హోమియో కౌన్సెలింగ్
తామరను తరిమి కొట్టవచ్చు
నా వయసు 36. నాకు తొడల మీద, కాళ్ల మీద, పొట్టమీద ఎర్రగా, గుండ్రంగా మచ్చలు వచ్చాయి. ఇవి చాలా దురద పెడుతున్నాయి. నాకు ఈ మచ్చల వల్ల చాలా అసౌకర్యంగా ఉంది. హోమియోలో ఏమైనా మందులు ఉంటే సూచించగలరు.
- పి.కుమార్, మాచర్ల
ఎగ్జిమా అనేది దీర్ఘకాలిక చర్మసమస్య. దీనివల్ల చర్మం ఎరుపు దనంతో కమిలినట్లు కనిపించడం, దురద, రసితో కూడిన చిన్న చిన్న పొక్కులుగా ఏర్పడటం, చర్మం పొలుసులుగా రాలడంతోపాటు పిగ్మెంటేషన్ జరుగుతుంది.
కారణాలు: ఇది వంశపారంపర్యం, వాతావరణ మార్పులు, అలర్జీ వల్ల వచ్చే అవకాశం ఉంది.
ఎగ్జిమాను ప్రేరేపించే కారణాలు... వాతావరణ మార్పులు, దురద పుట్టించే ఆహార పదార్థాలు, సబ్బులు, డిటర్జెంట్లు, షాంపూలు, కొన్ని రకాల అలర్జిన్స్ ముఖ్యంగా డస్ట్‌మైట్లు, పెంపుడు జంతువులు, పుప్పొడి రేణువులు, డాండ్రఫ్ మొదలైనవి. ఒత్తిడి వల్ల కూడా ఎక్కువయ్యే అవకాశం ఉంది. హార్మోన్ల అసమతుల్యత ముఖ్యంగా స్త్రీలలో ఈ లక్షణాలను మరింత దుర్భరం చేస్తాయి. ఎగ్జిమా ఎక్కువగా ఉబ్బసం, తీవ్రమైన జ్వరాలు, ఇతర శ్వాస సంబంధితమైన అలర్జీల వంటి వ్యక్తిగత చరిత్ర కలిగి ఉన్నవారిలో ఎక్కువగా కనిపిస్తుంది.
రకాలు... ఎగ్జిమాలో అటోపిక్ డెర్మటైటిస్ సర్వసాధారణం. అలర్జిక్ కాంటాక్ట్ డెర్మటైటిస్, కాంటాక్ట్ ఎగ్జిమా, డిస్‌హైడ్రియాట్రిక్ ఎగ్జిమా, న్యూరో డెర్మటైటిస్, నమ్యులార్ ఎగ్జిమా, సెబోరిక్ ఎగ్జిమా, స్పాసిస్ డెర్మటైటిస్ వంటి రకాలున్నాయి.
ముఖ్యలక్షణాలు: ఇవి వయస్సును బట్టి మారుతుంటాయి.
శిశువులలో... చర్మంపై దద్దులు ముఖ్యంగా బుగ్గలపై, తలపైన ఎక్కువగా కనిపిస్తాయి. ఇవి నీటిబుగ్గల మాదిరిగా తయారై, రసికారడం, విపరీతమైన దురద, గోకడం వల్ల చర్మంపై ఇన్ఫెక్షన్ వంటి సమస్యలు వస్తాయి. చిన్నపిల్లలు, యుక్తవయసు వారిలో మోచేయి, మోకాలి మడతలలో, మణికట్టు, చీలమండలు, పిరుదులు, కాళ్ల మీద కనిపిస్తుంది. పెద్దవారిలో మోకాలు, మోచేయి, మెడభాగాలలో, ముఖంపైన, కళ్లచుట్టూ దద్దుర్లు వస్తాయి. చర్మం పొడిబారడం, దురద, చర్మం ఇన్ఫెక్షన్లకు గురికావడం వంటివి
ఎలా నిర్థారిస్తారంటే... కుటుంబ చరిత్ర, వ్యక్తిగత చరిత్ర తెలుసుకుని వ్యాధిని నిర్ధారిస్తారు. బాహ్యపరీక్ష, అవసరమైతే రక్తపరీక్ష, కొన్ని సందర్భాలలో చర్మపు మచ్చల నిర్ధారణకై బయాప్సీ చేయించాల్సి ఉంటుంది.
ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలంటే..? వ్యాధి లక్షణాలను దుర్భరం చేసే ప్రేరేపకాలకు దూరంగా ఉండాలి. ఎగ్జిమాల వల్ల వచ్చే పుండ్లను గోకడం, రక్కడం లాంటివి చేయకూడదు. హోమియో చికిత్స: కాన్‌స్టిట్యూషనల్ హోమియోపతిలో భాగంగా రోగి శరీర రోగనిరోధక కణాలకు పునరుజ్జీవం కల్పించి, దుష్ఫలితాలు లేకుండా ఎగ్జిమాను పూర్తిగా నయం చేయవచ్చు. అన్ని ప్రతికూల పరిస్థితులలో సైతం ఆరోగ్యవంతమైన జీవనం సాగించే విధంగా హోమియోకేర్ ఇంటర్నేషనల్ వారు అందించే వైద్య కచ్చితంగా దోహపడుతుంది.
నెఫ్రాలజీ కౌన్సెలింగ్
క్రియాటినిన్ పెరిగినా డయాలసిస్ చేయలేదు..?
నా వయసు 55. ఇటీవలే బాగా నిస్సత్తువగా, నీరసంగా ఉంటే డాక్టర్ దగ్గరికి వెళ్లాను. అన్ని పరీక్షలు చేసి క్రియాటినిన్ పాళ్లు ఉండాల్సిన దానికంటే ఎక్కువగా ఉన్నాయని అన్నారు. దాంతో నాకు డయాలసిస్ చేస్తారేమోనని ఆందోళన పడ్డాను. కానీ డయాలసిస్ చేయడం లేదు. మందులే ఇస్తున్నారు. క్రియాటినిన్ ఎంత ఉంటే డయాలసిస్ చేస్తారు?
- మస్తాన్, గుడివాడ
ఒక రోగికి డయాలసిస్ మొదలుపెట్టడానికి కేవలం క్రియాటినిన్ కౌంట్ మాత్రమే ఆధారం కాదు. ఇంకా చాలా రకాల పరీక్షలు చేసి డయాలసిస్ ఎప్పుడు చేయాలో నిర్ధారణ చేస్తారు. ఇటీవలి నూతన పరిశోధనల ఆధారంగా క్రియాటినిన్ కౌంట్ 6 - 8 మధ్యలో ఉన్న రోగులకు కొందరికి డయాలసిస్ చేశారు. అయితే క్రియాటినిన్ కౌంట్ 10 - 12 మధ్య ఉన్నవారికి డయాలసిస్ ప్రారంభించినప్పుడు ఇచ్చినన్ని సత్ఫలితాలు ఈ 6 - 8 మధ్య ఉన్నవారిలో కనిపించలేదు. దీనివల్ల డయాలసిస్ చేయాలనడానికి కేవలం క్రియాటినిన్ మాత్రమే ఒక నిర్దిష్ట పరీక్ష కాదని స్పష్టంగా తేలిపోయింది. క్రియాటినిన్ ఎక్కువగా ఉండటంతో పాటు మూత్రపిండాల రోగి ఊపిరి తీసుకోలేకపోవడం, సరైన పోషకాహారం తీసుకోక సన్నబడిపోవడం, ఆకలిని కోల్పోవడం, వాంతులు కావడం (ఈ లక్షణాలన్నింటినీ యూరెమిక్ సింప్టమ్స్ అంటారు) వంటివి కనిపించినప్పుడు మాత్రమే డయాలసిస్ చేయాలన్న నిర్ణయం తీసుకుంటారు. మీ విషయానికి వస్తే మీకు ఎప్పుడు డయాలసిస్ ప్రారంభించాలన్న అంశాన్ని మీ నెఫ్రాలజిస్టు నిర్ణయిస్తారు.
