టాలీవుడుకు చెందిన దగ్గుబాటి వెంకటేష్,సురేష్, రానాలపై కేసు నమోదైంది. ఫిలింనగర్ డెక్కన్ కిచెన్ కూల్చివేత కేసులో దగ్గుబాటి కుటుంబ సభ్యులపై కేసు నమోదు చేయాలని ఇప్పటికే నాంపల్లి కోర్టు గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన విషయం తెలిసిందే. దీంతో ఫిలిం నగర్ పోలీసులు కేసు నమోదు చేశారు. హైకోర్టు ఆదేశాలు బేఖాతరు చేస్తూ.. దక్కన్ కిచెన్ హోటల్‌ను కూల్చివేసినందుకు వారిపై కేసు నమోదైంది. దగ్గుబాటి వెంకటేశ్, నిర్మాత సురేశ్ బాబు, రానా, అభిరామ్‌పై 448, 452,458,120బి సెక్షన్లపై కేసు నమోదైంది.
వివాదం ఏంటి..?
డెక్కన్ కిచెన్ లీజు విషయంలో ఆ హోటల్ యజమాని నందకుమార్, దగ్గుబాటి ఫ్యామిలీ మధ్య వివాదం ఏర్పడింది. ఫిలిం నగర్‌లోని వెంకటేష్‌కు చెందిన స్థలంలో నందకుమార్ వ్యాపారం నిర్వహించేవాడు. లీజు విషయంలో ఇద్దరి మధ్య విబేదాలు రావడంతో హోటల్ యజమానీ కోర్టుకు వెళ్లాడు. లీజు విషయంలో తనకు కోర్టు ఆదేశాలు ఉన్నప్పటికీ వాటిని ధిక్కరించి అక్రమంగా బిల్డింగ్ కూల్చివేశారని ఆయన పేర్కొన్నారు. దీనివల్ల తనకు రూ. 20 కోట్ల నష్టం వాటిల్లిందని చెప్పారు. బాధ్యులపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని కోర్టును కోరారు. దీంతో దగ్గుబాటి ఫ్యామిలీపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని కోర్టు సూచించింది. న్యాయస్థానం సూచనల మేరకు వారిపై పోలీసులు కేసు నమోదు చేశారు.
దగ్గుబాటి ఫ్యామిలీ ఏం చెబుతుంది..?
జూబ్లీహిల్స్ డివిజన్ ఫిలింనగర్ రోడ్డు నంబర్ ఒకటిలో వెంకటేష్‌కు చెందిన 1000 గజాలు స్థలాన్ని సుమారు ఆరేళ్ల క్రితం నందకుమార్ అనే వ్యక్తి లీజుకు తీసుకున్నారు. అక్కడ డెక్కన్ కిచెన్ పేరుతో ఆయన ఒక రెస్టారెంట్‌ను ఏర్పాటు చేశారు. అయితే, ఈ స్థలానికి పక్కనే ఉన్న రానాకు చెందిన స్థలాన్ని కూడా నందకుమార్ లీజుకు తీసుకుని నిర్మాణాలు చేపట్టారు. ఇక్కడే వారి మధ్య వివాదం తలెత్తింది. రానా నుంచి తీసుకున్న స్థలం లీజు పూర్తి అయింది. కానీ, ఆ స్థలంలో నందకుమార్ నిర్మాణాలు చేయడంతో రానా జీహెచ్ఎంసీ అధికారులకు ఫిర్యాదు చేశారు.
ఆపై జీహెచ్ఎంసీ అధికారులు నందకుమార్‌కు నోటీసులు జారీ చేసి డెక్కన్ కిచెన్ నిర్మాణాలను కూల్చివేశారు. కానీ, దగ్గుబాటి కుటుంబ సభ్యులు 60 మంది బౌన్సర్లతో తన రెస్టారెంట్‌ను కూల్చివేశారని నాంపల్లి కోర్టును నందకుమార్ ఆశ్రయించారు. ఈ స్థలం విషయంలో నందకుమార్‌పై కూడా కేసు నమోదు అయింది. దగ్గుబాటి కుటుంబానికి చెందిన స్థలాన్ని నందకుమార్ తన స్థలంగా చెప్పుకుంటూ మరో ఇద్దరికి లీజుకు ఇచ్చారనే ఆరోపణలు వచ్చాయి. దీంతో ఆయనపై రెండు కేసులో నమోదు అయ్యాయి.
Comments
Please login to add a commentAdd a comment