హైదరాబాద్: బ్యాడ్మింటన్ స్టార్ పీవీ సింధు ఉషాలక్ష్మి రొమ్ము క్యాన్సర్ ఫౌండేషన్‌ను అభినందించారు. సాంకేతికత సహాయంతో ప్రజల ఇళ్లకే వెళ్లి రొమ్ము క్యాన్సర్ ముందస్తు గుర్తింపుపై అవగాహన కల్పించడం గొప్ప కార్యక్రమం అన్నారు. రొమ్ము క్యాన్సర్‌పై అగ్మెంటెడ్ రియాలిటీ సేవల్ని సోమవారం సింధు ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. మహిళల పాలిట రొమ్ము క్యాన్సర్ పెనుశాపంగా మారుతోంది. ఈ క్యాన్సర్ మహమ్మారిపై సమగ్రమైన అవగాహన కల్పించే లక్ష్యంతో ఉషాలక్ష్మి బ్రెస్ట్ క్యాన్సర్ ఫౌండేషన్ చేస్తున్న కృషికి, ఫౌండేషన్ వ్యవస్థాపకులు డా. పి రఘురామ్‌కు అభినందనలు. రొమ్ముక్యాన్సర్‌పై నిర్వహించే అనేక కార్యక్రమాల్లో ఇప్పటికే పాల్గొన్నాను. ఈ కార్యక్రమం ప్రజలకు చేరువై విజయవంతం అవడంలో నా సెలబ్రిటీ హోదా తోడ్పడితే అది నా అదృష్టంగా భావిస్తాను’అన్నారు.
ఉషాలక్ష్మి బ్రెస్ట్ క్యాన్సర్ ఫౌండేషన్ వ్యవస్థాపకులు పి.రఘురామ్ మాట్లాడుతూ.. బ్రెస్ట్ క్యాన్సర్ అంటేనే ఏదో మాట్లాడకూడని విషయంగా పరిస్థితులు మారాయి. దీనిపై అందరూ అవగాహన పెంచుకొని ఆరోగ్యాన్ని కాపాడుకొనే పరిస్థితులు రావడానికి గత 12 ఏళ్లుగా ఉషాలక్ష్మీ ఫౌండేషన్ కృషి చేస్తోంది. ప్రపంచంలోనే మొదటిసారి లైఫ్‌సైజ్ అగ్మెంటెడ్ రియాలిటీని ఉపయోగించి మా సంస్థ ఇంటింటికీ వెళ్లి అవగాహన కల్పిస్తోంది. ఈ కార్యక్రమాన్ని నా దత్తత గ్రామమైన ఇబ్రహీంపట్నం నుంచే ప్రారంభిస్తున్నాం. ఈ కార్యక్రమాన్ని దేశవ్యాప్తంగా అన్ని గ్రామాల్లో అమలు చేయాలని కోరుతూ ప్రధానికి లేఖ రాయనున్నాం. చరిత్రాత్మకమైన ఇలాంటి కార్యక్రమాల్లో తమకు తోడ్పాటునందించినందుకు పీవీ సింధుకు కృతజ్ఞతలు’అని పేర్కొన్నారు.
'ఏబీసీస్ ఆఫ్ బ్రెస్ట్ హెల్త్' పేరిట 2017లో ఉషాలక్ష్మి బ్రెస్ట్ క్యాన్సర్ ఫౌండేషన్ ఒక మొబైల్ యాప్ తీసుకొచ్చినట్లు తెలంగాణ ప్రభుత్వ ఐటీ శాఖ కార్యదర్శి జయేశ్ రంజన్ తెలిపారు. దేశంలో ఎక్కువమంది మాట్లాడే 12 భాషలో దీనిని తయారు చేశారని వెల్లడించారు. నేటి పరిస్థితుల్లో రొమ్ము క్యాన్సర్ గురించి తెలుసుకోవడానికి ఇది ప్రజలకు ఎంతో మేలు చేస్తుందని అన్నారు.
Comments
Please login to add a commentAdd a comment