అహం బ్రహ్మాస్మి అంటే అదే! | A story by ravula giridhar | Sakshi
Sakshi News home page

అహం బ్రహ్మాస్మి అంటే అదే!

Published Sun, Sep 16 2018 2:02 AM | Last Updated on Sun, Sep 16 2018 2:02 AM

A story by ravula giridhar - Sakshi

ఆత్మ సర్వాంతర్యామి అన్న విషయం ఎరిగినవారు, ఆత్మ రూపంలో భగవంతుడు సర్వత్రా వ్యాపించి ఉన్నాడని అంగీకరించినవారు, ఆత్మానందాన్ని అనుభవించడానికి మాత్రం మానసికంగా చాలా కృషి చేయాల్సి ఉంటుంది. కనిపించేవన్నీ ఆ ఆత్మ లేక అనంతశక్తిలోనుండే పరిణమిస్తూ ఉద్భవించాయని ఎరిగినవారు నిజజీవితంలో అద్వైత ఆనందాన్ని పొందడం అంత సులభమేమీ కాదు. ఈశావాస్యోపనిషత్తు లో సర్వ భూతాలలో అంతర్యామిని దర్శించిన వారికి మానసిక వైకల్యాలు కలగవు అనడం సులభంగా అనిపించినా, అది నిరంతర చింతన వలననే సాధ్యం.

ఆది శంకరులు అద్వైత సిద్ధాంతం ప్రతిపాదించిన అనంతరకాలంలో, గంగా స్నానమాచరించి విశ్వనాథుని దర్శనం కోసం కదులుతూ ఉంటే, ఒక కాటికాపరి ఎదురైనప్పుడు ’పక్కకు తప్పుకో’ అని అనడం విచిత్రం. అద్వైత సిద్ధాంత ప్రతిపాదకుడు, అత్యంత మేథాశక్తి గల మహిమాన్వితుడు, వేదవేదాంతాలను ఔపోసనపట్టిన బ్రహ్మజ్ఞాని ఆచరణ విషయం వచ్చేసరికి భంగపడ్డాడంటే ఎంత ఆశ్చర్యకరమో ఆలోచించండి. సర్వాంతర్యామి అంటే అంతటా ఉన్నవాడు, ఆత్మస్వరూపుడై ఉన్నవాడని తెలిసినా, అంగీకరించినా, అనుభవించడం ఎంత కష్టమో అర్థం చేసుకోవాలి. ఆ అనుభవంతోనే ఆదిశంకరులవారు అప్పటికప్పుడు ‘మనీషాపంచకం’ ప్రవచించి, బ్రహ్మజ్ఞాని ఎవరైననేమి, అతడు నా గురువంటూ నిశ్చయించుకొన్నాడు.

ఆత్మజ్ఞానం తెలుసుకుంటే చాలు కదా, ఎందుకు అనుభవించడం? అనే ప్రశ్న ఉదయించవచ్చు. అరిషడ్వర్గరూపంలో ఉన్న మనో మాలిన్యాలు తొలగేందుకు, శ్రీ కృష్ణుని నిష్కామకర్మ సాధించేందుకు, సనాతన ధర్మజీవితం జీవించేందుకు, సుఖదుఃఖాలను నిర్మూలించేందుకు, ముఖ్యంగా మృత్యుంజయ మోక్షస్థితిని జీవితంలో అనుభవించేందుకు, ఆత్మానందంలో రమించేందుకు అద్వైతాన్ని అనుభవించాలి. అదే కదా ‘అహం బ్రహ్మాస్మి’కి నిజమైన తార్కాణం. అన్నమయ్య కలగన్న శ్రీవేంకటేశ్వరుడు ఆయనకు చివరిదశలో ‘అంతర్యామి’గా ద్యోతకమయ్యాడు. భౌతిక దృక్పథం నుండి ఆత్మ దృక్పథంలోకి మారడానికి ఎన్ని సంవత్సరాల కాలం పట్టిందో చూడవచ్చు. అందుకే, ఆత్మజ్ఞాన జిజ్ఞాసులు తొలుత ఆత్మను, జడమును అర్థం చేసుకోవాలి. తద్వారా మాత్రమే ఆత్మను, జడమును వేరుగా చూడటాన్ని మన తలపులలోంచి తీసివేయగలం.

‘మహోపనిషత్‌’ భేద దృష్టియే అవిద్య అని చెప్పింది. దానిని విసర్జించమని ఆదేశించింది. సర్వమూ బ్రహ్మమేనన్న విషయం తెలుసుకోవడమే విద్య అని, దానిని అనుభవించడమే అక్షయమని తేల్చిచెప్పింది. దీనికి చిన్న ఉదాహరణగా సైన్స్‌ చెప్పే విషయాన్ని తీసుకోవచ్చు. భూమిమీద, భూమిని మించిన బరువు ఉన్న జీవులు జన్మిస్తే భూమి తన భ్రమణ, పరిభ్రమణ గతులను తప్పుతుందా అనేది ప్రశ్న. సమాధానం ‘గతి తప్పదు’. ఎందుకు గతి తప్పదు? ఎందుకంటే ఆ జీవులన్నీ భూమండలంలోనుండే ఉద్భవించినవి కాబట్టి. ఇదే గమ్మత్తు. ఆశ్చర్యదాయకం. ఇదే చిన్న ఉదాహరణను ఆ సర్వాంతర్యామిలో పుట్టి, గిట్టే ఖగోళ పదార్థాలన్నింటి విషయంలోనూ అన్వయించుకోవచ్చు.

ఈ విధంగా అంతర్యామిని దర్శించుకోవచ్చు. ఈ దర్శనం నిరంతర మానసిక చింతనతోనే ఆచరణసాధ్యం. జిజ్ఞాసులకు మనసు అత్యంత కీలక సాధనం. అది మాత్రమే అవిద్యను తొలగించివేసే విద్యకు ఆధారమౌతుంది. ఆ మనసు స్థిరంగా, బలంగా ఆత్మతో మమేకమైతేనే ఆచరణ సాధ్యమౌతుంది. అప్పుడే నిష్కామకర్మ చేస్తూ మోక్ష స్థితిని అనుభవించగలం. తద్వారా, మనచుట్టూ ఉన్న సమాజంలో, ప్రకృతిలో మనల్ని మనమే చూసుకోగలం. అంతటా ప్రేమను నింపగలం. ఆ స్థితియే ‘అహం బ్రహ్మాస్మి’ అప్పుడే భేదభావం వలన ఉత్పన్నమయ్యే అరిషడ్వర్గాలు నశించి, ఆనందమయ జగత్తు సాక్షాత్కారమౌతుంది.

– రావుల గిరిధర్‌

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement