పూలలో కన్నీరు | Life of flowers selling peoples | Sakshi
Sakshi News home page

పూలలో కన్నీరు

Published Thu, Mar 29 2018 1:08 AM | Last Updated on Thu, Mar 29 2018 1:08 AM

Life of flowers selling peoples - Sakshi

మూర పూలకు జానెడు పొట్టకు లంకె. నాలుగు రెక్కలకు నాలుగు వేళ్లకు ముడి. బుట్టనిండా సువాసనే. ఇంట్లో గంజి వాసన కూడా రాదు. పూలమ్మే వాళ్ల జీవితాలు రాళ్లు మోసే వారి కంటే ఘోరంగా ఉన్నాయి.

శ్రీరామనవమి పండుగ... ఇళ్లు, గుళ్లు కోలాహలంగా ఉన్నాయి. పూలదండలు వేళ్లాడుతున్నాయి. చుట్టిన దండలు బుట్టల్లో ఉన్నాయి. మరో పక్క విడిపూల గంపలు. గుళ్లో పూజారి మంత్రాలకంటే పూల బుట్టల దగ్గర బేరాలే గట్టిగా వినిపిస్తున్నాయి. ‘‘అవ్వా! రెండు మూరల బంతిపూల దండ ఇస్తావా’’ అన్నాడు వివేక్‌ ప్యాంట్‌ బ్యాక్‌ పాకెట్‌లో నుంచి పర్సు తీస్తూ. వెంకటమ్మ పూలు మూర కొలిచి వేలిని మెలిపెట్టి తుంచబోతూ ఆగి, ‘‘రెండు మూరలు చాలా నాయనా! దేవుడికా, వాకిలికా’’ అడిగింది. అప్పటికే వివేక్‌కీ అదే సందేహం... రెండు మూరల బారును చూస్తూ ద్వారబంధానికి సరిపోతుందా, అమ్మను ఎన్ని మూరలని అడగలేదే... అన్నట్లు చూస్తున్నాడు.

‘‘వాకిలికి వేయడానికే’’ అన్నాడు. ‘‘వాకిలికి మూడు మూరలు పడతాయి’’ అని వివేక్‌ ముఖంలోకి చూస్తూ ఆగింది. ‘‘అలాగే మూడు మూరలివ్వు... ఎంత’’ అడిగాడు వివేక్‌. ‘‘పాతిక... మూర’’ పాతిక పెద్దగా అంటూ... మూర చిన్నగా పలికింది. మూడు మూరలకూ కలిపి ఏకంగా డెబ్బై అయిదు అంటే పర్సులో డబ్బు పర్సులోనే పెట్టుకుని వెళ్లిపోతాడేమోనని బెరుకు. ‘‘డెబ్బై అయిదు రూపాయలా! బంతిపూలు’’ బంతిపూలు పదాన్ని నొక్కి పలికాడు వివేక్‌.

‘‘బంతిపువ్వయినా గులాప్పువ్వయినా నా తోటలో పూస్తుందా నాయనా? మార్కెట్‌లో కొనాలె, దండల్లి అమ్మాలె. అక్కడే కేజీ బంతిపూలు వంద రూపాయిలు పలుకుతున్నాయీరోజు. పండగ గిరాకీ అట్లుంది మరి’’ కన్విన్స్‌ చేసి కొనిపించాలనే ప్రయత్నం ఆమె మాటల్లో. ‘‘సరే ఇవ్వవ్వా’’ అన్నాడే కానీ వివేక్‌కి ‘అంత ధర పెట్టి తెచ్చావా, బేరమాడలేదా’ అని అమ్మ కోప్పడుతుందేమోనని భయంగానే ఉంది.

‘‘గులాబీలు ఇవ్వనా’’ వాకిలికి బంతిపూలు వేస్తే దేవుడికి గులాబీలు పెట్టవా? అన్నట్లుందా మాట. ‘‘పది రూపాయలకివ్వు’’ అన్నాడు తనతో తెచ్చిన పెద్ద షాపింగ్‌ బ్యాగ్‌ ఓపెన్‌ చేస్తూ. ‘‘ఈ రోజు పదిరూపాయలకి రావు నాయనా, ఇరవై రూపాయలు, రేపట్నుండి మార్కెట్‌ అగ్వవుంటది గప్పుడు పదిరూపాయలకిస్తా’’ అంటూ చిన్న పాలిథిన్‌ కవర్‌లో గులాబీలు వేసింది. పిల్లాడు గీచి బేరం చేయట్లేదులే అనుకుంటూ మరో గుప్పెడు గులాబీలను అదే కవర్‌లో కుక్కినట్లు పెట్టింది.

‘‘పూలతోనే బిల్డింగులు కట్టేట్లున్నారు’’  చిరాగ్గా అన్నది ఆ పక్కనే ఉన్న వసంత ఏ బుట్ట దగ్గర ఆగాలో తేల్చుకోలేక అటూ ఇటూ తిరుగుతూ. ‘‘ఈ ఒక్కరోజే వేలాదిరూపాయల వ్యాపారం చేస్తారు. రూపాయి కూడా తగ్గించరు. పండక్కి కొనక చస్తారా అని వాళ్ల ధీమా’’ మరింత విసుగ్గా బదులిచ్చింది మాలతి. వాకిలికి పూలదండ వేసి దేవుడి పటాలన్నింటికీ పూలు అలంకరించాలి, తలలోకి మల్లెలు కొనాలంటే రెండొందలైనా అయ్యేట్లుంది. నిన్న ఆఫీస్‌ నుంచొస్తూ తెమ్మంటే ఆయనకి పట్టనేలేదు. ఉడికిపోతోంది వసంత.

‘‘అంతేసి మాటెందుకు బిడ్డా! మాకు గిట్టేది మా కష్టమేనమ్మా. ఈ రోజు మార్కెట్‌లోనే మస్తు గిరాకుంటది. గిట్ల బేరం అడుగుతానికి కూడా ఉండదక్కడ. ఎన్ని కిలోల పూలు కావాలో చెప్పాలె, వాళ్లు చెప్పిన ధరకు తెచ్చుకోవాలె’’ నొచ్చుకుంది వెంకటమ్మ. తమ మాటలు ఆమెను నొప్పించాయని అర్థమైంది మాలతికి. వసంతను మాట్లాడవద్దని గిల్లుతూ ‘‘బంతిపూలు మూర ఇరవైకిస్తావా’’ అన్నది వెంకటమ్మ దృష్టి పూల వైపు మరలడానికి. వసంత మరొక పూల బుట్ట దగ్గరకు నడిచింది.

‘‘అత్తా! ఓ సారి బస్తీలో తిరిగొస్తా, అన్నం పెట్టుకు తిను.     పిల్లలొచ్చాక వాళ్లకీ పెట్టు’’ పూల బుట్ట సర్దుకుంటూ అన్నది సుజాత. వెంకటమ్మ గుడి దగ్గర అమ్మగా మిగిలిపోయిన పూలను ఇంటికి తెచ్చింది. ఆ పూలను మళ్లీ వేటికి వాటిని విడిగా సర్దుతోంది సుజాత. ‘‘సర్లేవే సుజాతా, మరీ పొద్దుపోయే దాకా ఉండొద్దు. ఎన్ని అమ్మితే అంతే అమ్మి తొందరగా ఇంటికొచ్చెయ్‌. బస్తీలో మూలలకెళ్లకు’’ వెంకటమ్మ మాటల్లో భయం. ఆ భయం సుజాతకూ అర్థమవుతోంది. ‘‘అలాగేలే’’ అని బుట్ట చంకన పెట్టుకుని కాలు బయటపెట్టింది. ఎలాగైనా మిగిలిన పూలను రాత్రికి అమ్మకపోతే రేపు కొనేవాళ్లుండరు. గులాబీల రెక్కలు రాలిపోతాయి. బంతిపూలు వాడి ముడుచుకుంటాయి. మూర పదికైనా సరే ఇచ్చేయాలి... అనుకుంటూ వీథిలో నడుస్తూంది.

‘‘అమ్మా! అన్నం తిన్నావా! పిల్లలు తిన్నారా? సుజాత కనిపించదే ఎటెళ్లింది’’ అంటూనే మంచం మీద వాలిపోయాడు యాదగిరి. ‘‘పిల్లలు, నేనూ తిన్నాం కొడకా, సుజాత మిగిలిన పూలు అమ్ముకొత్తానని బస్తీలకెళ్లింది. నువ్వు తిందువు రా మల్లా పొద్దుగాలే మార్కెట్‌కెళ్లాలె, నీకు నిద్దరుండట్లేదసలే’’ వెంకటమ్మ తల్లి మనసు పడుతున్న తపన. ‘‘సుజాతకు ఎన్ని అమ్ముడుపోతయ్యో ? ఎన్ని పూలు మిగిలి తెస్తదో? రేప్పొద్దున మార్కెట్‌కెళ్లడానికి ఎన్ని డబ్బులున్నాయమ్మా’’ అంటూ కళ్లు మూసుకున్నాడు.

ఇంట్లోకి సుజాత వస్తున్న ఆనవాలుగా పూలవాసన వచ్చింది. యాదగిరిని పూల వాసన తాకింది. అతడి ముక్కుపుటాలు పూల వాసనను గుర్తించడం మానేసి ఎన్నో ఏళ్లయింది. పూలు అందరికీ సువాసననిస్తాయి, పూలతో బతికే వాళ్లకు ఆ వాసనే తెలియదు. ‘‘అమ్మా! ఈ పూలు నేను పెట్టుకుంటా’’ సుజాత తెచ్చిన బుట్టలో నుంచి మల్లెపూల దండ తీసుకున్నది పదేళ్ల లావణ్య. ‘‘పెట్టుకో’’ అంటూ లోపలికెళ్లింది సుజాత. భర్తకు తనకు భోజనాలు వడ్డించుకోవడానికి. కూతురి జడలో పూలు చూస్తే ముచ్చటగానే ఉంది.

కానీ ఆ మూర కూడా అమ్ముడైతే పూలు కొన్న డబ్బయినా వచ్చేది. తల్లి ముఖం అభావంగా ఉందని తెలిసే వయసు కాదు లావణ్యది. జడ పొడవునా చుట్టుకున్న మల్లెల దండను జడతోపాటు ముందుకు వేసి బుగ్గకు రాసుకుంటూ సంతోషపడుతోంది. కూతురి సంతోషం చూస్తుంటే... యాదగిరికి నిండుగా విరిసిన పూలతోటను చూసినట్లుంది. ‘‘బిడ్డకు నాలాగ పూలమ్మేవాడు వద్దే సుజాతా, భార్యకు తల నిండా పూలు కొనిపెట్టగలిగినోడితో పెళ్లి చేస్తా’’ అంటూ భోజనానికి కూర్చున్నాడు. సుజాత భోజనం వడ్డిస్తూ యాదగిరి ముఖంలోకి చూసింది     ‘మా నాన్న కూడా ఇలాగే అనుకుని ఉంటాడు’ అనుకుందామె మనసులో.  

పది తిండికి... పది ఇంటికి!
మాది మహబూబ్‌ నగర్‌ జిల్లా కొల్లాపూర్‌. అక్కడ చారెడు పొలం ఉండేది. ఆ తిండి గింజలతో ఏడాదంతా వెళ్లబారేది కాదు. పొలం పనులు చేయడానికి నా మొగునికి ఒంట్లో బలం లేదు. దాంతో హైద్రాబాద్‌ సిటీకొస్తే తేలిక పనులు చేసుకుని బతకొచ్చనుకున్నాం. మేము సిటీకొచ్చేనాటికి కొడుకు, కూతురు చిన్నపిల్లలు. మేమొచ్చి నలభై ఏళ్లయింది. నా పెనిమిటి మార్కెట్‌ నుంచి పూలు తెస్తే నేను దండలు కట్టేదాన్ని. రోజూ పొద్దున్నే గుడిమల్కాపూర్‌ మార్కెట్‌కో, జాంబాగ్‌ మార్కెట్‌కో పోయి పూలు తెచ్చేటోడు. అప్పట్లో దినాలు బాగానే వెళ్లబారినాయి.

ఇప్పుడున్నన్ని ఇంగ్లిష్‌ పూలు అప్పట్లో లేవు. ఏ పండుగయినా, వేడుకైనా ఈ బంతిపూలు, చేమంతులు, మల్లెలే. ఇప్పుడు అరచెయ్యంత పూలు అక్కడెక్కడో సీమదేశాల్లో పూస్తాయట. మరీ డబ్బున్నోళ్లు ఆ పూలతోనే డెకరేషన్‌ చేస్తున్రు. మా పూలు పండగలప్పుడే కొంటున్రు. ఈ పూల మీదనే కొడుకుని పదో తరగతి వరకు చదివించినం. కూతురికి పెళ్లి చేసినం. బతుకైతే వెళ్లబారుతోంది. ఇంటద్దెలు కట్టుకుని, నలుగురూ తినాలంటే జరిగే పని కాదని తెలిసింది. ఊర్లో ఉన్న పొలం అమ్మి బోరబండలో 120 గజాల జాగా కొనుక్కున్నాం. అందులో గోడలు లేపి రేకులు దించింనం.

ఆ గోడలు లేపి రేకులు వేయడానికి పడిన పాట్లు చిన్నవి కాదు. పూలమ్మిన డబ్బుల్లో పది రూపాయలు ఇంటి కోసం పక్కన పెట్టి, పది రూపాయలు తినడానికి ఖర్చు చేసుకున్నం. కాస్త నిమ్మళించాం అనుకునేంతలో నా పెనిమిటి రాములుకి జబ్బు చేసింది. నాలుగేళ్లయింది క్యాన్సర్‌తో పోయాడు. ఇప్పుడు నా కొడుకు, కోడలు, నేను ముగ్గురం పూలతోనే బతుకుతున్న. రోజుకు మూడు వందలు మిగిలితే ఆ రోజు గుండె నిండినట్లవుతాది. – వెంకటమ్మ, పూలమ్మే మహిళ

– వాకా మంజులారెడ్డి

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement