సాహసానికి ప్రతిరూపం | Television reality show Anchoring Anuroop | Sakshi
Sakshi News home page

సాహసానికి ప్రతిరూపం

Published Tue, Nov 18 2014 12:18 AM | Last Updated on Sat, Jun 2 2018 7:34 PM

సాహసానికి ప్రతిరూపం - Sakshi

సాహసానికి ప్రతిరూపం

 దేశం ఉత్తరాన మంచుపర్వతాన్ని తాకాడు.
 దక్షిణాన అరేబియా సముద్రంలో దూకాడు.
 ఈ మధ్యలో పుణేలో బంగీ జంప్ చేశాడు.
 సికింద్రాబాద్‌లో స్క్వాష్ ఆడి ట్రోఫీ అందుకున్నాడు.
 బాస్కెట్ బాల్, టేబుల్ టెన్నిస్, బాడ్మింటన్‌లలో ప్రతిభ చూపించాడు.
 ఇవన్నీ చేస్తున్న అనురూప్‌ను అచ్చమైన ఆల్‌రౌండర్ అంటే తప్పులేదు.
 పాతికేళ్లయినా నిండని ఈ కుర్రాడి కృషి వెనుక చాలా కథే ఉంది...

 
బి.టెక్ (ఎలక్ట్రానిక్స్ అండ్ ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్) చదివి, బహుళజాతి కంపెనీలో ఉద్యోగం చేస్తున్న ఆ కుర్రాడు ఓ రోజు టెలివిజన్ రియాలిటీ షోలో యాంకరింగ్ చేస్తూ కనిపిస్తాడు. ఓ రోజు స్క్వాష్ ఆటగాడిగా చాంపియన్ షిప్ అందుకుంటూ వార్తల్లో కనిపిస్తాడు. మారథాన్ రన్ చేసి సమాజానికి సందేశంగా నిలుస్తాడు. సముద్రంలో బుడుంగున మునిగి స్కూబా డైవింగ్ చేస్తాడు. అంతెత్తు నుంచి బంగీ జంప్ చేసి చూపరులను ఆశ్చర్యంలో ముంచెత్తుతాడు. వీటికి తోడు ఓ సారి హఠాత్తుగా ర్యాంప్ మీద మోడలింగ్ చేస్తాడు.

ఇవన్నీ తన సరదా కోసం చేస్తున్న పనులు. స్త్రీని వేధింపులకు గురిచేసే వారిని క్షమించరాదని గట్టిగా వాదిస్తాడు అనురూప్. అతడి వాదన వింటే ఏ తల్లి కన్నబిడ్డో... మహిళల మీద ఇంతటి అక్కర చూపిస్తున్నాడు అనిపించక మానదు. అనురూప్ తల్లి శోభ సంతోషంగా నవ్వుతూ... ‘‘అనురూప్ చిన్నప్పుడు చాలా అల్లరి పిల్లాడు. స్కూల్ నుంచి కంప్లయింట్స్ వచ్చేవి. అయితే అనురూప్ అల్లరి ఇతరులను ఇబ్బంది పెట్టకుండా జాగ్రత్తపడేదానిని. ‘మన కారణంగా ఎవరూ ఇబ్బంది పడకూడదు. ఎవరినీ నొప్పించకూడదు’ అని చెప్తుండేదాన్ని’’ అన్నారు.
 
వయసు చిన్నది... విజయాలు పెద్దవి...
* స్క్వాష్‌లో...  హైదరాబాద్ సర్క్యూట్‌లో ప్రథమ స్థానం. 2012 నుంచి 2014 వరకు స్క్వాష్ సింగిల్స్ ఓపెన్, మెన్స్ ఓపెన్, డబుల్స్‌లో మొత్తం ఏడు పతకాలు. పూనా, కర్నాటక, ఎ.పి  ఓపెన్ చాంపియన్‌షిప్‌లు.
* బాడ్మింటన్‌లో... మెన్స్ ఓపెన్, మెన్స్ డబుల్స్, మిక్స్‌డ్ డబుల్స్ .
* టేబుల్ టెన్నిస్‌లో... 2014లో మిక్స్‌డ్ డబుల్స్, మెన్స్ డబుల్స్ చాంపియన్ షిప్‌లు. 2013లో యాన్యువల్ టేబుల్ టెన్నిస్ చాంపియన్‌షిప్.
* మోడలింగ్ రంగంలో... ఆర్‌ఎస్‌ఐ మే ప్రిన్స్ 2013, మిస్టర్ టాలెంటెడ్ 2014, మిస్టర్ ఆటిట్యూడ్ 2014.
* టెలివిజన్‌లో... ఎంటీవీలో రోడీస్‌కి వ్యాఖ్యాత.
* సాహస క్రీడల్లో... బంగీజంప్, స్కూబా డైవింగ్‌లో నిష్ణాతుడు.
 
అమ్మకు బహుమతి !
నేను టోర్నమెంట్‌లకు వెళ్లడానికయ్యే ఖర్చులన్నీ మా నాన్న భరిస్తారు. బహుమతి కవర్ మాత్రం అమ్మకే. ఓ సారి అమ్మ కొత్త చీర కట్టుకుని ... అంచులు సర్దుకుంటూ గదిలో నుంచి బయటకు వచ్చి ఎలా ఉంది- అని అడిగింది. బావుందన్నాను. ఇది నీ పారితోషికం డబ్బుతో కొన్నాను. ఇది నువ్వు నాకిచ్చిన గిఫ్ట్ అంటూ నాకు సర్‌ప్రైజ్ ఇచ్చింది మా బ్యూటిఫుల్, లవ్లీ మామ్...
 - అనురూప్, సాహస క్రీడాకారుడు
 
పన్నెండు తరగతులకు ఎనిమిది పాఠశాలలు!
అనురూప్ తండ్రి బాలకృష్ణన్ ఆర్మీలో అధికారి. ఉద్యోగరీత్యా దేశమంతటా బదిలీలు ఉండేవి. దాంతో అనురూప్ పాఠశాల విద్య పూర్తయ్యేలోపు ఎనిమిది రాష్ట్రాలు మారారు. ‘‘అనురూప్ ఢిల్లీ, బికనీర్, లేహ్, కోళిక్కోద్... అనేక నగరాల్లో చదువుకుని, దాదాపుగా దేశమంతటినీ చూశాడు. వాడి ఆలోచనలు విస్తృతం కావడానికి అది చాలా దోహదం చేసింది. ఎంతటి అల్లరి వాడైనప్పటికీ తరచూ కొత్త ప్రదేశాలలో ఇమడాల్సి రావడంతో చిన్నప్పుడు కొంత బిడియం ఉండేది.

స్కూల్లో బాస్కెట్‌బాల్ ఆడడం మొదలైనప్పటి నుంచి రెక్కలొచ్చిన సీతాకోక చిలుకలా మారిపోయాడు. ఆత్మవిశ్వాసం పాదుకొల్పడానికి తండ్రిగా నేనిచ్చిన కౌన్సెలింగ్ ఫలించింది. అనురూప్ ఏ ఆట ఆడుతానన్నా నేను అడ్డుచెప్పలేదు. స్క్వాష్ ఆటలో తనకు శిక్షణ కూడా లేదు. స్వతహాగా నేర్చుకున్నాడు. రాణిస్తున్నాడని తెలిసిన తర్వాత మెలకువల కోసం శిక్షణ ఇప్పించాను. అయితే మా అబ్బాయికి మంచి విలువలను నేర్పించింది మాత్రం వాళ్ల అమ్మే’’ అన్నారు.
 
క్రీడాకారుడికి కుటుంబమే వెన్నెముక!
క్రీడాకారులకు వెన్నెముక కుటుంబమే, తనకు అంతకంటే గొప్ప వరం అమ్మానాన్నలిద్దరూ ప్రేమను పంచడంతోపాటు సామాజికంగా చైతన్యపరచడమేనంటాడు అనురూప్. ‘‘బంగీజంప్, స్కూబా డైవింగ్ వంటి ఎంత రిస్కీ ఫీట్ చేసేటప్పుడైనా నాన్నకు చెబుతాను. అమ్మకు ఆ సాహస సన్నివేశం రికార్డును మాత్రమే చూపిస్తాను. నేల మీద ఆడే ఆటలెన్నయినా ఆడుకో, అంతే కానీ గాల్లో దూకడం, నీటిలో మునగడం వంటి నేల విడిచిన సాహసాలు వద్దంటుంది అమ్మ. 150 అడుగుల బంగీజంప్,  పారాగ్లైడింగ్ వీడియో చూసి కన్నీళ్లు పెట్టుకుంది. అప్పుడు అమ్మకు నేనే ధైర్యం చెప్పాను’’ అన్నాడు.
 
ఇంత అల్లరిగా కనిపించే ఈ కుర్రాడు జీవితానికి చాలా లోతైన నిర్వచనం చెబుతాడు. జీవితం చాలా విలువైనది. ఆనందించడానికి ఎన్నో మార్గాలున్నాయి. పబ్‌లలో గడపడం, ధూమపానం, మద్యపానంతో దొరికే ఆనందం కంటే క్రీడలతో వచ్చే ఆనందం వెయ్యి రెట్లు ఎక్కువ అని ఈ ఆటల ద్వారా  చెప్పదలుచుకున్నానంటాడు. స్క్వాష్ క్రీడాకారుడిగా కెరీర్ కొనసాగించడంతోపాటు హైదరాబాద్‌లో స్క్వాష్ అకాడమీ స్థాపించి క్రీడాకారులను తయారు చేయాలనేది అనురూప్ ఆకాంక్ష.
 - వాకా మంజులారెడ్డి

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement