పాదుకలకే పట్టం | Swamy mocked at the footwear | Sakshi
Sakshi News home page

పాదుకలకే పట్టం

Published Wed, Sep 26 2018 12:18 AM | Last Updated on Wed, Sep 26 2018 12:18 AM

Swamy mocked at the footwear - Sakshi

కాలం ఎప్పుడూ ఒకేలా ఉండిపోదు. ఆనందం, ఆవేదన కూడా అంతే. నవ్వులూ కన్నీళ్ళూ కలగలసినదే జీవితం. కష్టమూ శాశ్వతం కాదు.  సంతోషమూ శాశ్వతమూ కాదు.

ఓరోజు వైకుంఠవాసుడి శిరస్సుపైనున్న కిరీటం స్వామివారి పాదరక్షలను చూసి హేళన చేసింది. కించపరిచింది.‘‘నేను విష్ణుమూర్తి శిరస్సుపై దర్జాగా ఉన్నాను. నువ్వేమో స్వామివారి పాదాల దగ్గరున్నావు... అంతెందుకు మనుషులు కూడా నిన్ను తొడుక్కుని ఊరంతా తిరుగుతారు. కానీ ఇంటికి వచ్చేసరికి మాత్రం నిన్ను గుమ్మంలోనే విడిచిపెట్టి లోపలికి వెళ్ళిపోతారు. నీకు లభించే మర్యాద అంతేసుమా. కానీ నా విషయానికి వస్తాను... నన్ను స్వామివారు శిరస్సుపై ధరించడమే కాకుండా దాన్ని చాలా జాగ్రత్తగా చూసుకుంటూ ఉంటారు. అంతేకాదు, అన్ని అర్హతలున్న చోట మాత్రమే నన్ను ఉంచుతారు. నిన్ను బయటే ఉంచినట్టు నన్ను బయటకు విసరరు’’ అని పాదరక్షలను చూసి పకపకా నవ్వింది కిరీటం. అయినా పాదరక్షలు కిరీటంతో ఎలాంటి వాదనకూ దిగలేదు. కానీ విష్ణుమూర్తి ఏదో పనిమీద బయటకు వెళ్ళినప్పుడు పాదరక్షలు తమ గోడు వినిపించాయి స్వామివారికి. కన్నీళ్ళు పెట్టుకున్నాయి.పాదరక్షల బాధనంతా విన్న స్వామివారు ‘‘పాదరక్షకులారా, నా పాదాలకు రక్షణ ఇస్తున్న మీరు ఎందుకు బాధ పడుతున్నారు... మిమ్మల్ని నేనెప్పుడూ తక్కువ చేయలేదుగా... కిరీటం చెప్పిన మాటలకా బాధపడుతున్నారు...’’ అని అడిగాడు.

వెంటనే పాదరక్షలు తన గోడునంతా మళ్ళీ విడమరిచి చెప్పాయి. వాటిని విన్న స్వామివారు ‘‘ఇందుకా బాధ పడుతున్నారు... దాన్ని మరచిపొండి... కిరీటం మాటలు పట్టించుకోకండి... నేనురామావతారంలో మిమ్మల్ని పద్నాలుగేళ్ళపాటు సింహాసనంలో ఉంచి రాజ్యపాలన చేయిస్తాను. సరేనా...’’ అని హామీ ఇచ్చాడు.ఆ మేరకే రాముడుగా అవతారమెత్తినప్పుడు పద్నాలుగేళ్ళు అరణ్యవాసం చేయవలసి వచ్చింది. అప్పుడు సోదరుడు భరతుడు రాముడి పాదుకలను తీసుకుని వాటిని సింహాసనంలో ఉంచి పాలన చేశాడు. అప్పుడు పాదుకలు తమ స్థితిని తలచి ఎంతగానో సంతోషించాయి. భరతుడు ప్రతిరోజూ సింహాసనం ముందు కూర్చుని పాదుకలకు నమస్కరించినప్పుడల్లా అతని శిరస్సుపై ఉన్న కిరీటం సిగ్గుతో తల వంచి తన తప్పుకు, పాదుకలను కించపరచి మాటాడినందుకు మానసికంగా బాధపడింది.  ఈ సంఘటనతో తెలుసుకోవలసిన విషయమేమిటంటే ఎవరినీ చిన్నచూపు చూడకూడదు. అదేవిధంగా కాలం ఎప్పుడూ ఒకేలా ఉండిపోదు. ఆనందం, ఆవేదన కూడా అంతే. నవ్వులూ కన్నీళ్ళూ కలగలసినదే జీవితం. కష్టమూ శాశ్వతం కాదు. సంతోషమూ శాశ్వతమూ కాదు.
– వై. సాత్యకి 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement