వీధిబాలలే లక్ష్యంగా... | Street targeting children | Sakshi
Sakshi News home page

వీధిబాలలే లక్ష్యంగా...

Published Tue, Sep 9 2014 11:00 PM | Last Updated on Mon, Oct 1 2018 1:16 PM

వీధిబాలలే లక్ష్యంగా... - Sakshi

వీధిబాలలే లక్ష్యంగా...

అమ్మ చేతి గోరు ముద్దలు తింటూ, హాయిగా ఆడుతూ పాడుతూ, చదువుకోవలసిన వయసులో కొందరు బాలలు మత్తుపదార్థాలకు బానిస అయ్యారు. మరికొందరు కడుపు నింపుకోవడం కోసం యాచన చేస్తుంటే, ఇంకొందరు జేబులు కొట్టేయడం, వ్యభిచారానికి పాల్పడటం వంటి అసాంఘిక కార్యకలాపాలలో భాగస్వాములయ్యారు. అలాంటి వారి దయనీయ స్థితిని చూసి ఆమె మనసు కలత చెందింది. వారికి ఆసరా ఇస్తే వీటి నుంచి దూరం కాగలుగుతారనుకుంది. అందుకే ఆమె వారి కోసం లక్ష్యం అనే పాఠశాలను స్థాపించింది. ఇంతకూ ఎవరీమె? ఈమె లక్ష్యం ఎంత మేరకు నెరవేరిందో చూద్దామా!     

ఢిల్లీకి చెందిన యువ సామాజిక కార్యకర్త రాశి ఆనంద్. వీధి బాలల సంక్షేమం కోసమే ‘లక్ష్యం’ అనే ఎన్జీవోను నిర్వహిస్తున్న రాశి, వసంత్ కుంజ్‌లో ‘సాక్ష్యం’ అనే పాఠశాలను స్థాపించారు. ఇందులో ఇప్పటికి సుమారు 200 మంది బాలలు చేరారు. నిర్వాహకులు వారికి చదువుతో పాటు చేతి పనులు కూడా నేర్పుతున్నారు. ఈ పిల్లల కోసం... ఫ్లై ఓవర్ల కింద చిన్న చిన్న వర్క్‌షాపులు నిర్వహిస్తున్నారు. రెడ్ లైట్ ఏరియాలకు, రైల్వే స్టేషన్లకు వెళ్లి అక్కడ మత్తుపదార్థాలకు బానిసలైనవారికీ, పొగాకు సేవించేవారికీ వాటి వలన కలిగే నష్టాల గురించి తెలియచేస్తున్నారు. ‘‘అతి తక్కువ కాలంలోనే అంటే కేవలం ఏడాదిన్నరలోనే మా ప్రయత్నం ఫలించింది. మా ‘లక్ష్యం’ సంస్థ జార్ఖండ్, ఢిల్లీ, బెంగళూరు, ఉత్తరాఖండ్, తమిళనాడు, కర్ణాటక వంటి ఆరు రాష్ట్రాలకు వ్యాపించింది. ఇది నాకు ఎంతో సంతోషాన్ని ఇచ్చింది’’ అంటారు రాశి ఆనంద్.

 ఆ బాలలు... పాడైపోయిన టైర్లు, ఖాళీ ప్లాస్టిక్ సీసాలు, రాళ్లు... వీటితో ఆడుకుంటారు. వారు మంచి మంచి బొమ్మలతో ఆడుకునేందుకు తనకు తోచిన సహాయం చేయాలనుకుంది. ఏదో చేయాలనే తపన కలిగించింది. ‘లక్ష్యం’ పేరుతో బొమ్మల కేంద్రం ఏర్పరిచింది. ఢిల్లీలోని పన్నెండు పాఠశాలల్లో పెద్ద పెద్ద బాక్సులు ఏర్పాటు చేసింది. ఆయా పాఠశాలల్లో చదువుకునే పిల్లలు వారి దగ్గర ఉన్న బొమ్మలను తెచ్చి ఆ బాక్సులో ఉంచేలా వారిని ఉత్తేజపరిచారు. ‘‘మాకు మంచి స్పందనే వచ్చింది. సుమారు 60,000 బొమ్మలు, పుస్తకాలు, బాక్సులు సమకూరాయి. వాటిని ఢిల్లీలోని వీధిబాలలకు అందచేశాం’’ అంటారు రాశి. బొమ్మల సంఖ్య బాగా పెరగడంతో రాశి మరిన్ని ఇతర సంస్థలతో సంబంధం పెట్టుకుని, వారి ద్వారా బీహార్ రాష్ట్రంలోని అనేక గ్రామాలకు, ధర్మశాలలోని శరణార్థులు ఉన్న ప్రాంతాలకి వీటిని అందచేశారు.