నా వయసు 49 ఏళ్లు. ఇటీవలే నాకు కిడ్నీలు సరిగా పనిచేయడం లేదని తెలిసింది. నేను నీళ్లు ఎక్కువగా తాగకూడదని డాక్టర్ చెప్పారు. సాధారణంగా డాక్టర్లు నీళ్లు ఎక్కువగా తాగమని చెబుతుంటారు కదా! మరి నా విషయంలో నీళ్లు తాగవద్దని ఆంక్ష ఎందుకు పెట్టారు? నాకు అర్థమయ్యేలా వివరించగలరు.
- సుందర్‌రావు, ఆకివీడు
సాధారణంగా కిడ్నీ జబ్బులు ఉన్న వారిలో నీరు తక్కువగా తాగాలని ఆంక్షలు విధించరు. అయితే కిడ్నీ జబ్బుతో పాటు గుండెజబ్బు లేదా అలా నీరు తీసుకోవడం వల్ల హాని జరిగే అవకాశాలు ఉన్నప్పుడు మాత్రం ఎంత నీరు తీసుకోవాలన్నది డాక్టర్లు నిర్దేశిస్తారు. మన భారతదేశం లాంటి ఉష్ణోగ్రత ఎక్కువ ఉన్న దేశాల్లో మామూలు వ్యక్తి రోజుకు 5-6 లీటర్ల నీటిని తీసుకుంటాడు. అయితే కొందరి కిడ్నీలు కేవలం ఒక్క లీటరు నీటిని ప్రాసెస్ చేయడానికే ఎంతో కష్టపడాల్సి వస్తుంది. అందుకే వారికి ఉన్న జబ్బు ఆధారంగా, వారి కిడ్నీ పనిచేసే సామర్థ్యం ఎంతో తెలుసుకొని, డాక్టర్లు రోజూవారీ తీసుకోవాల్సి నీటి మోతాదును నిర్ణయిస్తారు.
కార్డియాలజీ కౌన్సెలింగ్
ఆ మందులు ఇంకా వాడాలా..?
నా వయసు 56. పన్నెండేళ్ల కిందట నాకు యాంజియోప్లాస్టీ చేశారు. ప్రతిరోజూ అటార్ 10, క్లోపిటాబ్-ఏ 75 తీసుకొమ్మని చెప్పారు. ఇప్పటికీ నేను ఆ మందులు తీసుకుంటూనే ఉన్నాను. పన్నెండేళ్లు గడిచాక కూడా ఇంకా నేను వాటిని తీసుకోవాల్సిన అవసరం ఉందా? తెలియజేయగలరు.
- అమీర్‌సాహెబ్, గుంటూరు
మీ యాంజియోప్లాస్టీ తర్వాత మీరు ఏడాదికొకసారి మీ డాక్టర్‌ను కలుసుకొని మీరు తీసుకునే మందులను రివ్యూ చేయించుకోవాల్సింది. ఇలా దీర్ఘకాలం పాటు కొన్ని మందులు తీసుకోవడం వల్ల వాటి దుష్పరిణామాలు (సైడ్ ఎఫెక్ట్స్) కూడా ఉండవచ్చు. మొదట మీరు పీటీ-ఐఎన్‌ఆర్, లిపిడ్స్ (కొలెస్ట్రాల్, ట్రైగ్లిజరైడ్స్, ఎల్‌డీఎల్, హెచ్‌డీఎల్) పరీక్షలు చేయించుకోండి. కార్డియాక్ ఫంక్షన్ అసెస్‌మెంట్ కూడా చేయించుకోండి. ఇకవేళ మీ రక్తంలో లిపిడ్స్ పాళ్లు సరిగా ఉంటే అటర్వోస్టాటిన్ (అటార్ 10)ను ఆపివేయవచ్చు. ఇక క్లోపిటాబ్-ఏ 75 లో రక్తాన్ని పలచబార్చే రెండు రకాల ఏజెంట్స్ ఉంటాయి. అవి... 1) క్లోపిడోగ్రెల్, 2) ఆస్పిరిన్. ఈ రెండింటి స్థానంలో అవసరాన్ని బట్టి మీకు కేవలం ఆస్పిరిన్ 75 - 100 ఎంజీ ఇవ్వవచ్చు. అయితే ఈ మందుల మార్పిడి అంతా మీ రక్తపరీక్షలూ, కార్డియాక్ ఫంక్షన్ పరీక్షల మీద ఆధారపడి ఉంటుంది. కాబట్టి పైన పేర్కొన్న పరీక్షలు చేయించి ఒకసారి మీ కార్డియాలజిస్ట్‌ను కలవండి.
నా వయసు 60. నాకు ఆర్నెల్ల క్రితం యాంజియోప్లాస్టీ చేసి మెడికేటెడ్ స్టెంట్ వేశారు. అప్పట్నుంచి నేను ఆస్పిరిన్-100 ఎంజీ, క్లోపిడోగ్రెల్ 75 ఎంజీ, అటెనొలాల్ 25 ఎంజీ, ఒమెప్రొజాల్ 20 ఎంజీ, ఫోలిక్‌యాసిడ్ 5 ఎంజీ, మల్టీవిటమిన్ విత్ జింక్ (రోజుకు ఒకసారి), సింవాస్టాటిన్ 10 ఎంజీ (రాత్రిపూట), ఎజెటెమైబ్ 10 ఎంజీ (రెండు నెలల క్రితం మొదలుపెట్టాను, రాత్రిపూట తీసుకుంటున్నాను)... ఈ మందులు వాడుతున్నాను. ఇటీవల రక్తపరీక్షలు చేయిస్తే టోటల్ ఆర్‌బీసీ - 5.4 ఎం/సీఎమ్‌ఎమ్, హీమోగ్లోబిన్ 14.2 జీ/డీఎల్, పీసీవీ 48%, ఎంసీవీ 89 ఎఫ్‌ఎల్, ఎమ్‌సీహెచ్ - 26 పీజీ, ఎమ్‌సీహెచ్‌సీ 29%, మోనోసైట్స్ 9%, ఇసినోఫిల్స్ 7%, బ్లడ్‌గ్లూకోజ్ 112 ఎంజీ/డీఎల్ , సీఈఏ 5.2 వీ ఎన్‌జీ/ఎమ్మెల్ ఉన్నాయి. లిపిడ్ ప్రొఫైల్‌లో కొలెస్ట్రాల్ 146, గ్రైగ్లిజరైడ్స్ 165, హెచ్‌డీఎల్ 40, ఎల్‌డీఎల్ 73 ఉన్నాయి. ఇటీవలే నేను బరువు తగ్గడానికి గ్జెనికాల్ (ఆర్లిస్టాట్ రోజుకు రెండుసార్లు భోజనం తర్వాత) తీసుకోవడం మొదలుపెట్టాను. నా రిపోర్టుల ప్రకారం అంతా బాగున్నట్టేనా? దయచేసి తెలియజేయగలరు.
- చంద్రశేఖర్‌రెడ్డి, కర్నూలు
మీ గుండెకు సంబంధించినంత వరకు మీ రిపోర్టులన్నీ చక్కగానే ఉన్నాయి. అయితే మీరు పంపిన దాంతో ఎర్రరక్తకణాలకూ గుండెజబ్బులకూ నేరుగా ఎలాంటి సంబంధం లేదు. మీరు ఒకసారి మీ ఫిజీషియన్‌నుగానీ లేదా కార్డియాలజిస్టును గానీ కలిసి, అంతర్గతంగా ఏదైనా సమస్య ఉందేమో తెలుసుకోవడం అవసరం.
స్లీప్ కౌన్సెలింగ్
నిద్రలో కాళ్లు కదులుతున్నాయేమిటి?
నా భార్య వయసు 50 ఏళ్లు. కాస్త లావుగా ఉంటుంది. డయాబెటిస్‌తో బాధపడుతోంది. ఇటీవల నిద్రలో ఆమె కాళ్లను కుదిపినట్లుగా చాలా వేగంగా కదిలిస్తోంది. నిద్రలోంచి లేచి పిక్కలు పట్టేస్తున్నాయని (మజిల్ క్రాంప్స్) అంటోంది. దీంతో ఆమె నిద్రకు తీవ్ర అంతరాయం కలుగుతోంది. దయచేసి ఆమె విషయంలో ఏం చేయాలో తగిన సలహా ఇవ్వండి.
- వెంకటేశ్వరరావు, హన్మకొండ
నిద్రలో ఇలా కుదుపుతున్నట్లుగా కాళ్లు వేగంగా కదిలించడాన్ని ‘పీరియాడిక్ లింబ్ మూవ్‌మెంట్ డిజార్డర్ (పీఎల్‌ఎమ్‌డీ) అంటారు. సాధారణంగా నిద్రపోతున్న సమయంలో మన శరీరంలో శ్వాస తప్ప మరే కదలికా ఉండదు. కానీ నిద్రలో ఇలా కదలికలు కనిపించే జబ్బు ఇదే. ఇక్కడ ‘పీరియాడిక్’ అనే పదం కదలికలు ఎంత ఫ్రీక్వెన్సీతో వస్తున్నాయనేందుకు ఉపయోగిస్తారు. ఇవి క్రమబద్ధంగా ప్రతి 20 - 40 సెకండ్ల పాటు వస్తుంటాయి. పీఎల్‌ఎమ్‌డీ అనేది నిద్రకు సంబంధించిన వ్యాధి. దీనితో బాధపడేవారు రాత్రివేళ నిద్ర తక్కువ కావడం వల్ల పగలు మగతగా ఉంటారు. పీఎల్‌ఎమ్‌డీ అనేది ఏ వయసు వారిలోనైనా రావచ్చు. అయితే సాధారణంగా మధ్యవయస్కుల్లో ఇది ఎక్కువ. పీఎల్‌ఎమ్‌డీలో ప్రైమరీ, సెకండరీ అని రెండు రకాలున్నాయి. సెకండరీ పీఎల్‌ఎమ్‌డీ అనేది అంతర్గతంగా ఇతర వ్యాధులు ఉన్నవారిలో కనిపిస్తుంది. లేదా కొందరిలో దీనికి కారణం కూడా తెలియదు. మెదడు నుంచి కాళ్లు, చేతులకు వెళ్లే నరాల్లో సమస్యల వల్ల ఇది వస్తుందని తెలుసుకానీ, ఆ సమస్యలేమిటో ఇంకా పరిశోధనల్లో వెల్లడికాలేదు. సెకండరీ పీఎల్‌ఎమ్‌డీకి చాలా కారణాలు ఉన్నాయి. అవి... డయాబెటిస్ ఐరన్ లోపం వెన్నెముకలో కణుతులు వెన్నెముక దెబ్బతినడం స్లీప్ ఆప్నియా (గురక సమస్య) నార్కోలెప్సీ (క్రమమైన వేళల్లో నిద్రపట్టడం, నిద్రలేవడం జరగకపోవడం) యురేమియా (రక్తంలో యురియా, నైట్రోజన్ సంబంధిత వ్యర్థపదార్థాల పాళ్లు పెరగడం), రక్తహీనత మొదలైనవి.
పీఎల్‌ఎమ్‌డీతో బాధపడే చాలామందిలో కాళ్ల కదలికలు లేకుండా నిద్రపట్టకపోవడం, దాంతో పగటినిద్ర ఎక్కువగా ఉంటాయి. కొందరిలో ఒక కాలు, లేదా మరికొందరిలో రెండుకాళ్లూ కదులుతూ ఉండవచ్చు. దీని నిర్ధారణకు నిర్దిష్టంగా పరీక్షలేవీ లేకపోయినా, రక్తహీనత వంటి వాటి ద్వారా కారణాన్ని ఊహించవచ్చు. ఈ సమస్య ఉన్నవారికి బెంజోడయజిపైన్స్, క్లోనోజెపామ్, డోమమినెర్జిక్ ఏజెంట్స్, యాంటీకన్వల్జెంట్ ఏజెంట్స్, గాబా ఆగోనిస్స్ వంటి మందులతో చికిత్స చేయవచ్చు కాబట్టి మీరు ఆందోళన పడకుండా మీ భార్యతో కలిసి ఒక ఫిజిషియన్‌ను సంప్రదించండి.
ఆ మందులు ఇంకా వాడాలా..?
Published Sun, Aug 16 2015 11:16 PM | Last Updated on Sun, Sep 3 2017 7:33 AM
Advertisement