ఎందుకోగాని సమాజంలో ఎన్ని మార్పులొస్తున్నా స్వార్ధప్రియత్వం తగ్గడం లేదు. పక్కవాడు బాగుంటే ఓర్వలేని పరిస్థితే ఎక్కువగా కనిపిస్తోంది. అంటే, ఇలాంటి పరిస్థితి గతంలో ఎప్పుడూ లేదని కాదు... మరీ ఈ స్థాయిలో ఉండేది కాదు. ఇప్పుడు వ్యాపార దృష్టి మరీ పెరిగిపోయింది. దాని ఫలితమే మానవ సంబంధాలను కూడా ఆ దృష్టితోనే చూడడం. మంచి, మర్యాద, ప్రేమ, ఆప్యాయతలు కనీస స్థాయిలోనే కనిపిస్తున్నాయి తప్ప, కావలసినంత స్థాయిలో కనబడడం లేదు.
‘నోటితో పలకరిస్తూ... నొసటితో వెక్కిరించే ధోరణిలో పైకి చిరునవ్వులు చిందిస్తారు కానీ, పక్కకెళ్లి చెవులు కొరుక్కోవడమే ఇంచుమించు అందరిలోనూ. కడుపులో కల్మషం తప్ప నికార్సయిన ప్రేమ కానరాదు... అంతా కృత్రిమం. దీనంతటికీ ప్రధాన కారణం ప్రాపంచిక సుఖాల మీద విపరీతంగా వ్యామోహం పెరిగిపోవడం... సుఖం కోసం పాకులాట. సంతోషం కోసం వెంపర్లాట. బంధుమిత్రులు, పేదసాదలు, సమాజం, ప్రేమ, అభిమానం, దానధర్మాలు అంటూ ఆ వైపు మొగ్గుచూపితే తమ సంపద ఎక్కడ తరిగిపోతుందోనని, తమ సుఖభోగాలకు ఎక్కడ అంతరాయం ఏర్పడుతుందోనని భయం.
ఈ నేపథ్యం లోంచే స్వార్థం పుట్టుకొస్తోంది. మనసులో స్వార్థం గూడుకట్టుకున్న వారు పరులకేమీ చేయకపోగా, వారి ఎదుగుదలను కూడా సహించలేరు. లోభత్వం, పిసినారితనంతోపాటు, అసూయ, అహంకారం కూడా అలుముకుంటాయి. త్యాగం, సహనం, ప్రేమ, పరోపకారం, దయ. జాలి, కరుణ లాంటి పదాలకు చోటుండదు. ఈ దుస్థితి దూరం కావాలంటే, కొన్ని విశ్వాసాలకు బద్ధుడు కావాలి. ఈ ప్రపంచమే సర్వస్వమని, ఇక్కడి సుఖాలు, ప్రయోజనాలే ముఖ్యమన్న భ్రమల్లోంచి బయట పడాలి. ఈ ప్రపంచం అశాశ్వతమని, అందులో తమ జీవితం కూడా మూణ్నాళ్ళ ముచ్చటేనని గ్రహించాలి.
స్వార్థం వీడితేనే జీవితానికి సార్ధకత చేకూరుతుంది. అది పోవాలంటే, ప్రాపంచిక వ్యామోహాన్ని కనీస స్థాయికి తగ్గించుకోవాలి. ఇతరులను ప్రేమించడం అలవరచుకోవాలి. వారి అవసరాలు తీర్చాలి. కష్టసుఖాల్లో పాలుపంచుకోవాలి. సమాజం పట్ల బాధ్యతను గుర్తెరగాలి. ఎంత పోగేసినా అది తమ వెంట రాదని, ఏదో ఒకనాడు అదంతా వదిలేసి వెళ్ళిపోవలసిందేనన్న స్పృహను ప్రదర్శించాలి. ఎదుటి వారి ప్రగతిని, అభివృద్ధిని కాంక్షించాలి. వారి ఎదుగుదలను ప్రోత్సహించాలి. మనసులో స్వార్ధం, కల్మషం లేనప్పుడే ఇది సాధ్యం.
Comments
Please login to add a commentAdd a comment