అమ్మ నుంచి అలవాటయింది...

‘‘నేను ఇన్ని సాధించడానికి మా అమ్మ పూనమ్ ఆనంద్ నాకు ప్రేరణ. ఆమె ‘లక్ష్య’ అనే ఒక ఎన్‌జివో స్థాపించి గిరిజన మహిళలకు సేవ చేశారు. అప్పట్లో నేను అందులో సభ్యురాలిని. అప్పుడు నా వయసు 18 సంవత్సరాలు. ఆ సంస్థ ద్వారా రాంచీలో ఒక అనాథాశ్రమం స్థాపించారు. గుడ్డి, మూగ, చెవిటి వారితో సుమారు మూడు సంవత్సరాలు పనిచేశారు. అమ్మ కారణంగానే, నేను చిన్న వయసులోనే అంటే నాకు 25 సంవత్సరాల వయసు వచ్చేసరికే సుమారు 7381 మంది జీవితాలను దగ్గరగా చూశాను. పేద- ధనిక తారతమ్యం తెలుసుకున్నాను, సామాజిక సేవ నేర్చుకున్నాను.’’ అని చెబుతారు రాశి ఆనంద్. తల్లి స్థాపించిన లక్ష్య’ సంస్థను మరింత మందికి సేవ చేయడానికిగాను ‘లక్ష్యం’ పేరుగా 2004లో మార్పు చేశారు.

మరో కోణం...

‘మిర్రర్స్’ అనే ఈవెంట్ మేనేజ్‌మెంట్, అడ్వర్టయిజింగ్ ఏజెన్సీని గత ఐదుసంవత్సరాలుగా నడుపుతున్నారు రాశి. ఇందులో భాగంగా జాతీయ అంతర్జాతీయ కార్యక్రమాలు నిర్వహిస్తుంటారు. ఈ కార్యక్రమాల నుంచే ‘లక్ష్యం’ సంస్థ కోసం నిధులు సేకరిస్తారు. ‘బీయింగ్ హ్యూమన్’ పేరిట వీధి బాలలకు సల్మాన్‌ఖాన్‌ను కలిసే అవకాశం కల్పించారు. ‘‘సల్మాన్‌ఖాన్ మా సంస్థకు కొంత డబ్బు విరాళంగా ఇచ్చారు’’ అని చెబుతారు రాశి.

 ‘ఫ్యాషన్ ఫర్ ఏ కాజ్’ పేరిట ఒక ఫ్యాషన్ షో ఏర్పాటుచేశారు. అందులో... ఢిల్లీ రెడ్ లైట్ ఏరియాలోని ఆర్‌కె పురం బాలలు ర్యాంప్ మీద నడిచారు. ‘‘ఆ బాలలకు సహాయం చేయడానికి మరిన్ని నిధులు సేకరించాను. బాలీవుడ్, ఫ్యాషన్ పరిశ్రమ... అందరూ ఈ కార్యక్రమానికి వారి మద్దతు ప్రకటించి నా కార్యక్రమం విజయవంతం కావడానికి సహకరించారు’’ సంతోషంగా చెప్పారు రాశి.

ర్యాంప్ మీద జేబుదొంగలు, మత్తుపదార్థాలకు బానిసైనవారు ఎంతో వయ్యారంగా నడిచారు. ఒక్క రాత్రిలో వారి జీవితమే మారిపోయింది. ఏ చేతితో వారిని అసహ్యించుకున్నారో, అదే చేతులు ఆ బాలలతో కరచాలనం చేశాయి. ఆమె మనసు ఆనందంతో పొంగిపోయింది.
 మరింత మంది బాలతారల జీవితాలను మార్చడం కోసం కొత్త కొత్త ఆలోచనలు చేస్తున్న రాశి ఆనంద్ మరిన్ని విజయాలు సాధించాలని ఆశిద్దాం.

 - డా.వైజయంతి
 

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement