రజనీకాంత్‌... స్టెంట్‌ కథ | Rajinikanth undergoes procedure for aortic repair | Sakshi
Sakshi News home page

రజనీకాంత్‌... స్టెంట్‌ కథ

Published Sun, Oct 6 2024 4:18 AM | Last Updated on Sun, Oct 6 2024 4:18 AM

Rajinikanth undergoes procedure for aortic repair

 అయోర్టిక్‌ అన్యూరిజం

అయోర్టిక్‌ అన్యురిజమ్‌ గురించి తెలుసుకునే ముందర అసలు అన్యురిజమ్స్‌ అంటే ఏమిటో చూద్దాం. బెలూన్‌ ఊదినప్పుడు అంతటా అది సాఫీగా సాగుతుంది. కానీ ఎక్కడైనా బెలూన్‌ గోడలు పలుచగా ఉన్నచోట అక్కడ అది ఉబ్బినట్లు అవుతుంది. అదే తరహాలో రక్తనాళాలు కూడా పలుచబారినచోట బలహీనంగా ఉండి  ఉబ్బినట్లుగా అయిపోతాయి. ఇలా రక్తనాళాలు పరచబారి ఉబ్బినట్లుగా అయి΄ోవడాన్ని అన్యురిజమ్స్‌ అంటారు. 

ఉబ్బిన చోటను బట్టి పేరు... 
మెదడు, కడుపు మొదలుకొని, కాళ్లవరకూ రక్తనాళాలు ఎక్కడైనా బెలూన్‌లా ఉబ్బవచ్చు. ఉబ్బిన చోటును బట్టి డాక్టర్లు వాటికి పేరు పెడతారు. ఉదాహరణకు మెదడులో ఉబ్బితే సెరిబ్రల్‌ అన్యురిజమ్స్‌ లేదా మామూలుగా అన్యురిజమ్స్‌ అని వ్యవహరిస్తారు. కడుపు భాగంలో ఉబ్బడాన్ని ‘అబ్డామినల్‌ అన్యురిజమ్‌’ అని, ఛాతీలో జరిగితే ‘థొరాసిక్‌ అన్యురిజమ్‌’గా పేర్కొంటారు. ఇప్పుడు రజనీకాంత్‌ విషయంలో ‘అయోర్టా’లోని రక్తనాళాలు ఉబ్బడం వల్ల దాన్ని అయోర్టిక్‌ అన్యురిజమ్‌గా పేర్కొంటారు.
 
అన్యురిజమ్‌ ఉన్న ప్రదేశాన్ని బట్టి లక్షణాలిలా...
గొంతు బొంగురుపోవడం ∙మింగడంలో ఇబ్బంది 

గొంతు వాపు 

ఛాతీపై భాగంలో లేదా ఛాతీ వెనకాల వీపు భాగంలో నొప్పి 

వికారం, వాంతులు ∙గుండె వేగంగా కొట్టుకోవడం (టాకికార్డియా). 

నిర్ధారణ... 
అయోర్టిక్‌ అన్యురిజమ్‌ని గుర్తించడానికి అల్ట్రాసౌండ్‌ మొదటి పరీక్ష. ఇందులో అయోర్టిక్‌ అన్యురిజమ్‌ కనిపిస్తే దాన్ని నిర్ధారణ చేయడానికి సీటీ స్కాన్‌ గాని, ఎమ్మారై గాని, యాంజియోగ్రామ్‌ గాని చేస్తారు. వాటి సరైన పరిమాణం, ఎంతభాగం ఉబ్బింది అనే విషయాలు సీటీస్కాన్‌ లేదా ఎమ్మారైలో తెలుస్తాయి. 

చికిత్సలు : ∙అన్యురిజమ్‌ కనుగొనగానే దీనికి తక్షణం శస్త్రచికిత్స అవసరం ఉండదు. అయితే అది చిట్లిపోకుండా జాగ్రత్త కోసం రక్త΄ోటును నియంత్రణలో ఉంచేందుకు మందులు వాడతారు. అప్పటి నుంచి డాక్టర్లు అన్యురిజమ్‌ పెరుగుదలను తరచూ సీటీ స్కాన్‌ చేస్తూ గమనిస్తూ ఉంటారు. 

 ఏడాదిలో అది 0.5 సెం.మీ. నుంచి  1 సెం.మీ. పెరిగితే, అప్పుడు దానికి రిపేరు చేయాల్సి ఉంటుంది. (సైజు ఎంతన్నది కాకుండా దాని పెరుగుదల రేటును బట్టి ఈ రిపేరు జరగాలి). ∙ఐదు సెంటీమీటర్ల లోపు ఉండే అబ్డామినల్‌ అయోర్టిక్‌ అన్యురిజమ్‌ కి మందులతోనే చికిత్స చేస్తారు. 5.5 సెంటీమీటర్ల పరిమాణం దాటినప్పుడు వాటికి ఆపరేషన్‌ గాని లేదా స్టెంట్‌ గాని ఉపయోగించి చికిత్స చేస్తారు. అయోర్టిక్‌ అన్యురిజమ్‌ పరిమాణం ఆరు నెలల్లో 0.5 సెంటీమీటర్స్‌ కన్నా ఎక్కువ ఉన్నప్పుడు లేదా అయోర్టిక్‌ అన్యురిజమ్‌ వల్ల లక్షణాలు కనబడుతున్నప్పుడు లేదా అన్యురిజమ్‌ పగిలిపోయే అవకాశం ఉన్నప్పుడు కూడా ఆపరేషన్‌ కూడా అవసరం పడవచ్చు. 

స్టెంటింగ్‌ విధానం: ఈ ప్రక్రియలో కాలు ద్వారా ఒక లోహపు స్టెంట్‌ ని అయోర్టిక్‌ అన్యురిజమ్‌ లోకి ప్రవేశపెట్టడం ద్వారా అన్యురిజమ్‌ చికిత్స చేస్తారు. సుమారుగా రెండు గంటలు పట్టే ఈ ప్రక్రియని ఇంటర్వెన్షనల్‌ కార్డియాలజిస్టులు నిర్వర్తిస్తారు. సాధారణంగా ఈ ప్రక్రియ పూర్తయిన రెండు రోజుల్లో ఆసుపత్రి నుంచి డిశ్చార్జి చేస్తారు. తర్వాత రక్తం పల్చగా అయ్యే మందులు కొంత కాలం ΄ాటు వాడాలి. ప్రక్రియ సజావుగా సాగితే కాంప్లికేషన్‌​ ఉండే అవకాశం బాగా తక్కువ. ప్రస్తుతం రజనీకాంత్‌కు చేసిన చికిత్స ఇదే. 

శస్త్రచికిత్స ఎప్పుడంటే... 
∙బాధితులు భారీ బరువులెత్తడం, ఫర్నిచర్‌ కదపడం, ఛాతీపై బరువు పడే పని చేయడం వంటి అంశాలు అన్యురిజమ్‌పై ప్రభావం చూపవచ్చు. ఈ సమయాల్లోగానీ లేదా ఇతరత్రాగానీ అన్యురిజమ్‌ హఠాత్తుగా చిట్లితే కార్డియోథొరాసిక్‌ సర్జన్లు అప్పటికప్పుడు శస్త్రచికిత్స నిర్ణయాన్ని తీసుకోవాల్సి వస్తుంది. కొన్ని సందర్భాల్లో శస్త్రచికిత్సను కొంతకాలం వాయిదా వేసేందుకు కూడా స్టెంటింగ్, ఆర్టిఫిషియల్‌ గ్రాఫ్టింగ్‌ వంటి ప్రత్యామ్నాయ చికిత్సలను డాక్టర్లు ఎంచుకుంటారు. అంటే బాధితుల పరిస్థితిని బట్టి ఏ ప్రక్రియను అనుసరించాలో డాక్టర్లు నిర్ణయిస్తారు.                 ∙

కారణాలు... 
 హైపర్‌టెన్షన్‌ (హైబీపీ) ∙రక్తనాళాల గోడలు మందంగా మారడం (అథెరోస్కి›్లరోసిస్‌); అలాగే రక్తనాళాల్లో కొవ్వు, కొలెస్ట్రాల్‌ అధికంగా పేరుకుపోవడంవల్ల రక్తనాళం గోడపై ఒత్తిడి పడి ఉబ్బు వచ్చే అవకాశం / ముప్పు ఎక్కువ ∙వృద్ధాప్యం (వయసు పెరుగుతున్న కొద్దీ రక్తనాళాల గోడల్లో మార్పులు వస్తూ అవి బిరుసుగా, మందంగా మారుతుంటాయి) ∙కొన్ని కనెక్టివ్‌ టిష్యూ జబ్బులు పోగతాగే అలవాటు (దీనివల్ల అయోర్టా గోడకు గాయమై చిట్లే ప్రమాదం ఎక్కువ) జన్యుపరమైన కారణాలతో పుట్టుకతోనే వచ్చే మార్ఫన్‌ లేదా ఎహ్లర్‌–డాన్లోస్‌ సిండ్రోమ్‌ వంటి వ్యాధుల కారణంగా.

లక్షణాలు... 
నిజానికి తొలిదశల్లో అన్యురిజమ్స్‌తో ఎలాంటి లక్షణాలూ... అంటే నొప్పి, ఇతరత్రా ఇబ్బందులు కనిపించకపోవచ్చు. పలచబడిన చోట మరింత బలహీనపడుతూ, ఉబ్బిన భాగంలో ఉబ్బు మరింతగా పెరుగుతుంటుంది. సాధారణంగా ఇతర ఆరోగ్యసమస్యల గురించి వెదుకుతున్నప్పుడు ఇవి అనుకోకుండా బయటపడవచ్చు. అన్యురిజమ్స్‌ బాగా పెరిగి, పక్కనున్న అవయవాలపై ఒత్తిడి కలిగించవచ్చు లేదా బాగా పలుచబడిపోయిన రక్తనాళం అకస్మాత్తుగా చిట్లవచ్చు. దీన్ని అయోర్టిక్‌ డిసెక్షన్‌ అంటారు. ఈ అన్యురిజమ్‌ పగిలి తీవ్ర రక్తస్రావం జరిగి, ప్రాణాపాయ పరిస్థితీ ఏర్పడవచ్చు. 

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement