హోలీ వేళ ఈ జాగ్రత్తలు తీసుకోండి | Take these precautions Holly | Sakshi
Sakshi News home page

హోలీ వేళ ఈ జాగ్రత్తలు తీసుకోండి

Published Tue, Mar 22 2016 11:13 PM | Last Updated on Sun, Sep 3 2017 8:20 PM

హోలీ వేళ ఈ జాగ్రత్తలు తీసుకోండి

హోలీ వేళ ఈ జాగ్రత్తలు తీసుకోండి

హోమియో కౌన్సెలింగ్

 

నా వయసు 88 ఏళ్లు. ఈమధ్య నాకు మల బద్ధకం సమస్య ఎక్కువైంది. మలవిసర్జన తర్వాత విపరీతమైన నొప్పితో బాధపడుతున్నాను. డాక్టర్‌గారు పరీక్షించి ఫిషర్ అని చెప్పారు. ఆపరేషన్ అవసరమన్నారు. హోమియోలో దీనికి చికిత్స ఉందా?  - గోపాల్‌రావు, కోదాడ


మలద్వారం దగ్గర ఏర్పడే చీలికను ఫిషర్ అంటారు. నిత్యం తీసుకునే ఆహారంలో పీచుపదార్థాల శాతం తగ్గడం వల్ల మలబద్ధకం వస్తుంది. దాంతో మలవిసర్జన కష్టమవుతుంది. మలవిసర్జన సజావుగా జరగనప్పుడు ముక్కడం వల్ల మలద్వారం వద్ద పగుళ్లు ఏర్పడటాన్ని ఫిషర్ అంటారు. ఈ సమస్య ఉన్నప్పుడు మల విసర్జన సమయంలో నొప్పితో పాటు రక్తస్రావం జరుగుతుంది. ఇది వేసవికాలంలో ఎక్కువ ఉంటుంది. మారుతున్న ఆహారపు అలవాట్లు, జీవనవిధానం వల్ల ఈమధ్యకాలంలో ప్రతి ఐదుగురిలో ఒక్కరికి మలద్వార సమస్యలు వస్తున్నాయి. మలబద్ధకం వల్ల రోగి ఎక్కువగా ముక్కాల్సి రావడంతో మలద్వారంతో పాటు దాని చుట్టుపక్కల ఉండే అవయవాలన్నీ తీవ్ర ఒత్తిడికి గురవుతాయి. క్రమేపీ అక్కడి ప్రాంతంలో కూడా వాపు రావడం, రక్తనాళాలు చిట్లడం మలంతో పాటు రక్తం పడటం జరుగుతుంది. ఫిషర్ సంవత్సరాల తరబడి బాధిస్తుంటుంది. ఆపరేషన్ చేయించుకున్నా మళ్లీ సమస్య తిరగబెట్టడం వారిని మరింత ఆందోళనకు గురి చేస్తుంది.

 
కారణాలు:  దీర్ఘకాలిక మలబద్ధకం  ఎక్కువకాలం విరేచనాలు  వంశపారంపర్యం  అతిగా మద్యం తీసుకోవడం  ఫాస్ట్‌ఫుడ్స్, వేపుళ్లు ఎక్కువగా తినడం  మాంసాహారం తరచుగా తినడం వల్ల ఫిషర్ సమస్య వస్తుంది.

 
లక్షణాలు: తీవ్రమైన నొప్పి, మంట  చురుకుగా ఉండలేరు  చిరాకు, కోపం  విరేచనంలో రక్తం పడుతుంటుంది  కొందరిలో మలవిసర్జన అనంతరం మరో రెండు గంటల పాటు  నొప్పి, మంట.


వ్యాధి నిర్ధారణ: సీబీపీ, ఈఎస్‌ఆర్, ఎమ్మారై, సీటీస్కాన్


హోమియో చికిత్స: ఫిషర్‌తో బాధపడుతున్న వారికి హోమియోలో మంచి చికిత్స అందుబాటులో ఉంది. దీంతో ఆపరేషన్ అవసరం లేకుండానే చాలావరకు నయం అవుతుంది. ఏ సైడ్‌ఎఫెక్ట్స్ లేకుండా చికిత్స చేయడం హోమియో విధానం ప్రత్యేకత. ఈ సమస్యకు నక్స్‌వామికా, నైట్రస్ యాసిడ్, సల్ఫర్ వంటి మందులు ప్రభావవంతంగా పనిచేస్తాయి. వీటిని అనుభవజ్ఞులైన డాక్టర్ల పర్యవేక్షణలో వాడాలి.

 

డాక్టర్ మురళి కె. అంకిరెడ్డి ఎండీ (హోమియో)
స్టార్ హోమియోపతి
హైదరాబాద్

 

స్కిన్ కౌన్సెలింగ్


హోలీ వేడుకలో మీ చర్మాన్ని సురక్షితంగా ఉంచుకోడానికి కొన్ని సూచనలు...

 
రంగులు పూసుకునే ముందు మీజుజీ ముఖంపైన,  చర్మంపైన కాస్త హెయిరాయిల్‌గానీ లేదా కొబ్బరినూనెగాని పూసుకోండి. దీని వల్ల ఆ తర్వాత రంగులు తేలిగ్గా వదులుతాయి.   సాధ్యమైనంత వరకు పొడిగా ఉండే గులాల్ వంటి రంగులను వాడండి.   నేరుగా ఎండలో హోలీ ఆడకండి. ఆ సమయంలో మనకు దాని ప్రభావం తెలియకపోవచ్చు. కానీ దాని వల్ల డీహైడ్రేషన్ బారిన పడే అవకాశం ఉంది. హోలీ ఆడే సమయంలో ఎస్‌పీఎఫ్ 50 ప్లస్ ఉండే వాటర్ రెసిస్టెంట్ సన్ స్క్రీన్ వాడండి.   కేవలం స్వాభావికమైన రంగులనే (నేచురల్ కలర్స్) వాడండి.   కొందరు ఆటలోని జోష్‌లో పెదవులకు సైతం రంగు పూసుకోవచ్చు. దీనివల్ల అది నోటిలోకి ప్రవేశించే అవకాశం ఉంది.   హోలీ వేడుకలు పూర్తి అయిన వెంటనే ఒళ్లంతా శుభ్రమయేలా స్నానం చేయండి.   రంగులు తేలిగ్గా వదిలిపోయేందుకు ముందుగా నూనె పూసుకోండి.   రంగులు వదిలించుకునే ప్రయత్నంలో చాలా కఠినంగా ఉండే సబ్బులు లేదా డిటర్జెంట్ సబ్బులను ఉపయోగించవద్దు. కేవలం జంటిల్ సోప్స్ మాత్రమే వాడండి.  స్నానం తర్వాత ఒళ్లంతా ముద్దగా అయపోయేలా షియా బటర్ ఉన్న మాయిశ్చరైజర్ రాసుకోండి.   పొడి రంగులు వాడే సమయంలో అవి కళ్లలోకి పోకుండా జాగ్రత్త పడండి.   వేడుకల తర్వాత ఒంటిపై దద్దుర్లు లేదా ఎర్రమచ్చలు, చర్మంపై అలర్జీ వంటివి వస్తే తప్పక డర్మటాలజిస్ట్‌ను కలవండి.

డాక్టర్ స్మిత ఆళ్లగడ్డ  చీఫ్ డర్మటాలజిస్ట్
త్వచ స్కిన్ క్లినిక్  గచ్చిబౌలి, హైదరాబాద్

 

పల్మనాలజీ కౌన్సెలింగ్

 

నాకు డస్ట్  అలర్జీ ఉంది. హోలీ సమయంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలు చెప్పండి. - వినోద్, హైదరాబాద్
హోలీ వేడుకల్లో ఉపయోగించే పొడి రంగుల వల్ల డస్ట్ అలర్జీతో కనిపించే దుష్ర్పభావాలే కనిపించవచ్చు. ఈ పౌడర్స్ వల్ల హోలీ సమంలో వాడే రంగుల వల్ల అలర్జిక్ రైనైటిస్ ఉన్నవారిలో ముక్కునుంచి స్రావాలు కారుతుంటాయి. రంగుల పండుగ సందర్భంగా వాడే పొడి రంగులు ఊపిరితిత్తుల్లోకి ప్రవేశించడం వల్ల కలిగే అలర్జీ... ‘ఆస్తమా’ను ప్రేరేపించవచ్చు. ఒక్కోసారి మనకు సరిపడని పదార్థానికి ఎక్స్‌పోజ్ అయినప్పుడు గాలిపీల్చుకునేందుకు దోహదపడే ఊపిరితిత్తుల నాళాలు సన్నబడిపోయి గాలి స్వేచ్ఛగా ప్రవహించేందుకు దోహదపడకుండా అడ్డుపడతాయి. దీన్నే అలర్జీగా చెప్పవచ్చు. అలర్జీ వల్ల కళ్లు ఎర్రబారడం కూడా కొందరిలో కనిపిస్తుంది. ఇక ఆస్తమా రోగుల్లో మ్యూకస్ ఎక్కువగా, చిక్కగా స్రవించి శ్వాసనాళానికి అడ్డుపడుతూ ఉంటుంది. దానివల్ల ఒక్కోసారి ప్రాణాలకు ప్రమాదం జరగవచ్చు.

 
ఆస్తమా మొదలు కాగానే కొన్ని లక్షణాలు కనిపిస్తాయి. అవి...  ఊపిరి తీసుకోవడంలో తీవ్రమైన ఇబ్బంది.  శ్వాస కొద్దిగా అందేలోపే ఛాతీ గట్టిగా బిగదీసుకుపోయి పట్టేసినట్లుగా ఉండటం.   తీవ్రమైన ఆయాసం  దగ్గు  శ్వాస తీసుకునే సమయంలో గొంతులోంచి పిల్లికూతలు వినిపించడం.

 
ఇతర లక్షణాలు: ఆస్తమా రోగుల్లో ప్రధాన లక్షణాలతో పాటు మరికొన్ని అదనపు లక్షణాలూ కనిపించవచ్చు. అవి... ముక్కులు బిగదీసుకుపోవడం, సైనుసైటిస్ లక్షణాల్లోలా ముక్కు నుంచి స్రావాలు కనిపించడం,  కొందరిలో ఒంటిపై దద్దుర్లు (ర్యాషెస్), చర్మంపై పగుళ్లు (డర్మటైటిస్) వంటివీ కనిపించవచ్చు.

 
హోలీ వేడుకల్లో ఆడే రంగువల్ల ఆస్తమా కలిగితే అది ప్రాణాపాయానికీ దారి తీసే ప్రమాదం ఉంది. కాబట్టి ఆస్తమా వ్యాధి చరిత్ర (మెడికల్ హిస్టరీ) ఉన్నవారు ఈ వేడుకలకు దూరంగా ఉండటమే మంచిది. ఇక వ్యాధిగ్రస్తులు తాము వాడే ఇన్‌హేలర్ వంటి ఫస్ట్‌లైన్ ట్రీట్‌మెంట్ తీసుకున్నా ఇది తగ్గకపోతే వెంటనే డాక్టరును సంప్రదించాలి. వారి పర్యవేక్షణలో తక్షణమే ఆస్తమా అటాక్‌ను తగ్గించే మందులు, దీర్ఘకాలంలో యాంటీహిస్టమైన్ వంటి మందులు వాడాల్సిన అవసరం రావచ్చు.

 

డా. రమణ ప్రసాద్ కన్సల్టెంట్ స్లీప్ స్పెషలిస్ట్ అండ్ పల్మునాలజిస్ట్
కిమ్స్ హాస్పిటల్ సికింద్రాబాద్

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement