మీకు తరచూ జలుబు చేస్తుంటుందా? అలా కాస్త తగ్గుతుండగానే మళ్లీ ఇలా అది వచ్చేస్తోందా? వర్షాలు పడుతున్న ఇలాంటి సీజన్‌లో ఈ లక్షణాలు కొందరిలో తరచూ కనిపిస్తుంటాయి. మనందరిలో కాస్త దగ్గు, జలుబూ, రొంపా, జ్వరం కనిపించగానే... అలా మందుల దుకాణానికి వెళ్లడం, ఏదో యాంటీబయాటిక్ కొని వేసుకోవడం సాధారణంగా చేస్తుంటాం. దీనితో రెండు నష్టాలు. మొదటిది... రోగ నిరోధక శక్తి తగ్గడంతో పాటు ఆ కారణంగా మరింత ప్రభావకరమైన మందు వాడితే తప్ప మనకు వచ్చే జబ్బులు తగ్గకపోవడం. ఇదొక దుష్పరిణామం అయితే... ఆ మందుల సైడ్ ఎఫెక్ట్స్ కూడా రెండో ప్రమాదంగా చెప్పవచ్చు. అందుకే ఇంట్లో దొరికే మామూలు వంట పదార్థాలతో మంచి రోగనిరోధక శక్తిని సాధించవచ్చు. దీనితో తరచూ వచ్చే జబ్బులే కాదు... కొన్ని రకాల దీర్ఘరోగాల నుంచి మంచి ఇమ్యూనిటీ కూడా లభిస్తుంది.
చిలగడ దుంపలు (స్వీట్‌పొటాటో)
దీన్నే మోరంగడ్డ/గెణుసుగడ్డ అని కూడా పిలుస్తారు. ఇందులో విటమిన్ ఏ, విటమిన్ సి పుష్కలంగా ఉంటాయి. ఈ రెండు పోషకాలూ వ్యాధి నిరోధకశక్తిని పెంచేందుకు ఉపయోగపడేవే. ఇక ఇది మేనికి మంచి మెరుపునిస్తుంది. ప్రమాదకరమైన బ్యాక్టీరియల్, వైరల్ ఇన్ఫెక్షన్స్‌నుంచి రక్షణ ఇస్తుంది. ఇక ఇందులో ఉండే చక్కెర వల్ల గుండె, రక్తప్రసరణ వ్యవస్థ, నాడీ వ్యవస్థకు బలం చేకూరుతుంది. ఇది మన శరీరంలోని గ్లూటాథయోన్ అనే యాంటీ ఆక్సిడెంట్ స్థాయులను పెంచుతుంది. గ్లూటాథయోన్‌ను ‘మాస్టర్ యాంటీఆక్సిడెంట్’ అని వ్యవహరిస్తారు. ఇది మన కణాల్లో పేరుకున్న విషాలను బయటకు పంపి, వాటిని శుభ్రపరచడంలో కీలక పాత్ర పోషిస్తుంది. ఫ్రీ–రాడికల్స్‌ను తొలగిస్తుంది. అందుకే చిలగడదుంపలు తినేవారు ఆరోగ్యంగా ఉంటారు. మంచి జీవననాణ్యతతో దీర్ఘకాలం బతుకుతారు. వర్షాలు విస్తృతంగా పడుతున్న ఈ సీజన్‌లో ఇవి వ్యాధినిరోధక శక్తిని పెంచుకోడానికి చాలా రుచికరమైన కొన్ని చిట్కాలు. వీటితోపాటు అన్ని పోషకాలు ఉండే సమతులాహారం తీసుకోవడం, ఏ సీజన్‌లో దొరికే పండ్లను ఆ సీజన్‌లో తింటుండటం కూడా బాగా ఉపకరిస్తుంది.
చికెన్ సూప్
మీరు మాంసాహారం తినేవారైతే జలుబు, రొంప లాంటి తరచూ సోకే ఇన్ఫెక్షన్లకు కమ్మటి చికిత్స చికెన్ సూప్. ఇది ఎన్నో ఏళ్లుగా అందరూ అనుసరిస్తున్న రుచికరమైన స్వాభావిక చికిత్సామార్గం. చికెన్ సూప్‌లో సిస్టిన్ అనే ఒక అమైనో యాసిడ్ ఉంటుంది. కోడి పులుసు పెట్టేటప్పుడే ఈ అమైనో యాసిడ్ స్రవిస్తుంది. చికెన్, దాని ఎముకలతో చేసే సూప్‌లో మినరల్స్, పోషకాలతో మంచి వ్యాధి నిరోధకశక్తి చేకూరుతుంది. ఉదాహరణకు చికెన్‌సూప్‌లోని జిలాటిన్ అనే అమైనోయాసిడ్ వ్యాధి నిరోధకశక్తిని పెంచుతుంది. అంతేకాదు... చికెన్‌సూప్ అన్నది మంచి జీర్ణశక్తికి, కాలేయం పనితీరును మెరుగుపరచడానికి, ఎముకలను పటిష్టం చేయడానికి ఉపయోగపడుతుంది.
వెల్లుల్లి
ఇది ఉల్లి జాతికి చెందిన వంట దినుసు. తాను ఘాటుగా ఉండటం మాత్రమే కాదు... ఇది ఎన్నో వ్యాధులపై కూడా అంతే ఘాటు ప్రభావాన్ని చూపిస్తుంది. అనేక రోగాలను నిరోధిస్తుంది. దీనిలోని అల్లెసిన్ అనే పోషకం చాలా రకాల జబ్బులతో పోరాడి, వాటి నుంచి శరీరాన్ని, ఆరోగ్యాన్ని కాపాడుతుంది. అల్లిసిన్ ఒక ప్రభావపూర్వకమైన యాంటీ ఆక్సిడెంట్ కూడా. మనం తినే ఆహారాల్లో ఫ్రీ–రాడికల్స్ అనే పదార్థాలు అనేక దుష్ప్రభావాలను చూపి, వ్యాధులకు కారణమవుతాయి. అల్లిసిన్ అనే యాంటీఆక్సిడెంట్ ఫ్రీ–రాడికల్స్‌ను ప్రభావరహితం చేసేస్తుంది. అందుకే ఇది వ్యాధి నిరోధకతను పెంచడంతో పాటు ఎన్నో రకాల క్యాన్సర్లనూ నివారిస్తుంది. ఆహారంలో వెల్లుల్లి ఎక్కువగా తినేవారికి బ్యాక్టీరియల్, ఫంగల్, వైరల్, పరాన్నజీవుల (పారసైటిక్) ఇన్ఫెక్షన్ల నుంచి మంచి రక్షణ లభిస్తుంది. అంతేకాదు... శ్వాసకోశవ్యాధులున్నవారు వెల్లుల్లిని ఎక్కువగా వాడటం వల్ల ఇది మంచి ఉపశమనాన్ని ఇస్తుంది.
నిమ్మజాతి పండ్లు
నిమ్మజాతి పండ్లైన నారింజ, బత్తాయి, కమలాలు వంటి పండ్లలో విటమిన్–సి పుష్కలంగా ఉంటుంది. అది అనేక రకాల వ్యాధుల నుంచి రక్షణ కల్పిస్తుంది. అందుకే ఇవి చాలా వ్యాధులకు మంచి రుచికరమైన నివారణ అని చెప్పవచ్చు. అంతేకాదు... కణాలను నాశనం చేసి, ఏజింగ్‌కు తోడ్పడే ఫ్రీరాడికల్స్‌ను నారింజల్లోని హెస్పరిడిన్, హెస్పరెటిన్ వంటి బయోఫ్లేవనాయిడ్స్ సమర్థంగా అరికడతాయి. అందువల్ల వీటిని తినేవారు దీర్ఘకాలం యౌవనంగా ఉంటారు. వీటిల్లో యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉన్నందున ఇవి ఎన్నో రకాల క్యాన్సర్లను సమర్థంగా నివారిస్తాయి. పీచు చాలా ఎక్కువ. అందుకే జీర్ణవ్యవస్థ ఆరోగ్యానికి బాగా తోడ్పడుతుంది. ఎక్కువ పీచు, తక్కువ క్యాలరీలు ఉండటం వల్ల స్థూలకాయం, బరువు తగ్గడానికి ఇది బాగా ఉపకరిస్తుంది. దాంతో చాలా జబ్బులు నివారితమవుతాయి.
Comments
Please login to add a commentAdd a comment