మా నాన్నగారు భావి తరాలకు స్ఫూర్తి
- సురేశ్‌బాబు
‘‘ఓ రైతుగా జీవితం మొదలు పెట్టిన మా నాన్న రామానాయుడుగారు ఎంతో కృషితో నిర్మాతగా మారి, హైదరాబాద్‌కొచ్చి స్టూడియోలు కట్టారు. మాతోపాటు ఎంతోమంది నటీనటులు, సాంకేతిక నిపుణులను పరిచయం చే సిన మహావ్యక్తి ఆయన. నాన్నగారు చేసిన పనులు, చూపిన మార్గాన్ని ‘ది నర్చరింగ్ హ్యాండ్స్’ స్మారక చిహ్నం ద్వారా భావితరాల వారికి గుర్తుండిపోయేలా చేస్తున్నాం’’ అని నిర్మాత డి. సురేశ్‌బాబు అన్నారు. నేడు పద్మభూషణ్ డా. డి. రామానాయుడు 80వ జయంతి.
ఈ సందర్భంగా హైదరాబాద్‌లోని రామానాయుడు స్టూడియోలో ఆయన జ్ఞాపకార్థం ఏర్పాటు చేసిన ‘డా.డి. రామానాయుడు మెమోరియల్ ది నర్చరింగ్ హ్యాండ్స్’ స్మారక చిహ్నాన్ని ఆదివారం సురేశ్‌బాబు, వెంకటేశ్, రానా ప్రారంభించారు. సురేశ్‌బాబు మాట్లాడుతూ- ‘‘నాన్నగారి జీవితానికి సంబంధించిన జనరల్ కొటేషన్స్‌ను ఫలకాలపై ముద్రించి ఈ స్మారక చిహ్నం వద్ద ఏర్పాటు చేస్తాం. నాన్నగారి పేరుతో వైజాగ్‌లో ‘మ్యూజియం ఆఫ్ సినిమా’ను ప్రారంభిస్తున్నాం.
ఇందులో పాత చిత్రాల నెగటివ్స్, ఆయా చిత్రాల్లో వాడిన వస్తువులు, గుర్తులను భద్రపరుస్తాం. ప్రస్తుతం ఉన్నవారు, భవిష్యత్ తరాల వారు ఆ మ్యూజియంను సందర్శించి ఎన్నో విషయాలు తెలుసుకునేలా ఏర్పాటు చేశాం. మెదక్ జిల్లాలోని నర్సాపూర్‌లో కృషి విజ్ఞానకేంద్రం ద్వారా రైతులకు వ్యవసాయంపై శిక్షణ ఇవ్వనున్నాం. ఇందుకు ఏక లవ్య ఫౌండేషన్ వారు సహకరిస్తారు. కొత్తవారిని ప్రోత్సహించేందుకు చిన్న సినిమాలు తీస్తా. నాన్నగారి పేరుతో ఓ అవార్డు కూడా ఏర్పాటు చేస్తాం’’ అన్నారు. ‘‘అందర్నీ ప్రేమించడం, ప్రేమించబడటం నాన్న గారి నేచర్. మానవీయ బంధాలు, విలువలను మాకు నేర్పారు’’ అని వెంకటేశ్ చెప్పారు. ‘‘తాతగారు విజన్, వేల్యూస్‌తో ముందుకెళ్లారు కాబట్టే, గొప్ప వ్యక్తిగా, నిర్మాతగా మారారు’’ అని రానా అన్నారు.