పెళ్లి కాని పెళ్లి... | sakshi special story to Un-Married Marriage | Sakshi
Sakshi News home page

పెళ్లి కాని పెళ్లి...

Published Tue, Oct 4 2016 10:53 PM | Last Updated on Mon, Oct 8 2018 8:34 PM

పెళ్లి కాని పెళ్లి... - Sakshi

పెళ్లి కాని పెళ్లి...

అన్‌మ్యారీడ్ మ్యారేజ్
పెళ్లి కాని పెళ్లిలో సుఖాలెన్ని? కష్టాలెన్ని?
తంతుకి తాళం వెయ్యక్కర్లేదు.
తాళి అడ్డం రాదు.
మెట్టెలు ఇబ్బంది పెట్టవు.
అదేంటో... ఒక రకమైన ఫ్రీడమ్!
పెళ్లికాకపోయినా పెళ్లయిన ఫీలింగ్!
పెళ్లయినా పెళ్లికాని థ్రిల్లింగ్.
కానీ మొగుడు కాని ఆ మొగుడు తోక లేపితే?
గుర్రుమంటే? కరుస్తానంటే?
క్యా కర్‌నా? ఏం చేయాలి?
డోన్ట్ వర్రీ.
‘సుప్రీం’ మొట్టికాయలు వెయ్యొచ్చు.
సహజీవనం కూడా పెళ్లిలాంటి పెళ్లే.


‘ఇప్పుడేడిస్తే ఏమొస్తదే? పాతభావాలు, చాదస్తపు పద్ధతులంటూ మమ్మల్ని తన్ని వెళ్లిపోయావ్? అరే.. మీనాన్న ఎంత బతిమాలాడు.. నువ్వు ఇష్టపడ్డ అబ్బాయిని మా ఇంటి అల్లుడుగా ఒప్పుకుంటున్నాం తల్లీ.. కాని ఇలా వద్దు.. పెళ్లితో ఒకింటి వారవండి అని! విన్నావా? మీ అన్నయ్య ఎంత నచ్చజెప్పాడు.. అర్భాటంగా నచ్చకపోతే గుడిలో అయినా పెళ్లి చేస్తాం.. పోనీ రిజిష్టర్ మ్యారేజ్ అయినా  అని! చస్ పొండి.. గుడి.. దండలు మార్చుకోవడం ఇదంతా పెళ్లే కదా.. అసలు మాకు ఆ తంతే వద్దు పొమ్మంటుంటే...’

‘అవును అన్నాను.. నా నెత్తిమీద జేజమ్మ కూర్చుందప్పుడు.. తప్పయింది.. క్షమించండి.. బుద్ధి వచ్చింది.. మీ కాళ్లు పట్టుకోనా’... మేనత్త మాటలను మధ్యలోనే తుంచేస్తూ ఆవేశంగా తన ఆవేదనను వెళ్లగక్కింది వారిజ. వారిజ వేదన అర్థమైంది ఆమె మేనత్తకు. రెండు మోకాళ్ల మధ్య తల దాచుకొని పొట్టలో దాగిన దుఃఖాన్ని వెళ్లగక్కుతున్న వారిజ పక్కన కూర్చుంది మేనత్త. ఆ పిల్ల తలమీద చేయివేసి చిన్నగా నిమురుతూ... ‘వారిజా.. పుట్టెడు కష్టంతో నా గడపలోకి అడుగుపెట్టావనే చిన్నచూపుతో అనలేదే. అప్పుడు మా మాట వినుంటే మా బంగారానికి ఈ రోజు ఈ అవమానం జరిగేది కాదు కదా అనే బాధతో అన్నాను’ అంది. అంతే ఆ సాంత్వనకు అత్తను అల్లుకుపోయింది వారిజ.

‘ఊరుకో.. ఏడిస్తే జరిగిన అవమానం సన్మానంగా మారదు.. ప్రాబ్లం సాల్వ్ కాదు. ఇప్పుడేం చేయాలో ఆలోచిద్దాం.. మీ అన్నయ్యకు చెప్పమంటావా?’ అనునయంగా కోడలి వీపును తడుముతూ అన్నది వారిజ మేనత్త. ‘లేదత్తా.. మీ మాటలను ఖాతరు చేయకుండా చేసిన తప్పును నేనే కరెక్ట్ చేసుకుంటా.. అన్నయ్యకేం చెప్పకు. ఒక్క హెల్ప్ చేయి చాలు’ అని. ‘ఏంటే..’ అంతే అనునయం ఆమె మేనత్త మాటల్లో.‘నా ప్రాబ్లం సాల్వ్ అయ్యేవరకు నాకు, నా కూతురికి మీ ఇంట్లో షెల్టర్ ఇవ్వు చాలు అత్తా’ అంటూ రెండు చేతులు జోడించింది వారిజ. ఆమె చేతులను పట్టుకుంటూ ‘అవేం మాటలే? నేను మీ అమ్మలాంటిదాన్ని కానా? షెల్టర్ ఇవ్వమని అడగడమేంటి? నీ హక్కు. నీ ఇష్టమొచ్చినన్నాళ్లు ఉండొచ్చు.. అసలు ఎప్పుడూ ఉండిపో ఎవరొద్దాన్నారే!’ అంటే కళ్లనీళ్లతో అక్కున చేర్చుకుంది వారిజను.

అసలేం జరిగింది?

అనాథ పిల్లలు, వృద్ధుల కోసం నడుపుతున్న ఓ ఎన్‌జీవోలో పనిచేస్తోంది వారిజ. అదే ఎన్‌జీవోలో పనిచేసే సురేష్‌తో ఉన్న పరిచయం ప్రేమగా మారింది. తర్వాత ఏంటి అనే ప్రస్తావన వచ్చింది వాళ్ల మధ్య ఒకరోజు.. ‘వారిజా.. నాకు ఈ పెళ్లి వ్యవస్థ మీద నమ్మకం లేదు. రోజూ గొడవ పడుతూ, ఒకరి మీద ఒకరు కారాలు మీరియాలు నూరుకుంటూ వందేళ్ల శత్రువులుగా ఒకే రూఫ్ కింద ఉండడం ఎంత నరకం చెప్పు? అసలు అదేం లైఫ్?’ అన్నాడు. ‘నిజమే.. కాని పెళ్లి ఓ స్ట్రాంగ్ ఇన్‌స్టిట్యూషన్‌లా మారిపోయింది. ఇప్పుడు నువ్వు, నేను వ్యతిరేకిస్తే మారిపోదు కదా’ అంది వారిజ. ‘వ్యతిరేకించొద్దు. అలాగని రెస్పెక్ట్ చేయాల్సిన అవసరం కూడా లేదుకదా’ అన్నాడు. ‘అంటే? అర్థంకానట్టు అడిగింది. వారిజకు దగ్గరగా వస్తూ ఆమె రెండు చేతులను తన చేతుల్లోకి తీసుకుంటూ  ‘మనమిద్దరం ఆ మ్యారేజ్ అనే ఇన్‌స్టిట్యూషన్‌లో ఇరుక్కోకుండా లివ్ ఇన్ రిలేషన్‌షిప్‌లో కలకాలం కలిసి ఉందాం’ అన్నాడు.

ఆ కాన్సెప్ట్ వారిజకూ నచ్చింది. ఇంట్లో వాళ్లకు చెప్పింది. సురేష్ అంటే వారిజకున్న ప్రేమపట్ల ఆమె ఇంట్లో వాళ్లెవరికీ అభ్యంతరం లేదు. ఎటొచ్చి సురేష్ చెప్పిన ఆ లివ్ ఇన్ రిలేషన్‌షిప్ థాట్ పట్లే తీవ్ర అభ్యంతరం వ్యక్తమైంది. ‘అసలు ఈ పిల్ల ఆ పిల్లాడి మాయలో పడి.. తన భవిష్యత్ గురించి పట్టించుకోవట్లేదు. ఏ భరోసాలేని ఆ బంధాన్ని ఎలా యాక్సెప్ట్ చేస్తోంది? ఇరువైపు  పెద్దలు, మంత్రాలు, మంగళ సూత్రాధారణ, వందలమంది అతిథుల సమక్షంలో జరిగే పెళ్లంటేనే విలువ లేనివాడు కేవలం నోటి మాటే నమ్మకంగా సాగే కాపురాన్ని మాత్రం ఎలా గౌరవిస్తాడు అనే ఆలోచనలేదేంటి నాన్నా చెల్లికి’ అంటూ వారిజ అన్నయ్య వాపోయాడు. వారిజ తల్లి తల్లడిల్లింది. తండ్రి అయితే చెప్పి చెప్పి విసిగి పోయాడు. మేనత్తా ససేమీరా అంది. ‘మీరంతా ఇంకా పాత చింతకాయ పులుపునే ఆస్వాదిస్తున్నారు’ అంటూ కొత్త దారి వైపు పరుగుతీసింది వారిజ సురేష్ చేయి పట్టుకొని!

పాప పుట్టేదాకా...

కొత్తలో చాలా బాగా ఉంది. అరమరికల్లేకుండా ఉంటూనే ఎవరి స్పేస్ వాళ్లు తీసుకుంటూ కాపురం చేయడం... భలే అనిపించింది వారిజకు. వాళ్ల నాన్న దగ్గర అమ్మకు దక్కని గౌరవం సురేష్ దగ్గర తనకు దక్కుతున్న ఫీలింగ్.. గర్వంగా ఉండింది. కాలం గడుస్తోంది. పాప పుట్టింది. మెల్లగా అభద్రత మొదలవసాగింది వారిజకు. కారణం.. సురేష్‌లో వచ్చిన మార్పే. ఇంటిని, ఇల్లాలిని, పాపనూ పట్టించుకోవడం మానేశాడు. ఎన్‌జీవోలో ఉద్యోగం వదిలి ఏదో కార్పోరెట్ కంపెనీలో చేరాడు. జీతం బాగానే వస్తోందని తెలిసింది వారిజకు.. కాని ఎంతో భర్త చెప్పలేదు. ఆయన జీవన శైలీ మారింది. ఫ్రెండ్స్, లేట్ నైట్ పార్టీలంటూ తప్పతాగి తెల్లవారు జామున ఎప్పుడో ఇంటికి చేరేవాడు. కారు కొన్నాడు. ఈఎమ్‌ఐలు.. ఇతర లోన్లూ ఎక్కువయ్యాయి. దేనికీ లెక్క చెప్పట్లేదు. ఇంటి బాధ్యత అంతా వారిజ నెత్తిన పడింది. ఓపిక పట్టినన్నాళ్లూ పట్టి ఒకరోజు నిలదీసింది.

‘నీకు చెప్పాల్సిన అవసరం లేదు’  అన్నాడు సురేష్. ఇంకా గట్టిగా మాట్లాడితే.. ‘అసలు నువ్వెవరు? నేనెందుకు నీ ఇంటి బాధ్యత మోయాలి?’ అని ఎదురు ప్రశ్నించాడు. ‘నేను నీ భార్యను’ అంది ఆవేశంగా వారిజ. ‘అని ఎక్కడుంది? సాక్ష్యమేంటి?’ అన్నాడు నింపాదిగా. ఖంగు తిన్నది. ‘అవును.. మన పెళ్లయినట్టు.. నువ్వు నా భార్య అన్నట్టు, ఇది నా బిడ్డే అన్నట్టు  ఏమైనా ప్రూఫ్స్ ఉంటే తీసుకురా.. ఒప్పుకుంటా.. అంతేకాని ఇట్లా పెళ్లాంలా పెత్తనం చేయకు.. నా జోలికి రాకు’ అంటూ ఇంట్లోంచి వెళ్లిపోయాడు. చంటిదాన్ని దగ్గర తీసుకొని ఏడ్వడం తప్ప ఏమీ చేయలేకపోయింది వారిజ. సురేష్ స్నేహితుడి ద్వారా అతని అడ్రస్ కనుక్కొని వెళ్లింది. అక్కడా ఇదే అవమానం. తనకు వచ్చే జీతంతో ఇంటి అద్దె, పాప పెంపకం.. ఖర్చులు.. భరించలేకపోయింది. ఎటూ దిక్కుతోచని స్థితిలో మేనత్త ఇంటికి చేరింది.

న్యాయం కోసం...

మేనత్తను తీసుకొని అడ్వకేట్‌ను కలిసింది వారిజ. ఆమె కథంతా విన్న అడ్వకేట్ ముందుగా డొమెస్టిక్ వయొలెన్స్ కేస్ వేయించింది. దాని ద్వారా వారిజ  రెసిడెన్షియల్ ఆర్డర్స్, మెయిన్‌టెనెన్స్ సాధించుకుంది. కోర్టులో కూడా సురేష్ వారిజ తన భార్యకాదని, పాప తన లెజిటిమేట్ చైల్డ్ కాదని సిగ్గు లేకుండా వాదించాడు. అయితే వారిజ గతే ఏడేళ్లుగా భార్యభర్తలుగా ఒకే రూఫ్ కింద కలిసి జీవిస్తున్నామని, ఆ బిడ్డ తమ బిడ్డే అని సాక్ష్యాధారాలను కోర్టు ముందుంచడంతో తోక ముడిచాడు సురేష్. 
- సరస్వతి రమ


సహజీవనంలో భార్యకు ఇలాంటి పరిస్థితి ఎదురైతే?

సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం వివాహిత మహిళకు ఎలాంటి హక్కులుంటాయో సహజీవన బంధంలోని మహిళకూ అలాంటి హక్కులే ఉంటాయి. మోసపోయినా, హింసకు గురైనా కోర్టును ఆశ్రయించవచ్చు. పోషణ భృతి పొందవచ్చు. వారి పిల్లలకు ఆస్తి హక్కులూ సంక్రమిస్తాయి. సహజీవనంలో పురుషుడు మధ్యలో వదిలేసి వెళితే మహిళా భాగస్వామికి చట్టబద్ధంగా ప్రశ్నించే, నిలదీసే అధికారం ఉంటుంది. పెళ్లి చేసుకోకుండా కలిసి జీవించినా అది పెళ్లే అవుతుంది. కొందరు సహజీవన బంధాన్ని తప్పుగా అర్థం చేసుకుంటున్నారు.  అసలు సహజీవనం అని దేన్నంటారు? ఇద్దరూ మేజర్లై ఉండాలి, అవివాహితులై ఉండాలి, విడాకులు పొందిన వారైనా, వితంతువులైనా అయి ఉండాలి, కొన్ని యేళ్లు నిరంతరాయంగా కలిసి జీవించాలి. అంతేకాని భార్య ఉండగా మరో స్త్రీతో, భర్త ఉండగా మరో పురుషుడుతో సంబంధం ఏర్పర్చుకుంటే అది సహజీవనం కాదు. మొన్నటి వరకు వివాహిత మహిళలకే మెడికల్ టర్మినేషన్ ఆఫ్ ప్రెగ్నెన్సీ (ఎమ్‌టీపీ) యాక్ట్ ప్రకారం అబార్షన్ చేయించుకునే వెసులుబాటు ఉండేది. ఇటీవలకాలంలో సహజీవనంలోని మహిళలకూ ఆ వెసులుబాటు కల్పించేలా చట్టాన్ని సవరించారు.

ఇ. పార్వతి, అడ్వొకేట్ అండ్ ఫ్యామిలీ కౌన్సెలర్
parvathiadvocate2015@gmail.com

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement