సాక్షి, హైదరాబాద్: కేన్సర్ పేషంట్లకు వైద్య చికిత్సతో పాటు మానసిక స్థైర్యం అందించాల్సిన అవసరం ఎంతో ఉందని ప్రముఖ సినీతార సోనాలి బింద్రే తెలిపారు. స్వయంగా తనకే కేన్సర్ ఉందని తెలిసిన సమయంలో ఇక తన జీవితం ముగిసిపోయిందని, ఆవేదనతో కృంగిపోయానని, కానీ తన భర్త అందించిన మానసిక స్థైర్యం, తక్షణ ఆరోగ్య సంరక్షణతో కేన్సర్ నుంచి బయటపడ్డానని ఆమె అన్నారు. అక్టోబర్.. బ్రెస్ట్ కేన్సర్ అవేర్‌నెస్ మంత్ నేపథ్యంలో జీవీకే హెల్త్‌హబ్ ఆధ్వర్యంలో ప్రత్యేకంగా ప్యానెల్ చర్చ నిర్వహించగా, ఇందులో సోనాలితో పాటు ప్రముఖ సామాజికవేత్త పింకీరెడ్డి, జీవీకే హెల్త్‌హబ్ మెడికల్ ఆంకాలజిస్ట్ డాక్టర్ స్నేహసాగర్ పాల్గొన్నారు.
ఈ సందర్భంగా సోనాలి బింద్రే మాట్లాడుతూ.. రొమ్ము కేన్సర్‌ను మొదటి దశలోనే స్క్రీనింగ్ టెస్టులతో గుర్తించి చికిత్స అందించగలిగితే మళ్లీ సాధారణ జీవితాన్ని కొనసాగించవచ్చని, దీనికి తానే ఒక నిదర్శనమని అన్నారు. కానీ ఈ ప్రయాణం ఎంతో వేధనతో కూడుకున్నది, ఆ సమయంలోనే జీవితమంటే ఏంటో తెలిసేలా చేసిందని చెప్పారు. ముందస్తుగా కేన్సర్‌ను గుర్తించే స్క్రీనింగ్ టెస్టులతో డబ్బులు వృథా అని చాలా మంది నిర్లక్ష్యం చేస్తున్నారు.. చిన్న మొత్తాలకు చూసుకుంటే, ప్రమాదవశాత్తు కేన్సర్ భారిన పడితే అంతకు మించిన డబ్బులను కోల్పోవడమే కాకుండా విలువైన జీవితాన్ని సంక్షోభంలోకి నెట్టినవారవుతారని ఆమె సూచించింది.
వంశపారపర్యంగా 5 నుంచి 10 శాతమే..
మహిళల్లో రొమ్ము కేన్సర్ కేసుల సంఖ్య అధికంగా పెరుగుతుంది. 40 ఏళ్లు దాటిన మహిళలు ఖచి్చతంగా కేన్సర్‌కు సంబంధించిన స్క్రీనింగ్ టెస్టులు చేసుకోవాలని పింకీరెడ్డి సూచించారు. ఒక మహిళ దీర్ఘకాలిక రోగాలబారిన పడితే ఆ కుటుంబమంతా అస్తవ్యస్తంగా మారుతుందని అన్నారు. ఈ సందర్భంగా ముందస్తుగా రొమ్ము కేన్సర్‌ను గుర్తించగలిగే కొన్ని చిట్కాలను, సంరక్షణ పద్దతులను గురించి మెడికల్ ఆంకాలజిస్ట్ డాక్టర్ స్నేహ సాగర్ వివరించారు. రొమ్ము కేన్సర్ మహిళలకే కాదు కొంత మంది పురుషులకు కూడా వచ్చే అవకాశముందని ఆమె తెలిపారు. ప్రముఖ సినీతార నమ్రతా శిరోద్కర్, శిల్పారెడ్డి తదితరులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment