అర కప్పు; నీళ్లు – ఒక కప్పు + ఒకటిన్నర కప్పులు; పల్చటి కొబ్బరి పాలు – అర కప్పు; బెల్లం పొడి – ముప్పావు కప్పు; కొబ్బరి నూనె – 2 టేబుల్‌ స్పూన్లు; ఏలకుల పొడి∙– అర టీ స్పూను; జీడిపప్పు – 25 గ్రా; కిస్‌మిస్‌ – ఒక టేబుల్‌ స్పూను
తయారీ: కుకర్‌లో ఒకటిన్నర కప్పుల నీళ్లు పోయాలి ∙ ఒక గిన్నెలో పెసరపప్పు పోసి శుభ్రంగా కడిగి, ఒక కప్పు నీళ్లు జత చేసి ఉడికించి దింపేసి, చల్లారాక కొద్దిగా మెత్తగా అయ్యేలా మెదపాలి ∙ముప్పావు కప్పు బెల్లం పొడి జత చేసి స్టౌ మీద ఉంచి బాగా కలపాలి ∙ అర కప్పు కొబ్బరి పాలు జత చేసి మరో మారు బాగా కలపాలి ∙ చిన్న బాణలిలో కొబ్బరి నూనె వేసి కాగాక జీడిపప్పులు వేయించి తీసేయాలి ∙ అదే బాణలిలో కిస్‌మిస్‌ వేసి వేయించి తీసేయాలి ∙ ఉడికిన పెసరపప్పు పాయసంలో వేయించిన జీడిపప్పులు, కిస్‌మిస్, ఏలకుల పొడి వేసి బాగా కలిపి అందించాలి.

పెసర ఢోక్లా
కావలసినవి:  పెసర పప్పు – ఒక కప్పు; అల్లం + పచ్చి మిర్చి ముద్ద – టేబుల్‌ స్పూను; నీళ్లు – అర కప్పు; కొత్తిమీర – టేబుల్‌ స్పూను; నూనె – ఒక టేబుల్‌ స్పూను; నిమ్మరసం – ఒక టేబుల్‌ స్పూను; ఉప్పు – తగినంత; నిమ్మ ఉప్పు – టీ స్పూను. పోపు కోసం.. నూనె – 2 టేబుల్‌ స్పూన్లు; ఆవాలు – అర టీ స్పూను; జీలకర్ర – అర టీ స్పూను; ఇంగువ – చిటికెడు; వేయించిన నువ్వులు – టీ స్పూను; కరివేపాకు – రెండు రెమ్మలు గార్నిషింగ్‌ కోసం... కొత్తిమీర తరుగు – పావు కప్పు; పచ్చి కొబ్బరి తురుము – పావు కప్పు
తయారీ: ∙పెసరపప్పుకి తగినన్ని నీళ్లు జత చేసి రెండుమూడు సార్లు బాగా కడిగి, నాలుగు గంటల పాటు నాన»ñ ట్టి, నీళ్లు ఒంపేయాలి ∙కొత్తిమీర, అర కప్పు నీళ్లు జత చేసి, మిక్సీలో వేసి కొద్దిగా పలుకులా ఉండేలా మిక్సీ పట్టాలి. (మరీ ముద్దలా అవ్వకూడదు. మరీ పల్చగాను, మరీ గట్టిగానూ కూడా ఉండకూడదు) ∙ఒక పాత్రలో రెండున్నర కప్పుల నీళ్లు పోసి, మరిగించాలి ∙ఒక వెడల్పాటి పళ్లానికి కొద్దిగా నూనె పూసి పక్కన ఉంచాలి ∙ఒక పాత్రలో అల్లం + పచ్చిమిర్చి ముద్ద, నూనె, నిమ్మరసం, ఉప్పు వేసి బాగా కలిపి, తయారుచేసి ఉంచుకున్న పెసరపిండి మిశ్రమాన్ని జత చేయాలి ∙చివరగా నిమ్మ ఉప్పు జత చేసి బాగా కలిపి, నూనె రాసి ఉంచుకున్న పాత్రలో పోసి సమానంగా పరవాలి ∙స్టౌ మీద మరుగుతున్న నీళ్ల పాత్రలో ఈ పళ్లెం ఉంచి, మూత పెట్టి, సుమారు పావుగంట అయ్యాక దింపేయాలి ∙బాగా చల్లారాక బయటకు తీయాలి ∙చిన్న బాణలిలో నూనె వేసి కాగాక ఆవాలు, జీలకర్ర వేసి వేయించాలి ∙నువ్వులు జత చేసి మరోమారు కలియబెట్టాలి ∙ఇంగువ, కరివేపాకు వేసి వేయించి బాగా కలపాలి ∙రెండు టేబుల్‌ స్పూన్ల నీళ్లు జత చేసి పోపు మిశ్రమాన్ని బాగా కలపాలి. ∙ఈ మిశ్రమాన్ని తయారుచేసి ఉంచుకున్న ఢోక్లా మీద వేయాలి ∙కొత్తిమీర, కొబ్బరి తురుములతో అలంకరించి అందించాలి.

పెసరపప్పు తడ్‌కా
కావలసినవి: పెసర పప్పు – ముప్పావు కప్పు; ఉల్లి తరుగు – పావు కప్పు; టొమాటో తరుగు – పావు కప్పు; అల్లం తురుము – అర టీ స్పూను; మిరప కారం – పావు టీ స్పూను; పసుపు – పావు టీ స్పూను; నీళ్లు – మూడు కప్పులు; ఉప్పు – తగినంత; జీలకర్ర – ఒక టీ స్పూను; వెల్లుల్లి రెబ్బలు – 5; గరం మసాలా – అర టీ స్పూను; పచ్చి మిర్చి – 2 (నిలువుగా మధ్యకు చీల్చాలి); ఇంగువ – చిటికెడు; కొత్తిమీర – కొద్దిగా; నెయ్యి – 3 టేబుల్‌ స్పూన్లు
తయారీ: ∙ఒక పాత్రలో పెసర పప్పు, ఉల్లి తరుగు, టొమాటో తరుగు, మూడు కప్పుల నీళ్లు పోసి కుకర్‌లో ఉంచి మూడు విజిల్స్‌ వచ్చాక దింపేయాలి ∙విజిల్‌ తీసి, మిశ్రమం మరీ గట్టిగా ఉంటే, కొద్దిగా నీళ్లు, ఉప్పు జత చేసి పక్కన ఉంచాలి ∙చిన్న బాణలిలో నెయ్యి వేసి స్టౌ మీద ఉంచి, కరిగాక జీలకర్ర వేసి వేయించాలి ∙వెల్లుల్లి రెబ్బలు, పచ్చి మిర్చి, అల్లం తురుము, పసుపు జత చేసి, కొద్దిగా వేయించాలి ∙గరం మసాలా పొడి, మిరప కారం, ఇంగువ జత చేసి కలిపి వెంటనే పెసరపప్పు తడ్కాలో వేసి కలపాలి ∙కొత్తిమీరతో అలంకరించి అందించాలి.

పెసర బూరెలు
కావలసినవి:  పెసర పప్పు – ఒక కప్పు; బెల్లం పొడి – ఒక కప్పు; బియ్యం – అర కప్పు; మినప్పప్పు – ఒక కప్పు; నెయ్యి – 2 టీ స్పూన్లు; ఏలకుల పొడి – ఒక టీ స్పూను; ఉప్పు – చిటికెడు; ఎండు కొబ్బరి తురుము – అర కప్పు; నూనె – డీప్‌ ఫ్రైకి సరిపడా
తయారీ:  ∙ముందుగా ఒక పాత్రలో మినప్పప్పు,  బియ్యం, వేసి సుమారు నాలుగు గంటలు నానబెట్టి, నీరు ఒంపేసి, మిక్సీలో వేసి, ఉప్పు జతచేసి మెత్తగా దోసెల పిండి మాదిరిగా రుబ్బి పక్కన ఉంచాలి ∙పెసర పప్పుకి తగినన్ని నీళ్లు జత చేసి సుమారు గంటసేపు నానబెట్టి, నీళ్లు ఒంపేయాలి ∙బాణలిలో తగినన్ని నీళ్లు పోసి మరిగించాక, పెసరపప్పు జత చేసి ఉడికించాక రంధ్రాలున్న గిన్నెలో పోసి నీళ్లు పోయేవరకు సుమారు ఐదు నిమిషాలు పక్కన ఉంచి, చల్లారాక మిక్సీలో వేసి మెత్తగా చేసి పక్కన ఉంచాలి ∙స్టౌ మీద బాణలి ఉంచి వేడయ్యాక, బెల్లం పొడి, పావు కప్పు నీళ్లు పోసి తీగ పాకం వచ్చేవరకు కలుపుతుండాలి ∙కొద్దిగా నెయ్యి వేసి బాగా కలిపి, ఉడికించి ఉంచుకున్న పెసర పప్పు ముద్ద, యాలకుల పొడి, కొబ్బరి తురుము వేసి కలిపి, గడ్డ కట్టిన తరవాత దింపేయాలి ∙కొద్దిగా చల్లారాక ఉండలుగా చేసి పక్కన ఉంచాలి ∙బాణలిలో నూనె కాగాక, తయారుచేసి ఉంచుకున్న పెసర పూర్ణాలను మినప్పప్పు మిశ్రమంలో ముంచి బూరెల మాదిరిగా నూనెలో వేసి వేయించాలి ∙దోరగా వేగిన తరవాత పేపర్‌ న్యాప్‌కిన్‌ మీదకు తీసుకోవాలి ∙కొద్దిగా చల్లారాక మధ్యకు కట్‌ చేసి, కాచిన నెయ్యి వేసి అందించాలి. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement