స్టాండప్ | "Stand on the bench ' | Sakshi
Sakshi News home page

స్టాండప్

Published Wed, Apr 20 2016 12:04 AM | Last Updated on Sun, Sep 3 2017 10:16 PM

స్టాండప్

స్టాండప్

స్కూల్లో పిల్లలు సరిగా చదువుకోకపోతే ‘స్టాండప్ ఆన్ ది బెంచ్’ అని పనిష్మెంట్ ఇస్తారు. జీవితంలో ఏదైనా సాధించాలంటే దానికోసం నిలబడాలంటారు.. అదేనండీ.. స్టాండప్ అంటారు. ఈ సమాజంలో ఎవరికైనా, ఎప్పుడైనా కష్టం వస్తే... వాళ్ల కోసం కూడా నిలబడాలని అంటారు. ఈ అమ్మాయిలిద్దరికీ అమ్మానాన్నలు విధించిన పనిష్మెంట్... స్టాండప్ ఆన్ ది బెంచ్. అంటే ఏకాకుల్ని చేసేశారు! అయితే ఈ అమ్మాయిలు.. ‘మాకు చదువు కావాలి’ అని రెవెన్యూ దర్బారులో ధైర్యంగా లేచి నిలబడి అడిగారు. ఈ కథనం చదివి మనలో ఎంత మంది... ఇలాంటి చిన్నారుల కోసం లేచి నిలబడతారో చూడాలి.

 

మహబూబ్‌నగర్ జిల్లా.. నవాబుపేట..  ఎప్పటిలాగే  ఆరోజూ రెవెన్యూ దర్బార్ జరుగుతోంది. ఆ మండల గ్రామాల్లోని చాలామంది ఆ దర్బారుకు హాజరయ్యారు. రకరకాల సమస్యల గురించి మొరపెట్టుకుంటున్నారు. వినతిపత్రాలను అందజేస్తున్నారు. ఇంతలో అక్కడ కూర్చున్న గుంపులోంచి ఇద్దరు అమ్మాయిలు లేచినిలబడ్డారు. ఒక అమ్మాయికి ఎనిమిదేళ్లు, ఇంకో అమ్మాయికి అయిదేళ్లుంటాయి. ‘సర్ .. మేమిద్దరం అక్కాచెల్లెళ్లం. నాన్నలేడు. మా అమ్మ మమ్మల్ని వదిలేసి వెళ్లిపోయింది. అనాథలం.  మేనత్త దగ్గరుంటున్నం. మాకు బాగా చదువుకోవాలనుంది. కాని మా మేనత్త దగ్గర పైసలు లేవు. మీరు బడిల చేర్పించి.. పుస్తకాలు కొనిస్తే.. మంచిగ చదువుకుంటం.. మమ్మల్ని చదివించండి సార్’ అంటూ తమ మనసులో మాటను విన్నవించుకున్నారు. ఆ మేరకు ఓ వినతిపత్రాన్నీ తహశిల్దార్‌కు అందచేశారు. ఆ మాటలు తహశిల్దార్‌నే కాదు దర్బారునంతటినీ కదిలించాయి. కంటనీరు పెట్టించాయి. ఆ పిల్లలకు చదువు చెప్పిస్తామంటూ కొంతమంది ముందుకొచ్చారు. అయితే వాళ్లు ఈ పిల్లలను తమ వెంట హైదరాబాద్ తీసుకెళ్లి చదివిస్తామంటున్నారు.  హైదరాబాద్ వెళ్లడానికి పిల్లలు భయపడ్తున్నారు. అందుకే వాళ్ల మేనత్తంటోంది.. ‘పదవ తరగతి వరకు నవాబుపేటలోనే చదివిస్తా.. అప్పటికి వాళ్లకు కొంచెం తెలివొస్తది. అప్పుడు వాళ్లకు నచ్చిన చోట చదువుకుంటరు’ అని. ‘మేం పేటలోనే చదువుకుంటం.. అమ్మను (మేనత్తను అమ్మా అని పిలుస్తారు) వదిలి ఎక్కడికీ వెళ్లం’  మేనత్త భుజాల చుట్టూ వేసిన ఆ చిట్టి చేతుల పట్టును మరింత బిగుతు చేస్తూ  అన్నారు పిల్లలు

 
పిల్లల భయానికి  కారణం వాళ్ల నేపథ్యం కావచ్చు!

వాళ్ల తండ్రి పేరు చింతికింది కుమార్. నవాబుపేట్ మండలం.. గురుకుంట సొంతూరు. ఈ ఊళ్లో కుమార్‌కు రెండు ఎకరాల పొలం ఉంది. ఓవైపు పొలం చూసుకుంటూనే ఇంకోవైపు హైదరాబాద్ దిల్‌సుఖ్‌నగర్‌లో వంటమాస్టర్‌గా పనిచేసేవాడు. గురుకుంటకే చెందిన అముర్తతో అతనికి పెళ్లయింది. పెళ్లయిన మొదట్లో ఆలుమగలిద్దరూ అన్యోన్యంగానే ఉండేవారు. యేడాదికే పెద్దమ్మాయి శృతి పుట్టింది. పట్టరాని సంతోషమైంది కుమార్‌కి. బిడ్డ అంటే ఎనలేని ప్రేమ తండ్రికి. ‘మమ్మీ’ అని పిలుచుకుంటూ ప్రాణం పెట్టేవాడు. శృతి పుట్టాక భార్య, బిడ్డను  ఊళ్లోనే ఉంచి... ఉద్యోగరీత్యా తాను మాత్రం హైదరాబాద్‌లో ఉండసాగాడు కుమార్. వారానికి రెండుసార్లు గురుకుంట వెళ్లేవాడు. ఇక్కడ ఊళ్లో అముర్త పొలం పనికి వెళ్లేది. సాఫీగానే కాలం సాగిపోతోంది. మూడేళ్లు గడిచాయి. చిన్న కూతురు అనిత పుట్టింది. ఆ పిల్ల పుట్టినప్పటి నుంచి హైదరాబాద్ వెళ్లడం మానేశాడు కుమార్. వ్యవసాయ పనులే చూసుకోవడం మొదలుపెట్టాడు. ఈ క్రమంలోనే భార్యాభర్తలిద్దరి మధ్య విభేదాలొచ్చాయి.

 
ఏమైందో ఏమో ఉన్నట్టుండి ఓరోజు పురుగుల మందుతాగి ఆత్మహత్య చేసుకున్నాడు కుమార్. అప్పుడు పెద్దపాపకు మూడేళ్లు.. చిన్నపాప మూడునెలల పసికందు. కుమార్ చనిపోయిన అయిదురోజులకే అముర్త ఆ పిల్లలిద్దరినీ తీసుకొని కుమార్ చిన్న అక్కయ్య ఉండే కొండాపూర్‌కు చేరుకుంది. ఆ ఊళ్లోని బడిలో ఈ పిల్లలిద్దర్నీ వదిలేసి వెళ్లిపోయింది. ఈ సమాచారాన్ని  ఆ బడిలోనే చదువుకుంటున్న కుమార్ సోదరి పిల్లలు తమ తల్లికి అందించారు. ఆమె హుటాహుటిన బడికి వచ్చింది. ఈ విషయం ఆ ఊరంతా వ్యాపించింది. ఊళ్లో వాళ్లంతా గుమిగూడారు అక్కడ.  ‘ఏ తల్లి అయినా పిల్లల్ని ఇలా వదిలేసి వెళ్లిపోతదా? పైగా ఇద్దరు ఆడపిల్లలు’ అంటూ తలోమాట మాట్లాడసాగారు. ఎవరేం మాట్లాడినా పిల్లల్ని ఎవరు పెంచాలన్నది ప్రశ్నగా మిగిలింది. ఆమె వెంటనే తన  అక్కయ్య పద్మమ్మకు కబురు పెట్టింది. పద్మమ్మ కొండాపూర్ వచ్చి పిల్లల్నిద్దరినీ తెచ్చేసుకుంది. తండ్రి చనిపోయేనాటికి శృతికి కాస్త ఊహ తెలుస్తోంది కాబట్టి.. తదనంతరం జరిగిన ఈ పరిణామాలను చూసి భయపడి మేనత్తను వదిలి హైదరాబాద్ వెళ్లడానికి పిల్లలిద్దరూ సుముఖంగా లేకపోవచ్చు.

 

కూలికి వెళితేనే కూటికొస్తుంది

పిల్లల్ని సాకుతున్న పద్మమ్మది కలిగిన కుటుంబమేమీ కాదు. ఆ మాటకొస్తే మగతోడులేని సంసారం ఆమెది.  భీమారం గ్రామానికి చెందిన వ్యక్తితో పెళ్లి అయ్యింది.  పిల్లలు లేరు. భర్త మరో స్త్రీతో సహజీవనం చేస్తుండేవాడు. ఉన్నట్టుండి చనిపోయాడు. అప్పటినుంచి పద్మమ్మ గురుకుంటలోనే ఉంటోంది. వితంతు పింఛన్, కూలీ తప్ప ఇంకో జీవనాధారం లేదు. రోజూ పనికి వెళితేనే కూటికి వస్తది. ‘పిల్లల్ని తెచ్చుకున్నప్పుడు చిన్న పిల్ల మూడునెలలది కదా.. పాలకోసం రాత్రంతా ఏడ్చేది. పెద్దదేమో.. వాళ్ల నాన్న ఫోటో చూసుకుంటా ఏడ్చేది. గోస అనిపించేది. వీళ్లను వదిలిపెట్టి పనికి పోయేటట్టు లేకుండే పరిస్థితి... పని చేయకపోతే వీళ్లను సాకలేను. చాలా యాతన పడ్డ. లాస్ట్‌కి మా అమ్మ దగ్గర పిల్లల్ని వదిలి పనికిపోయేదాన్ని. అయినా ధ్యాసంతా పిల్లల మీదనే ఉంటుండే’ అంటూ కంటనీరు పెట్టుకుంది పద్మమ్మ.

 

ఎల్‌ఐసీ డబ్బులూ.. ‘ఇద్దరి పిల్లల్ని బాగా చదివించాలే.. వాళ్లకు అండగా ఉండేలే’ అని కలలు కనేవాడట కుమార్. ముందు జాగ్రత్తతో జీవిత బీమా చేశాడు. అయితే కుమార్ చనిపోయాక వచ్చిన డబ్బులను నామినీగా ఉన్న అముర్తే తీసుకెళ్లిందని, కనీసం ఆ డబ్బులున్నా పిల్లల చదువుకు పనికివచ్చేవని బాధ పడుతుంది పద్మమ్మ. ‘వాళ్ల నాన్న ఉంటే అన్నీ చూసుకునేవాడు. నాకంత స్థోమత లేదు.. ఉన్నదాంట్లోనే ఏ లోటూ రాకుండా పిల్లల్ని చూసుకుంటా. కాలం బాగున్నప్పుడు చానా పనిదొరికేది. నాట్లు, కలుపు, వరికోతలకు పోయేదాన్ని. ఇప్పుడు కాలం లేదు..పనులు లేవు. ఫించన్, దొరికిన నాడు కూలీ తప్ప ఇంకేం లేదు’ అంటూ తన ఆర్థికస్థితిని వివరించింది ఆమె.

 ‘బాగా చదువుకొని  నాకు టీచర్ కావాలని ఉంది’ అని పెద్దమ్మాయి శృతి అంటే.. ‘నేను పోలీస్ అయితా’ అని  చిన్నపాప అనిత చెప్తుంది. ఈ చిన్నారుల చేయి పట్టుకొని  నడిపించేందుకు మార్గదర్శకులు మందుకు వస్తారని ఆశిద్దాం..   దత్తత తీసుకొని కొత్త జీవితాల్ని ప్రసాదించే వరప్రదాతలూ ఉంటారని కోరుకుందాం.   వీళ్ల చదువుకోసం ఆర్థిక సహాయం అందించాలనుకునేవారు పైన ఇచ్చిన అకౌంట్‌నెంబర్‌కి పంపగలరు  - కొడిగంటి వీరేశం, నవాబుపేట, మహబూబ్‌నగర్



బ్యాంక్ అకౌంట్‌నంబర్
చింతికింది పద్మమ్మ,  అకౌంట్‌నంబర్ : 62451543770
స్టేట్ బ్యాంక్ ఆఫ్ హైదరాబాద్, నవాబుపేట, మహబూబ్‌నగర్ జిల్లా

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement