స్టంట్ హీరో దారా సింగ్...
దారా సింగ్ అంటే రుసుం-ఏ- హింద్. అంతటి పహిల్వాన్ మరొకడు లేడని పేరు. బహుశా అప్పట్లో పండితులు పామరులు అన్న తేడా లేకుండా భారతదేశం అంతటికీ తెలిసిన ఆటగాడు ఇతడొక్కడేనేమో. అమృత్‌సర్‌కు ముప్పై కిలోమీటర్ల దూరంలో పుట్టాడు. ఆరడుగుల 2 అంగుళాల పొడవు, 120 కిలోల బరువు, 53 అంగుళాల విశాలమైన ఛాతీ... పహిల్వాన్‌గా రాణించడానికి ఇంతకుమించి ఏం కావాలి. అయితే దేశంలో ఉండగా ఈ పని సాధ్యం కాలేదు. సింగపూర్‌లో బాబాయి పని చేస్తుంటే అతడితో పాటు వెళ్లి అక్కడ తగిన తిండి దొరికే పరిస్థితి ఏర్పడ్డాక పహిల్వాన్‌గా మారాడు. అప్పటికే ‘హెర్క్యులస్’ వంటి సినిమాలు కలెక్షన్లు కురిపిస్తున్నాయి.
ఇండియన్ హెర్క్యులస్ కోసం తమిళ, ఉత్తరాది నిర్మాతలు వెతుకుతున్నారు. దారాసింగ్ వాళ్ల కళ్లల్లో పడ్డాడు. ఎవరో వచ్చి సినిమాల్లో చేస్తావా అడిగితే ‘స్టంట్స్ వరకూ చేస్తాను. యాక్టింగ్‌కు ఇంకొకరిని పెట్టుకోండి’ అన్నాడట. అంతటి అమాయకుడు. హీరో అంటే యాక్టింగు, స్టంట్సు అన్నీ చేయాలి అని ఒప్పించారు. రిటైర్ అయిన పహిల్వాన్లు ఆర్థిక బాధలు పడటం అప్పటికే గమనించిన దారాసింగ్ సినిమాల్లో చేయడం వల్ల నాలుగు డబ్బులు వస్తే చివరి రోజుల్లో పనికొస్తాయని ఒప్పుకున్నాడు. అప్పట్లో ఉర్దూ వాడకం ఎక్కువగా ఉండేది. దారాసింగ్‌కు రాదు. మొదటి నాలుగు సినిమాల్లో డబ్బింగ్ చెప్పించి ఐదో సినిమా నుంచి పూర్తి స్థాయి హీరోని చేశారు. దారాసింగ్ వల్ల కింగ్ కాంగ్, శాంసన్, డాకూ మంగళ్‌సింగ్ వంటి స్టంట్ సినిమాలు ప్రేక్షకులు చూడగలిగారు. ఆయన పక్కన ఎవరూ చేయకపోతే ముంతాజ్ చాలా సినిమాలు చేసి ఆయనను నిలబెట్టింది. దారాకు కుస్తీలో వరల్డ్ చాంపియన్‌షిప్ ఉంది. రాజ్యసభకు నామినేట్ అయిన తొలి ఆటగాడు ఆయన. రామాయణం సీరియల్‌లో హనుమంతుడిగా వేయడం వల్ల ఆబాలగోపాలానికి మరోమారు దగ్గరయ్యాడు. దారా అంటే భారత్ బలం. కండ. దేహ ధారుడ్యం. 2012లో 83 ఏళ్ల వయసులో మరణించిన ఆయన జీవితాన్ని పరిపూర్ణం చేసుకోగలిగిన భాగ్యశాలి.