ఏ పబ్లిసిటీ అయినా మంచి పబ్లిసిటీనే!
స్టంట్
ప్రేక్షకులు సినిమా చూశాక వచ్చే పబ్లిసిటీ ‘మౌత్ పబ్లిసిటీ’. సినిమా రిలీజ్‌కు ముందే జరిగే రభస... ‘పబ్లిసిటీ స్టంట్’. అయితే ఏ కారణం వల్ల రభస జరిగినా అది పబ్లిసిటీ స్టంటేనని అనుకోవడమూ మామూలైపోయింది. నిన్న మొన్న రిలీజ్ అయిన ‘ఉడ్తా పంజాబ్’ సినిమానే చూడండి. కేజ్రీవాల్ పార్టీ ఈ చిత్ర నిర్మాణం కోసం నిధులు సమకూర్చిందని టాక్ నడిచింది. అందులో నిజం ఉందో లేదో తెలీదు. పబ్లిసిటీ మాత్రం ఉంది.
మన దగ్గర రామ్‌గోపాల్ వర్మ సినిమా రిలీజ్‌కు ముందు.. ప్రతిసారీ ఏదో ఒక రచ్చ లేదా చిచ్చు మొదలౌతుంది. సరిగ్గా విడుదలకు ముందు ట్విట్టర్‌లోనో, మరో చోటో ఆయన... దేవుళ్లవో, దేవుళ్లలాంటి అగ్రహీరోలవో ముక్కు చెవులు కోసేస్తుంటారు తన కామెంట్‌లతో. అయితే వర్మ నిర్విరామంగా సినిమాలు తీస్తూ, నిరంతరం ఏదో ఒకటి ట్వీట్ చేస్తుంటారు కాబట్టి అయనది పబ్లిసిటీ స్టంట్ అనుకోడానికీ, అనుకోకుండా ఉండడానికీ లేదు!
సినిమా రిలీజ్‌కు ముందు, రిలీజ్ తర్వాత... సినిమా కేంద్రబిందువుగా జరిగే చర్చగానీ, వాదనలు గానీ ప్రతిసారీ పబ్లిసిటీ స్టెంటే కాకపోవచ్చు. తాజాగా -‘‘సుల్తాన్ సన్నివేశాల షూటింగ్‌లో ఒక అత్యాచార బాధితురాలికి జరిగినట్లుగా నా ఒళ్లు హూనం అయింది’’.. అన్న సల్మాన్ కామెంట్ వెనుక కూడా పబ్లిసిటీ స్టంట్ లేకపోవచ్చు కానీ, అలా అనడం కరెక్ట్ కాదు. ఒకవేళ ఆ కామెంట్ కారణంగా ‘సుల్తాన్’కు పబ్లిసిటీ వస్తే కనుక అది అనుకోకుండా వచ్చిన పబ్లిసిటీనే అనుకోవాలి.
స్టంట్ అంటే ఇదీ...
2012లో ‘ఏజెంట్ వినోద్’ రిలీజ్‌కు ముందు ఆ సినిమా హీరో సయీఫ్ అలీఖాన్ ‘తాజ్’ హోటల్‌లో ఓ ఎన్నారైతో, అతడి మామగారితో గొడవ పడి కేసుల్లో ఇరుక్కున్నాడు. సినిమా రిలీజ్ అయ్యాక చిత్రంగా ఆ కేసులన్నీ మాఫీ అయిపోయాయి!
2011లో ‘డబుల్ ఢమాల్’ సినిమా కోసం నటి మల్లికా శెరావత్ ముంబైలోని రోడ్డు సైడ్ దుకాణాలలో జిలేబీలు పిండారు. ఆ సినిమాలోని ‘జలేబీ బాయ్’ పాట హిట్ అవడానికే ఈ ప్రయాస.
2006 లో ‘ఫనా’ రిలీజ్‌కు ముందు ఆ సినిమా హీరో ఆమిర్ ఖాన్ ‘నర్మదా బాచావో ఆందోళన్’కి మద్దతు ప్రకటించడం పాలకపక్షాల ఆగ్రహానికి కారణం అయింది. కొన్నిచోట్ల సినిమాను బ్యాన్ చేశారు. దాంతో ‘ఫనా’కు విపరీతమైన పబ్లిసిటీ వచ్చేసింది.
2002లో ‘ఏక్ ఛోటీ సీ లవ్ స్టోరీ’ విడుదలకు ముందు ఆ చిత్ర కథా నాయిక మనీషా కొయిరాలా, తనవి కాని నగ్నదేహ సన్నివేశాలను తనవి అని నమ్మిస్తూ దర్శకుడు చిత్రీకరించాడని కోర్టుకు ఎక్కారు. ఆ వివాదం సినిమాకు చక్కటి పబ్లిసిటీ తెచ్చిపెట్టింది.