ట్యాబ్లెట్ల రూపంలోనూ కీమోథెరపీ
క్యాన్సర్ కౌన్సెలింగ్
నా సోదరికి 39 ఏళ్లు. ఆమె ఊపిరితిత్తుల క్యాన్సర్‌తో బాధపడుతూ స్టేజ్ 4లో ఉంది. ఇంట్రావీనస్ కీమోథెరపీ అంటే ఆమెకు భయంగా ఉంది. ఇది కాకుండా మరేదైనా ప్రక్రియ ఉందా? అలాగే దుష్ఫలితాలు లేకుండా కీమోథెరపీ తీసుకునే అవకాశం ఉందా?
- సందీప్, కరీంనగర్
ఇటీవల మన దేశంలో ఊపిరితిత్తుల క్యాన్సర్‌తో బాధపడే మహిళల సంఖ్య కూడా గణనీయంగా పెరుగుతోంది. పాశ్చాత్యదేశాల స్త్రీలతో పోలిస్తే మన దేశం మహిళలు ప్రధానంగా నాన్-స్మోకర్లే అయినా వాళ్లు ఊపిరితిత్తుల క్యాన్సర్ బారిన పడటానికి ప్రధానంగా వారిలో వచ్చే జన్యుమార్పులే లంగ్ క్యాన్సర్‌కు కారణం. జన్యుపరమైన కారణాలతో క్యాన్సర్ బారిన పడిన పేషెంట్లకు చికిత్స ప్రారంభించడానికి ముందుగానే వారిలో జన్యుకణ పరిణామ ప్రక్రియ ఏవిధంగా కొనసాగుతోందో తెలుసుకోవడం చాలా అవసరం.
అలా చేయడం వల్ల అవసరమైతే వారికి ఇంట్రావీనస్ (రక్తనాళం నుంచి) కీమో ఇవ్వడానికి బదులుగా టాబ్లెట్ల రూపంలోనూ కీమోథెరపీ అందించే అవకాశం కూడా ఉంది. అందువల్ల ఇలాంటి పేషెంట్లకు ముందుగా ఎపీడెర్మల్ గ్రోత్ ఫ్యాక్టర్ (ఈజీఎఫ్‌ఆర్) మ్యుటేషన్ అనే పరీక్ష నిర్వహించాలి. ఎందుకంటే ఆరోగ్యవంతమైన కణంలో కణాల పెరుగుదల, విభజనకు ఈజీఎఫ్‌ఆర్ తోడ్పడుతుంది. క్యాన్సర్ కణాల పెరుగుదల, విభజనలో ఈజీఎఫ్‌ఆర్ మరింత క్రియాశీలకంగా పనిచేస్తూ క్యాన్సర్ కణాలు ఇబ్బడి ముబ్బడిగా పెరిగిపోతూ అవి ట్యూమర్లకింద రూపాంతరం చెందేలా చేస్తుంది.
అందువల్ల ఈ పరీక్ష ఫలితాలను అనుసరించి, వైద్యులు లంగ్ క్యాన్సర్ పేషెంట్లకు టాబ్లెట్ల రూపంలో కీమోథెరపీని అందించే సౌలభ్యాన్ని కల్పిస్తారు. ఇది కూడా ఐవీ కీమోథెరపీతో సమానంగా లేదా అంతకంటే మంచి ఫలితాలనే ఇస్తుంది. పైగా దీనివల్ల కలిగే దుష్ఫలితాలు (సైడ్‌ఎఫెక్ట్స్) కూడా తక్కువ. పేషెంట్లు టాబ్లెట్లను ఇంటికి తీసుకెళ్లి మరీ వాడవచ్చు. ఈవిధంగా టాబ్లెట్లద్వారా కీమోథెరపీ చేయించుకున్న పేషెంట్ల సుదీర్ఘకాలం జీవించిన సంఘటనలు చాలా ఎక్కువే. కాబట్టి మీరు ఆందోళన పడాల్సిన అవసరం లేదు.