దేవుడు పోషించేవాడే కాదు సరిదిద్దేవాడు కూడా!
సువార్త
ఎగ్జిబిషన్‌లో ఇసుకేస్తే రాలనంత జనంలో తన ఐదేళ్ల కొడుకు తప్పిపోతాడన్న భయంతో తండ్రి కొడుకు చేయి గట్టిగా పట్టుకున్నాడు. వాడేమో అక్కడి ఆకర్షణలకు లోనై తండ్రి చేయి విడిపించుకునే నిరంతర ప్రయత్నంలో ఉన్నాడు. కొడుకు ధ్యాసంతా ఎగ్జిబిషన్ మీద, తండ్రి ధ్యాసంతా కొడుకు మీద!
ఆరు లక్షల మందికి పైగా ఇశ్రాయేలీయులు ఐగుప్తు దాస్య విముక్తులై వాగ్దాన దేశానికి వెళ్తున్న అరణ్య మార్గంలో ఎన్నో మార్లు తిరుగుబాటు చేసి దేవుని చేయి విడిపించుకునే ప్రయత్నం చేశారు. కొన్నాళ్లకు దేవుడు కూడా విసిగిపోయి ‘ఇక నేను మీతో రాను’ అని వారి నాయకుడైన మోషేకు తెలిపాడు (నిర్గమ 33:3). నీవు మాతో రాకపోతే మేము ముందుకు సాగేది లేదంటూ మోషే దేవుని ప్రాథేయపడి ప్రార్థన చేశాడు (నిర్గమ 33:15). ఫరోకు భయపడి మోషే తల్లిదండ్రులు అతను పుట్టగానే కన్నతల్లిదండ్రుల ప్రేమకు దూరమై ఆయా పరిస్థితుల్లో పెరిగి పెద్దవాడైనా, క్రమంగా నిజం తెలుసుకొని పరలోకపు తండ్రియైన దేవుని ప్రేమను అతను అపారంగా చవిచూశాడు. తన దేవుడైన పరలోకపు తండ్రితో ప్రగాఢమైన అనుబంధాన్నేర్పర్చుకున్న మోషే దేవుడు లేకపోతే క్షణకాలం కూడా భరించలేనంత అత్యున్నతమైన ఆత్మీయ స్థితికి ఎదిగాడు. అందుకే కోరినంత అత్యున్నతమైన ఆత్మీయ స్థితికి ఎదిగాడు. అందుకే కోరి మరీ దేవుని సన్నిధిని సాధించుకున్నాడు.
దేవుని సన్నిధిలో పోషణ, భద్రత మాత్రమే కాదు దిద్దుబాటు కూడా ఉంటుందని ఎదిగినవాడుగా మోషే తన ప్రజల కోసం ప్రార్థించి సాధించిన ఘనవిజయం దేవుని నిరంతర సన్నిధి. దేవుడు కావాలా, దేవుడు చేసే అద్భుతాలు కావాలా అనడిగితే మోషే తడుముకోకుండా దేవుడే కావాలంటాడు. ఇశ్రాయేలీయుల ప్రస్థానమంతా అడుగడుగునా దేవుని అద్భుతాలలోనే సాగినా, వాటిని తాను ప్రత్యక్షంగా చూసినా దేవుని సన్నిధి ఇచ్చిన ఆనందం, తృప్తి మోషేకు అవేమీ ఇవ్వలేదు. ఎందుకంటే అద్భుతాలు తాత్కాలికం కాని దేవుని సన్నిధి శాశ్వతం.
రకరకాల ఒత్తిళ్లు, పోటీతత్వం, ఘర్షణలు, ఓటములు, ప్రచ్ఛన్న పోరాటాలు భాగంగా మారిన ఆధునిక జీవనశైలితో ప్రతి ఒక్కరూ ఏదో ఒక దశలో సందిగ్ధావస్థలో సరైన మార్గం కోసం, పరిష్కారం కోసం చూసే వారే. అలాంటప్పుడు దేవుడు దారి చూపించేవాడు మాత్రమే కాదు, మీతోపాటు ఉండి, ఆశీర్వాదపథంలో చేయి పట్టుకొని విజయపథం వైపునకు నడిపిస్తానని దేవుడంటే అదెంత భాగ్యం! మోషే ప్రార్థన అదే. మాకు దారి చూపించడం కాదు, మాతో ఉండమంటూ ఆయన దేవుని బతిమాలాడు. అలా దేవుడు మానవాళికి గమ్యం, మార్గం మాత్రమే కాదు. యేసుక్రీస్తు రూపంలో మనతో నడిచే బాటసారి కూడా అయ్యాడు.
అందుకే యేసు ‘నేనే మార్గం, నేనే సత్యం, నేనే జీవం’ అని సాధికారికంగా ప్రకటించాడు (యోహాను 14:6). జీవితంలో ఎంతో ప్రయాసపడి ఎంతెంతో సాధించి, సంపాదించి చివరికి అది దేవుని సన్నిధిలేని బతుకైతే, విందుభోజనం పారేసి విస్తరాకు నమిలినట్టే కదా! నగరం నడిబొడ్డున కరెంటు తీగమీద కూర్చున్న ఒక పిచ్చుక ‘ఈ ప్రజలు ఎందుకిలా పరిగెత్తడం, ఎందుకీ హడావుడి, హైరానా?’ అనడిగిందట. ‘మనల్ని పోషిస్తున్న పరలోకపు తండ్రి తమను కూడా పోషించగల సమర్థుడని వారికి తెలియదు, అందుకే’ అని జవాబిచ్చిందట మరో పిచ్చుక.
- రెవ.టి.ఎ.ప్రభుకిరణ్