'Divya Bollareddy' won the Gold medal at the 21st Asia Masters Athletics Championships - Sakshi Telugu
Sakshi News home page

విశ్వాసమే గెలిపించింది

Published Tue, Dec 24 2019 12:22 AM | Last Updated on Tue, Dec 24 2019 2:24 PM

Success Story Of Athlete Divya Bollareddy - Sakshi

దివ్యా బొల్లారెడ్డి

వివాహం స్త్రీని ఏమీ సాధించనివ్వదని ఒక అపోహ. వివాహం జరిగి, పిల్లలు పుట్టి, 40 ఏళ్లు వచ్చేశాక స్త్రీలు  ఎంతకూ సాధించే అవకాశం లేదనేది తిరుగులేని అపోహ. కాని– ఈ అపోహలన్నీ తప్పు అని నిరూపించారు దివ్యా బొల్లారెడ్డి. 42 ఏళ్ల వయసులో ఆసియా మాస్టర్స్‌ అథ్లెటిక్స్‌లో వింటిని వొదిలిన  బాణంలా దూసుకువెళ్లి ఆమె స్వర్ణపతకాన్ని సాధించారు. అంతేకాదు ప్రపంచ మాస్టర్స్‌ అథ్లెటిక్స్‌లో ఎంట్రీ పొందారు. దైవం మీద తనకున్న విశ్వాసమే ఈ గెలుపును ఇచ్చిందని,  ఈ గెలుపు దైవానిదేనని ఆమె వినమ్రంతో సాక్ష్యం చెబుతున్నారు.

ఈ నెల మొదటివారంలో మలేసియాలోని కుచింగ్‌లో ‘ఆసియా మాస్టర్స్‌ అథ్లెటిక్స్‌ ఛాంపియన్‌షిప్స్‌’ జరిగాయి. 35 ఏళ్లు పైబడినవారు ఈ పోటీలలో పాల్గొనడానికి అర్హులు. ఆసియా ఖండంలోని 29 దేశాల నుంచి 2,500 మంది అథ్లెట్లు పాల్గొన్నారు. అంతపోటీని ఎదుర్కొని కూడా 40 ఏళ్ల విభాగంలో మన దేశానికి 800 మీటర్ల పరుగుపోటీలో బంగారు పతకం, 400 మీటర్ల పరుగుపోటీలో రజతపతకం సాధించారు నలభై రెండేళ్ల దివ్యారెడ్డి. ఆమె కేవలం అథ్లెట్‌ మాత్రమే కాదు. మీడియా రంగంలో ఉన్నతోద్యోగి కూడా. తెలుగు ప్రాంతాల స్త్రీలనే కాదు, దేశంలో ఉన్న స్త్రీలకు కూడా స్ఫూర్తినిచ్చే ఆసక్తికరమైన కథను ఆమె సాక్షితో పంచుకున్నారు.

ఆటలు తెలియవు
మాది రాయలసీమే అయినా హైదరాబాద్‌లోనే పుట్టి పెరిగాను. ఇక్కడ బిఎస్సీ చేసి అమెరికాలో కంప్యూటర్స్‌లో ఎం.ఎస్‌ చేశాను. చదువులో చురుగ్గా ఉన్నాను కాని ఆటలు పెద్దగా ఇంట్రస్ట్‌ ఉండేది కాదు. మా కుటుంబాలలో మగవారు కొందరు ఫిట్‌నెస్‌ మీద శ్రద్ధ పెట్టి కృషి చేయడం తెలుసు. స్త్రీలకు ఆ విషయంపై ప్రత్యేక శ్రద్ధ ఉండేది కాదు. అందరూ ఆడుకునే చిన్న చిన్న ఆటలు ఆడుకోవడం, నాలుగేళ్లకు ఒకసారి జరిగే ఒలింపిక్స్‌ పోటీలను టీవీలో చూడటం తప్ప నేను ఈ రంగానికి వస్తానని ఎప్పుడూ అనుకోలేదు. వివాహం జరిగి, పిల్లలు పుట్టాక అనుకోకుండా ఈ రంగంలో అడుగుపెట్టాను.

బాబు పుట్టాక...
నాకు ఒక పాప. ఒక బాబు. బాబు పుట్టాక సంవత్సరం తర్వాత ఫిట్‌నెస్‌ మీద శ్రద్ధ పెట్టాలనిపించింది. ఇంట్లోనే ట్రెడ్‌మిల్‌ మీద రన్నింగ్‌ చేయడం మొదలెట్టాను. నేను సన్నగా ఉండటం, ట్రెడ్‌మిల్‌ మీద ఉత్సాహంగా పరిగెత్తడం చూసిన ఒక స్నేహితురాలు ‘బాగా పరిగెడుతున్నావ్‌... రోడ్‌రేస్‌లో పాల్గొనచ్చు కదా’ అని సలహా చెప్పింది. 2013లో అనుకుంటాను సిటీలో ‘బిట్స్‌ పిలాని యానివర్సరీ 10కె రన్‌’ జరిగింది. అందులో పాల్గొనమని అందరూ ప్రోత్సహించారు. నాకు అంతవరకూ ఆ దృష్టి లేదు. సరే.. స్నేహితులతో సరదాగా ఉంటుందని పాల్గొన్నాను. 10కె రన్‌ అంటే సామర్థ్యాన్ని కొనసాగించే శక్తి ఉండాలి. ఆ దేవుడి కృప వల్ల అది నాకున్నట్టుంది. పోటీలో మూడో స్థానంలో వచ్చాను. అందరూ మెచ్చుకున్నారు. ఇక మీదట పరుగు మీద దృష్టి పెట్టాలని సూచించారు. అలా పరుగు మీద ఆసక్తి కలిగింది.

పిల్లల స్ఫూర్తితో
మా పిల్లలు స్విమ్మర్లు. పాపకు 15, బాబుకి 12 సంవత్సరాలు. ప్రాక్టీసు కోసం రోజూ వెంటబెట్టుకుని వెళ్తుంటాను. నేను రన్నింగ్‌ ప్రాక్టీస్‌ చేస్తుంటే బాబు ఆశ్రయ్‌ సైకిలింగ్‌ చేస్తూ నాకు తోడుగా ఉంటాడు.
పిల్లలిద్దరూ రెండు మూడు గంటలు ప్రాక్టీస్‌ చేస్తారు. ఈతే కాదు, ఏ క్రీడ అయినా శరీరాన్ని గొప్ప క్రమశిక్షణతో ఉంచుతుందని ఆ ప్రాక్టీస్‌ చూస్తే నాకు అనిపించేది. గృహిణిగా, ఉద్యోగిగా నాకు ఎన్ని బాధ్యతలు ఉన్నా నేను పరుగు మీద దృష్టి పెట్టడానికి ఈ స్ఫూర్తి ఒక కారణం. ట్రెడ్‌మిల్‌ మీద 10 కిలోమీటర్ల దూరాన్ని గంటా మూడు నిమిషాల్లో పూర్తి చేయడం నాకు నేనే ప్రాక్టీసు చేశాను. దానిని ఒక్కో నిమిషం తగ్గించుకుంటూ ఇప్పుడు 49 నిమిషాలలో పూర్తయ్యేలా సాధన చేశాను.

‘ఆసియా మాస్టర్స్‌ అథ్లెటిక్స్‌ ఛాంపియన్‌షిప్స్‌’లో సాధించిన బంగారు, రజత పతకాలతో దివ్యా బొల్లారెడ్డి

దైవం ఇచ్చిన విజయం
నేను ఇలా ఈ స్థాయికి వచ్చానంటే అదంతా దేవుడు నాయందు చూపిన కరుణ వల్లే అని అనుకుంటాను. తాత ముత్తాతల నుంచి దైవ విశ్వాసులుగా ఉన్న మా కుటుంబం ఆశీస్సులు ముఖ్యంగా మా అమ్మ ప్రార్థనలు నాకు మానసికంగా, శారీరకంగా ఎంతో బలాన్నిచ్చాయి. గృహిణిగా, ఉద్యోగిగా ఉన్న నేను అథ్లెట్‌గా మారడం కేవలం ఆ దేవుడి గొప్పతనం వల్లే అనిపిస్తుంది. నా కోసం ఆయన రచించిన ప్రణాళిక వల్లే నేను అథ్లెట్‌ కాగలిగాను. ఆయన గొప్పతనం చాటడానికే నాకు విజయం చేకూరింది అని కూడా నా విశ్వాసం. పిల్లలతో, ఉద్యోగంతో అలిసిన ప్రతిసారి నాకు బైబిల్‌ ఒక ఉత్సాహాన్ని ఇచ్చేది. నేను ఇక నా వల్ల కాదు, వెనక్కు మరలుదాం అనుకున్నప్పుడల్లా ‘డెయిలీ బ్రెడ్‌’ నాకు ఎంతో ప్రేరణనిచ్చేది. అన్నిటినీ మించి క్రిస్టమస్‌ వేడుకలు జరిగే డిసెంబర్‌ మాసంలో నేను అసియా పోటీలలో విజయం సాధించడాన్ని కూడా నేను దైవ విజయంగానే భావిస్తాను.
– దివ్యారెడ్డి

హాఫ్‌ మారథాన్, ఫుల్‌ మారథాన్‌...
సరదాగా మొదలైన నా పరుగు ఇప్పుడు హాఫ్‌ మారథాన్‌ (21 కి.మీ)కు చేరింది. హైదరాబాద్‌లో జరిగిన ఎయిర్‌టెల్‌ హాఫ్‌మారథాన్‌లో పాల్గొని అన్ని కిలోమీటర్లు పరిగెత్తగలనని నిరూపించాను. ఆ తర్వాత 2016లో ముంబైలో జరిగిన ‘టాటా ముంబై మారథాన్‌’లో ఫుల్‌ మారథాన్‌ (42 కి.మీ) పరిగెత్తాను. అయితే ఏ సాధనకైనా ట్రైనర్‌ అవసరమని అర్థమయ్యాక రాజశేఖర్‌ కాలివెంకట దగ్గర ట్రైనింగ్‌ తీసుకోవడం మొదలుపెట్టాను. యూనివర్శిటీ ఆఫ్‌ హైదరాబాద్‌లో ఫిజికల్‌ ఎడ్యుకేషన్, స్పోర్ట్స్‌ విభాగానికి డైరెక్టర్‌ అయిన మా కోచ్‌ నేను స్ప్రింట్‌లో (తక్కువ దూరపు పరుగు) పాల్గొంటే బాగుంటుందని సూచించారు. అంతేకాదు... స్పోర్ట్‌ సైన్స్, న్యూట్రిషన్‌లో పీహెచ్‌డీ చేసి ఉండడంతో నా డైట్‌లో కూడా మార్పులు చెప్పారు. ఇక స్ప్రింట్‌లో అంటే పూర్తిస్థాయి అథ్లెటిక్‌గా మారాలి. గాయాల ప్రమాదం ఉంటుంది. చాలా శారీరక శ్రమ చేయాలి. డైట్‌ పాటించాలి. చాలామంది వద్దు అని వారించారు. కాని నేను అవన్నీ చేశాను. జూలై 2019లో గోవాలో జరిగిన ‘నేషనల్‌ మాస్టర్స్‌ అథ్లెటిక్స్‌లో’ 800 మీటర్ల పరుగులో, 400 మీటర్ల పరుగులో కూడా గోల్డ్‌ సాధించేసరికి ఆసియా అథ్లెటిక్స్‌కు క్వాలిఫై అయ్యాను.

కోచ్‌ రాజశేఖర్‌ కాలివెంకటతో దివ్య

ఆసియా గోల్డ్‌
మలేసియాలో జరిగిన 800 మీటర్ల పరుగును నేను మర్చిపోలేను. నాతోపాటు ఫీల్డ్‌లో 13 మంది ఉన్నారు. కాని దైవాన్ని తలుచుకుని, దేశాన్ని తలుచుకుని ఒక్కసారిగా పరుగు తీశాను. లక్ష్యం పూర్తి చేసేసరికి కరతాళధ్వనులు మిన్నంటాయి. ఇండియాకు గోల్డ్‌ అని ప్రకటించారు. చాలా ఉద్వేగం కలిగింది. 400 మీటర్ల పరుగులో రజతం సాధించడం కూడా చాలా సంతోషం కలిగించింది. ఇప్పుడు నా దృష్టి అంతా వచ్చే సంవత్సరం టొరెంటో (కెనడా)లో జరిగే ‘వరల్డ్‌ మాస్టర్స్‌ అథ్లెటిక్స్‌ ఛాంపియన్‌షిప్స్‌’పైనే. దైవం తోడుగా అక్కడ కూడా విజయం సాధిస్తానని ఆశిస్తాను.
– సాక్షి ఫీచర్స్‌ డెస్క్‌

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement