స్మరణీయం.... రమణీయం
ఆత్మీయం
శ్రీరాముడు సకల గుణాభిరాముడు. మానవుడిగా పుట్టినా, మంచిలక్షణాలను, ధర్మప్రవర్తనను కలిగి ఉండటం వల్ల దేవుడిగా కొనియాడబడ్డాడు. మొదటి మంచి లక్షణంగా చెప్పుకోవాలంటే, పితృవాక్యపరిపాలకుడు. లేలేత వయసులో ఉన్నప్పుడే విశ్వామిత్రుడు వచ్చి, యాగరక్షణ కోసం తనను పంపమని తండ్రిని అడిగినప్పుడు లక్ష్మణునితో కలసి మౌనంగా విశ్వామిత్రుని వెంట నడిచాడు. సీతాస్వయంవరంలో శివధనుర్భంగం చేసి, సీతను గెలుచుకున్నప్పుడు కూడా తనంతట తాను ఆమెను పరిణయం చేసుకోలేదు. గురువు ద్వారా తలిదండ్రులకు సమాచారాన్ని తెలియజేసి, వారు వచ్చిన తర్వాతనే వివాహం చేసుకున్నాడు.
అయోధ్యానగరానికి రాజయ్యాకా, అంతకు ముందూ కూడా తాను దశరథ తనయుడనని తప్ప రాజునని ఏనాడూ చెప్పుకోలేదు. తండ్రి ఇచ్చిన మాటను నిలబెట్టడం కోసం మరికొద్దిసేపటిలో యువరాజుగా పట్టాభిషిక్తుడు కావలసిన వాడు కూడా వనవాసం చేసేందుకు సిద్ధపడ్డాడు. తన వనవాసానికి కారకురాలైన సవతి తల్లి కైకను పన్నెత్తి ఒక్కమాట అనలేదు. కన్నతల్లి కౌసల్యను ఎంతగా ప్రేమించాడో, సుమిత్రను, కైకను కూడా అంతగా ప్రేమించాడు. గౌరవించాడు. వనవాస సమయంలో తండ్రి మృతి చెందాడన్న వార్తను తెలుసుకుని ఎంతగానో దుఃఖించాడు. పెద్దకుమారుడిగా ఆయనకు తానే శ్రాద్ధకర్మలు నిర్వర్తించాడు. జటాయువు తండ్రికి స్నేహితుడని తెలుసుకుని, జటాయువుకు కూడా శాస్త్రోక్తంగా అంత్యక్రియలు నిర్వర్తించాడు. అంతేకాదు, మంచిశిష్యుడు, మంచి భర్త, మంచి స్నేహితుడు, మంచి సోదరుడు, స్ఫూర్తిప్రదాత. దేవుళ్లను పూజించడమే కాదు, వారిలోని మంచి లక్షణాలను కూడా అలవరచుకోవాలి. అనుసరించాలి. అప్పుడే ఆ భక్తికి అర్థం... పరమార్థం.