ఆత్మను అనుభవించటం ఇంద్రియాలకు సాధ్యం కాదని మనం చెప్పుకున్నాం. మరి దేనికి సాధ్యమంటే జ్ఞానమనే పునాది మీద నిలబడిన మనసుకి మాత్రమే అది సాధ్యం. జ్ఞానం అనేది హేతువును తెలియజేస్తుంది. దృశ్యమాన ప్రపంచం ఏ విధంగా ఉనికిలోకి వచ్చిందో అర్థం చేయిస్తుంది. ఆ శక్తి ఏవిధంగా పరివ్యాప్తమై ఉండి, సకల చరాచర సృష్టికి ఆధారమై, నిత్యమై, నిశ్చలమై సర్వత్రా ఏ విధంగా నిబిడీకృతమైనదనే విషయాన్ని తెలియజేస్తుంది. అట్టి జ్ఞానాన్ని అవగాహన చేసుకోవడమే మేథకు గొప్ప పని. ఆ మేథను మనసు ఆకళింపు చేసుకోవడం ఓ అంతర్గత సంఘర్షణ.
ఆ సంఘర్షణలో అరిషడ్వర్గాల పతనం ప్రారంభమౌతుంది. నిజమేది? నిత్యమేది? జీవమేది? మరణమేది మొదలైన ప్రశ్నలు భౌతిక జీవితాన్ని గడపాల్సి రావడం వలన ఉత్పన్నమౌతాయి. గమ్యమదే ఐనపుడు కర్మసన్యాసం సుఖవంతమనే బలహీనత మనసును తొలుస్తుంది. గీతాపాఠాలు స్ఫురణకు వస్తాయి. ఈ విధమైన మానసిక సంఘర్షణలో నుండే జ్ఞానం ప్రకాశించి, ఆత్మ సందర్శనకు కారణమౌతుంది. జ్ఞానయోగి, కర్మయోగిగా పరిణమిస్తాడు. ప్రతికర్మలోనూ భగవచ్ఛక్తితో రమిస్తాడు. బ్రహ్మజ్ఞానియై బ్రహ్మానందంలో ఓలలాడతాడు. మనసు చేసే నిరంతర చింతన వలన ఆత్మను అనుభవిస్తాడు. ఆ అనుభవమే ఆత్మదర్శనం లేక భగవద్దర్శనం.
‘సమస్తమై విరాజిల్లుతున్న ఆత్మను దర్శిస్తే మానసిక గందరగోళాలు నశిస్తాయి. అన్ని సందేహాలు సమసిపోతాయి. ప్రారబ్ధ కర్మలతో సంబంధం తెగిపోతుంది. ప్రాకృతిక సుఖ సంతోషాల స్థానే నిరంతర ఆత్మానందం ఉదయిస్తుంది. దుఃఖ ద్వేషాదులస్థానే ప్రేమ ఆప్యాయతలు వికసిస్తాయి. శత్రు భయం, కష్టాలు తొలగి విశ్వనరులమై వెలుగొందగలుగుతాం.. ఆత్మప్రకాశం ద్వారానే ఆత్మను చూడగలుగుతామంటుంది ముండకోపనిషత్తు. అక్కడ సూర్య చంద్రాదులు ప్రకాశించడం లేదు, మెరుపులు మెరవడం లేదు, అలాంటప్పుడు ప్రకాశం అంటే ఏంటి? మన మనసులో మనం ఊహించుకునే వెలుతురు కాదు. అది ఒక యోచన. అది ఒక దివ్యానుభూతి. దానివలన మనసులో ఉండే చీకటి సహిత మాలిన్యాలు నశించిపోతాయి. కాబట్టి, ప్రకాశంగా చెప్పబడింది.
‘పెట్రోమాక్సు దీపం నుండి వచ్చే ప్రకాశం లాంటిది కాదు ఆత్మప్రకాశం. అన్నింటినీ మనం తెలుసుకుంటున్నది ఆత్మప్రకాశం చేతనే! అందువల్లనే అది ప్రకాశమని చెప్పబడిందంటారు శ్రీరమణమహర్షి. ఆ ప్రకాశం వైపుగా మనం పయనిద్దాం. మన మేథలో హేతువు మథించి, మనసులో ఆత్మతో రమిద్దాం. ఆత్మ ప్రకాశంలో అద్వైతస్థితిని చేరుకుందాం. అరిషడ్వర్గాలను అణచి, కుల, మత భేదాలకు అతీతులమై ఆనందిద్దాం. మానవ జీవితాన్ని ఆస్వాదించుదాం.
– రావుల గిరిధర్
Comments
Please login to add a commentAdd a comment