తెలుగులో మామ్ కథలు | telugu mom stories by ampashayya naveen | Sakshi
Sakshi News home page

తెలుగులో మామ్ కథలు

Published Mon, Jul 4 2016 12:36 AM | Last Updated on Mon, Sep 4 2017 4:03 AM

telugu mom stories by ampashayya naveen

సోమర్సెట్ మామ్ కథలన్నింటిలోనూ ఒక క్రమం - అంటే ఒక మంచి ప్రారంభం, ఒక మంచి మధ్యస్థం, ఒక మంచి ముగింపు ఉంటాయి. ఏ కథలో కూడా అనవసరమైన వర్ణనలుగానీ, సంఘటనలుగానీ, పాత్రలుగానీ ఉండవు. ఒక సంఘటన చుట్టూ తిరిగేదే మంచి కథ అంటాడు మామ్.
 
 చిన్న కథల రచయితగా సోమర్సెట్ మామ్ ప్రపంచవ్యాప్తంగా కొన్ని లక్షలమంది పాఠకుల హృదయాలను రంజింపజేశారు. ఎంతోమంది తెలుగు కథకులు కూడా ఆయన కథల్ని చదివి కథలు ఎలా రాయాలో తెలుసుకున్నారు. తన కథల్ని గూర్చి సోమర్సెట్ మామ్ ఆయన ఆత్మకథలో ((The Summing up) C) ఇలా చెప్పకున్నారు:

 ‘బిగువైన అల్లికతో ప్రతిపాదన నుండి ముగింపు దాకా ఏకధారగా సాగే కథలంటే నాకు ఇష్టం. నా దృష్టిలో కథానిక అనేది ఒకే సంఘటనను వివరించే రచన. అది భౌతికమైనది కావచ్చు లేక ఆధ్యాత్మికమైనది కావచ్చు. దాని వర్ణనకు  అవసరం కానిదాన్నంతా వదిలేయటం ద్వారా అద్భుతమైన ఏకతను సాధించే వీలుంది. అసలైన ఉద్దేశం అని సాంకేతికంగా మనం చెప్పకునేదాని గురించిన భయం నాకు లేదు. సహేతుకంగా లేనప్పుడు మాత్రమే దాన్ని తప్పు పట్టాలని అనిపిస్తుంది. సమ్మతమైన కారణం లేకుండా కేవలం ప్రభావం కోసమే తరచుగా చేర్చబడటం మూలంగానే హాని కలుగుతుందని నా అభిప్రాయం. క్లుప్తంగా చెప్పాలంటే, నేను నా కథానికలను ఫుల్‌స్టాప్‌తో ముగించటానికే ఇష్టపడుతాను తప్ప చుక్కల వరుసతో కాదు’.
 
తెలుగు కథకుల్లో సోమర్సెట్ మామ్‌తో గాఢంగా ప్రభావితుడైన కథకుడు బుచ్చిబాబు. మామ్‌కు నోబెల్ ప్రైజ్ రాలేదని ఎంతో బాధపడేవాళ్ళల్లో బుచ్చిబాబుగారొకరు. ‘‘మామ్‌కు నోబెల్ ప్రైజ్ రాలేదని బాధపడేవాళ్ళల్లో నేనొకణ్ణి. కథారచయితల్లో మామ్ అగ్రగణ్యుడనడానికి సందేహించను’’ అన్నాడు బుచ్చిబాబు. సోమర్సెట్ మామ్ 150 కథలు రాశాడని ఆయన స్నేహితుల్లో ఒకడైన కారల్ ఫీఫర్ చెప్పాడు. ఈ కథలన్నీ మూడు సంపుటాల్లో ప్రచురించబడినాయి. మామ్ తన జీవితంలో ఒక క్రమం, ఆకృతి ఉన్నాయని చెప్పుకున్నాడు. ఇవే ఆయన కథల్లోనూ ఉన్నాయంటాడు బుచ్చిబాబు. ఆయన కథలన్నింటిలోనూ ఒక క్రమం - అంటే ఒక మంచి ప్రారంభం, ఒక మంచి మధ్యస్థం, ఒక మంచి ముగింపు ఉంటాయి. ఏ కథలో కూడా అనవసరమైన వర్ణనలుగానీ, సంఘటనలుగానీ, పాత్రలుగానీ ఉండవు.

ఒక సంఘటన చుట్టూ తిరిగేదే మంచి కథ అంటాడు మామ్. అలాగే ఆయన రాసిన ఏ కథను కుడా అర్ధంతరంగా ముగించడు.  మామ్ రాసిన కథలు అనేక దేశాల్లో జరిగినవి అయ్యుంటాయి. మామ్ గొప్ప యాత్రా ప్రేమికుడు. ఆయన ప్రపంచంలోని ఎన్నో దేశాల్ని సందర్శించాడు. మలయా, బోర్నియో, ఇంగ్లాండ్, టహిటీ, మెక్సికో, సమోవ, ఇటలీ, స్పెయిన్, ఫ్రెంచ్ గయానా, ఇండియా లాంటి ఎన్నో దేశాలు ఆయన కథలకు కథాస్థలాలు. ఆయన ఎక్కువగా ఓడలమీద ప్రయాణం చేశాడు. ఆయన కథలు రాస్తున్న రోజుల్లో విమాన ప్రయాణాలు లేవు.
 
‘‘మామ్ కథలు రాసినప్పటి స్థితిగతులు ఇప్పుడు లేవు. చాలా మారిపోయాయి. ఆ మార్పుల వల్ల కథల విలువ తగ్గిందనుకోను. ఏ ఒక్క తత్వానికి, రాజకీయ, జాతీయ సిద్ధాంతానికీ, జాతి మతాలతో ముడిపడ్డ దృక్పథానికీ కట్టుబడిపోక, కేవలం మానవ ప్రకృతిని విశదపరచే కథలవడం వల్ల, అవి చారిత్రక మార్పులతో వెనుకబడిపోవు. ఆయనకు స్వదేశీయులైన ఆంగ్లేయుల పట్ల ప్రత్యేకమైన అభిమానం లేదు. ప్రపంచమంతా రెండు మూడు మార్లు చుట్టిరావడం వల్ల మానవ ప్రకృతిలోని ప్రధాన లక్షణాలను నిశితంగా పరిశీలించి, అవగాహన చేసుకొని, అన్ని రకాల వారికీ నచ్చే కథా వస్తువును ఎన్నుకోగల్గాడు. అదొక అంతర్జాతీయ దృక్పథం అనను నేను. మానవ వ్యవస్థ వ్యక్తీకరణ’’ అంటాడు బుచ్చిబాబు తను రాసిన ‘సోమర్‌సెట్ మామ్ - ఆయన కథా ప్రపంచం’ అన్న సుదీర్ఘమైన వ్యాసంలో.

 నేను బి.ఏ. విద్యార్థిగా ఉన్నపుడే లైబ్రరీల నుండి మామ్ కథానిక సంపుటాలను తెచ్చుకొని ఒక తీవ్రమైన ఆసక్తితో చదివేవాడిని. ఇప్పుడు చాలా కాలం తర్వాత ‘ఎలనాగ’ గారు తెలుగులోకి అనువదించిన మామ్ కథలు చదువుతోంటే ఎంత ఆనందం కలిగిందో మాటల్లో చెప్పలేను. అయితే ఎలనాగ మామ్ రచించిన 15 కథల్ని మాత్రమే అనువదించాడు. మామ్ రచించిన ‘సానటోరియం’, ‘రెయిన్’ లాంటి ఎన్నో గొప్ప కథల్ని ఆయన అనువదించలేదు. అయితే సూక్ష్మంలో మోక్షం అన్నట్లుగా ఆయన అనువదించిన ఈ 15 కథలు చదివిన తెలుగు పాఠకులు మామ్ కథల్లోని ప్రత్యేకతల్ని అవగాహన చేసుకొని ఆనందించగల్గుతారనడంలో సందేహం లేదు. ఎలనాగ గారి అనువాదం చాలా సరళంగా సాగింది. ఆయన అనువాదంలో చక్కని ధార కూడా వుంది. ఎక్కడా తట్టుకోకుండా చక్కగా సాగిపోతుంది.

మామ్ కథల్లోని ఒక ప్రధానమైన లక్షణాన్ని చెప్పాలి. మామ్ తన చాలా కథల్ని ‘నేనూ’ అంటూ ఉత్తమ పురుషలో చెప్పాడు. ఆయన తన కథల్లోని ఈ శిల్పాన్ని గూర్చి చెబుతూ ‘ఫస్ట్ పర్సన్ సింగ్యులర్’ పేరుతో ఒక పుస్తకమే రాశాడు. అయితే ఆయన కథల్లోని ఈ ‘నేనూ’ అనేవాడికి ఆ కథల్లో ముఖ్యమైన పాత్ర ఉండదు. ఈ ‘నేనూ’ కేవలం జరుగుతున్న సంఘటనలకు సాక్షీభూతంగా మాత్రమే వుంటాడు. ఇప్పుడు ఎలనాగ అనువాదం చేసిన ఈ 15 కథల్లోని చాలా కథల్లో ఈ ‘నేనూ’ అంటూ కథ చెప్పడాన్నే మనం చూస్తాం. అయితే ఈ ‘నేనూ’ పేరు ఏమిటన్న ప్రసక్తి వచ్చినప్పుడు ‘మామ్’ అనే ఈ ‘నేనూ’ అనేవాడు చెప్పేస్తాడు. ఈ కథల్లోని సంఘటనలన్నీ, పాత్రలందరూ నిజమైనవే అనే అభిప్రాయాన్ని కల్గించటం కోసమే ఆయన ఈ ‘నేనూ’ అంటే తనే అని చెబుతాడు.
 
 అంపశయ్య నవీన్
 
 ఎలనాగ అనువదించిన ‘సోమర్సెట్ మామ్ కథలు’ విశాలాంధ్ర పబ్లిషింగ్ హౌస్ ద్వారా ప్రచురితం. ఆ పుస్తకానికి అంపశయ్య నవీన్ రాసిన ముందుమాటలోంచి కొంతభాగం, పై వ్యాసం. ఎలనాగ ఫోన్: 8885563042

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement