మాలోనే.. మాతోనే.. నాన్న | sunday special chit chat with venkatesh and | Sakshi
Sakshi News home page

మాలోనే.. మాతోనే.. నాన్న

Published Sat, Jun 18 2016 10:05 PM | Last Updated on Mon, Sep 4 2017 2:49 AM

మాలోనే.. మాతోనే.. నాన్న

మాలోనే.. మాతోనే.. నాన్న

ప్రతి సక్సెస్‌ఫుల్ లైఫ్ వెనుక గొప్ప కష్టాలు కూడా ఉంటాయి. రామానాయుడుగారి జీవనయానంలో ఎన్నో ఆటుపోట్లు. ఎన్నో ఓటములు. ప్రతి ఓటమీ.. ‘‘ఇంక చాల్లే, ఊరికి వెళ్లిపోతాం పద’’ అని గొణిగిన ఓటమే. ఆ ప్రతి ఓటమినీ ఒక అధ్యాయంగా మార్చుకొని.. ఒక సక్సెస్‌స్టోరీని రచించారు రామానాయుడు గారు. ఇది తప్పకుండా ఒక అందమైన స్టోరీ. కానీ, అంతకంటే అందమైన, లోతైన, ఉద్వేగభరితమైన కథ ఈ కథలో దాగి ఉంది. నాయుడుగారు ఈ కథను ఎవరికీ చెప్పలేదు. తన పిల్లలకు కూడా చెప్పలేదు. కథలో ఉన్నవన్నీ కష్టాలే. అవేవీ పిల్లలకు తెలియనివ్వలేదు. ఆనందాన్ని పంచుకుంటే రెండింతలవుతుందని మాత్రమే పిల్లలకు చెప్పారు. మరి ఇవాళ.. నాన్న లేని దుఃఖం పిల్లల్ని సగం చేసేసిందా? ‘‘కానే కాదు’’ అంటున్నారు సురేశ్, వెంకటేశ్.‘‘మానాన్న మాతోనే ఉన్నారు.ఇప్పుడు రెండింతలు ఉన్నారు’’ అంటున్నారు.  నేడు ‘ఫాదర్స్ డే’. ఇది పిల్లల ఇంటర్వ్యూ.



బయటివాళ్లు ‘ది గ్రేట్ రామానాయుడుగారు’ అంటారు.. సురేశ్‌బాబు: నేనూ అదే అంటాను. కారంచేడులో రైతు కుటుంబంలో పుట్టి, సినిమాల మీద ఇష్టంతో ఇక్కడికి వచ్చారు. ‘రాముడు-భీముడు’ నుంచి ‘ప్రేమ్‌నగర్’ విడుదలయ్యేంతవరకూ ‘డూ ఆర్ డై’ అనే పరిస్థితి. ఫెయిల్యూర్‌గా ఊరికి వెళ్లకూడదనుకున్నారు. ఎన్ని ఒడిదొడుకులు ఉన్నా మాకు బెస్ట్ లైఫ్ ఇచ్చారు. బెస్ట్ స్కూల్‌లో చేర్చారు. అప్పట్లో మేం విదేశాల్లో చదువుకు నేంత డబ్బు మాకు లేదు. అయినా నేనిక్కడ ఇంజనీరింగ్ చేస్తూ, మధ్యలో మానేసి అమెరికాలో బ్యాచిలర్స్ చేస్తానంటే వద్దనలేదు. ఆర్థిక కష్టాలు ఉండేవి. కానీ, వాటి ప్రభావం మా మీద లేకుండా చూసుకునేవారు.

     
మీ నాన్నగారి తర్వాత మీరే ఇంటి పెద్దలా వ్యవహరిస్తున్నారు. చిన్నతనం నుంచి మీరింతేనా?
సురేశ్‌బాబు: మా ఊళ్లో కొంతమంది ఏవైనా కష్టాలొస్తే మా నాన్నగారికి చెప్పుకోవడానికి వచ్చేవాళ్లు. ఆయనతో చెప్పుకోలేకపోయినవాళ్లు నా ద్వారా చేరవేసేవాళ్లు. దాంతో ‘మనం కూడా ఇంటికి పెద్దే’ అని ఫీలైపోయేవాణ్ణి (నవ్వుతూ). అప్పట్నుంచే పెద్దరికం అలవాటైంది. అయితే నాకు నేనుగా వేటిలోనూ తలదూర్చేవాణ్ని కాదు. ఎవరైనా కష్టం అంటూ వస్తే మాత్రం వెళ్లేవాణ్ణి.


మీతో కష్టసుఃఖాలు పంచుకునేవారా?
సురేశ్‌బాబు: ఓసారి ఫైనాన్షియల్‌గా నాన్నగారు చాలా టైట్ పొజిషన్‌లో ఉన్నారు. మాతో చెబితే వెంకీ తన ఫ్రెండ్ ద్వారా ఎరేంజ్ చేశాడు. అది మినహా నాన్నగారు పెద్దగా కష్టాలు చెప్పుకున్నది లేదు. రాత్రి నిద్రపోయే ముందు ‘ఆస్తి ఎంత... అప్పు ఎంత’ అని లెక్కలు వేసుకునేవారు. ఇంజనీరింగ్ అయ్యాక, అప్పులు ఉన్నాయని తెలిసి కంగారుపడిపోయాను. నాన్నగారేమో ‘‘ఏంట్రా అంత కంగారు.. ఒక్క సినిమా హిట్ అయితే డబ్బులొచ్చేస్తాయ్’’ అన్నారు. అప్పుడు ‘దేవత’ సినిమా తీశాం. అన్ని ఏరియాలు అమ్మేసి, వచ్చిన లాభాలతో కొంత అప్పు తీర్చేయొచ్చన్నది నా ఆరాటం. నాన్నగారు ఒప్పుకోలేదు. మేమే రిలీజ్ చేశాం. పది లక్షలు ప్రాఫిట్ వచ్చింది. మొత్తం అప్పు తీరింది. నాన్నగారు అంత కాన్ఫిడెంట్‌గా ఉండేవారు. స్క్రిప్ట్ నుంచి సినిమా విడుదలయ్యేంత వరకూ ప్రతీదీ చూసుకునే నిర్మాతలు ఎక్కువ కాలం నిలుస్తారనీ, మందు, అమ్మాయిలు.. వంటి వ్యసనాలు ఉన్నవాళ్లు నిలవలేరని ఆయన అనుకునేవారు.

     
సేవా కార్యక్రమాలు బాగా చేసేవారు కదా...

సురేశ్‌బాబు: అప్పట్లో వినోదాభావే మా ఊరికి వస్తే, ఎవరూ ఏమీ ఇవ్వలేదు. కానీ, ఆయన చేస్తున్న ఉద్యమం కోసం మా నాన్నగారు పొలం రాసిచ్చేశారు. ఊళ్లో పెద్దవాళ్లు ‘ఏంట్రా అలా రాసిచ్చేశావ్.. మీ నాన్న ఒప్పుకోకపోతే? ’’ అని అడిగితే, ‘‘మా అమ్మ తెచ్చిన ఆస్తి కూడా ఉంది’’ అని మా నాన్నతో చెబుతా అన్నారట. నాన్నగారికి ఇవ్వడం ఇష్టం. బయటకు వెళ్తున్నప్పుడు మా అమ్మను చిల్లర అడిగి తీసుకుని, దానం చేసేవారు. చేతికి ఎంత వస్తే అంత.. లెక్క లేకుండా ఇచ్చేవారు. ఏం చేసినా మేం బాధపడే వాళ్లు కాదు. కానీ, ఆయన మంచితనాన్ని చాలా మంది తమ స్వార్థానికి ఉపయోగించుకునేవాళ్లు.

     
ఆ విషయం మీరు చెప్పడానికి ప్రయత్నించేవాళ్లు కాదా?

సురేశ్‌బాబు: మా నాన్న మాట ఇస్తే తప్పే మనిషి కాదు. కొంతమంది ఏదో కథ పట్టుకు వచ్చేవారు. నాన్నగారు కాదనలేక మాటిచ్చేసేవారు. అప్పుడు నేను వాళ్లతో ‘ఇలా మాటివ్వడం మా నాన్నకూ మంచిది కాదు. మీకూ మంచిది కాదు. కథ బాగోలేదు. మహా అయితే మాకు డబ్బులు మాత్రమే పోతాయి. కానీ, మీకు కెరీర్ పోతుంది’ అనేవాణ్ణి. కానీ, వాళ్లు సినిమా తీయడానికే డిసైడై ఫెయిల్యూర్ చూసేవాళ్లు. ఇలాంటి విషయాల్లోనే నాకూ, నాన్నకూ కొంచెం తేడా వచ్చేది. ‘పోన్లే రా..’ అనేవారు. ఒకసారి జనవరి 1న తమిళ నటుడు బాలాజీకి నాన్నగారు వంద రూపాయలిస్తే, ఆ ఏడాది మొత్తం ఆయనకు కలిసొచ్చిందట. ఆ విషయం కొంతమందికి తెలిసి, జనవరి 1న నాన్నగారి చేతుల మీద వంద రూపాయలు తీసుకోవడానికి వచ్చేవాళ్లు. ఒకళ్లతో మొదలుపెట్టినది వందల సంఖ్యలో అయిపోయింది. బ్యాగు నిండా వంద రూపాయల నోట్ల కట్టలు పెట్టుకుని, ఆఫీసులో కూర్చుని వచ్చిన ప్రతి ఒక్కరికీ ఇచ్చేవారు.

     
మీ నాన్నగారి నిర్ణయాలు మిమ్మల్ని కంగారుపెట్టేవా?
సురేశ్‌బాబు: నాన్నగారు చాలా ఫాస్ట్‌గా నిర్ణయాలు తీసుకునేవారు. దాంతో భయం వేసేది. మా నాన్నగారి ఫ్యామిలీ వాళ్లు చాలా ఫాస్ట్. మా అమ్మగారువాళ్లు జాగ్రత్తపరులన్నమట. మేం తీసిన సినిమా సూపర్‌హిట్ అయితే మా నాన్నగారి సైడ్ తాతగారైతే ‘మా వాళ్ల సినిమా సూపర్’ అని గొప్పగా చెప్పుకుంటే , అమ్మ తరఫు వాళ్లయితే ‘లెక్కలు చూశారా’ అని అడిగేవారు. నాకు మా అమ్మగారివైపు పోలికలు వచ్చాయి. ప్రతిదానికీ లెక్కలేస్తుంటాను. పిల్లలను కూడా కంట్రోల్ చేస్తుంటా. అందుకే ఇంట్లో నన్ను ‘కంట్రోల్ ఫ్రీక్’ అంటారు (నవ్వుతూ).

 
పిల్లలు చెడిపోతారేమోనని భయపడేవారా?

సురేశ్‌బాబు: నేను ‘రౌండ్‌టేబుల్’లో జాయిన్ అయ్యాక ఫ్రెండ్స్‌తో గడిపి లేట్ నైట్ ఇంటికి వెళ్లేవాణ్ణి ‘మావాణ్ణి ఫ్రెండ్స్ చెడగొట్టేస్తారేమో’’ అని అనుకునేవారాయన. విలేజ్‌లో చీకటి పడితే ఇంటికి వెళ్లిపోతారు కదా.. అది ఇక్కడ కూడా ఫాలో అయ్యేవారు. మేం చెడిపోతామేమోనని భయపడేవారు. ముందు నుంచీ ఆయనకు మందు తాగే అలవాటు లేదు. ఆరోగ్య పరిస్థితుల రీత్యా నాన్నగార్ని చిన్న గ్లాస్ వైన్ తాగమని డాక్టర్లు సలహా ఇచ్చారు. నాన్న తాగడం చూసి మేమెక్కడ చెడిపోతామేమోనని మంచి నీళ్లు తాగుతున్నట్లు కలరింగ్ ఇచ్చి, వైన్‌ను స్టెయిన్‌లెస్ స్టీల్ గ్లాస్‌లో తాగేవారు. నాకు కూడా డాక్టర్లు ‘బాగా స్ట్రెస్ ఫీలవు తున్నావు... వైన్ తాగు’ అని సలహా ఇచ్చారు. నేను 50వ ఏట తాగుతానని పోస్ట్‌పోన్ చేసుకుంటూ వచ్చా. 50వ పుట్టినరోజున వైన్ గ్లాస్ పట్టు కుంటే నేను మందు తాగబోతున్నాననే ఊహను భరించ లేక, మా అబ్బాయిని పిలిచి ‘ఒరేయ్ మీ నాన్న చేతిలో ఆ గ్లాస్ చూడలేకపోతున్నా’ అని అన్నారట. నిజానికి నాక్కూడా మింగుడుపడలేదు. అందుకే గ్లాస్ పారేశాను.

     
రానాకు మీ నాన్నగారి పేరు పెట్టాలన్నది ఎవరి ఆలోచన?
సురేశ్‌బాబు: మా వైఫ్ సిద్థార్థ్ అని పెట్టాలనుకుంటుంటే నేనే రామానాయుడు పెట్టాలని ఫిక్సయ్యా! ఆ విషయం ఎవరికీ చెప్పలేదు. బియ్యం మీద పేరు రాయిస్తున్నప్పుడు సడన్‌గా ‘రామానాయుడు’ అన్నా. నాన్నగారు చాలా సంబరపడ్డారు. మా నాన్నగారి ఫ్రెండ్ ఒకాయన నిన్ను ‘రామానాయుడు’ అని పిలవలేను అని చెప్పి ‘రానా’ అని షార్ట్ చేశారు. అదలా కంటిన్యూ అయిపోతోంది.

     
క్యాన్సర్ అని తెలిశాక ప్రొఫెషనల్‌గా స్లో కావాలనుకున్నారా?
సురేశ్‌బాబు: ఆయన స్లో అయితే బాగుంటుందేమో అని మాకనిపించింది. కానీ, వర్క్ చేయడానికే ఇష్టపడ్డారు. వెంకీ కూడా ఆయన ఇష్టప్రకారం చేయనిస్తే, హ్యాపీగా ఉంటారు కదా అనడంతో నేనేమీ అనలేదు. ఇక... తరుముకొచ్చేస్తోంది అనే అనుమానం కలిగాక ఫ్యామిలీ మెంబర్స్ మొత్తం ఆయనతోనే ఉండటం మొదలుపెట్టాం. అందుకే ‘గోపాల గోపాల’ తర్వాత వెంకీ వేరే సినిమాలు కమిట్ కాలేదు. నాన్నగారి చివరి రోజులను మేం పూర్తిగా ఆయనకే కేటాయించేశాం. మా ఆనందం ఏంటంటే.. తుది శ్వాస వరకూ ఆయన ఇబ్బందిపడలేదు. ప్రశాంతంగానే కన్ను మూశారు. అంతకుముందు మా మధ్య ఏవీ భేదాభిప్రాయాలు లేకపోయినప్పటికీ, ఆ ఏడు నెలల కాలం మా అందర్నీ ఇంకా దగ్గర చేసింది.

     
చివరి క్షణాల్లో అందరూ దగ్గరే ఉన్నారన్న మాట..

సురేశ్‌బాబు: ఆ క్షణాల్లో అందరూ ఆయన చుట్టూ ఉన్నారు. నేను మాత్రం నాన్నగార్ని ఆ పరిస్థితిలో చూడలేక బయట ఉండిపోయా (చెమర్చిన కళ్లతో). నాయుడుగారు మరణించాక మీ దగ్గర పని చేసే ఉద్యోగులు అభద్రతా భావానికి గురి కావడం సహజం....

 
సురేశ్‌బాబు: మొదట్లో వాళ్లకు ఆ ఫీలింగ్ ఉన్న మాట నిజమే. అది గ్రహించే జనవరి 1న మా నాన్నగారి ఆఫీసు రూమ్‌లో కూర్చుని, ఆయన ఇచ్చినట్టుగానే అందరికీ వంద రూపాయలు ఇచ్చాను. చాల మంది సంతృప్తిగా ఫీలయ్యారు. లెక్కలేసుకుని డబ్బులు ఖర్చు పెట్టే మనిషినే కానీ, సహాయం కూడా చేస్తుంటాను. ఎవరింట్లో అయినా ఫంక్షన్ అంటే వెళ్లడానికి బద్ధకిస్తాను. జరగకూడనిది జరిగిందని తెలిస్తే మాత్రం వెళ్లిపోతాను. ఆనంద సమయాల్లో ఎవరి అండా అవసరం లేదు. కష్ట సమయాల్లో మాత్రం కావాలి.

 
లైఫ్ విత్ ఫాదర్.. వితౌట్ యువర్ ఫాదర్...?
సురేశ్‌బాబు: తెలీకుండా బాగా ఎఫెక్ట్ అయ్యాం. నాకు ప్రేమ బయటకు చూపించడం తెలియదు. ఇప్పుడు కూడా ఏం చెప్పాలో తెలియడంలేదు. కానీ, నా మిసెస్ మాత్రం ‘మామయ్యగారు వెళ్లిపోయాక మీరు చాలా మారారు’ అంది. అదేంటో నాకు తెలియడంలేదు. ఇక రోజులు దగ్గరపడుతున్నాయని తెలిసిన తర్వాత నాన్నగారు అప్పుడప్పుడూ నన్ను ‘హగ్’ చేసుకునేవారు. ఆ స్పర్శలో ఏదో తెలియని ఫీలింగ్. అది అలా గుర్తుండిపోయింది.

 

మీ నాన్నగారి గౌరవాన్ని నిలబట్టడానికి ఏం చేయాలనుకుంటున్నారు?

 సురేశ్‌బాబు: ఆయనను భావితరాలు స్మరించుకోవడానికి ఏదో ఒకటి చేయాలనే ఆలోచన నుంచి పుట్టిందే రామానాయుడు స్టూడియోలో ఏర్పాటు చేసిన మెమోరియల్. ఇక్కడికి ఫిల్మ్ స్కూల్ స్టూడెంట్స్ వస్తారు. షూటింగ్స్ జరుగుతాయి. అలా అందరూ మా నాన్నగారిని గుర్తు చేసుకోవాలి. ఎప్పుడూ ఏది చేయాలన్నా లెక్క చూసుకునే నేను ఈ మెమోరియల్‌కి మాత్రం లెక్కలేసుకోకుండా ఖర్చుపెట్టా. టైమ్, దయ, కృషి, ఫ్యామిలీ.. అనే నాలుగు విషయాల గురించి నాన్నగారు ఎప్పుడూ చెప్పేవారు. అందుకే ఈ మెమోరియల్‌లో నాలుగు రాళ్ల మీద ఆ అక్షరాలు చెక్కించాం. అక్కడే కూర్చుని మాట్లాడేలా ఏర్పాటు చేశాం. ఇక్కడ కూర్చుని మాట్లాడుతుంటే మా నాన్నగారు ఇక్కడే ఉన్నారనే ఫీలింగ్ కలుగుతుంది. ఫార్మింగ్, ఫిలింస్ ఆయనకు బాగా ఇష్టమైన రంగాలు.  వైజాగ్‌లో ఫిల్మ్ మ్యూజియం ప్రారంభించాం. ఇప్పటికే ఆయన పేరు మీద అగ్రికల్చరల్ రూరల్ ఇన్‌స్టిట్యూట్ ఉంది. ఇక్కడే హైదరాబాద్‌లో కృషి విజ్ఞాన కేంద్రం ఏర్పాటు చేస్తున్నాం. రైతులకు ఉపయోగకరంగా ఉండేట్లు దీన్ని తీర్చిదిద్దడానికి ప్రణాళికలు వేస్తున్నాం. ఇంకా చాలా చాలా చేయాలని ఉంది.

 

నాన్నగారు ‘మోర్ దేన్ రామానాయుడు’
మీ నాన్నగారి లేని మీ ప్రపంచం గురించి...
వెంకటేశ్: టు బీ హానెస్ట్... మా మధ్య ఉన్నది ‘సోల్ టు సోల్’ కనెక్షన్. అందుకే ఆయన లేరనే ఫీలింగే లేదు. శారీరకంగా లేకపోవచ్చు.. ఆత్మ రూపంలో ఇక్కడే ఉన్నారు. మా నాన్నగార్ని ఒక మనిషిగా చూడలేదు. ఆయన అంతకు మించే అనుకున్నాను. నాన్నగారు తన గురించి మాత్రమే ఆలోచించలేదు. తన చుట్టూ ఉన్నవాళ్లందరూ ఆనందంగా ఉండాలనుకునేవారు. అంత మంచి సోల్ ఆయనది.

     
నాయుడుగారి నుంచి మీరు ఆదర్శంగా తీసుకున్నవి?

వెంకటేశ్: మా అమ్మ పట్ల ఆయన కనబర్చిన ప్రేమ, గౌరవం అద్భుతం అనాలి. ఇద్దరూ కలిసి కుటుంబాన్ని బాగా నడిపించారు. మా ఇంట్లో ప్రశాంతమైన వాతావరణం ఉండేది. కుటుంబాన్ని ఎలా ప్రేమించాలి? అనే విషయంలో నాన్నగారే ఆదర్శం. ఏ పని చేసినా వంద శాతం ఎఫర్ట్ పెట్టాలని అనేవారు. టైమింగ్స్ విషయంలో చాలా పర్ఫెక్ట్‌గా ఉండేవారు. అదే మాకూ అలవాటైంది.

     
నాయుడుగారి చివరి రోజుల్లో  మీ ఫీలింగ్స్ గురించి?

వెంకటేశ్: వాస్తవాన్ని అంగీకరించక తప్పదు. నాన్నగారు శారీరకంగా మాత్రమే ఉండరన్నది నా ప్రగాఢ నమ్మకం కాబట్టి, చివరి రోజుల్లో ఆయనతో చీర్‌ఫుల్‌గానే ఉన్నాను. నాన్నగారు కూడా అలానే ఉండేవారు. శారీరకంగా ఎనర్జీ పెద్దగా లేకపోయినా మమ్మల్ని ఎంకరేజ్ చేసేవారు. చేయబోయే సినిమాల స్క్రిప్ట్స్ గురించి అడిగి తెలుసుకునేవారు. అప్పట్లో నా సినిమాలు ‘ప్రేమ,’, ‘ధర్మచక్రం’ వంటివి హిట్టయి నప్పుడు ఆయన చాలా హ్యాపీ ఫీలయ్యారు. ‘బాగా యాక్ట్ చేశావ్‌రా’ అని సంబరపడిపోతూ చెప్పేవారు. జీవితంలో ఆయనకు అసంతృప్తి అంటూ ఏదీ లేదు. అందుకే చివరి రోజులను ప్రశాంతంగానే గడిపేశారు.

     
మీరు ఆధ్యాత్మికం గురించి మాట్లాడుతుంటారు కదా.. అప్పుడేమనేవారు?

వెంకటేశ్: మొదట్లో కొంచెం బాధపడేవారు. ‘ఏంటిది సన్యాసిలా అయిపోతున్నాడు’ అని కంగారు పడేవారు. తర్వాత అర్థం చేసుకున్నారు. నాన్నగారి చివరి రోజుల్లో ఆధ్యాత్మికం గురించి ఆయనకు బోల్డన్ని విషయాలు చెప్పేవాణ్ణి. కొన్ని మంత్రాలు కూడా చెప్పాను. ఆయన చాలా ప్రశాంతంగా వినేవారు. ‘యు ఆర్ మోర్ దేన్ రామానాయుడు.. నాన్నా’ అనేవాణ్ణి.

     
అలా ఎందుకు అనాలనిపించింది?

వెంకటేశ్: మా నాన్నగారు ఈ ప్రపంచానికి పాజిటివ్ ఎనర్జీని స్ప్రెడ్ చేయడానికే వచ్చారని నా నమ్మకం. ఆ ఎనర్జీ కొందరికే ఉంటుంది. ఇప్పటికీ ఆ ఎనర్జీ నా చుట్టూనే ఉంది. మనం బాగుండాలి.. అందరూ బాగుండాలని అనుకునేవారు. అలాంటివాళ్లు చాలా రేర్. అందుకే ‘మోర్ దేన్ రామానాయుడు’ అన్నాను.

     
ఒక కొడుకుగా మీ అమ్మగార్ని ఎలా ఓదార్చారు?

వెంకటేశ్: మా అమ్మగారికి ఇది చాలా పెద్ద లాస్. నాన్నగారు లేరనే ఒక్క విషయం తప్ప ఆమెకు మేమంతా ఉన్నాం. నాన్నగారితో అమ్మ అద్భుతమైన జీవితాన్ని చూసింది. కానీ, వాస్తవాన్ని ఒప్పుకోవాలి. ఎప్పటికైనా ఎవరైనా ఫిజికల్‌గా దూరంగా వెళ్లాల్సిన వాళ్లమే. కానీ, సోల్ కనెక్షన్ అనేది ఎప్పటికీ దూరం కాదు.

     
నాయుడిగారి గ్రాండ్ చిల్డ్రన్ మాటేంటి?
వెంకటేశ్: నాన్నగారు మమ్మల్ని ఎంత బాగా ప్రేమించారో.. మా పిల్లల్నీ అంతే బాగా ప్రేమించారు. మా ఇంట్లో పిల్లలందరికీ ఆయన ‘వెరీ లవింగ్ అండ్ కేరింగ్ తాత’. నేనూ, మా అబ్బాయి అర్జున్ కలిసి నటిస్తే చూడాలన్నది నాన్నగారి కోరిక. అర్జున్‌ని హీరోగా పెట్టి సినిమా తీయాలనుకునేవారు. ఆ కోరిక నెరవేరలేదు. నెరవేర్చుకోవడానికి మళ్లీ వస్తారు... డెఫినెట్‌గా.

 - డి.జి. భవాని

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement